25, జూన్ 2016, శనివారం

ఈ పాపం ఎవ్వరిది?


తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తిని పంచి ఇస్తే, పిల్లలు తల్లిదండ్రులను పంచుకున్నారు. ఎవరి వంతుకు వచ్చిన వారిని వారే బతికినంత కాలం చూసుకోవాలని షరతు విదించుకున్నారు కొడుకులు. 
మరి ఆ తల్లిదండ్రులకు ఈ కొడుకులు ఇచ్చిన బహుమతి ఏమిటి? తెలుసుకోవాలా?! ఒక్కసారి కథా జగత్ లోకి అడుగేసి, నే రాసిన కథ ఈ పాపం ఎవ్వరిది? చదవండి. మీ అభిప్రాయాలు చెప్పండి.  


3, జూన్ 2016, శుక్రవారం

నే చెప్తా బ్రదర్!

"పవర్ స్టార్...పవర్ స్టార్...పవర్ స్టార్" 

గత కొంతకాలంగా మెగా ఫంక్షన్‌లలో                                                                                                                                                                                                                                                                   (కేవలం మెగా ఫంక్షన్‌లలోనే సుమా! వాడెవడో
టుమిడిగాడు మరేదో అన్నట్లు గుర్తు...ఆ విషయం తరువాత మాట్లాడుదాం) హోరెత్తిపోతున్న పిలుపు.

"పవర్ర్...పవర్ర్ర్ ..పవర్ర్ర్ర్ ....అన్నావ్ ! ఇప్పుడేమైంది నీ పవర్ర్ర్..?!" అదేదో రేసు గుర్రమో! పీసు గాడిదో! సినిమాలోనో హీరో వ్యంగ్యంగా విలన్‌తో అంటాడు.  

వీలు చిక్కినప్పుడల్లా అభిమానులు అట్లా అభిమానం చాటుకొంటే,  ఈ హీరో ఇట్లా తన ఇరిటేషన్‌ను  తీర్చుకుంటాడన్నమాట.
 
                                                                   *** 

మరో సినిమాలో...

"ఎదుటోన్ని ఎదురుకోవాలంటే కావల్సింది బ్రాండ్ కాదు. దమ్ము! అది టన్నులు టన్నులు ఉంది చూస్తావా!" తన....మొఖంతో సినిమాల్లోకి ఎంట్రి ఇచ్చిన ఈ హిరోని ....స్టార్ ని చేసింది బ్రాండు కాదు తన టాలెంటే అని గొప్పగా నమ్మి చెప్పిన డవిలాగు .

"ఇట్లా చేస్తే దమ్ము పోయి దద్దమ్మల్లా మిగులుతారు. జాగ్రత్తా!" మరో హీరో ఫ్యాన్స్ ఇచ్చిన కౌంటర్.
అడిగినంతా డబ్బు పెట్టే నాన్నా. గుప్పిట్లో థియేటర్లు. నిరంతరాయంగా ప్రచారం. వక్రమార్గాల్లో
పాపులారిటీ సంపాదనా ( ఫేక్ అకౌంట్ల తో  ఫేస్ బుక్ లైకులు, ఒకే రోజు ముప్పై వేల ఆన్ లైన్ ఫేక్  ఓట్లు వగైరాలన్నమాట) అవసరమైతే అణగదొక్కటం  తదితర అస్త్రాలతో వరుసగా మూడు హిట్లు(పాపం వాళ్ళూ వీటిని ఇట్లాగే అనుకొంటారు).  ఇంకేముంది హీరో గారి తలకు పొగరు బ్బాగా...వచ్చేసింది.  ఇక విజయ యాత్రలకు బయలుదేరాడు.

***
మరో వేదిక...అదే హోరు...అదే ఇర్రిటేషన్...
సంకల్పితంగానో,అసంకల్పితంగానో, నోటి దురుసుతోనో, మరేదో కారణంతోనో నోటి నుండి "చెప్పను బ్రదర్" అన్న మాట వచ్చేసింది.

"మహోన్నత శిఖరం గురించి మట్టి దిబ్బలు మాట్లాడితే ఎంత? మాట్లాడకపోతే ఎంత?! " అంతే వేగంగా కౌంటర్ ఇచ్చారు అభిమానులు. తరువాత సామాజిక మాధ్యమాలలో ఒకటే రగడ.

తిరిగి మరో వేదిక మీద పాపం ఆ హీరో గారు ఆ అభిమానులకు గీతోపదేశం చేశాడు(తాననుకుంటాడు).  "మీ ప్రవర్తన ఏమి బోగోలేదు"(తనది బాగున్నట్లు). ఎవరి కారణంగా మేమంతా ఈ స్థాయికి ఎదిగామో వారికి కూడా ఇబ్బంది కలిగించేటట్లుగా ఉంది (ఇక్కడ హీరో గారు దమ్ము మరిచిపోయి బ్రాండ్ గుర్తు చేసుకోవడం వింత). ఇతర హిరోలు వచ్చినప్పుడు కూడా మిరిట్లా ఇబ్బందికి గురిచేయడం మరి బాగోలేదు. (అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు అభిమానులు. ఏ మెగా హీరో ఫంక్షన్‌లోనో, మెగా హీరోను అభిమానించే హీరో నితిన్ ఫంక్షన్‌లోనో, మెగా డాటర్ ఫంక్షన్లోనో మాత్రమే, అంటే మెగా బ్రాండ్ ఫంక్షన్‌లో మాత్రమే అభిమానంతో అడిగి ఉంటారు. హీరో ప్రభాస్‌ను ఇబ్బంది పెట్టలేదా? అని అంటారా? అదేగదా చెప్పింది. ఆయన వొచ్చింది కూడా మెగా హీరో ఫంక్షన్‌కే కదా!  రెండు దశాబ్ధాల పాటు ఏకచక్రాధిపతిగా సినీ రంగాన్నేలిన ఓ పెద్ద హీరో, ఆయన వారసత్వంతో వచ్చిన ఓ అరడజన్ మంది హీరోలు ఉండగా  మరో హీరో అవసరమా? ఆ డైరెక్టర్ గారు ఇలా కసి ఎందుకు తీర్చుకున్నాడో ఈ ముద్దపప్పుకు తెలియకపోవచ్చుగాని అభిమానులకు తెలియదనుకోవాలా? ఇవన్ని అభిమానుల ప్రశ్నలు. హీరోల మధ్య ఒక సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పడానికే పిల్చామని ఎవరన్నా, అదే సుహృద్భావంతో రెండు మాటలు చెబితే బంధం మరింత బలపడుతది కదా!  అని అభిమానులు. ఇట్లా కొన్ని ప్రశ్నలు, మరి కొన్ని సమాధానాలు, ఒకవైపు  అభిమానాలు, ఆవేశాలు, మరో వైపు  ఉపదేశాలు  అన్నీ జరిగిపోయాయి.

ఇదంతా నేపథ్యం. ఇక అసలు విషయానికొస్తే... అభిమానుల మనస్తత్వమేమిటి? ఎప్పుడు ఎవరిని నెత్తి మీద పెట్టుకుంటారు?  ఎప్పుడు ఎవరిని పక్కనబెడతారు? ఎప్పుడెవరి పక్షం చేరుతారు? అన్న ప్రశ్నలకు  సమాధానాలు చెప్పాలంటే మీకు కొన్ని  ఉదాహారణలు చూపాలి...

అది పంతొమ్మిది వందల ఎనభై మూడు....
                                                                                                                                                                                                                                                                                           (సశేషం) 

25, మే 2016, బుధవారం

వెల్లాల సదాశివశాస్త్రి

వెల్లాల సదాశివశాస్త్రి (1861-1925) మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కవి. జిల్లాలోని పెబ్బేరు మండలంలోని అయ్యవారిపల్లె వీరి స్వగ్రామం. తల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి శంకరజ్యోసులు. వీరు ప్రధానంగా చరిత్ర సంబంధిత రచనలు చేసారు.

రచనులు
1. వెలుగోటి వంశచరిత్రము
2. సురభి వంశచరిత్రము
3. ఆంధ్రుల చరిత్ర - విమర్శనము
4. వీరభద్రీయ ఖండనము
5. కంఠీరవ చరిత్రము
6. రామచంద్ర చరిత్రము
7. నామిరెడ్డి చరిత్రము
8. యతినిండా నిరాకరణము
9. రామానుజ గోపాల విజయము
10. ఆంధ్ర దశరూపక విమర్శనము

--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల*



21, మే 2016, శనివారం

కాశీం

కాశీం తెలంగాణ ప్రాంతానికి చెందిన విప్లవకవి. వృత్తిరీత్యా విశ్వవిద్యాలయాచార్యులు. విప్లవ రచయితల సంఘంలో క్రియాశీల బాధ్యులు. తెలంగాణ ఉద్యమంలోనూ గణనీయమైన పాత్ర పోషించాడు. ఊరూరా తన ఉపన్యాసాలతో ఉద్యమానికి ఊతనిచ్చాడు.

స్వస్థలం
మహబూబ్ నగర్ జిల్లాలోని అచ్చంపేట ప్రాంతానికి చెందినవాడు. నిరుపేద దళిత
కుటుంబంలో జన్మించాడు.

వృత్తి జీవితం
కాశీం మొదట్లో హైదరాబాద్లోని ఆంధ్ర సారస్వత పరిషత్లో తెలుగు ఆచార్యులుగా పనిచేశాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో తెలుగు ఆచార్యులుగా పనిచేస్తున్నాడు.
 రచనలు

1. పొలమారిన పాలమూరు
2.నేను తెలంగాణోన్ని మాట్లాడుతున్నా
3. తెలంగాణ ఉద్యమాలు-పాట
4. తెలంగాణ సాహిత్యం
5.

'పొలమారిన పాలమూరు ' రచనను 2003 లో వెలువరించాడు. ఇది పాలమూరు జిల్లాలోని తీవ్రమైన కరువు నేపథ్యంలో వెలువరించిన దీర్ఘకవిత. 2003 లో పాలమూరు జిల్లా కరువు వ్యతిరేక పోరాట కమిటి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్‌లోని టౌన్ హాలులో నిర్వహించిన 'పాలమూరు గోస ' కవి,గాయక సమ్మేళనంలో ఆవిష్కరించి, వినిపించాడు.

కాశీం కవిత్వంపై వ్యాఖ్యలు
కాశీం కవిత్వంపై పలువురు రచయితలు, ఆయన ఉద్యమ సహచరులు పలు వ్యాఖ్యానాలు చేశారు. వాటిలో కొన్ని...
* నాళేశ్వరం శంకరం: "కాశీం కవిత్వం సహజంగా కురిసే వర్షంలా ఉంటుంది. పారే నదిలా ఉంటుంది. మొలకెత్తే విత్తనంలా ఉంటుంది. పంటపొలం లా ఉంటుంది. ఆయన కవిత్వంలో తేమ ఎక్కువ.

* ఎండ్లూరి సుధాకర్: "అతని జీవితమే అతన్ని ఇంతటి స్థాయికి తెచ్చింది."
* నందిని సిధారెడ్డి: "ఆయన కవిత్వంలో అడుగుపెడితే అక్షరాలు తిరగబడుతున్న అలజడినీ, ఇగం పట్టిన పనిముట్టు మంట కాగుతున్న ఇగురం ధ్వనిస్తుంది. ఆయన అనుభవం మన అనుభవంలోకి కవిత్వం ద్వారా ప్రవేశింపగలిగాడు.

వరవరరావు:"కాశీం కవిత్వంలో ప్రకృతిలో బీభత్సమూ, సౌందర్యమూ కలనేతగా కనిపించే దృశ్యాల వలే ఆయన కవనాక్షరం రూపుదిద్దుకుంటుంది."

 ఇటీవల వార్తల్లో
కాశీం ఇటీవల వార్తల్లో నిలిచాడు. తెలంగాణ ప్రభుత్వం అతనిపై రాజద్రోహం కేసు మోపి అరెస్ట్ చేయమని ఆదేశాలు జారీ చేసింది. మావోయిస్ట్‌లతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు వచ్చాయి.

విప్లవ రచయితల సంఘం 25 వ మహా సభల్లో... 'రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలు - అగ్రకుల తత్వం' అనే అంశం పై కాశీం ఉపన్యాసం.

--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల*



9, మే 2016, సోమవారం

సమస్యా పూరణం

శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం బ్లాగ్ లో తేది: 22.02.2013 నాడు ఇచ్చిన సమస్యకు నా పూరణ.....
 
ఆ.             ముద్దపప్పు లోన శుద్ధ నెయ్యి గలిపి
                 ముద్ద ముద్ద కొక్క సుద్ధి వింటు
                 అమ్మ చేతి తోటి కమ్మనైనటువంటి
                 ఆవకాయ దినిన నమరుడగును

 

8, మే 2016, ఆదివారం

సమస్యా పూరణ


శ్రీ కంది శంకరయ్య గారి  శంకరాభరణం బ్లాగ్ లో తేది: 04.05.2016 నాడు ఇచ్చిన సమస్య కు
          నా  పూరణ....

 
             ఆ.                కన్న బిడ్డ పెళ్ళి కంటను కదలాడ
                                 అప్పు చేసి వేయ పప్పు పంట
                                 కలిసి రాని దైన కాల మిచ్చిన తాలు 
                                 ధాన్యము గని రైతు తల్లడిల్లె   

 

7, మే 2016, శనివారం

సమస్యా పూరణం


శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం బ్లాగ్ లో  తేది: ౦౩.05.2016 రోజు ఇచ్చిన  సమస్య(2022 /03.05.2016) కు నా  పూరణ-

 
 
 
 
 
 
 
 
కం.   కోపముననో! ఘన మునుల
         శాపమునో! పరుల భాష చపలత్వమునో!,
         తాపమునో! యిపుడు తెలుగు  
         దీపాలంకృత గృహమున దిమిరము నిండెన్