ఒక్కమాట (కవితత్వాలు) 👈 download free
18, డిసెంబర్ 2021, శనివారం
11, డిసెంబర్ 2021, శనివారం
పొట్లూరి మోహన రామప్రసాదు
పొట్లూరి మోహన రామప్రసాదు తెలుగు కవి. కథా రచయిత, న్యాయవాది. ప్రధానంగా హైకూ కవి. ఇప్పటికి నాలుగు హైకూ సంపుటాలు వెలువరించాడు. రంగస్థలంపై నటించిన అనుభవం కూడా ఉంది. దాదాపు 20 నాటకాలు వేశాడు. లఘు చిత్రాలను నిర్మించాడు. కథ స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తూ పలు లఘు చిత్రాలను తీశాడు.
స్వస్థలం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కృష్ణాజిల్లా తెన్నేరు. తల్లిదండ్రులు అన్నపూర్ణాదేవి, కృష్ణమూర్తి. ప్రస్తుతం విజయవాడలో స్థిరపడ్డాడు.
విద్యాభ్యాసం: వాణిజ్య శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ చేశాడు. పూణే విశ్వవిద్యాలయం నుండి 1987 లో లా డిగ్రీ ని పొందాడు.
ఉద్యోగం: వృత్తిరీత్యా ఇతను న్యాయవాది. రాష్ట్రంలోని విజయవాడలో న్యాయవాదిగా పనిచేస్తున్నారు
రచనలు: మా ఊరు, బడిలో, పూల రేకులు, తనేను
ఇందులో కొన్ని హైకూలు
చందమామని చూస్తే
ఎక్కింది దిగింది
ఈ పుస్తకంలోని హైకూలు 1995 1996 కాలంలో రచించబడినవి.
ఇందులోని కొన్ని హైకూలు
మా బడికెళ్ళా
వేసిన గోడకుర్చీ
కనిపించలేదు.
మాబడికెళ్ళా
బెంచీల మీద పేర్లు
చెరగలేదు.
బడి గుర్తొస్తే
సిరామరకలన్నీ
గుర్తుకొస్తాయి
పూల రేకులు-పొట్లూరి మోహన రామ ప్రసాదు- చినుకు పబ్లికేషన్స్ విజయవాడ ఫిబ్రవరి 2021
ఈ పుస్తకానికి ముఖచిత్రం శ్యామ్ కుమార్ కర్రీ వేశాడు. హైకూ మోహన సమ్మోహనం
పూలరేకులు అంటూ చిత్తలూరి సత్యనారాయణ ఈ పుస్తకానికి ముందుమాట రాశాడు.
అందులోని కొన్ని హైకూలు
బంతి చేమంతి
తోటలోనే రాలాయి
కోయలేదుగా
వానచినుకు
కొమ్మల మీద పడి
పువ్వులైనాయి.
నల్లని మబ్బు
తోటమీంచి వెళుతూ
పూలనిచ్చింది.
తనేను - పొట్లూరి మోహన రామ ప్రసాద్-చినుకు పబ్లికేషన్స్ విజయవాడ ఆగస్టు 2021
ఇందులోని కొన్ని హైకూలు
ఆమె వెళ్ళింది
కొన్ని అక్షరాలని
కవిత చేసి
ఆమె లేకుంటే
ప్రపంచమే లేదుగా
ఉన్నా అంతేగా
తోటలో పూలు
పూస్తున్నా రాలవేంటి
ఆమె వచ్చిందా?
18, నవంబర్ 2021, గురువారం
తురిమెళ్ళ రాధాకృష్ణమూర్తి
తురిమెళ్ళ రాధాకృష్ణమూర్తి జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన కవి. ప్రధానంగా వీరు పద్య కవులు. శతకాలు, సమస్యా పూరణలు వీరు రచించారు. అవధానాలలో పృచ్ఛకులుగా పాల్గొన్నారు. సంస్కృత ప్రచారం, హిందూ ధర్మ ప్రచారం వీరి ప్రవృత్తి. ఆకాశవాణి, దూరదర్శన్ లలో అనేక సాహిత్య కార్యక్రమాలలో వీరు పాల్గొన్నారు.
6, నవంబర్ 2021, శనివారం
14, జులై 2021, బుధవారం
నేను - దేవుడు
జీవితంలో నాకు కొంచెం స్థిరత్వం తక్కువ. అనేకానేక ప్రభావాలకు చాలా తేలికగా లోనై తరుచూ అభిప్రాయాలు మార్చుకుంటుపోతాను. ఈ విషయంలో మరీనూ.
బాల్యమంతా మా పెద్దమ్మ ఊర్లో గడిచిపోయింది. ఇంటి ముందరే హనుమాన్ గుడి. పొద్దున లేవగానే దైవ దర్శనం. వేసవి కాలం గుడి కట్ట మీదే నిద్ర. యవ్వనంలో అర్ధరాత్రి దాకా మిత్రబృందంతో బాతాఖానీ అక్కడే. సరదాగా శనివారాలు, శ్రావణ మాసాలు భజన బృందాలతో మా మిత్రబృందం కలిసిపోయి తాళాలు, గొంతులు, అడుగులు (అడుగు భజన) కలిపే వాళ్ళం. కొత్తకొత్త పాటలు రాసుకొని కొత్తకొత్త బాణీలతో పాడుకొంటు గడిపేవాళ్ళం. అట్లా సహజంగానే దైవం పట్ల సానుకూలత ఏర్పడింది.
డిగ్రీలోకి ప్రవేశించటంతో పరిస్థితులు మారటం మొదలుపెట్టాయి. కొత్త ఊరు. కొత్త పరిచయాలు. కాలేజీ గొడలపై నినాదాలు, కాలేజీ నేపథ్యం. శ్రీశ్రీ, తిలక్ కవిత్వం (శ్రీశ్రీ ప్రతిజ్ఞ, తిలక్ తపాలా బంట్రోత్ డిగ్రీలో పాఠాలుగా ఉండేవి. దాంతో మహాప్రస్థానం, అమృతం కురిసిన రాత్రి ఇంటికి వచ్చేశాయి. దిన,వార,మాస పత్రికలు కాకుండా సాహిత్యానికీ సంబంధించి నేను కొన్న మొదటి పుస్తకాలు ఇవే) నన్ను మార్చడం మొదలు పెట్టాయి.
వీటికి తోడు దిగజారిపోయిన ఇంటి ఆర్థిక పరిస్థితులు, ముందుకు సాగని చదువు, అధికమైన అవమానాలు, ఆకలి నన్ను దేవుడికి దూరం చేశాయి.
ఇవే పరిస్థితులు ఇంకొంత కాలం ఉండి ఉంటే, ఇంకొంచెం తీవ్రమై ఉంటే అడవి దారి పట్టేవాడినేమో! ఏ పరిస్థితి ఎల్లకాలం ఒకే తీరుగా ఉండదు కదా! పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. అడవికి దూరమయ్యాను కానీ దేవుడికి దగ్గర కాలేకపోయాను. ఒక దశాబ్దం పాటు ఎర్రజెండకు సమీపంలో నడిచాను.
జీవితంలో మెరుగుపడిన పరిస్థితులు, ప్రభుత్వ ఉద్యోగం, పెళ్ళి, కూతురు, వయసు, అనుభవాలు నన్ను ఒక్కొక్కటి మార్చుకుంటూ వచ్చేశాయి. వీటన్నింటికి మించి అభ్యుదయ మిత్రుల డొల్లతనమూ ఎర్రజెండకూ దూరం చేసింది. కులమతాలు అవమానాలకు, అణచివేతలకు కారణమైనప్ఫుడు తిరుగబడటం నేరం కానేకాదు. ఆ కారణం చేత పొందే ప్రతిఫలాలను కూడా కాలదన్ని, ఏ హద్దులైన దాటి స్వేచ్చగా నచ్చిన కులం, మతంలో చేరిపోయి, నచ్చిన దేవుడిని భుజం మీద మోస్తూ, హీనత్వానికి కారణమైన మతం మీద, దేవుడి మీద యుద్దం చేయడం నికార్సైన మనుషుల పని. అట్లాంటి మనుషులు నాకక్కడ కనపడటం మానేశారు. ప్రతిఫలాలు అనుభవిస్తూనే, ఎవడి మతం మురికిని వాడు తొలిగించుకోకుండానే, ఎదుటి మతంపై దాడి చేసే సహచరులతో కలిసి నడవడం నాకు కొంచెం కష్టమైపోయింది. పూర్తిగా ఎర్రజెండా నీడ నుండి బయటికి వచ్చేశాను. అట్లాగని భక్తిలో మునిగిందీ లేదు. కుటుంబ సభ్యులతో, మిత్రులతో తప్పని సరి అయినప్పుడు గుడికి వెళ్తాను. దేవుడి ముందుకు వెళ్ళను. కోర్కెల చిట్టా విప్పను. మొక్కినా, చెప్పినా, అరిచినా, ఏడ్చినా, గీపెట్టినా, పొర్లినా, దొర్లినా మనకు ఇవ్వకూడదనిది ఇవ్వడని, ఇవ్వాల్సినవి, ఇవ్ళాల్సిన సమయంలో అడగకపోయినా తప్పకుండా ఇస్తాడని నమ్ముతాను. దేవుడు గుడిలో మాత్రమే ఉంటాడని, చూడాలని, అడగాలని తాపత్రయపడే మనుషులకు అడ్డుతగలడం, ముందునిలబడం భావ్యం కాదని బయటే ఉండిపోతాను. గుడిని, దాని నిర్మాణాన్ని, వాటి శిల్పసౌందర్యాన్ని ఆరాధిస్తూ బయటే ఉండిపోతాను.
ఈ మొత్తం జీవితంలో ఇప్పటికి నేను నేర్చుకున్నది ఏమిటంటే...దేవుడున్నాడో లేడో తేల్చి చెప్పడం కష్టం. ఏది తేల్చినా, వాటికి ఋజువులు చూపడం మరింత కష్టం. ఉంటే అన్ని మతాల దేవుడొక్కడే. ఒక మతం దేవుడు మంచి, ఒక మతం దేవుడు చెడు అంటూ లేడు. మనుషుల దృష్టికోణంలోనే ఈ వ్యత్యాసమంతా. దేవుడు ఉన్నాడనుకుంటే...ఎక్కడెక్కడికో వెతుక్కుంటూ, వెళ్ళాలిసిన అవసరం లేదు. నువ్వున్న చోటే, నీలోనే, నీవు చేసే పనిలోనే ఉండి ఉంటాడు. అన్నిటికి మించి, తిండి పెట్టే పనికి మించిన దేవుడు ప్రపంచంలో ఏ మతంలోనూ లేడు. కార్యాలయమే గొప్పగుడి అని భావిస్తాను.
5, జూన్ 2021, శనివారం
నేను - చిరంజీవి
ఊర్లోకి అప్పుడప్పుడూ బట్ట సినిమాలు (టూరింగ్ టాకీస్) వచ్చేవి. అందులో ఎక్కువగా ఎన్టీఆర్, చిరంజీవి సినిమాలే. సువర్ణ సుందరి, భట్టి విక్రమార్క లాంటి సినిమాలు పెద్దవాళ్ళకు వినోదాన్ని పంచిపెడితే, ఇంటి గుట్టు, టింగురంగడు, దేవాంతకుడు, మంత్రి గారి వియ్యంకుడు, బిల్లా రంగా, పులిబెబ్బులి, మగమహారాజు వంటి సినిమాలు మాకు పండుగ వాతావరణం తెచ్చేవి. సినిమా వచ్చిన రోజు సాయంత్రం ఆ పరిసరాల్లో ఎంత సందడి చేసేవారమో! ఈ సినిమాలే అంగి జేబు మీదికి, దాని కింది గుండెలోకి చిరంజీవి బొమ్మ చేరేలా చేశాయి. మేము బడిలో ఒక్కో తరగతి దాటి పోతున్న కాలం, చిరంజీవి ఒక్కో మెట్టూ ఎదుగుతున్న కాలం ఒకటే కావటంతో ఆ అభిమానబంధం మరింత బలపడింది. ఆ డ్యాన్సులు, ఫైట్లు, స్టైల్, డైలాగులు అన్నీ మైమరిపించేవి.
ఆరవ తరగతిలో ఉన్నప్పుడు కరణం విమలమ్మ గారని మాకు ట్యూషన్ చెప్పేది. సాధారణంగా ఉదయం సాయంకాలం ట్యూషన్ ఉండేది. మా తరగతిలో ఓ నలుగురు మిత్రులం మాత్రం రాత్రి భోజనాల తర్వాత కూడా ట్యూషన్ కు వెళ్లి, అక్కడే చదువుకొని, అక్కడే నిద్రపోయే వాళ్ళం. మళ్ళీ తెల్లవారుజామున లేచి చదువుకోవడం చేసేవాళ్ళం. మాకిచ్చిన ఈ సౌలభ్యానికి వారికి మేము చెల్లించవలసిన అదనపు ఫీజు ఏమిటంటే బావి నుండి ఓ పది కడవల నీళ్ళు తెచ్చిపోయడం. ఇలా ఉండగా ఒకరోజు ఊర్లోకి ఖైదీ సినిమా వచ్చింది. అదీ రంగుల సినిమా. అప్పటి దాకా బట్ట మీద నలుపు తెలుపు సినిమాలు మాత్రమే చూసిన అనుభవం. రంగుల సినిమా ఎలా ఉంటుందో చూడాలనే ఉబలాటం. దానికి తోడు అభిమాన హీరో సూపర్ హిట్టు సినిమా. ఆ రాత్రి సినిమా మీద మనుసు పీకుతుంది. మనుషులమేమో ట్యూషన్ లో బంధీ అయిపోయాం. మా ఉబలాటాన్ని గమనించే టీచర్ " ఎవడైనా సినిమాకు వెళ్ళాడో! మరి ట్యూషన్ కు రాడు" అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది. చేసేదేమీలేక పుస్తకంలో తలలు దూర్చాం. అక్షరాలన్నీ గజిబిజిగా కనిపిస్తున్నాయి. పక్కల మా బడి మైదానంలో వేసిన సినిమా మాటలు, పాటలు చెవిలోకి చొరబడుతున్నాయి. టీచర్ హెచ్చరిక ఓ అరగంట మాత్రమే మమ్మల్ని ఆపింది. టీచర్ ఇంట్లో నిద్రపోయిందన్న నిర్ణయానికి వచ్చాకా, బయట అరుగుల మీద పుస్తకాలు, పరుపులు పక్కన పెట్టేసి సినిమాకు వెళ్ళిపోయాం. బ్రహ్మానందభరితంగా సినిమా చూసి వచ్చి, ఏమీ ఎరుగనట్లు చడీచప్పుడు కాకుండా దొంగల్లా వచ్చి చేరి ఎప్పట్లాగే నిద్రపోయాం. పొద్దుగాల లేవగానే "పరుపులు చుట్టుకొని ఇంటికి వెళ్ళండి. దొంగ వెదవల్లారా! వద్దంటే కూడా సినిమాకు వెళ్తరా?" అంటూ టీచర్ కోపంతో ఇంటికి పంపించి వేసింది. మా పెద్దవాళ్ళు బతిమిలాడితే మూడు రోజుల బహిష్కరణ తర్వాత ట్యూషన్ కు రానిచ్చింది టీచర్. మొదట్లో భయపడినా, చివరకు 'చిరంజీవి ఎంత పని చేశాడురా!' అని నవ్వుకున్నాం.
మా ఊర్లో ఏడు వరకు మాత్రమే బడి ఉండేది. హైస్కూలుకు మండల కేంద్రానికి సైకిళ్ళపై వెళ్ళి చదువుకునే వారు మా సీనియర్లు. సీనియర్లకు సినిమా టిక్కెట్ పెడితే చాలు, సైకిళ్ళ మీద మండల కేంద్రంలో ఆదివారం మాత్రమే వేసే మ్యాట్నీ షో చూపించి తీసుకొచ్చేవారు. అలా చూసిన చిరంజీవి సినిమాలు చాలానే ఉన్నాయి.
ఏడవ తరగతిలో మా గురువుగారు గడియారం సాంఖ్యాయన శర్మ గారు (గడియారం రామకృష్ణ శర్మ గారి పెద్ద కుమారుడు). మాకు ఇంగ్లీష్ చెప్పేవారు. బళ్ళో ఒక రోజు ఎక్సర్సైజ్లో భాగంగా కొన్ని ప్రశ్నలు ఇచ్చి జవాబులు రాయమన్నారు. అందులో హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో? అనే ప్రశ్న కూడా ఒకటి. తరగతిలో ఎక్కువ మందిమి చిరంజీవనే రాశాం. ఆయన ఆశ్చర్యపోయి, హో గ్రేట్! నాక్కూడా చిరంజీవంటే ఇష్టమన్నారు. ఇక మా ఆనందానికి అవధుల్లేవు. సారూ కూడా మా పార్టే అంటూ వేయ్యేనుగులు ఎక్కినంత సంతోషపడి పోయాం.
ఏడో తరగతి తర్వాత ఊర్లో చదువు లేకపోవడంతో అందరిలాగే మేము మా మండల కేంద్రానికి వెళ్ళలేదు. మా గురువు శర్మ గారు మా మిత్రబృందాన్ని వారి సొంతూరు అలంపూరుకు తీసుకువెళ్ళి చేర్పించారు. అక్కడే ఎనిమిది నుండి ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నాం. ఈ ఐదేళ్లలో మాకు కావలసినంత స్వేచ్ఛ లభించడం, అలంపూరు నుండి ఆరు కిలోమీటర్ల కాలినడక నడిచి తుంగభద్ర దాటితే కర్నూలు అందుబాటులో ఉండటం, అక్కడ సినిమాలకు కొదువ లేకపోవడం వంటి అంశాలు మా సినిమా పిచ్చికి, చిరంజీవిపై ఇష్టానికి ఆజ్యం పోశాయి.
మా ఊర్లో చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ఉండేది. చిరంజీవి సినిమా విడుదలైతే చాలు థియేటర్ల దగ్గర బ్యానర్లు కట్టేవాళ్ళు. చిరంజీవి మీద అభిమానంతో నాకొచ్చిన కళను మరింత మెరుగుపరుచుకోవచ్చన్న ఆశతో అప్పుడప్పుడు వారికి బ్యానర్లు రాసిచ్చి సహాయపడే వాడిని.
చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చాలా ఆశలు ఉండేవి. అవన్నీ కల్లలైపోయినప్పుడు, రక్తదానం, నేత్రదానం వంటి సేవాకార్యక్రమాలు చేపట్టి రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ అందుకున్న వ్యక్తి మీదే తోటి నటులు అసూయతో అభాండాలు వేసి, అవమానపరిచినప్పుడు చాలా బాధేసింది. తిరిగి సినిమాల్లోకి వచ్చాకా మళ్ళీ కొంత ఊరట కలిగింది. తెలుగు సినీరంగంలో చిరంజీవి ఎప్పటికీ చిరంజీవే!
2, జూన్ 2021, బుధవారం
బాల్యంలో నా అమాయకత్వం
నాకు ఊహా తెలియకముందే మా పెద్దమ్మ తెచ్చి పెంచుకుంది. నా చదువు అట్లా పెద్దమ్మ ఊరైన పల్లెపాడు(జో.గద్వాల)లో ప్రారంభమైంది. అదో చిన్న పల్లెటూరు. ఐదవ తరగతి వరకు మాత్రమే బడి ఉండేది. మా తరగతిలో ఐదుగురం ఉండేవారం. అందులో శ్యామసుందర్ రెడ్డి నాకు అత్యంత ప్రియమిత్రుడు. బడిలో చదువులు, మైదానాల్లో ఆటలు, వంకల్లో ఈతలు...ఏడున్న ఒకరి భుజం మీద మరొకరి చేయి ఉండాల్సిందే. అట్లా నాలుగేండ్లు గడిచిపోయాయి. ఐదో తరగతికి వచ్చాకా ఆలోచన మొదలైంది. 'ఇది చివరి సంవత్సరం. వచ్చే సంవత్సరం బడి వదలాలి. ఊరు విడువాలి. మరి ఎక్కడ చదవాలి?' ఎక్కడ చదివినా ఇద్దరం ఒకేచోట చదవాలని నిర్ణయించుకున్నాం. అప్పటికి మా ఊరి పిల్లలకు రెండు అవకాశాలు ఉండేవి. ఒకటి మా సొంతూరు జల్లాపురం. అక్కడ ఏడు వరకు మాత్రమే బడి ఉండేది. రెండు ధర్మవరం. అక్కడ పది దాకా బడి ఉండేది. కొంచెం దూరమెక్కువైనా రెండోదే ఎంపిక చేసుకునేవారు మా ఊరి పిల్లలు ఎక్కువ కాలం ఒకే దగ్గర చదువొచ్చని.
రెండ్లేండ్లకే మారాల్సి ఉంటుందని మొదటిది, దూరమెక్కువని రెండోది వద్దనుకున్నాం. మూడో ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తున్నప్పుడు నా మిత్రుడు చెప్పాడు..."మనం వనపర్తి దగ్గర ఉండే మా మేనమామ ఊరికి వెళ్దాం. అక్కడే ఉంటూ చదువుకుందాం. మనకే ఇబ్బంది రాకుండా వాళ్ళు చూసుకుంటారు" అని చెప్పేవాడు. పెద్దల నిర్ణయాల ప్రమేయం లేకుండా పిల్లల ఆలోచనలు కార్యరూపం దాల్చవన్న సత్యాన్ని గ్రహించకుండా అది నిజమైతదనే అమాయకంగా నమ్మాం. ఎన్నెన్నో కలలు కన్నాం. ఆనందంగా ఆ సంవత్సరం ఐదో తరగతి పూర్తి చేశాం. మనం ఒకటి తలిస్తే విధి ఒకటి చేస్తది కదా! పెద్దల నిర్ణయాల మేరకు ఆరవ తరగతికి నేను మా సొంతూరు జల్లాపూర్ కు, తాను వనపర్తికి వెళ్ళిపోయాం. పదేండ్లు గడిచిపోయాయి.
డిగ్రీ పూర్తయ్యాక...
తాను హైదరాబాద్ నగరానికి రమ్మని, తన రూంలోనే ఉండమని, పని కూడా చూసి పెడతానని మాటిచ్చి, బతుకుదారి చూపాడు. చిన్నప్పుడు ఇచ్చిన మాటను ఇలా నెరవేర్చుకున్నాడా అన్పించింది.
20, మే 2021, గురువారం
19, మే 2021, బుధవారం
2, ఏప్రిల్ 2021, శుక్రవారం
వల్లభాపురం జనార్ధన
వల్లభాపురం జనార్ధన అభ్యుదయ కవి. వివిధ ఛందస్సులలో అనేక పద్యాలు కూడా రాశారు. తెలుగు పండితులుగా పనిచేసి, పదవీ విరమణ పొందారు. పాలమూరు జిల్లా కవులలో ఈయన ఒకరు. ఇతను వామపక్ష భావ జాలంతో రచనలు చేశారు. వీరి కవితలు అనేక పత్రికలలో, సంకలనాలలో చోటును సంపాదించుకున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా ప్రజా సాహితీ జిల్లా బాధ్యులుగా అనేక సాహితీ కార్యక్రమాలను నిర్వహించారు. వీరు పహారా కాస్తున్న రాత్రి అను కవితా సంకలనాన్ని వెలువరించారు.శ్రీశ్రీ మీద ఉన్న అభిమానంతో ' యుగ పతాక ' పేరుతో ఓ దీర్ఘ కవితను వెలువరించారు. భారత్, అమెరికాల మధ్య కుదిరిన అణు ఒప్పందాన్ని నిరసిస్తూ విషకౌగిలి123 పేరుతో నానీలు వెలువరించారు. విజయక్రాంతి పేరుతో సంగీత రూపకాన్ని 1974లో వెలువరించారు. ఇదే అచ్చైన వీరి మొదటి రచన. తెలంగాణ సాహితీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తూ, వివిధ సాహితీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
రచనలు
1.పహారా కాస్తున్న రాత్రి(వచన కవితా సంకలనం -మార్చి,2000)
2.యుగ పతాక శ్రీశ్రీ (దీర్ఘకవిత- ఏప్రిల్, 2010)
3. విషకౌగిలి 123 (అణుబంధ నానీలు - ఏప్రిల్, 2008)
4. విజయక్రాంతి (సంగీత రూపకం - ఆగస్ట్,1974)
అతని రచనల నుండి...
*సురవరం ప్రతాపరెడ్డి గురించి...
సీస పద్యం:
తెలగాణ తెలుగున వెలుగులు చూపించి
ప్రాంతీయ ప్రతిభను పంచినాడు
తెలగాణ నేలలో తెలివికి చీకటి జాడయే లేదని చాటినాడు
మరియాదలను వీడి మాటతూలినవారి
గర్వమ్ము దించగా కదలినాడు
తెలగాణ తెలుగులో తీయందనాలను
చూడని నాల్కకు చూపినాడు
వైతాళికుండుగా జాతిరాగము పాడి
తెలగాణ ధిషణను తెలిపినాడు
తే:గీ:
మిట్టమధ్యాహ్న సూర్యుడై మెలగినాడు
ఆంధ్ర గర్వము చెండాడియలరినాడు
ప్రాంత తెలగాణ నడవడి పట్టిచూపి
రచనలందున రత్నాల రశ్మి చూపి
సురవరము జాతి మర్యాద చూపినాడు
కందం:
ప్రతిభా మంజూష తెరిచి
శ్రుతి చేసెను తెలుగుబాస చిన్నెల లయలన్
మతిమంతుడు జనహిత వరి
స్తుతికే స్తుతియయి నిలిచెను సురవర మతియై
కందం:
సేద్యము కవితా సేద్యము
వేద్యత పరిశోధకత్వ విద్వచ్చవియై
హృద్యపు రచనలు చేసెను
ఖాద్యములుగ బుద్ధికిడగ ఘన సురవరమే
కందం:
స్థిరుడై భాషా రతుడై
సురుచిరమగు గ్రామ్యభాష సొబగులు తెలిపీ
సురభాష కన్న మిన్నని
పరిచయమొనరించె భువికి భాసుర వరమే
ఉత్పలమాల:
బాలిశులైనయాంధ్రుల సవాలుకునిచ్చె జవాబు దీటుగా
సాలగ గోలకొండ కవి సంచిక నిల్పి చరిత్ర సాక్షిగా
గాలికి తూలిపోదు తెలగాణ యశమ్మని చాటి చెప్పెరా
చాలిన స్వాభిమాన జవసత్వపు దుర్భిణి చూడు సాహితిన్
శా ర్దూల వృత్తం:
శ్రీ రామాయణ కావ్యగాథగల రాశీభూతమౌ కల్పనల్
సారాంశమ్మున విశ్వసించుటకు సాక్ష్యాధారముల్ లేవనెన్
చారిత్రాత్మక గీటురాయిపయి సంచాలించి చూపించెరా
ధీరుండౌ పరిశోధకుండు ప్రతిభా ధీ రశ్మి మార్తాండుడే
తేటగీతి:
ఆంధ్ర తెలగాణ జీవన వ్యాకరణము
సంస్కృతీ నాగరికతల సౌరభాల
తెలుగు వెలుగుల చీకటి తీరులన్ని
గరిమనాంధ్రుల సాంఘిక చరిత రాసి
కొత్త పరిశోధనకు దారులెత్తి చూపె
తేటగీతి:
భాష సౌందర్య రూపము పరిమళించ
లిపికి సంస్కరణమ్ముల ప్రాపు వలయు
ననుచు చర్చించి నవ సూత్రమునులిఖించె
సురవరమ్ము భాషాశాస్త్ర పరిమళమ్ము
* పాలమూరు కరువు గురించి...
పాలమూరు పల్లెలు
బే చిరాగ్‌లుగా మారుతున్నయి
పొలాలు బీళ్ళవుతున్నయి
బీటలు వారుతున్నయి
సమాధులవుతున్నయి
ఇది ప్రకృతి ప్రకటించిన కోపమా!
వికటించిన ప్రజా ప్రభుత్వద్యేయమా!
...
ఆనకట్టలతో అన్నం పెడుతున్న పాలమూరు కూలీ
మెతుకు దూరమై
గొంతు పొలమారిపోయి
గటుక్కుమంటుండడు
దత్తత మంత్రపుష్పాలు
దగాల దడి కడ్తున్నయి
ఆకలి చావులపై మంత్రుల సుభాషితాలు
మనిషితనాన్ని తలదించుకొనేలా చేస్తున్నయి
పొలం పొలంగా మిగలని పాలమూరు
పటంలో గూడా ఊరుగా
మిగలకుండా పోయే రోజొస్తుంది
మనం మేల్కొనకుంటే.
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు |
26, ఫిబ్రవరి 2021, శుక్రవారం
నేను - నా ఉద్యోగం
ఏదో బొమ్మలు బాగా వేయగలనని, పనికొస్తుందని పది తర్వాత ఇంటర్లో బైపిసీ తీసుకున్నాను. ఆ తర్వాత బి.ఎస్సీ., అంతే.
బతకడానికి ఈ మాత్రం చదువు చాలని, పెట్టే,బేడా సర్దుకుని, అప్పటికే హైదరాబాద్లో ఉన్న నా చిన్నప్పటి దోస్తుగాన్ని , నా బతుకుదారిని అన్వేషిస్తూ, నగరానికి వచ్చి పడ్డాను.
ఎస్టీడీ బూతులు, మార్కెటింగ్, నాకొచ్చిన పెయింటింగ్ అన్నీ ప్రయత్నించా, ప్రయోగించా, పనిచేశా. రెండేండ్లు అట్లా నేను నగరానికి అప్పగిస్తే, నాకది ఆకలి, అల్సర్లు, అవమానం బహుమతిగా ఇచ్చింది. ఇక దానితో నాకు, నాతో దానికి పొసగక విడిపోయాం. ఊరికి తిరిగి వచ్చాకా, ఊరికే తిని తిరిగేంత ఆస్తులేమీ లేవు కాబట్టి, అప్పటికి నాకు వచ్చిన, చేతనైన పని చదువుకున్న చదువుతో చదువు చెప్పడం.
అంతే ఓ ఇరవై మంది పిల్లలను పోగేసుకుని చిన్న బడి ఒకటి ప్రారంభించాను. కొంత కాలం గడిచాకా, ప్రభుత్వ బడిలో పిల్లల సంఖ్య తగ్గిపోతుందని, కాబట్టి ఆ పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్చితే, ఈ బడిలోనే ప్యారాటీచర్ గా చేరవచ్చని, ఊరి ఉపాధ్యాయులు చెబితే, పిల్లల తల్లిదండ్రుల అంగీకారంతో బడిలో ప్యారా టీచర్గా చేరిపోయాను.
ఎక్కడైతే చదువు నేర్చుకోవడం మొదలు పెట్టానో! అదే చోట చదువు నేర్పటం మొదలుపెట్టాను.
అప్పుడు మొదలైంది అసలు కల.
పిల్లలకు నేర్పడం ద్వారా కలిగిన సంతృప్తి, వచ్చిన గౌరవం నన్ను జీవితంలో ఉపాధ్యాయుడిగా స్థిరపడిపోవాలనే కలల వైపు నెట్టింది.
అప్పటికీ డిగ్రీ మాత్రమే పూర్తైంది. అది సరిపోదు. బి.ఎడ్., పూర్తి చేయాలి.
బి. ఎడ్.,లో సీటు అంత తేలికగా దొరక లేదు.
దండయాత్ర మొదలైంది. వరుసగా నాలుగేండ్లు ఎంట్రన్స్ రాశాను. మొదటి మూడేండ్లు ఇరవై వేలు, పదహారు వేలు, మూడు వేల ర్యాంకులు వచ్చాయి. సమయం వృధా చేయకుండా ఈ మధ్య కాలంలోనే ఎం.ఏ.,(తెలుగు) పూర్తి చేశాను. నాలుగో ప్రయత్నం లో మూడు వందల ర్యాంకుతో ప్రభుత్వ కళాశాలలో ఫ్రీ సీటు సంపాదించి, పూర్తి చేశాను. ఆ వెనువెంటనే ప్రకటించిన డిఎస్సీ పరీక్ష రాసి, జిల్లాలో మొదటి ర్యాంకు సాధించి, గ్రేడ్ -1 తెలుగు పండితుడి గా ఎంపికై ఉపాధ్యాయుడిని కావాలనే నా కలను నెరవేర్చుకున్నాను. 16 ఏండ్ల సంది ఈ వృత్తిలో కొనసాగుతున్నాను. సమాజంలో గౌరవాన్నిచ్చింది. బతుకడానికి భరోసానిచ్చింది. ఏనాడు అసంతృప్తి లేదు కృతజ్ఞత తప్పా.
18, ఫిబ్రవరి 2021, గురువారం
పద్య ప్రభంజనం
ఈ గ్రంథాన్ని మెతుకు సీమ సాహితీ సాంస్కృతిక సంస్థ సంగారెడ్డి ప్రచురించింది. ఈ సంకలనం జనవరి 2021 లో వెలువడింది. ఆచార్య కసిరెడ్డి, ఆచార్య బేతవోలు
రామబ్రహ్మం ఈ గ్రంథానికి మార్గదర్శనం చేశారు.
కంది శంకరయ్య, డాక్టర్ అయాచితం
నటేశ్వరశర్మ, డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, దోరవేటి చెన్నయ్య,
గుండు
మధుసూదన్, పి విట్టుబాబు సంపాదక మండలిగా వ్యవహరించారు.
ఆదిలాబాద్ నుండి డాక్టర్ మాడుగుల నారాయణ మూర్తి, కరీంనగర్ నుండి నంది
శ్రీనివాస్, ఖమ్మం నుండి ఎన్. సి. ఎచ్. చక్రవర్తి, నల్గొండ నుండి సాగర్ల సత్తయ్య, నిజామాబాద్ నుండి ఎన్. సాయి ప్రసాద్, మహబూబ్ నగర్ నుండి అంబటి
భానుప్రకాష్, బస్వోజు సుధాకర్ ఆచారి, మెదక్
నుండి వడ్ల రాజయ్య, వర్కోలు లక్ష్మయ్య, రంగారెడ్డి
నుండి గోగులపాటి కృష్ణమోహన్, జి కృష్ణ గౌడ్, వరంగల్ నుండి గుండు మధుసూదన్, హైదరాబాద్ నుండి డాక్టర్ మరుమాముల దత్తాత్రేయ
శర్మ, రాష్ట్రేతర ప్రాంతాల నుండి పి. విట్టుబాబు జిల్లాల వారి సమన్వయకర్తలుగా
వ్యవహరించి, ఈ పుస్తకం రూపకల్పనలో సహకారాన్ని అందించారు.
అష్టకాల నరసింహ రామశర్మ, డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య, డాక్టర్ నందిని సిద్ధారెడ్డి, డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, మామిడి హరికృష్ణ,
దేశపతి శ్రీనివాస్, గన్నమ రాజు గిరిజా మనోహర్ బాబు, ఆచార్య సూర్య ధనుంజయ్, ఆచార్య
బన్న అయిలయ్య, డాక్టర్ ఎన్. రఘు, డాక్టర్ సాగి కమలాకర శర్మ, డాక్టర్ పత్తిపాక మోహన్, డాక్టర్ లక్ష్మణ
చక్రవర్తి గౌరవ సలహా మండలి సభ్యులుగా వ్యవహరించారు.
ఈ గ్రంథంలో అనుక్రమణిక ఈ విధముగా ఉన్నది
#ప్రముఖుల ఆశీరభినందనలు,
#పద్య ప్రబోధం- ఆచార్య కసిరెడ్డి,
#కవితా ప్రభంజనం- శ్రీ పెరంబదూరు
రంగాచార్య
#అభినందనం- మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్
#సుస్వాగతం -డాక్టర్ పూసల లింగా గౌడ్
#సంపాదకీయం -అవుసుల భానుప్రకాష్
#ఆదిలాబాద్ జిల్లా కవుల కవిత్వం
#కరీంనగర్ జిల్లా కవుల కవిత్వం
#ఖమ్మం జిల్లా కవుల కవిత్వం
#నల్గొండ జిల్లా కవుల కవిత్వం
#నిజామాబాద్ జిల్లా కవుల కవిత్వం
#మహబూబ్ నగర్ జిల్లా కవుల కవిత్వం
#మెదక్ జిల్లా కవుల కవిత్వం
#రంగారెడ్డి జిల్లా కవుల కవిత్వం
#వరంగల్ జిల్లా కవుల కవిత్వం
#హైదరాబాద్ జిల్లా కవుల కవిత్వం
#రాష్ట్రేతర కవుల కవిత్వం
పుస్తకావిష్కరణ
జనవరి 24,2021, రోజు హైదరాబాద్లోని తెలంగాణ సారస్వత భవన్ సమావేశ మందిరంలో ఎమ్మెల్సీ కవిత గారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.