‘గజఈతరాలు’ పూర్ణమ్మ అయితే మా అత్తలాగా, ఆమె వెంట తిరిగాడిన పిల్లల్లో నేనొకడినై ఉన్నానేమో! ఆ అనుభవాలన్నీ మావేనేమో! ఆ భాషా మా నోటి నుండి రాలిపడితే ఏరి, రచయిత ఈ కథలో పొందుపర్చాడేమోననిపించింది. అందుకే ఆ కథ నన్ను నేను చూసుకోవడానికి మళ్లీ మళ్లీ ఎన్నిసార్లు చదివానో!
గజఈతరాలైన పూర్ణమ్మ, వందమందికి ఈత నేర్పిన పూర్ణమ్మ, కష్టాలని, జీవితాన్ని ఒంటరిగా, ధైర్యంగా ఎదుర్కొని బతుకు సాగించిన పూర్ణమ్మ చివరికి బావిలో పడి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో! చెపుతుందీ కథ. సహజ సంఘటనలకు, సున్నితమైన హాస్యాన్ని జోడించి, సమకాలీన సమస్యలు బతుకులను ఎట్లా చిందరవందర చేస్తాయో, చావులకు కారణం ఎలా అవుతాయో చెప్పిన కథ. చాలా కాలం నన్ను వెంటాడిన కథ. ఇప్పటికీ మరిచిపోని కథ. ఎన్ని కథలు చదివినా, ఎప్పటికీ మనసులో ప్రథమ స్థానంలో పదిలపరుచుకున్న కథ.
‘ఉసుళ్ళు’ అడుక్కుతినే మనషులను, వారి ఆర్తనాదాలను అల్లంత దూరంలోనే ఉంచి, కుక్కలకు మాంసం ముక్కలు పెడుతూ సంతోషించే సమాజాన్ని ఓ పార్శ్వాన చూపిన కథ. అంతకుమించి, ఎలాగోలా ఆకలిని జయించాలని నానా అవస్థలు పడే బతుకుల్ని, మరో రకమైన ఆకలి ఎట్లా బలితీసుకుందో హృదయ విదారకంగా చెప్పిన కథ. కథ చదివాకా ‘తుమ్మ ముళ్ళు దిగబడిన తూనీగలాగా’ హృదయాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తాం.
ఉసుళ్ళు, గజఈతరాలు మా కథలు, మా ఊరి కథలు. మా మనుషుల కథలు. మరి ఈ కథలు రాసిన ఈ రచయిత ఎవరు? ఎక్కడ ఉంటాడు? ఎలా కలవడం? చాలా కాలం ఈ ప్రశ్నలు వేదించాయి. అన్వేషణ మొదలైంది.
ఒకసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణల విభాగంలో కొత్త పుస్తకాల కొరకు వెతుకుతుంటే ఏదో సంవత్సరానికి సంబంధించిన కథావార్షిక ఒకటి కంటపడింది. దాని సంపాద వర్గంలో వీరి పేరు కనబడింది. పుస్తకం చివర్లో వీరి చిరునామా దొరికింది. ఇక నా ఆనందానికి అవధులు లేవు. పుస్తకం తీసుకోలేదు కానీ చిరునామా తెచ్చుకున్నాను. ఈ రెండు కథలపైన నా అభిప్రాయాలను, స్పందనలను తెలియజేస్తూ సుదీర్ఘంగా ఒక ఉత్తరం రాశాను. అప్పుడు ఏం రాశానో! ఎట్లా రాశానో! తెలియదు. తిరిగి జవాబు రాలేదు. చేరిందో! లేదో! కూడా తెలియదు. ఒక రచన చదివి, స్పందించి, దాని రచయితకు ఉత్తరం రాయడం నా వరకు నాకు అదే మొదలు, అదే ఆఖరు కూడా.
ఆ తర్వాత మరికొంత కాలానికి ఈ రెండు కథలతో పాటు వలసపక్షులు, చీడ, వాల్తేరత్త, ఖాయిలా బతుకులు మొదలగు మరో ఎనిమిది కథలను కలిపి నాకెంతో ఇష్టమైన ‘గజఈతరాలు’ కథ పేరుతోనే కథా సంపుటిని వెలువరించారు రచయిత. మళ్ళీ చిరునామా సంపాదించి, మనియార్డర్ చేసి, పుస్తకం పంపమని ఉత్తరం రాశాను. పుస్తకం వచ్చింది. దానితోపాటు మనియార్డర్ కూడా తిరిగి వచ్చింది.
ఉసుళ్లు, గజఈతరాలుతో పాటు నాకు బాగా నచ్చిన మరో కథ ఖాయిలా బతుకులు. ప్రభుత్వరంగ సంస్థల్లో జరిగే మోసాలు, లీలలు మన కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. పరిశ్రమలో పెద్ద తలకాయలు, వాటిని బటటి నుండి నడిపే శక్తులు పరిశ్రమల మూతకు ఎలా కారణమవుతాయో, తత్ఫలితంగా వాటి మీద ఆధారపడిన బతుకులు ఎలా చిద్రమవుతాయో! చూపిన కథ. ఈ పుస్తకంలోని కథలన్నీ ఆకట్టుకునే కథలే. అన్నీ వాస్తవజీవిత చిత్రణలే. ఈ రచయితకు పాలమూరు మాండలికం మీద ఎంత పట్టు ఉందో, ఉత్తరాంధ్ర మాండలికం మీద కూడా అంతే పట్టు ఉంది. ఈ రచయిత ఈ పుస్తకం తప్ప మరో పుస్తకం వెలువరించినట్లు కనపడదు. అయితేనేం ఇవి తెలుగు కథాసాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోదగ్గ కథలు.
గొరుసు జగదీశ్వరరెడ్డి గారు ఆదివారం ఆంధ్రజ్యోతికి ప్రముఖుల ఇంటర్వ్యూలు చేసి పెడుతున్నప్పుడు వారి ఫోన్ నెంబర్ దొరికింది. తీరిక దొరికిన ఒకరోజు ఫోన్ చేశాను. ఆనందంగా మాట్లాడారు. నేను రాసిన ఉత్తరం గురించి చెప్పారు. మా ప్రాంతంతో పెనవేసుకున్న వారి బాల్యం, జ్ఞాపకాలు, అనుభవాలు అన్నీ పంచుకున్నారు. చాలా కాలం తీరిక దొరికినప్పుడల్లా ఫోన్లో పలకరించేవారు.
ఒకసారి ఉద్యోగరీత్యా ఓ 12 రోజుల పాటు వృత్త్యంతర శిక్షణార్థమై హైదరాబాదులో ఉండవలసి వచ్చింది. ఆ సందర్భంలో నగరంలోనే ఉన్నానని వారికి ఫోన్ చేస్తే, అమీర్పేటలోని సారథి స్టూడియోకి వచ్చేయమన్నారు. అక్కడి ప్రివ్యూ థియేటర్లో ఆరోజు సాయంత్రం, పేరు గుర్తుకు లేదు కానీ ఏదో ఇరానీ సినిమాను చూపించారు. సినిమా అయిపోయాకా బయట కేఫ్ లో ఇరానీ చాయ్ తాగుతూ. చాలాసేపు మాట్లాడుకున్నాం. అది నా జీవితంలో అత్యంత ఆనందాన్ని ఇచ్చిన రోజులలో ఒకటి. ఒక అభిమాన రచయితను అట్లా ప్రత్యక్షంగా కలవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది.
తను బాల్యమంతా గడిపిన ఈ ప్రాంతాలలో, ఈ వీధులలో తనతో కలిసి తిరుగాలని, చూడాలని ఉందని, అందు కోసం ఓ రెండు రోజులు నాకు కేటాయించాలని కోరాను. వారు ఇచ్చే రోజు కోసం ఎదురుచూస్తూ....
- నాయుడు గారి జయన్న
03.03.2024
Chala bagundhi
రిప్లయితొలగించండిధన్యవాదాలు సార్ 🙏🙏
తొలగించండిఓ కథ చదివాక... ఎన్నోసార్లు ఇలా రచయితతో మాట్లాడితే బాగుండు.. ఆ రచయిత ఎందుకు అంత బాగా రాసారో.. అలా రాయగలిగారంటే వారు ఎంత ఆ కథలో జీర్ణించుకుపోయి ఉన్నారో వారి మాటల్లో వినాలనే బలమయిన కోరిక... కానీ చాలా తక్కువ సార్లు మాత్రమే నెరవేరింది ఈ కోరిక.. ఇప్పటికీ అలాగే మిగిలిపోయిన కథలెన్నో...
రిప్లయితొలగించండినిజమే శ్వేతా! ధన్యవాదాలు.
తొలగించండిNaveen super
రిప్లయితొలగించండిధన్యవాదాలు 🙏🙏
తొలగించండిNenu kuda "Kalojimuchtlu" chadivinpudu anipichidhi Naagilaramashastrini kalavalni
రిప్లయితొలగించండిసాహిత్యంపై మనకుండే మక్కువే ఆ అభిలాషకు కారణం కదా! సార్! ధన్యవాదాలు 🙏🙏
తొలగించండిచాలా బావుంది.
రిప్లయితొలగించండిధన్యవాదాలు సార్ 🙏🙏
తొలగించండిచాలా బాగుంది సార్. అభినందనలు
రిప్లయితొలగించండిధన్యవాదాలు సార్ 🙏🙏
తొలగించండి