11, డిసెంబర్ 2021, శనివారం

పొట్లూరి మోహన రామప్రసాదు

 

పొట్లూరి మోహన రామప్రసాదు తెలుగు కవి. కథా రచయిత, న్యాయవాది. ప్రధానంగా హైకూ కవి. ఇప్పటికి నాలుగు హైకూ సంపుటాలు వెలువరించాడు.  రంగస్థలంపై నటించిన అనుభవం కూడా ఉంది. దాదాపు 20 నాటకాలు వేశాడు. లఘు చిత్రాలను నిర్మించాడు.  కథ స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తూ పలు లఘు చిత్రాలను తీశాడు.

స్వస్థలం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కృష్ణాజిల్లా తెన్నేరు.  తల్లిదండ్రులు అన్నపూర్ణాదేవి, కృష్ణమూర్తి. ప్రస్తుతం విజయవాడలో స్థిరపడ్డాడు.

విద్యాభ్యాసం: వాణిజ్య శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ చేశాడు. పూణే విశ్వవిద్యాలయం నుండి 1987 లో లా డిగ్రీ ని పొందాడు.

ఉద్యోగం: వృత్తిరీత్యా ఇతను న్యాయవాది. రాష్ట్రంలోని విజయవాడలో న్యాయవాదిగా పనిచేస్తున్నారు

రచనలు: మా ఊరు, బడిలో, పూల రేకులు, తనేను

 మా ఊరు ఒక హైకు: ఈ హైకూల రచనాకాలం 1995. ఈ పుస్తకం అట్లూరి రాజ మనోహరం అట్లూరి రాజగోపాల రావులకు అంకితమివ్వబడినది. ఈ పుస్తకానికి శ్యామ్ కుమార్ కర్రి  ముఖచిత్రం వేశాడు. ఈ పుస్తకానికి కవిత్వం తొడుక్కున్న ఊరు కనురెప్పల నిశ్శబ్ద మోహనరాగం అంటూ డాక్టర్ సశ్రీ ముందుమాట రాశాడు.

ఇందులో కొన్ని హైకూలు

చింత తోపుల్లోంచి
చందమామని చూస్తే 
 మా ఊరు కనిపిస్తుంది

 

ఊళ్లో రైలు ఆగేది
ఎక్కింది దిగింది
లెక్కేలేదు

జడలాగినమ్మాయిని
మా ఆవిడకి చూపించా
ఇద్దరూ నవ్వుకున్నారు

 మా బడిలో పొట్లూరి మోహన రామ ప్రసాద్ చినుకు పబ్లికేషన్స్ విజయవాడ సెప్టెంబర్ 2020

ఈ పుస్తకంలోని హైకూలు 1995 1996 కాలంలో రచించబడినవి.

 

ఇందులోని కొన్ని హైకూలు

మా బడికెళ్ళా

వేసిన గోడకుర్చీ

కనిపించలేదు.

 

మాబడికెళ్ళా

బెంచీల మీద పేర్లు

చెరగలేదు.

 

బడి గుర్తొస్తే

సిరామరకలన్నీ

గుర్తుకొస్తాయి

 

పూల రేకులు-పొట్లూరి మోహన రామ ప్రసాదు- చినుకు పబ్లికేషన్స్ విజయవాడ ఫిబ్రవరి 2021

 

ఈ పుస్తకానికి ముఖచిత్రం శ్యామ్ కుమార్ కర్రీ వేశాడు. హైకూ మోహన సమ్మోహనం పూలరేకులు అంటూ చిత్తలూరి సత్యనారాయణ ఈ పుస్తకానికి ముందుమాట రాశాడు.

 

అందులోని కొన్ని హైకూలు

బంతి చేమంతి

తోటలోనే రాలాయి

కోయలేదుగా

 

వానచినుకు

కొమ్మల మీద పడి

పువ్వులైనాయి.

 

నల్లని మబ్బు

తోటమీంచి వెళుతూ

పూలనిచ్చింది.

 

తనేను - పొట్లూరి మోహన రామ ప్రసాద్-చినుకు పబ్లికేషన్స్ విజయవాడ ఆగస్టు 2021

 

ఇందులోని కొన్ని హైకూలు

ఆమె వెళ్ళింది

కొన్ని అక్షరాలని

కవిత చేసి

 

ఆమె లేకుంటే

ప్రపంచమే లేదుగా

ఉన్నా అంతేగా

 

తోటలో పూలు

పూస్తున్నా రాలవేంటి

ఆమె వచ్చిందా?