24, జులై 2016, ఆదివారం

ప్రకృతి ఇచ్చిన పాటగాడు -కొండన్న

తెలంగాణలో వెనుకబడిన జిల్లా గా పేరుబడిన పాలమూరు జిల్లాలో, కొండల నడుమ ఓ మారుమూల పల్లె అది. పేరు పెద్దగూడెం. వనపర్తికి అందెంతా దూరంలోనే ఉన్నా, నాగరికతకు  ఇంకా  అందనంత దూరంలోనే ఉన్న  ఊరది. ఆ ఊరిలో   బడి మొఖం కూడా చూడని వాడు. అక్షరాలు అసలే దిద్దని వాడు. గొర్రెలే లోకంగా బతుకుతూ , గొర్రెల వెనుకాలే నడుస్తూ, లోకం గురుంచి పెద్దగా తెలియని  ఓ మామూలు మనిషి, గొర్రెల కాపరి,  ఇప్పుడు తెలంగాణా అంతటా పాటై మొగుతున్నాడు. అతనే కొండన్న. అసలైన వాగ్గేయకారుడు. జానపద గాయకుడు.

 వేపూరి  హనుమద్దాసు నుండి గోరటి వెంకన్న వరకు లెక్కలేనంత మంది వాగ్గేయకారులను తెలంగాణాకు, తెలుగు నేలకు  అందించింది పాలమూరు. ఎంతో మంది  విశ్వవిద్యాలయాలలో  పరిశోధక పట్టాలు  పొందటానికి భూమికైంది.  అయితే చాలా మంది వాగ్గేయకారులకు కొండన్నకు ఉన్న ప్రధానమైన భేదం, కొండన్నకు అక్షరం  ముక్క కూడా రాకపోవడం.

అక్షరాలు రానివాడు పాటలు అల్లుకోవడం, వాటికి బాణీలు కట్టుకోవడం, తానే పాడుకోవడం వంటి పనులు అసలైన జానపద గాయకుడిగా కొండన్నను నిలబెట్టాయి. చాలా  మందిలాగా కొండన్న బతకడం కొరకు తన పాటను అమ్ముకోలేదు.  బతుకునిచ్చే గొర్రెలను అమ్ముకొని తన పాటను నిలబెట్టుకున్నాడు. కపటం తెలియని పల్లె దనానికి ప్రతీక కొండన్న.


ప్రకృతిలో కలిసిపోవడం, ప్రకృతికి మురిసిపోవడం కొండన్న కు తెలిసిన విద్య. అందుకే కొండన్న ప్రకృతి ఇచ్చిన పాటగాడు. కొండన్న పాట, కొండన్నతో పాటే పెరిగింది. చిన్నప్పటి నుండి గొర్లను దీసుకొని అడవికి వెళ్ళడం. అడవిలో కనిపించే ప్రతి చెట్టు, పుట్టా, గట్టు, వాగు, వంకా , పక్షులు , జంతువులూ అన్నిటిని పలకరిస్తూ కూనిరాగాలు తీయడం అలవాటై పోయింది. క్రమంగా అదే పాటై పోయింది. పొద్దున్న ఆకలిగొన్న మేకలను, గొర్లను అడవికి తీసుకరావడం, సాయంత్రానికి వాటిని కడుపు నింపుకొని, తాను పాటను గొంతు నింపుకొని ఇంటికి రావడం కొండన్నకు మామూలైపోయింది.  ఇంటికొచ్చిన పాటను  తమ్ముడు ఆంజనేయులు చెవిలో వేస్తె , తమ్ముడు పేపర్లో వేసేవాడు.  అట్లా  అవి పాటలుగా రూపుదిద్దుకొన్నవి.

చిన్నప్పటి నుండి కొండన్న గొంతు పాటలను మోస్తూనే ఉన్నా వాటిని పల్లకీ లేమి భుజానికె త్తుకోలేదు . మొదట్లో వాటికి చీత్కారాలు తప్పలేదు. వెక్కిరింతలు వదలలేదు. జనాలు పిచ్చివాడిగా జమకట్టిన రోజులూ లేకపోలేదు. జన జీవన వేదానికి భాష్యం చెప్పిన వేమనంతటి వాడినే పిచ్చివాడిగా జమకట్టిన లోకం మనది. కొండన్న ఓ లెక్క .  కొండన్న పాట గొంతు నుండి పేపరు మీదికి సులభంగానే చేరింది. కాని  పేపరు నుండి డిస్క్ మీదికి రావడానికి పెద్ద యుద్దమే జరిగింది.  తనకు ఆనందానిచ్చే పాట లొక వైపు,  కుటుంబానికి బతుకునిచ్చే గొర్లు ఒక వైపు. తాను పాటల వైపు. కుటుంబం గొర్ల వైపు. మధ్య గోడ, గొడవ, అలక, ఆకలి. అయినా కార్య సాధకులు ఆటంకాలకు లొంగిపోతారా? పోరు కాబట్టే మనమిట్లా కొండన్న గురించి మాట్లాడుకొంటున్నాం.  మందలో కొన్ని గొర్లు లారెక్కి  వెళ్ళిపోయాయి. 30 వేలు చేతిలో వాలిపోయాయి.  అంతే నవ్వుల తెలంగాణ , ఎండిన పాలమూరు  నేల తల్లి, చినబోయిన చిలుకమ్మా, అన్న గంగన్నా, తూర్పు కొండల్లో మల్లన్న, అందమైన గువ్వా అన్నీ పాటలై సిడిల మీద పరుచుకున్నాయి. గూడెం దాటి, కొండలు దాటి తెలంగాణా అంతటా మారుమోగాయి. టీవీ  కెమెరాలన్ని గూడెం చేరుకున్నాయి.  కొండన్న పాదాలకు టీవీ స్టూడియోలన్ని కార్పెట్ పరిచాయి. ఇంత జరిగినా  గొర్లను కొండన్న  వదలలేదు. పాట కొండన్నను వదలలేదు. ప్రకృతి పాటను వదలలేదు.   చిత్రమేమంటే కొండన్న తల్లిని కన్నీళ్ళూ  వదలలేదు. బువ్వ పెట్టె గొర్లు పోయినాయని దుఃఖంతో మొదట, తన కొడుకు జనం మెచ్చిన పాటగాడైనాడని  ఆనందంతో ఇప్పుడు...అంతే...

--నాయుడుగారి జయన్న

--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల*