31, ఆగస్టు 2014, ఆదివారం

అంకాళమ్మ కోటఅంకాళమ్మ కోట  మహబూబ్ నగర్, కర్నూలు జిల్లాల సరిహద్దులో విస్తరించి ఉన్న నల్లమల అడవులలో ఉంది. ఈ అటవి ప్రాంతంలో ప్రవహించే  కృష్ణానది మధ్యలో ద్వీపకల్పంలా విస్తరించి ఉన్న భూభాగంలో 600 అడుగుల ఎత్తులో కొండ మీద 20 ఎకరాల స్థలంలో ఈ కోటను నిర్మించారు. ప్రస్తుతం కోట శిథిలావస్థలో ఉన్నా, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండటంతో పర్యాటకులకు కనువిందు చేస్తూ అలరారుతూ ఉంది.
ఉనికి
మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ కు 16 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఒడ్డున అంకాళమ్మ కోట ఉంది. ఈ భూభాగం కర్నూలు జిల్లా లోని ఆత్మకూర్ అటవీ డివిజన్ పరిధిలోని పెద్ద చెరువు ప్రాంతంలో ఉంది.
కోట కాలం
ఈ కోటను 16 వ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తుంది.
కోటలోని నిర్మాణాలు
ఈ కోటలో కాళికాలయం, ఆంజనేయ స్వామి విగ్రహం, శివలింగం, పురాతన బావి ఉన్నాయి. ఇక్కడి కాళికాదేవికి అంకాళమ్మ అని పేరు. ఆమె పేరు మీదుగానే ఈ కోటకు అంకాళమ్మ కోట అని పేరు వచ్చింది. పేరు భయం కొల్పే విధంగా ఉండినా, అమ్మ వారు మాత్రం ప్రశాంత వదనంతో ఉంటుందంటారు. కోట జన బాహుళ్యంలోకి రాని నాడు, గుప్త నిధుల కొరకు కొందరు దుండగులు విగ్రహాలను ధ్వంసం చేస్తే, జాలరులు, అక్కడి చెంచులు, మరికొందరు భక్తులు విగ్రహాలను పునఃప్రతిష్టించారు. ఇక్కడ అమ్మవారి పూజారులు కూడా చెంచులే.
ప్రయాణ మార్గం
అంకాళమ్మ కోటకు చేరుకోవటానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి జల మార్గం, మరొకటి రోడ్డు మార్గం. జల మార్గం ద్వారా మహబూబ్ నగర్ జిల్లా వాసులు, రోడ్డు మార్గం ద్వారా కర్నూలు జిల్లా వాసులు ఈ కోటకు వస్తుంటారు. మహబూబ్ నగర్ జిల్లాలోని పర్యాటకులు, భక్తులు కొల్లాపూర్‌కు 8 కిలోమీటర్ల దూరంలో నల్లమల కొండల మధ్యన ఉన్న అమరగిరి గ్రామానికి చేరుకొని, అక్కడి నుండి కృష్ణానదిలో 8 కిలోమీటర్లు పుట్టీలలో, మోటార్ బోటులలో ప్రయాణించి అంకాళమ్మ కోటకు చేరుకుంటారు. కర్నూలు జిల్లా వాసులు ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని పెద్ద చెరువు ప్రాంతం వరకు లారీలు, ట్రాక్టర్లలో వచ్చి, అక్కడి నుండి కాలినడకన కోటకు చేరుకుంటారు.
ప్రత్యేక పూజలు
ప్రతి మంగళవారం ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. అందుకే ఆ రోజు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కొన్ని ప్రత్యేక దినాలలో కూడా భక్తులు బంధుమిత్రులతో వచ్చి జంతు బలిలు ఇచ్చి, అమ్మ వారికి పూజలు చేస్తుంటారు.

29, ఆగస్టు 2014, శుక్రవారం

పాలమూరు కోటలు -ఘనపురం ఖిల్లాఘనపురం ఖిల్లా మహబూబ్ నగర్ జిల్లాలోని గిరిదుర్గాలలో ఒకటి. ఇది వనపర్తికి సమీప మండలం మరియు కేంద్రమైన ఖిల్లాఘనపురంలో ఉంది. కాకతీయుల సామంతులు నిర్మించిన ఈ కోట ఎత్తైన రెండు కొండల మీద నిర్మించబడి చూపరులను ఆకట్టుకుంటుంది.

కోట చరిత్ర 

ఘనపూర్ ప్రాంతాన్ని ఇప్పటికి 800 ఏళ్ళ క్రితం కాకతీయుల సామంతులు పాలించినట్లు తెలుస్తుంది. వారిలో గోన బుద్దారెడ్డి కుమారుడు గోన గణపరెడ్డి ఒకరు. ఇతను  ఘనపురం గ్రామంలో గణపతీశ్వరాలయం నిర్మించాడు. ఇక్కడ గణపతీశ్వరాలయం ఉండటం, ఈ ప్రాంతాన్ని గణపరెడ్డి పాలించడం వలన ఈ గ్రామానికి ''గణపురం'' అని పేరు వచ్చింది. ఇతను నాగర్‌కర్నూల్ తాలుకాలోని వర్ధమానపురం నుండి  కాకతీ కందూర్(అడ్డాకుల) వరకు ఉన్న ప్రాంతాన్ని పరిపాలించాడు. ఈ ప్రాంతానికి కేంద్రంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో గణపురం గ్రామంలో కోటను నిర్మించాడు. ఇక్కడి నుండి పాలన సాగించాడు. ఈ కోట కారణంగా గణపురానికి ఖిల్లాఘనపురం అను పేరు స్థిరపడిపోయింది.

కోట నిర్మాణం
గణపురం గ్రామం చుట్టు ప్రక్కల తొమ్మిది గుట్టలు ఉన్నాయి. వాటికి దేవుని గుట్ట, మనిషి కొండయ్య గుట్ట, వీరన్నగుట్ట, బంగారు గూడు, వెంకయ్యగుట్ట, చౌడమ్మగుట్ట, చంద్రగుట్ట, ముర్రయ్యగుట్ట, దుర్గంగుట్ట అని పేర్లు ఉన్నవి. వీటిలో గ్రామానికి ఈశాన్యంలో ఉన్న  ముర్రయ్యగుట్ట, దుర్గంగుట్టలు ఎత్తుగా ఉన్నవి.  ఈ రెండు గుట్టలను కలుపుతూనే గణపరెడ్డి కోటను నిర్మింపచేశాడు. ఈ కోటలో రాజమందిరం, మంత్రుల నివాసాలు, సైనికుల స్థావరాలు ఉన్నట్లు అక్కడి ఆధారాల ద్వారా తెలుస్తుంది. కోటలోకి ప్రవేశించడానికి  వరుసగా మూడు ముఖద్వారాలు ఉన్నాయి.  ప్రతి ముఖద్వారం దగ్గర కాపలా కాసే సైనికులకు గదులు నిర్మించారు. అక్కడే అతిథులు ఎవరైనా వస్తే విశ్రాంతి తీసుకోవడానికి విశ్రాంతి గదులు కూడా ఉండినట్లు తెలుస్తుంది.
కోట రహస్య మార్గాలు
విపత్కర పరిస్థితులలో కోటపై శత్రువులు దాడి చేస్తే, ఎదుర్కోలేని పరిస్థితులు దాపురించినపుడు తప్పించుకోవడానికి కోటలో రెండు రహస్య మార్గాలు నిర్మించినట్లు తెలుస్తుంది. ఒకటి కోట నుండి సమీప ఘనపురం గ్రామంలోని ఓ చేదుడు బావికి చేరుకుంటుందని, మరొకటి పాన్‌గల్ కోట వరకు నిర్మించబడిందని ప్రచారంలో ఉంది.
కోట ఫిరంగి
 శత్రువులపై దాడికి ఈ కోటలో అత్యంత ఎత్తులో తోపు(ఫిరంగి)ని ఏర్పాటుచేశారు. దీని కొరకు ప్రత్యేకంగా సైనిక విభాగం ఉండినట్లు తెలుస్తుంది.
కోటలో ఇతర నిర్మాణాలు
కోటలోపల  దొరసాని మాలె, సమావేశ మందిరాలు, దొంగల బాట, నిత్యం నీటితో ఉండే రెండు చెరువులు, తాగునీటి కొరకు పాలగుండం, నేతిగుండం అనే నీటి తొట్టెలు, మబ్బు చెలిమ మొదలగు నిర్మాణాలు నేటికీ కనిపిస్తాయి. మబ్బు చెలిమలోకి వెళ్లాలంటే 10 అడుగుల వరకు చిమ్మచీకటిలో వెళ్ళవలసి ఉంటుంది, అనంతరం సూర్యకిరణాలు కనిపిస్తాయి. అక్కడి నుండి రెండు వందల అడుగుల వరకు దిగవలసి ఉంటుంది.
 అనుబంధ కోటలు
గణపురంలోని గుట్టలకు అనుసంధానంగా కాకతీయ సామంతరాజులు మట్టితో గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఏడు కోటలు నిర్మించారు. వాటికి మేడికోట, బండకోట, వీరన్నకోట, ఆగారంకోట, తక్కిళ్ళకోట, వావిళ్ళకోట, బర్వనికోట అని పేర్లు ఉన్నవి. శత్రువులు కోటలలోకి ప్రవేశించకుండా వాటి చుట్టు కందకాలు తవ్వింఛారు.  వాటిని నిత్యం నీటితో నింపి వాటిలో మొసళ్ళను పెంచేవారని తెలుస్తుంది.
 గణ సముద్రం
గ్రామానికి సంబంధించిన కోటలకు సమీపాన నాటి రాజులు ఒక పెద్ద చెరువును నిర్మించారు. దీనికే ''గణసముద్రం'' అని పేరు.
 చారిత్రక సంఘటనలకు సాక్షి
కాకతీయ వీరవనిత రాణి రుద్రమదేవి పాలనానంతరం కాకతీయ సింహాసనాన్ని ప్రతాపరుద్రుడు అధిష్టించాడు. ఇతను ఘనపురం రాజైన గణపరెడ్డి కుమారుడు గోన కన్నారెడ్డిని భూత్‌పూర్ యుద్దంలో ఓడించి, అతని కుమారైను ఈ కోటలోనే వివాహామాడినట్లు చరిత్ర చెబుతుంది. ఈ వివరాలు వరంగల్ లో వెయ్యి స్తంభాల గుడిలోని ఓ శిలాశాసనంలో పేర్కొనబడినవని చెబుతారు. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సైన్యం కూడా కోటకు వచ్చినట్లు ఆధారాలు ఉన్నాయి.

27, ఆగస్టు 2014, బుధవారం

పాలమూరు కవిభీష్మ- కపిలవాయి లింగమూర్తికపిలవాయి లింగమూర్తి పాలమూరు జిల్లాకు చెందిన కవి, పరిశోధకులలో ప్రముఖుడు. జిల్లాలోని బల్మూర్ మండలం జినుకుంట లో మాణిక్యమ్మ, వెంకటాచలం దంపతులకుమార్చి 31, 1928 న జన్మించిన లింగమూర్తి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ. (తెలుగు) పట్టా పొంది 1954లో నాగర్ కర్నూల్ జాతీయోద్యమ పాఠశాలలో తెలుగు పండితునిగా చేరాడు. ఆ తర్వాత 1972 లో పాలెం శ్రీవేంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో ఉపన్యాసకుడుగా చేరి దశాబ్దం పాటు సేవలందించి 1983లో ఉద్యోగవిరమణ పొందాడు. లింగమూర్తి నడిచే విజ్ఞానసర్వస్వంగా పేరుపొందాడు. జిల్లాలోని అనేక స్థలపురాణాలను, దేవాలయాల చరిత్రను వెలికితీశారు. కపిలవాయికి తెలుగు విశ్వవిద్యాలయం ఇటీవల  గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. 30.08.2014 రోజున విశ్వవిద్యాలయం 13 వ స్నాతకోత్సవంలో చాన్‌సలర్, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ వీరికి గౌరవ డాక్టరేట్‌ను అందించనున్నారు. 

రచనలు 
వీరు దాదాపు 115 పుస్తకాలను రచించారు. అందులో చరిత్ర పైనే 15 గ్రంథాలు ఉన్నాయి. ఇప్పటి 70కు పైగా పుస్తకాలు ముద్రణకు నోచుకున్నాయి. వాటిలో కొన్ని...
     * ఆర్యా శతకం
 • ఉప్పునూతల కథ
 • క్షేపాల గంగోత్రి - తూము వంశ రెడ్ల చరిత్ర
 • చక్రతీర్థ మాహాత్మ్యం - అయిదాశ్వాసాలు గల స్థల చారిత్రక కావ్యం
 • తిరుమలేశ శతకం
 • దుర్గా భర్గ శతకాలు
 • పండరినాథ విఠల శతకం - ఏకప్రాస ఔత్సలాలు
 • పరమహంస శతకం
 • పాలమూరు జిల్లా దేవాలయాలు - 2010
 • భాగవత కథాతత్త్వం
 • మహాక్షేత్రం మామిళ్ళపల్లి - స్థల చరిత్ర
 • శ్రీ భైరవకోన క్షేత్ర మాహాత్మ్యం
 • శ్రీమత్ప్రతాపగిరి ఖండం - ఆరు ఆశ్వాసాల స్థల చారిత్రక కావ్యం
కపిలవాయి రచనలపై పరిశోధనలు
కపిలవాయి లింగమూర్తి కావ్యాలు, గీతాలు, శతకాలు, వచన సాహిత్యం, స్థల చరిత్రలు, బాల సాహిత్యం మొదలగు వివిధ సాహిత్య ప్రక్రియలలో రచనలు చేశారు. ఈ రచనలపై పలివురు విద్యార్థులు పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికి వీరి రచనలపై వివిధ విశ్వవిద్యాలయాలలో ఆరు సిద్ధాంత గ్రంథాలు రూపొందినవి.
బిరుదులు
 • 1992 లో కవితా కళానిధి, పరిశోధనా పంచానన
 • 1996 లో కవికేసరి
 • 2005 లో వేదాంత విశారద
 • 2010 లో గురు శిరోమణి
 • 2012 లో సాహిత్య స్వర్ణ సౌరభ కేసరి
సన్మానాలు
కపిలవాయి లింగమూర్తికి సాహిత్య రంగంలో చేసిన విశేషకృషికి గుర్తింపుగా రాష్ట్ర స్థాయిలో అనేక సందర్భాలలో సన్మానాలు జరిగాయి. 1983 లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వీరిని సన్మానించారు. తరువాత నారా చంద్రబాబు నాయుడు, వై.యస్. రాజశేఖర్‌ రెడ్డిలు ముఖ్యమంత్రులుగా ఉన్నకాలంలోనూ వారిచే సన్మానాలు పొందారు. తెలంగాణ రాష్ట్ర సమితి దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షులు, ఇప్పటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్ర కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు వీరిని సన్మానించారు. నలుగురు ముఖ్యంత్రులచే సన్మానింపబడిన ఏకైక తెలుగు కవి, పరిశోధకులు కపిలవాయి లింగమూర్తి.
కపిలవాయిపై డాక్యుమెంటరీ
వెన్నెల సాహిత్య అకాడమీ కపిలవాయి లింగమూర్తి జీవితం, సాహిత్య సృజన, పరిశోధనలపై కవితా కళానిధి కపిలవాయి లింగమూర్తి పేరుతో ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. దీనికి 2011లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ రెండో డాక్యుమెంటరీ చిత్రంగా నంది అవార్డును ప్రకటించింది.

--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల*