మెర్సీ
మార్గరేట్ కవిత్వం 'మాటల మడుగు '- కొన్ని మాటలు
ఉరుకులు పరుగుల ఆధునిక యాంత్రిక
జీవితంలో కవిత్వాన్ని శ్వాసిస్తూ, కవిత్వంగా జీవిస్తూ, కవిత్వం కొరకు తపిస్తూ తిరుగాడే మనుషులు కొందరే ఉంటారు. ఆ కొందరిలో మెర్సీ
మార్గరేట్ ఉంటారు. ఫేస్ బుక్ కవిత్వ వేదిక 'కవి సంగమం' లో నిరంతరం తన స్పందనలకు కవితా రూపమద్దుతూ వచ్చింది. మరెంతో మందికి
కవిత్వంపై ఆసక్తి కలిగించడానికి కవిత్వశాలను నిర్వహించింది. ఆంధ్రా నుండి ఆటా వరకు, తెలంగాణ నుండి తెలుగోడుండె ప్రతి నేల వరకు తన గొంతును వినిపించింది.
ఇప్పుడు మాటల మడుగుతో మనముందుకొచ్చింది.
మాటల మడుగు 53 కవితలతో కూడిన కవిత్వ సంకలనం. వీటిలో కొన్ని కవితలు ఇదివరకే ఫేస్ బుక్లోనో, మరో పత్రికలోనో, ఇంకో వేదిక మీదో
ప్రచురించబడినవే. వినిపించబడినవే. ఏ ముందీ కవితల్లో? అని
ప్రశ్నించుకుంటే...నీ గురించి, నా గురించి, మన గురించి, మన చుట్టూ ఆవరించిన సమాజం గురించే
అనిపిస్తుంది. ఎట్లా రాసింది? హృదయమెట్లా స్పందిస్తే
అట్లా రాసింది. మనిషిలో మనిషి తనం మిగిలే ఉంటే ఇట్లానే రాస్తారనిపించేలా రాసింది.
ఎందుకు రాసిందో కూడా అడుగాలనిపిస్తే, అడుగేయండి--
" పునర్లిఖించుకోవాలిప్పుడు
నన్ను నేను
కొత్త కాగితంపైకి అడుగేస్తూ..."
అంటూ సమాధనమిస్తుంది.
కాలం మారడం నిత్యం. సమాజం మారడం సత్యం. కాని ఆ
మారేదేదో మంచి కొరకు మారితే ఎంత బాగుండు. అదే మన దురదృష్టం. ఈ కవి ఆవేదన కూడా అదే.
గడిచిన గతాన్ని, నేటి నిరర్థక సత్యాన్ని పోలుస్తూ రాసిన
మాటల మడుగు కవితలో ...
" ఒకప్పుడు
నోటి నిండా మాటలుండేవి...
మసక కన్నుల్ని వెలిగించే
నిప్పురవ్వలుండేవి
చెమట చుక్కల్ని కౌగిలించుకొనే
చేతులుండేవి.."
ఇప్పుడూ మాటలున్నాయి. కాని
అవన్నీ గాలికి తేలిపోయే తాలు మాటలే అంటూ చెబుతుంది. ఈ సంకలనంలో ఇది గొప్ప కవిత. ఈ
కవితా శీర్షికే ఈ సంకలనానికి పేరుగా మారడంలో ఔచిత్యమూ ఉంది. అర్హతా ఉంది. మనల్ని
మనం అన్ని విధాలుగా శారీరకంగా తీర్చిదిద్దుకోగలిగే అవకాశమే ఉండి ఉంటే, పురుషులందరు ఏ సల్మాన్ లాగో, స్త్రీలందరూ ఏ
ఐశ్వర్యరాయ్ లాగో తీర్చిదిద్దుకొనేవారు. మన
ప్రమేయంలేని జన్యుపర అంశాలను అర్థం చేసుకోకుండా, అంతర సౌందర్యాన్ని అవగతం చేసుకోకుండా, శారీరక
బాహ్య సౌందర్యానికే విలువిచ్చే మనుషులు అన్నం మెతుకుల్లాగే అర్ధాంగి హృదయాన్ని
కూడా చిదిమేసినప్పుడు, అనుభవించే వేదన బరువెంతో
తూచే కొత్త యంత్రమేమో అనిపిస్తుంది 'హృదయపు
మెతుకు ' కవిత. నిజంగానే హృదయాన్ని ద్రవింప జేసే
కవితిది.
భాష ఒక్కోరికి ఒక్కో తీరుగా
ఉపయోగపడుతుంది. మరి ఈమెకు? " మాయమవని కాలిన గాయం".
సమాజ శ్రేయస్సుకై జీవితాల్ని ఫణంగా పెట్టే, అదృష్టవంతుల
కోసం నిరంతరం దురదృష్ట వంతులుగా బతికే శ్రామికులు నిజంగా కోల్పోతుందేమిటో
చెబుతూ...
" మా
అరచేతుల గీతల్ని, అస్తిత్వాన్ని, కాలాన్ని"
అంటూ తానూ శ్రామిక పక్షపాతినేనని నిరూపించుకుంటుందీ కవి.
ప్రపంచపు బాధ శ్రీశ్రీ నెట్లా మెలిపెట్టిందో, ఈమెనూ అంతే. అందుకే సిరియా పిల్లల కొరకు కన్నీళ్ళు పెడుతూనే...
" స్వేచ్చగా తలెత్తుకుని శ్వాసించే అస్తిత్వ కేతనాలు " అంటూ పిడికళ్ళకు కొత్త నిర్వచనాన్నిస్తుంది.
గడియారంతో పోటి పడుతు, బండెడు పుస్తకాలతో కుస్తీ పడుతు, మనిషిని మనిషిగా
నిలుపలేని చదువులకు బంధీ అయిపోయిన బాల్యాన్ని గడిపే చిన్నారులు, స్వేచ్చగా ఎగిరే పక్షులను చూసినప్పుదు, ఆ
పిల్లల కళ్ళు " బస్సు కిటికీ చువ్వలతో చేసే సంభాషణ" ను మనం వినగలమా? అర్థం చేసుకోగలమా? ఈ కవి వినగలిగింది. 'అవసరం ' కవిత రాయగలిగింది.
మనసుండే మనుషులుండాలిగానీ, ఆ మనుషులు మాట్లాడగలగాలి కానీ, శవాలైనా జీవం
పోసుకొని తిరుగాడవూ? అదే చెబుతుంది 'జీవనది ' కవిత.
కమ్యూనికేషన్ స్కిల్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, పచ్చిగా చెప్పాలంటే బతుక
నేర్వడం తెలిసిన మనుషుల భాగోతాలను చూపే కవిత 'ఎక్స్‌క్లూసివ్
నవ్వులు '. నవ్వులను, మరి
ముఖ్యంగా నానార్థాలు తెలిసిన నవ్వులను మనిషి ఉపయోగించినత నైపుణ్యంగా మరే జంతువూ
ఉపయోగించకపోవడం మనిషి సాధించిన విజయమే. దుఃఖాన్ని
భరించడం, పంచుకోవడం సులువే. కానీ, వెటకారపు నవ్వులను భరించడం మాత్రం మహా కష్టమే.
ఈ కవి తన కవిత్వంలో సూర్యుడిని ఎట్లా
ఉదయింపజేస్తుందో చూడండి-
" సూర్యుడు
చుక్కల్ని పట్టుకొని
పగటి గంప కింద కప్పిపెట్టి
తన పనికి ఉపక్రమిస్తూ..."
అంటుంది. రాత్రిళ్ళు ఊళ్ళల్లో గంప కింద కోడిపిల్లలను మూసిపెట్టి, ఉదయం కాగానే తెరువడం మామూలే. దాన్నే ఇట్లా తిరిగేసి కాల సూచిగా వాడుకోవడం
కవి సాధించిన కవితా మాయజాలం.
"అరువు భాషను
హావభావాలను, వేషధారణను
చంకలోని బతుకు బరువును
సంచిలో వేసుకొని
నన్ను నేను అమ్ముకోవడానికి
బయలుదేరుతా '' ననటంలో, కేవలం బతకటం కోసం మన ఇష్టాలనెట్లా దూరం
చేకోవాలో తెలిపే ధైన్యం, అయిష్టాలనెట్లా బలవంతంగా
నెత్తికెత్తుకోవాలో తెలిపే దౌర్భాగ్యం ' జంతర్ మంతర్ ' కవితతో మనకు చూపిస్తూందీ కవి. ఇదే కవితలో ఒక చోట " నాలుకకు ఇరవై ఆరు అక్షరాల నరకాన్ని కట్టుకొని/ బయలుదేరుతాను"
అని అనటంలో పరాయి భాషెప్పుడూ మన సమస్త భావ వ్యక్తీకరణావసరాలను తీర్చలేదని చెప్పటం
లేదూ? ఆ ప్రయత్నం చేయడం నరకంతో సమానమేననే భావం కనిపించటం లేదూ? ఉద్యోగమంటే ఆషామాషి
కాదని, ఏ రోజుకారోజు పోరాటమేనని, ఆ రోజును ముగించటమంటే, ఆ యుద్ధంలో గెలవటమేనని
చెప్పినట్లుగా ఉంటుందీ కవిత. ఈ సంకలనంలో ఆణిముత్యాల్లాంటి కవితల్లో ఇదీ ఒకటి.
కొన్ని పరిచయాలు బౌతికంగా ముగిసినట్లు
అనిపించినా, వాటి అనుబంధపు తాలుకూ పరిమళాలేవో మనుసుకు
అంటుకొని గుభాలిస్తూనే ఉంటాయని," జ్ఞాపకాల వెన్నని/ చేతిలో చల్లని ముద్దగా ఉంచి వెళ్తాయని, కొత్త అనుబంధానికి నాందిగా నిలుస్తాయని ఈ కవి చెబుతుంది.
"అదేంటో
కడుపులోకి
పదునైన బాధ దిగిన ప్రతిసారి
అక్షరాలు గుండెను చీల్చుకొని
బయటకు వచ్చి
పసిపిల్లల్లా నవ్వుతాయి " అంటూ
ఈ కవి కవిత్వావిర్భావ రహస్యాన్ని మన ముందు ఉంచుతుంది.
చీత్కారాల ఘాటు గాయాల లోతెంతో
తెలిపే కవితలు, చెమ్మ కన్నుల నీటి సాంద్రతను తెలిపే కవితలు,విరహ వేదనను, స్నేహపు విలువను తెలిపే కవితలు,కవులకు, కవిత్వానికి,కన్నీళ్ళకు
నిర్వచనమిచ్చే కవితలు, మొసలి కన్నీరు కార్చే సమాజానికి
హితోపదేశం చేసే కవితలు, అనాగరికపు అంటరాని తనాన్ని, దాని విషాదకర ప్రతి ఫలనాలను చూపే కవితలు, చక్కటి
ఉపమానాలతో కూడిన కవితలు, అరుదైన భావచిత్రాలతో కూడిన
కవితలు ఈ సంకలనంలో ఎన్నో! చక్కటి కవితా సంకలనాన్ని అందించిన కవిని అభినందిస్తూ, మరింత చిక్కబడి, మరింత పదునుదేలి ఈ కవి కవిత్వం సమాజానికి దిక్సూచిగా నిలువాలని ఆకాంక్షిస్తున్నాను.
-నాయుడుగారి జయన్న