హోస్పేట్ ,
13. 10. 2013.
మధ్యాహ్నం 1. 30 గం. లకు హోస్పేట్ నుండి
నేను, బషీర్, గిరి హంపికి బస్ లో
బయలుదేరాం. అరగంట ప్రయాణం తర్వాత హంపికి
చేరుకున్నాం. ముందుగా కడుపులో ఎలుకలు పరిగెడుతుంటే ఒక భోజనశాలలో భోజనం
చేశాం. తరువాత ఒక ఆటో మాట్లాడుకున్నాం. మాకు మరో పెద్ద మనిషి తోడయ్యాడు షేరింగ్ ఆటోలో. తనది గుంటూరు. వృత్తి
రీత్యా బెంగుళూరులో ఉంటున్నట్టు చెప్పాడు. నలుగురం బయలుదేరాం ఆటోలో - అలనాటి వైభవ
అవశేషాలు దర్శించడానికి. సమయం చాల తక్కువగా ఉండటం మూలానా ఆటోవాడు చాలా వేగంగా ప్రాంతాలను
చూపించేశాడు. ముందుగా హంపి వీధికి దగ్గరలొనే 6.7 మీటర్ల ఎత్తున్న ఉగ్ర నరసింహమూర్తి విగ్రహాన్ని చూశాం. అక్కడ లభించిన శాసనాల
ప్రకారం ఈ విగ్రహాన్ని శ్రీ కృష్ణదేవరాయలు 1528 సంవత్సరంలో ఏకశిలపై
చెక్కించినట్లు తెలుస్తుంది. ఈ విగ్రహము మోకాలిపై చిన్న లక్ష్మీ దేవి విగ్రహము
ఒకటి ఉండేదట. విధ్వంసాల కారణంగా ఈ లక్ష్మీ విగ్రహము ప్రధాన విగ్రహము నుండి వేరుపడగా దానిని కమలాపురలోని మ్యూజియంలో ఉంచారట. ఈ విగ్రహములో
నరసింహుడు శేషతల్పముపై కూర్చుని ఉన్నట్టు చెక్కబడినది. ఆదిశేషువు ఏడు తలలతో
నరసింహునికి పడగవిప్పి తలపై నీడపడుతున్నాడు. ఈ విగ్రహాన్ని ఇటీవల కొంత
పునరుద్ధరించారు. మోకాళ్లను కలుపుతూ ఉన్న గానైటు పట్టీ విగ్రహాన్ని స్థిరపరచడానికి
ఇటీవలే చేర్చారు.
అక్కడి నుండి మా ఆటోవాడు రాణివాస భవన సముదాయానికి తీసుకవెళ్ళాడు. ఆ
దారిలోనే పురావస్తు శాఖ వారి కార్యాలయం ఉంది. దాని
దాటి ముందుకు వెళ్తే ఎత్తైన ప్రహరి గోడ కనిపిస్తుంది గోడకు ఆవలి వైపు ఉన్నదే రాణివాస భవన సముదాయం. లోపలికి వెళ్లడానికి బయటనే
టికెట్టు అమ్ముతుంటారు. లోపలికి వెళ్లడానికి ప్రత్యేకమైన
ప్రవేశ ద్వారం ఏమి లేదు. ఉన్న ప్రహరి కొంత మేర పడగొట్టి
దారి ఏర్పాటు చేసారు. లోపలికి వెళ్లగానే ఎడం వైపు ఒక భవనం కనబడుతుంది. అది పురావస్తు ప్రదర్శన శాల.
అందులో ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక వస్తువులను
ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రదర్శన శాలలో ముఖ్యమైనది: ఈ
ప్రదేశంలో ముఖ్యమైన ప్రదేశాలలో వంద సంవత్సరాల క్రితం తీసిన ఫోటోలు. అవే ఫోటోలను అదే కోణంలో ప్రస్తుతం ఉన్న
తీరులో తీసిన ఫోటోలు, వాటి
తేడాలను చూపుతూ ప్రక్క ప్రక్కనే ఉంచారు. ఈ భవనం కొంత
వైవిధ్యంగా ఉన్నది. ఇది ఆ రోజుల్లో ఖజాన భవనం గా సేవలందించింది. ఎత్తైన పై కప్పుతో, లోపల వేదికలతో, గంభీరంగా కనబడుతుంది. దీనిపైన, చుట్టూ ఉన్న చూరును గమనిస్తే, పడగ విప్పిన నాగులు మీద పడతాయా అన్నట్లుంటుంది. దీని ముందే రాణీ అంతఃపుర భవన పునాది
మట్టం ఉన్నది. ఈ ప్రహరీ లోపల మూలలందు బురుజులు ఉన్నాయి. ఒకదాని పైకి ఎక్కి చూడవచ్చు. ఈ ఆవరణలో ఉన్న మరో ప్రధాన భవనం పద్మమహల్.
ఈ అందమైన భవనం కూడ ధ్వంసం కాకుండా మిగిలి ఉన్నది. కాల గమనంలో కొంత శిధిలమైనా బాగానే ఉన్నది.
ఇది మూడడుగుల ఎత్తైన పీఠం పై రెండంతస్తులలో
ఉన్నది. హిందూ, ముస్లిమ్ నిర్మాణ శైలిలో దీనిని నిర్మించారు. తొమ్మిది పిరమిడ్ ఆకారంలో ఉన్న "డోం" లను
కలిగి ఉంది. ఆర్చీల మధ్య సింహం తలలు
కలిగి ఉన్నది. దీనిలో గదు లేమీ లేవు. ఇదొక అలంకార భవనం. చూడ ముచ్చటగా ఉన్నది. దీని ప్రక్కన పూదోట
ఉన్నది. పద్మమహల్ దాటుకుని ముందుకు వెళ్తే పెద్ద మైదానం,
దానికి
అవతల ఒక పెద్ద భవనం కనిపిస్తుంది. ఇదే గజశాల.
ఎత్తైన రాతి గోడలతో, పైన
గోళాకార బురుజులతో దీర్ఘ
చతురస్రంగా ఉన్న ఈ కట్టడం పైన మధ్యలో మండపం కలిగి, చాల అందంగా ఉన్నది. ఏనుగులు ఉండడానికి విశాలమైన
పదకొండు గదులతో, అన్ని గదులు ఒక దాని కొకటి చిన్న
ద్వారం ద్వారా
అనుసంధానించబడి ఉన్నాయి. లోపలి నుండి, పైనున్న బురుజుల పైకప్పు కేసి చూస్తే ఒకదానికి ఉన్న డిజైను మరొకదానికి లేకుండా దేనికి అదే ప్రత్యేకంగా ఉన్నది. డొమ్ ల పై ఆకారం కూడ అన్నీ ఒకే
విధంగా కాకుండా వేరు వేరుగా ఉన్నాయి. దీనికి దగ్గరలోనే ఇంకో రాతి కట్టడం కనబడుతుంది. అది కాపలా దారుల నివాస భవనం. కాని
ఈ భవనంలో గదులేమీ లేనందున, నివాస యోగ్యంగా లేదు. చుట్టూ ఎత్తైన వేదిక కలిగి, మధ్యలో ఆకాశం వైపు ఖాళీగా ఉన్నది.
ప్రస్తుతం ఇందులో కొన్ని శిల్పాలను ప్రదర్శనకు పెట్టారు. రాణి వాస భవన సముదాయం నుండి బయలుదేరి దసరా దిబ్బ వైపు తీసుకవెళ్ళాడు ఆటోవాడు. మధ్యలో కృష్ణ ఆలయం
చూపించాడు. ఈ
ఆలయం తూర్పు ముఖ ద్వారం
ప్రత్యేకంగా ఉన్నది. ముఖ ద్వారానికిరువైపులా ఎత్తైన
పీఠాలు కలిగి, దానిపై స్తంభాలతో మండపాలు ఉన్నాయి. పైనున్న గోపురం శిధిలమైనా, మిగిలిన శిల్పాలు అందంగా ఉన్నాయి.
అక్కడి నుంచి దసరా దిబ్బకు ... ఈ
ప్రాంతాన్ని రాజాంతఃపురమని అంటారట. ఈ ప్రాంగణంలో ఈశాన్య మూలలో వేధికలాగ ఎత్తుగా
కనబడేదే " దసరా దిబ్బ". ఇది చతురస్రంగా 25 అడుగుల ఎత్తు కలిగిన రాతి కట్టడం. పైన చదునుగా ఉండి నలు
మూలలలో రాతి లోనే గుంట లున్నాయి. ముందు నుండి పైకెక్కడానికి, అలాగే ప్రక్క నుండి, వెనకనుండి కిందికి
దిగడానికి మెట్లు ఉన్నాయి. ముందున్న మెట్లకు ఇరు వైపులా అందమైన నల్ల రాతి శిల్పాలు
అమర్చి ఉన్నాయి. అవి చాల వరకు విరగ గొట్ట బడినాయి. ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి.
విరిగిన వాటిని ఆ ఎదురుగా కుప్ప పోసి ఉంచారు.
శ్రీ కృష్ణదేవ రాయలు, తాను కళింగ దేశాన్ని జయించి నందుకు గుర్తుగా దీన్ని
నిర్మించాడు. ఈ వేదికకు ఒక వైపున కిందికి దిగి వచ్చే మార్గంలో గోడలపై అనేక
శిల్పాలు చెక్కి ఉన్నాయి. అందులో, గుర్రాలను పట్టుకొన్న అరబ్బులు, ఏనుగులు, ఒంటెలు, విల్లంబులు ధరించిన స్త్రీలు, యుద్ధ దృశ్యాలు, యోధులు, ఇలా అనేకమైన శిల్పాలు
ఉన్నాయి. ఈ ప్రాంగణంలోనే రకరకాల నిర్మాణాల శిథిలాలు కనిపిస్తాయి. దసరా దిబ్బకు దగ్గరలోనే ఒక అందమైన నిర్మాణంలో కొలను కనిపిస్తుంది.
ఈ
కోనేరు త్రిభుజాకారపు నల్ల రాతి పలకలతో అందంగా కట్టబడినది. అక్కడి నుండి రాణుల స్నాన మంటపానికి తీసుకవెల్లాడు.
ఇది ఒక దిగుడుబావి.
లోపలికి దిగడానికి మెట్లతో స్నానంచెయ్యడానికి అనువుగా నిర్మించబడింది. దీని నిర్మాణం చాల వైవిధ్యంగా ఉంది. చుట్టూ అందమైన వరండాలతో, బట్టలు మార్చు కోవడానికి గదులతో, మధ్యన ఈత కొలను ఉంది. వరండాల లోని పైకప్పు నందున్న డిజైనులు డోం
ఆకారంలో ఉండి, లోన కప్పు ఒకదాని కున్న డిజైను మరొక దానికి లేకుండా, దేనికదే ప్రత్యేకంగా ఉన్నవి. కొలను లోనికి మంచి నీరు రావడానికి, లోన నీరు బయటకు పోవడానికి
ఏర్పాట్లు ఉన్నవని. గమనించ వచ్చు. మధ్య నున్న కొలను పై కప్పు లేదు. కాని కొలను అడుగున నాలుగు
మూలలందున్న చిన్న గుంటలను బట్టి ఆగుంటలలో స్థంభాలుంచి, పైన అప్పట్లో
దానిపై కప్పు ఉండేదని అర్థం అవుతుంది. రెండతస్తులు కలిగిన ఈ భవనం చుట్టూ కందకం కూడా ఉన్నది. దీని
ముందున్న బోర్డు లోని విషయాన్ననుసరించి దీని చుట్టూ ఒక పెద్ద
భవన సముదాయం అప్పట్లో ఉండేది. ప్రస్తుతం కేవలం స్నాన ఘట్టం మాత్రం మిగిలి ఉన్నది. అక్కడి నుండి విఠలాలయానికి
తీసుకవెల్లాడు. ఆలయానికి వెళ్ళే దారి ప్రారంభంలో తలారిగట్ట
దగ్గర మా ఆటోవాడు వదిలేశాడు.
అక్కడి నుండి ప్రత్యేక వాహనాలలో
లేదా కాలినడకన గుడికి చేరుకోవచ్చు. ఈ ప్రత్యేక వాహనాలకు మరో ప్రత్యేకత ఉంది. వాటిని నడిపేది కేవలం స్త్రీలు మాత్రమే.
మేం ప్రకృతి అందాలు చూస్తూ కాలి నడకన గుడివైపు బయలుదేరాం. దారంతా దుమ్ము దూళీ.
వాహనాలలో వెళ్ళే వారి మొహాల నిండా దుమ్మే కప్పేస్తుంది. రోజూ ఎంతోమంది యాత్రికులు వెళ్ళే మార్గాన్ని బాగు చేయాలన్న ఆలోచన
కూడా వీళ్ళకు ఎందుకు రాలేదా అని ఆలోచించుకుంటు వెళ్ళాం. దారికి దూరంగా ఇరువైపుల
ఎత్తైన కొండలు. కొండల మీద విచిత్రాకృతిలో రాళ్ళూ మనల్ని కట్టి పడేస్తాయి. ఈ మార్గంలో రోడ్డు ప్రక్కన ఒక చిన్న శివాలయం ఉన్నది.
ఆలయానికి
వెళ్ళే దారిలో, సుమారు ఒక
కిలో మీటరు దూరం ఇరు
వైపులా మండపాలు కలిగిన వెడల్పైన రాచ వీధి కలదు.
దారికి ఇరువైపుల మండపాలు కనిపిస్తాయి. మండపాలపై ప్రస్తుతం పై కప్పు లేదు. హంపి బజారు
లాగ ఇది కూడ అందమైన వీధి. ఈ వీధిలో కొండ క్రింద ఒకదగ్గర కోనేరు ఉన్నది.
అందులో నాలుగు స్తంభాల
మండపం ఉన్నది. ఈ కోనేరును లోక పావని పుష్కరిణి అని
అంటారు. కోనేరు
దాటుకుని ముందుకు వెళ్తే విఠలాలయం వస్తుంది.
ఆలయ
ముఖ ద్వారం ముందు ఒక పెద్ద శిలా స్తంభం పడి ఉన్నది. అది ధ్వజ స్తంభం. ఆలయం లోపలికి
వెళ్లడానికి పది రూపాయలు టికెట్టు. ముఖ
ద్వారం శిఖర పైభాగం కొంత శిధిల
మైనది. ఆలయం లోనికి అడుగు పెట్టగానే కనుపించే దృశ్యం.
కుడి
ప్రక్కన పురందర దాసు భజన మండపం., ఎడం ప్రక్కన నూరు స్తంభాల మండపం
ఎదురుగా ఏక శిలా రథం.
ఈ రథం
పై మధ్యలో గరుడుడు ఆశీనుడై ఉన్నాడు. ముందు భాగంలో
రెండు ఏనుగులు మధ్యలో మెట్లు
ఉన్నాయి. చక్రాలు, ఇరుసు అంతా ఏక శిలా నిర్మితమే. ఈ రథ చక్రాలు నిజంగానే తిరుగుతాయి.
కాని పర్యాటకులు వాటిని
మాటి మాటికి త్రిప్పి చూస్తున్నందున ఆ చక్రాలు తిరగ కుండా సిమెంటు వేసినారు. ఈ ఏకశిలా రథాన్ని హంపి విజయనగరానికి గుర్తుగా
వాడతారు. ఈ ఏక శిలా రథం దేవుని ఊరేగింపునకు ఉపయోగించిన రథానికి ప్రతి రూపం.
ప్రధాన ఆలయం ముందు
ప్రహరీకి ఆనుకొని ఉన్న మండపమే పురందర దాసు మండపం. ఆ రోజుల్లో
పురందర దాసు ఇక్కడ భజనలు చేసే
వాడు. ఇతడు మహారాష్ట్ర లోని
పాండురంగని భక్తాగ్రేసరుడు.
విఠలాలయంలో ప్రధానంగా చెప్పుకో దగినది
నాట్య మండపం. ఇందులోని శిల్పకళా
విన్యాసం అత్యంత అద్భుతం. విజయనగర శిల్పకళా
చాతుర్యానికి ఇది పరాకాష్ఠ..
ఏకశిలలో చెక్కిన పెద్ద స్తంభాలలో
నలుదిక్కులలో మరో నాలుగు పిల్ల స్తంభాలు ఉండి అనగా
ఒక్క స్తంభానికి చుట్టూ అన్నీ
కలిపి పదహారు చిన్న స్తంభాలు ఉండి, అందులోనే ఒక వాయిద్యాన్ని
ధరించిన వాయిద్య కారిణి ప్రతిమ
మొత్తం కలిపి ఒకే శిలలో చెక్కి ఉండడం
ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక్కో స్తంభంలో ఒక్కో వాయిద్యాన్ని వాయిస్తున్నట్లున్న ఒక ప్రతిమ ఉన్నది. మధ్యలో నిలబడి
పైకప్పుకేసి చూస్తే ఎడం చేతి మూల పైకప్పు క్రింద ఉన్న దూలానికి శ్రీకృష్ణ దేవరాయలు , వారి సతీమణి, ప్రక్కనే విఠల స్వామి ప్రతిమలు చెక్కి ఉన్నాయి. ఆ విఠల స్వామి రూపమే ఈ ఆలయంలో ప్రతిష్టించిన విఠలుని ప్రతి
రూపమట.
ఆలయం
లోని నాట్య మండపానికి ప్రక్కన ఉన్నదే నూరు
స్తంభాల మండపం. ఇది మూడడుగుల ఎత్తైన పీఠం పై శిల్పకళా శోభితమైన స్తంభాలు కలిగి, మధ్యలో మరో పీఠం పై నాలుగు స్తంభాలు ఉండి, మొత్తానికి ఒకే కప్పు
కలిగి ఉన్నది. దీనిపైకి ఎక్కడానికి ఇరు
వైపుల ఏనుగు శిల్పాలు ఉన్న మెట్ల దారి కలదు.
పీఠం చుట్టూ కూడ శిల్ప కళ అమోఘం.
నూరు
స్తంభాల మండపానికి వెనుక నున్నదే వీర నారసింహ మండపం. దీనిలో ఉన్న స్తంభాలు పెద్దవిగా ఉండి, వాటిలో పిల్ల స్తంభాలు కూడ
ఉన్నాయి. మధ్యలో చిన్న
వేదిక ఉన్నది. సమావేశాలకు సభా
మండపంగాను, పెళ్ళిళ్లకు
పెళ్లి మండపం గాను ఉపయోగింపబడినది. దీని
వెనుక ప్రహరీకి ఆనుకొని మరో మండపం కలదు.
దీని వెనుక ఒక చిన్న ఆలయం కలదు. ఇది
దేవి ఆలయం. ప్రధాన గర్భాలయం వెనుక
ప్రహారీకి ఆనుకొని స్తంభాలు
కలిగిన వరండా కలదు.
ఈ
విఠలాలయం విజయనగర చారిత్రక కట్టడాలన్నింటి
లోకి, శిల్ప
కళ రీత్యా అత్యంత ప్రాధాన్యత సంతరించు
కొన్నది. దీనిని రెండవ దేవ రాయలు 1422-- 1446
సంవత్సరాల మధ్యలో కట్టించాడంటారు. ఆ
తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు ఇందులోని నూరు స్తంభాల మండపం, ఇరుప్రక్కల ప్రహరీకున్న ద్వారాలు
దానిపై గోపురాలు కట్టించాడంటారు.
నాట్య
మండపానికి ఆనుకుని ఉన్నదే రంగ మండపం. ఇది చుట్టు గోడలు కలిగి, ఉత్తర దక్షిణ దిక్కులకు కూడ ద్వారాలతో ఉన్నది. గర్భ గుడి లోనికి వెళ్లే ద్వారానికి ఇరు
వైపుల జయ విజయుల శిల్పాలుండేవి. ప్రస్తుతం
ఒకే శిల్పం ఉన్నది. రెండింటిని ధ్వంసం చేసి పార వేయగా, అందులో ఒకటి మాత్రమే దొరికిందట.
దానినే ఇక్కడ ప్రతిష్టించారు. రెండోది దొరకనందున, ఆ స్థానం ఖాళీగా ఉన్నది. దీని
కెదురుగా ఉన్నదే గర్భాలయం.
ఆంగ్లేయుల
కాలంలోనే భద్రత కొరకు మూల విరాట్టును మహారాష్ట్రకు తరలించి భద్రపరిచారట. గర్భాలయం ముందు రెండు మూడు మెట్లు క్రిందికి ఉన్నాయి. గర్భాలయం చుట్టు ప్రదక్షిణం చేయడానికి ఆవరణ ఉన్నది.
కాని ఇదంతా చీకటిగాను, అపరిశుభ్రంగాను ఉన్నది. ఈ ప్రదిక్షిణావరణానికి, గర్భాలయానికి కలిపి ఒకే పైకప్పు ఉన్నది. ప్రదక్షిణాపథం లోనికి వెళ్ల డానికి వీలు
లేదు.
అప్పటికే
చీకటి పడటంతో త్వరత్వరగా ప్రాంగణంలోని నిర్మాణాలు చూసి, మళ్ళీ
కాలి నడకన తిరుగు ప్రయాణమయ్యాం. ఆ వచ్చే దారిలో
ఎడం వైపు, అనగా నది వైపు ఒక పెద్ద రాళ్ల కుప్ప కనిపిస్తుంది. ఆబండ రాళ పై తెల్లటి పట్టీలు, తెల్లటి
సున్నం పట్టీలు వేసి కనబడుతుంది. అది సుగ్రీవుని
గుహట. దీనికి
చారిత్రక ప్రాముఖ్యత లేదు. కాని
స్థానికుల కథనం ప్రకారం ఈ
ప్రాంతమంతా రామాయణం లోని కిష్కింధ యని అంటారు.
అలా ఆ కొండల అందాలు చూసుకుంటూ ఒక కిలో మీటర్‌కు పైగా నడిచాకా,
దారి వెంట కొట్టుకున్న దుమ్మును పక్కనే పారుతున్న కాలువలో శుభ్రం చేసుకొని
ఆటోలో ఎక్కి కూర్చున్నాం. ఆటోవాడు హంపి వీధి దగ్గర దిగబెట్టి వెళ్ళీపోయాడు. మాతో
కలిసి ప్రయాణం చేసిన గుంటూరు పెద్ద మనిషి సత్యనారాయణ మాతో వీడ్కోలు తీసుకొని
వెళ్ళిపోయాడు.
మేము ఆ రాత్రి హజార రామాలయన్ని, హంపి వీధిని, పక్కనే తుంగభద్ర
సౌందర్యాన్ని చూసి హొస్పేట్కు వచ్చేశాం. భోజనాలు కానిచ్చికా, గిరి గద్వాల్ దారి పడితే, నేను, బషీర్ బేళూరు వైపు
ప్రయాణమయ్యాం.