20, జనవరి 2024, శనివారం

నడిగడ్డ చరిత్రే - కె. నాగేశ్వరాచారి 'గద్వాల్జాతర కథలు'


క మొక్క వృక్షమై ఆకాశం వైపు ఎంత ఎదిగినా, దాని కొమ్మలు దిక్కుదిక్కులకు ఎంత విస్తరించినా,  మూలాన్ని, తాను మొలకెత్తిన నేలను విడిచి ఏ వృక్షమైనా నిలబడగలదా?. అట్లా మూలాన్ని వదలని వ్యక్తిత్వం కె. నాగేశ్వరాచారి గారిది.  నడిగడ్డలో జన్మించి, ఉన్నత విద్య కోసం, ఉద్యోగం కోసం అనంతపురం వెళ్లి, అక్కడే ఉండిపోక,  తనకు జన్మనిచ్చిన నేల సమీపానికి రావడం, తన నేల మీద కథలు రాయడం, తన నేలకు సంబంధించిన వ్యక్తులను వెతుక్కోవడం, ఆ వ్యక్తులు దొరికితే అమాంతం హత్తుకపోవడం ఈ రచయిత వ్యక్తిత్వం.  ఇట్లాంటి హృదయమార్దవం కలిగిన రచయిత కలం నుండి ఎట్లాంటి కథలు రాగలవో ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదనుకుంటా!

  అయితే ఈ కథలు చదివిన ఏ విమర్శకుడైనా ఇవి కథలా?, కథనాలా? అనే ప్రశ్నవేయవచ్చు. దానికి ఈ సంకలనంలోని 'బీజం" లాంటి కథలు  కూడా ఊతం ఇవ్వవచ్చు. కానీ నేనైతే, ఇవి జీవితాలంటాను. మట్టి మనుషుల వెతలంటాను.  ఒక ప్రాంతపు చరిత్ర, వాళ్ళ బతుకులు, కష్టాలు, కన్నీళ్లు అమాయకత్వం, అన్ని కలగలిపి రాసిన చరిత్రంటాను, ఒక్కమాటలో చెప్పాలంటే ఇది యాభై, అరవై ఏళ్ల కిందటి నడిగడ్డ చరిత్ర.

 రచయిత ఈ కథలనెందుకు రాశాడు

  పాలమూరు కవి కోట్ల వేంకటేశ్వర్ రెడ్డి తన 'నూరు తెలంగాణ నానీలు' పుస్తకంలో... ఒక నానీలో, "పచ్చగున్న కాడ / పక్షివై వాల్తివి, నా నేలను/ నాక్కాకుండా చేస్తివి" అన్నట్లు ... అరవై ఏళ్ల  కిందట, ఆర్డీఎస్ వచ్చి అప్పుడప్పుడే పచ్చ పచ్చగా మారుతున్న నడిగడ్డను పసిగట్టిన కొన్ని వలస గద్దలు ఇక్కడ వాలి ఎంత సామాజిక, సాంస్కృతిక, భాషా విధ్వంసాన్ని సృష్టించాయో విడమర్చి చెప్పడానికే ఈ రచయిత ఈ కథలు రాశాడనిపిస్తుంది.

కథలు

  ఈ పుస్తకంలో మొత్తం 11 కథలు ఉన్నాయి. ఇవన్నీ కాలువ కథలు. ఆర్డీఎస్ కథలు.  మనిషి దేహం నిండా రక్తనాళాలు పరుచుకొని, ప్రతి అవయవానికి, ప్రతి కణానికి ప్రాణవాయువును అందించినట్లు, ఈ కథల నిండా కాలువలు,  వాటి మీద ఆధారపడిన బతుకులు పరుచుకున్నాయి.

    ఉన్న ఊర్లో జీవనాధారం లేక నగరానికి వలసెల్లిన ఓ కుటుంబానికి చదువుల తల్లి లాంటి బిడ్డను కోల్పోవడం ఎట్లా శాపంగా పరిణమించిందో తెలియజేసే కథ చంద్రమ్మ కథ. కథ సగ భాగం వరకు చంద్రమ్మ మరణం, కుటుంబ నేపథ్యం గురించి చర్చించి, ఆ తర్వాత  కాల్వ తెచ్చిన మార్పులు, ప్రజల జీవితాల్లో ఖర్చులు పెరిగిన వైనం, కాల్వల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష వైఖరులను ఈ కథ చర్చిస్తుంది. సేతుల్ల పెరిగి, పెద్దదైన పిల్లను పోగొట్టుకుంటే ఎవరి పానమైన ఎట్లుంటది. ఆ బాధ మన వరకొస్తే గాని అర్థం కాదనడం అక్షరసత్యం. కాల్వొచ్చినాక ప్రజల కూడు, గూడు, గుడ్డ విషయాల్లో కొంత మార్పొచ్చిన మాట వాస్తవమే అయినా, అంతకు మించి లాభపడిందెవడు?  మేడలు కట్టిందెవడు? విదేశాల్లో చదువులు లాంటి లాభాలు వొనగూడిందెవరికి? ఈ దేశభవిష్యత్తును బాధ్యతగా ముందుకు తీసుకపోగల విద్యార్థులు అర్థాంతరంగా తనువులు చాలిస్తుంటే కారణమెవరిదనాలి? అంటూ రచయిత ఈ కథ ద్వారా సంధించిన ప్రశ్నలు మన ఆలోచనల్ని మెలిపెడతాయి.

    ఆర్డీఎస్ పెద్దకాలువ పూర్తి కాగానే, సిన్న కాలువలు మొదలవుతుండగానే వచ్చిన బెజవాడ వాళ్లు ఊర్లల్ల పెద్ద మనుషులను, సావుకార్లను బుడుక్కొని వారిని మధ్య మనుషులుగా పెట్టుకొని,  అమాయకుల పొలాల నెట్లా కొన్నారో, ఆస్తిని అమ్ముకున్న కూడా వచ్చిన డబ్బెట్లా మాయమైపోయి, పేదల కండ్లల్లో కష్టమెట్లా కన్నీళ్లుగా రూపుదాల్చనో '18 వ కాలువ కథ' మనకు విడమర్చి చెపుతుంది. ఆర్డీఎస్ డిస్ట్రిబ్యూటర్ల లెక్కలు, కాలువ ప్రయాణ దూరాలు తెలియాలన్న, కాల్వ బుట్టిన కాడ్నుంచి కాల్వ ముగిసే వరకు ప్రయాణంలో ఎన్నెకరాలు ఎవరి పాలయ్యిందో తెలవాలన్న మనం ఈ కథను చదవాల్సిందే.

    'గద్వాల్జాతర కథ'... గద్వాల రథశాల దగ్గర మొదలై , గుండు కేశవ స్వామి, లింగం బాయి. చొక్కం బాయి, మీదుగా కోటలోకి ప్రవేశించి, గుడులు, భవనాలు వాటి సౌందర్యాలు, దాని వెనుక దాగిన శ్రమజీవుల కష్టాన్ని వివరిస్తూ కోట దాటుతుంది.   రథశాల నుండి కోట వరకు హనుమప్ప నాయుడు వెంట కథకుడు వెళ్లినట్లే, మనం కూడా తిరుగాడుతాం. దానితోపాటు ఒక సందేహాన్ని మోసుకతిరుగుతాం. సోమప్ప కాలం నాటి హనుమప్ప సీతారాంభూపాల్ కాలానికి ఎట్లొచ్చె, వర్తమాన కాలానికి చెందిన ఈ కథకుడితో ఎట్లా జత కలిసే అని, అదే ఈ కథలో ట్విస్ట్. కథాంతానికి చేరితే గాని మన సందేహాం పటాపంచలు కాదు. అది నేను చెప్పదలుచుకోలేదు. మీరు చదివి తీరాల్సిందే. చదివి సందేహాన్ని తీర్చుకోవాల్సిందే. కాల వైవిధ్యమైన పాత్రలను ఒక చోట చేర్చి, కథ నడిపిన విధానం బాగుంది. ఈ కథా సంపుటిలోని మంచి  కథల్లో ఇది ఒకటి.  ఈ సంపుటికి ఈ పేరు పెట్టటం సరైనదే.

   సమయ పాలన, క్రమశిక్షణ ఉండకూడదని కాదు గాని, విద్యాచైతన్యం లేని చోట అవి మరీ ఎక్కువైతే విద్యార్థుల చదువుకు అవే ఆటంకం కాగలవని తెలియజెప్పే కథ 'సూర్రెడ్డి జమానా'. "భయం విద్యార్థిని ఎదగనీయదు. టీచర్ విద్యార్థికి మధ్య నిరంతరం చర్చలు జరగాలి. విద్యార్థి తలనిండా ఉన్న ప్రశ్నలని బయటికి రానీయాల" అంటూ మనకు దిశానిర్దేశం చేస్తుందీ కథ.

 పైడి చంద్రలత 1997లో  నడిగడ్డ నేపథ్యంగా వెలువరించిన నవల - రేగడి విత్తులు. ఈ నవల నడిగడ్డ (పాలమూరు) భాషా, సంస్కృతులను అవహేళన చేసి,  అటు వైపు నుండి ఎంత  ఎత్తుకు ఎదిగిందో, ఇటు వైపు నుండి ఎంతటి తిరస్కరణకు, ధిక్కారానికి, విమర్శలకు గురైందో తెలుగు నవలా సాహిత్యలోకానికి విదితమే. ఆ నవలకు హీరో రామనాథం.  అదే రామనాథాన్ని ఆ నవలకు భిన్నమైన కోణంలో  ప్రత్యక్ష జీవితంలోనూ చూసిన ఈ రచయిత చూపించిన కథే 'ఎల్లెమ్బీ రామనాథం'. సహాయం చేసిన వారిని మోసం చేయడం, తిన్నింటి వాసాలను లెక్కించే వీళ్ల వ్యక్తిత్వాన్ని రామనాథం పాత్ర ద్వారా మనకు చూపిస్తారు రచయిత. ఈ కథలు వెలువడడానికి ప్రధానమైన అంశాలలో రేగడి విత్తులూ ఒక కారణమే.  

  టీవీలు, సెల్లు ఫోన్లు ఊర్లల్లోకి జొరబడని కాలంలో ప్రతి ఊర్లో రాత్రేల గుడికాడో, రచ్చబండ కాడో ముచ్చట్లు సర్వసాధారణం. అట్లాంటి ముచ్చట్లతోనే రచయిత  'నెనరు' కథను నడిపిన విధానానికి మనం ముచ్చటపడతాం. కాని కథలోని పాత్రలు బతకడానికి ఎన్నెన్ని పడవాట్లు పడ్డారో తెల్సుకొని విచారిస్తాం. జీవనాధారాన్ని పోగేసుకొని, అవరోధాలని అధిగమించే ప్రయత్నంలో శ్రమంతా చెల్లాచెదురై ఏట్లో కొట్టుకపోతుంటే బరువెక్కిన బతుకుల వేదనెంత దుర్భరంగా ఉంటుందో కథగా చూపి, మన కండ్లు తడిబారుస్తాడు రచయిత.

ఇట్లా ఈ కథల నిండా నడిగడ్డ బతుకులు, వాటి వెతలు మనకు కళ్లకు కట్టినట్లు చూయించారు రచయిత.

మాండలిక భాషా ప్రయోగం

 మానవ జీవితంలోని వివిధ దశలను, వాటి అనుభవాలను కథలుగా మల్చడంలో గాని,  కథావస్తువు స్వీకరణలో గాని, కథన విధానంలో గాని వైవిధ్యం ఉండవచ్చు. గాని ఆయా ప్రాంతాల మాండాలికాన్ని చక్కగా తమతమ కథల్లో పొందుపరిచిన సుప్రసిద్ద కథారచయితలు వంశి, స.వెం. రమేశ్, నామినిలతో నాగేశ్వరాచారి గారిని పోల్చడం అతిశయోక్తి కాకపోవచ్చు. నాగేశ్వరాచారి గద్వాల్జాతర కథల్లో నడిగడ్డ స్థానిక భాషను, యాసను అట్లే ప్రయోగించారు.

  బడి పలుకుల భాషలో కొట్టుకపోయిన మన పలుకుడుల భాషను వెతికిపట్టి, ఇక్కడ పొందుపరిచినట్లు మనకు కనిపిస్తది.

 ఈ కథలు చదివతే కాలప్రవాహంలో కొట్టుకపోయిన అనేక పదాలని మళ్లీ దొరకబుచ్చుకోవచ్చు.

సిన్నేటి సెంప లాంటి పద ప్రయోగాలు పాఠకుడికి ఈ ప్రాంత భౌగోళిక స్పృహ ఉంటే గాని అర్థం కావు.

జౌరి కట్టు , బుడుక్కొని, పురిబెట్టి, అమ్మడిపొద్దు, డబ్బిగిన్నె, కువాడం, వల్కలు, గప్పున, బుగులు, బుడ్డలు, బెరినా లాంటి అనేక పదాలు నడిగడ్డ భాషాసంపదను పట్టి చూపుతాయి.

కథనవిధానం

ప్రజల జీవనాన్ని వాళ్ల భాషతో సహా పట్టడానికి, వాళ్ల జీవితపు అనుభవాల లోతులను చూడటానికి ఒక అసక్తే గాక, వాళ్లను ప్రేమించే మనస్తత్వం కూడా ఉండాలిఅని హరగోపాల్ గారు చెప్పినట్లు ఈ కథకుడిలో ఆ గుణం మెండుగా ఉంది కాబట్టే ఇంత మెరుగైన కథలు మన ముందుకొచ్చాయి.

పాత్రలు

లచ్చుమన్న, మారెప్ప, మల్దకల్, పక్కీర, బతుకన్న, పెద్దయ్య, బడేసావు, మొదలుగు ఈ కథల్లోని పాత్రలు కల్పనలు కావు. అవి దేవలోకం నుండి దిగివచ్చినవి కావు.  అతి సామాన్యమైనవి. మన చుట్టూ ఉండే మనుషులు. కష్టం తప్ప మరో మార్గం తెలియని మట్టి మనుషులు.  మన తాతో, మామో, బావో, చిన్నాన్నో, పెదనాన్నో అన్నట్లే అనిపిస్తాయి. మనతో బంధాన్ని పెనవేసుకున్న మన ఊరి వాళ్లలాగే అనిపిస్తాయి. ఇట్లాంటి పాత్రలతో , నడిగడ్డ విషయాలతో, విశేషాలతో  కథావస్తువులను ఎంపిక చేసుకొని, వాటికి తగిన భాషను ఎంచుకొని ఈ కథలను విలువైన సాహిత్యంగా మనకందించిన పెద్దలు నాగేశ్వరాచారి గారికి ధన్యవాదాలు. 

                                                                                      - నాయుడి గారి జయన్న

***