10, మే 2018, గురువారం

అవనిశ్రీవీరేష్-మట్టి కుదురు- అనుభవైక కవిత్వంఅవనిశ్రీవీరేష్
ఆయన నడిగడ్డ మట్టిబిడ్డ
ఉత్సాహం ఉరకలెత్తే యువకుడు
అన్యాయంపై పిడికిలెత్తే పిడుగు
ఆయన కలం కళ్ళెం లేని గుర్రం.
కవిత్వాన్ని ప్రవాహంలా పరుగులెత్తించే ప్రజ్ఞాశాలి
కవిత్వక్యాన్వాస్ మీద పల్లెజనజీవన సౌందర్యాన్ని అందంగా చిత్రీకరిస్తున్న కవి
సమాజపురోగమనంలో సబ్బండ జాతుల శ్రామికత్యాగాన్ని
చరిత్రపుటల్లో చేరుస్తున్న చరిత్రకారుడు

మట్టి కుదురు
అవనిశ్రీ వెలువరించిన మొదటి కవితా సంపుటి.

ఇది అనుభవైక కవిత్వం
మట్టి కుదురు కవితా సంపుటికి నేనందించిన  ఆత్మీయ పలుకులు.


గద్వాలది చరిత్రలో ఎప్పుడూ చెరగని ఓ అధ్యాయం. ఓ ప్రత్యేకమైన ఉనికి. రెండు నదులు, రెండు రాష్ట్రాలతో అనుబంధం. విభిన్న సంస్కృతులు, భిన్న మాండలికాలు, సంస్థాన రాజసం, అపార విద్వత్తు, అడుగడుగున విప్లవం. ఇదిగో వీటన్నిటి వారసత్వంతో...ఉదయించిన యువకవే 'అవనిశ్రీ ' వీరేష్. ఎదిగిన దానితో సంబంధం లేకుండా, అవని మీదే పాదాలను నిలిపెటోడు. అవనికి శిరస్సు వంచెటోడు. అడుగడుగున కవితతో అవనిని అమాంతం అల్లుకున్నోడు. అక్షరం అతని ప్రాణం. వాక్యం అతని నినాదం. నేనిట్లా పరిచయం  చేయడం బాగుండదు కాని, అతని మాటల్లోనే విందాం...
                                                                                              
"నేను
సమాజపు పాఠకుణ్ణి
జన ఆలోచనల భావకుణ్ణి"   అర్థమైంది కదా! ఈ కవెవరో! మరి ఇలాంటి కవి రాసేదేమిటి?ఎవరి కొరకు? అని ప్రశ్నిస్తే..."నా కవిత క్రాంతి పథం/ నా కవిత జనహితం" అని సమాధనమిచ్చాకా, మనకు ప్రశ్నలు మిగులుతాయా?!

ఈ కవి తానేమి రాయాలో, ఎవరి కొరకు రాయాలో స్పస్టమైన అవగాహానతో ఉన్న కవి. అంతే కాదు తన తోటి కవులకు మార్గ నిర్దేశం చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్న కవి. కాబట్టే, కవులకు త్రికాలాలను సంధానం చేసే శక్తుండాలని, అక్షరాలతో విప్లవాన్ని తెప్పించగల పరిపూర్ణత ఉండాలని, ఆకలి బాధలను అక్షరాలలోకి వంపాలని,చెమట చుక్కల్లో పదాలను పులుమాలని, ఎక్కడే విపత్కర సంఘటన జరిగినా నిద్రలో ఉలికిపడి కలాన్ని కదిలించాలని మార్గనిర్దేశం చేస్తాడు. కవుల బాధ్యతను గుర్తు చేస్తాడు.  

ఈ కవికి తన ఊరంటే వల్లమాలిన అభిమానం. ఊర్లో జనాలు. జనాల్లో పిల్లలు. పిల్లల నవ్వులంటే మరీ ఇష్టం. ఆ నవ్వులు మామూలు నవ్వులు కాదని చందమామలో పూసిన కలువపువ్వులని, ఆకాశంలో తారలని పిల్లలను ఎదలకు హత్తుకుంటాడు.

ఈ కవి ఎవడెట్లా పోతే నాకేమి, లోకమెట్లుంటే నాకేమనే బాపతు కాదు. అట్లా మిన్నుకుండిపోయే మన్ను తిన్నపాములను ఊరికే వదిలిపెట్టడు. తాను లోకాన్ని గమనిస్తూ, తన కవిత్వంతో దాని గమనాన్ని సరిజేస్తాడు. తల్లిదండ్రులు, గురువులు, రైతులు, ప్రకృతి చేసే నిస్వార్థమైన సేవ నుండి ఏమైనా  నేర్వండ్రా!  కొద్దిగైనా లోకం కోసం చేసి చావండ్రా! అని వాతలు పెడతాడు.

నాకు ఈ కవిలో ఒక శ్రీశ్రీ, ఒక గోరటి కనిపిస్తాడు. వాళ్ళిద్దరూ ఆవహిస్తేనే రాసిన కవితేమో అనిపిస్తుంది- ఈ సంకలనంలో ఉన్న 'మేమే చరిత్ర పుటలం ' అన్న కవిత.  ఒక వెలుగు వెనుక దాగిన చీకటి రహస్యాన్ని, చెమట చుక్కలు సృష్టించిన చరిత్ర పాఠాన్ని, నాగరికత నేర్పిన వృత్తులను అమితమైన ప్రేమతో గుండెల కద్దుకుంటాడు ఈ కవి.

సామాజిక మాధ్యమాలలో ఈ కవి రాస్తున్న కవిత్వాన్ని నిశితంగా గమనిస్తూ వచ్చినప్పుడు, ఇది అనంత భావాలకొండ అని, ఈ కవికి కవిత్వం రాయడమంటే నీళ్ళు తాగినంత పనే అనుకున్నాను.  కానీ నా అంచనాలను తలకిందులు చేస్తూ ఈ కవి ఇట్లా అంటాడు..." ఒక కవిత రాయడమంటే/ ఒక మహా యుద్దం జరగటమే" నిజమే కదా! ఎంత అంతః సంఘర్షణా యుద్దం మెదడులో, హృదయంలో  జరిగితేనో ఒక కవిత పుట్టుకొస్తుంది. పురిటి నొప్పుల బాధ తల్లికే గానీ, తనువు పంచుకొని పుట్టిన వాళ్ళకేమి తెలుస్తుంది! పుట్టిన బిడ్డను చూసిన వాళ్ళకేమి తెలుస్తుంది. కవి కష్టం కవికే తప్పా, కవితకూ, పాఠకుడికి అర్థం కావు. అయినా అది అనుభూతే తప్పా, అనుభవం కాజాలదు. ఈ కవి కవిత్వమంతా ఎక్కువ భాగం అట్లా అనుభవం నుండి పుట్టుకొచ్చిన కవిత్వమే. అందుకే అది ఆకలి వేసినప్పుడు గొంతులో జారిపోయే సంకటిలా కమ్మగుంటది. దప్పికైనప్పుడు ఊరి నీటినిచ్చే చెలిమె అంత చల్లగుంటది. వాస్తవాలను కళ్ళ ముందు కవిత్వంగా ఉంచినప్పుడు గొంతుకడ్డం పడ్డ గొడ్డుకారం ముద్దలెక్క ఉంటది.

కవి కావాలని ఉత్త ఉబలాటం ఉంటే సరిపోదు. అదే చాలనుకుంటే పొరపాటు.  ప్రాంతం, పరిస్థితులు, అనుభవాలు, నిశిత దృష్టి, హృదయ మార్ధవ్యం ఇట్లా చాలా చాలా ఆవశ్యకాలతో పాటూ, కొంత సహజాతం, కొంత సాధన అవసరం. ఇవే కవికి ప్రాణం పోస్తాయనుకుంటా. ఇవే కవిని వెతికి పట్టుకుంటాయనుకుంటా. నేనైతే ఇట్లా తయారైన వాడేనేమో ఈ కవి అని నిర్ధారణకొస్తా. లేకపోతే సాగర కెరటమెందుకు ఎగసిపడుతుందో! పర్వతం మీది శిల ఎందుకు ఎదురుచూస్తుందో! ఈ కవి ఎట్లా పసి గట్టేవాడు?

ఎంత ఎదిగిన ఒదిగి ఉండే గుణం ఈ కవిలో మస్తుగ కనిపిస్తది. కాబట్టే 'ఎక్కువైతే కాదు ' కవిత రాయగలిగాడు. మేము ఉద్యమాలు చేయవచ్చు. ఉద్యమాల కొరకు కవిత్వం రాయవచ్చు. ఇంకోటి...ఇంకోటీ...ప్రజల కొరకు ఏదైనా కావొచ్చు. కానీ అవన్ని గతంలో చేసిన వారికన్న గొప్పవైతే కాదు.  వారి దోవలో, వారి నీడలో చేసిన చిరు ప్రయత్నాలేనని కవి వినమ్రతను కనబరుస్తాడు.

కవి జన సమూహంలో చేరిపోవాలా. జన సమూహాన్ని తన లోకంలోకి లాక్కపోవాలా. ఈ రెండూ చేయగలవాడే అసలు కవి. 'యాదికుందా?'  కవిత ద్వారా కవి తన బాల్యపు గుర్తులను ఏరుకుంటూ వెళ్తూనే, మనల్ని మన బాల్యంలోకి నెట్టేస్తాడు. సంసార సాగరంలో యవ్వన, మధ్య, వృద్ధాప్య దశలతో వాటి వాటికి నిర్ధేశించిన లక్ష్యాల సాధనలో చతికిలపడి, ఒడ్డునపడ్డ చేపల్లా గిలగిలా కొన ఊపిరితో తనుకులాడుతున్న మనకు మళ్ళీ బాల్యంలోకి తొంగి చూడటమంటే తిరిగి చేపలను నీటిలోకి చేర్చడమే కదా. అదిగో ఆ అనుభూతినే కలిగిస్తాడు.  ఇట్లా చెప్పుకుంటూ పొతే ఇది అనంతం. తినే వాడికి రుచులు చెప్పడమెందుకు?  మీరే చవి చూడండి. చివరగా ఒక ఆశ. ఈ కవి తన కవిత్వాన్ని మరింత చిక్కబరిచి, మరింత వైవిధ్యమైన శిల్పంతో, భవిష్యత్తులో విస్తృతమైన సాహిత్యాన్ని సృష్టించి, నడిగడ్డ సాహిత్య సంపదను సుసంపన్నం చేయాలి. ఎన్నో పోరాటాల తర్వాత  ఆవిర్భవించిన జోగులాంబ గద్వాల జిల్లాలో తొలి వచన కవితా సంపుటిని తీసుకొస్తున్న సోదరుడు అవనిశ్రీ వీరేష్ ను ఈ సందర్భంగా  మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.

నాయుడి గారి జయన్న,
తెలుగు ఉపాధ్యాయుడు,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పూడూరు.
04.10.2017.

--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల*
8, మే 2018, మంగళవారం

ఇక్బాల్_ఝరి_కొన్ని ఆయుధాలు- కొన్ని కన్నీళ్ళు

ఇక్బాల్
కవి, రచయిత, ఉపాధ్యాయుడు అంతకు మించి ప్రజల మనిషి.

ఝరి 
ఇక్బాల్ గారు ఉపాధ్యాయుడిగా పనిచేసి, ఉద్యోగ విరమణ చేసిన సందర్భంలో ఆయన జీవితం, సాహిత్యం, వారితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొంటూ హితులు, సహచరులు, శిష్యులు తమ స్పందనలతో తెచ్చిన పుస్తకం.

కొన్ని ఆయుధాలు- కొన్ని కన్నీళ్ళు
తన సాహిత్యాన్ని  చదువుతూ, 15 ఏళ్ళ పరిచయంతో తనకు సమీపంలో నడుస్తూ, గమనిస్తూ  వచ్చిన చనువుతో రాసిన కొన్ని మాటలు.

కొన్ని ఆయుధాలు... కొన్ని కన్నీళ్లు...
    ఇక్బాల్'  - పాలమూరు జిల్లా కరువు వ్యతిరేక పోరాట కమిటీ  మొదటి సారి నాకు ఈ పేరును పరిచయం చేసింది. 2003లో పాలమూరు టౌన్ హాల్లో ఈ కమిటీ ఆధ్వర్యంలో ఓ రోజంతా వందలాది మంది కవి గాయకులతో   'పాలమూరు గోస' అనే  కార్యక్రమం ఏర్పాటుచేసింది.  పెద్దలు కె.సి. వెంకటేశ్వర్లు గారి వలన ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చింది.  వారి ద్వారానే వీరి పరిచయ భాగ్యం కలగింది. అంటే వీరు ఉపాధ్యాయుడిగా కన్నా  నాకు కవిగానే ముందు పరిచయం. ఆ పరిచయం నాటి నుండి నేటి దాకా వీరితో సాహిత్యానుబంధం కొనసాగుతూనే ఉన్నది. కాబట్టే వీరి ఉపాధ్యాయజీవితం కన్నా వీరి సాహిత్య జీవితం గురించే నేను ఎక్కువ చెప్పదలుచుకున్నాను.
      కుటుంబం, వృత్తి, సమాజం ఈ  మూడింటి బాధ్యతల నుండి వ్యక్తి తప్పించుకోలేడు.  అట్లాగని వాటిని పూర్తి బ్యాలెన్స్ చేయలేడు.  చాలా మంది మొదటి దాని దగ్గరో, కొంత మంది రెండవ దాని దగ్గరో ఆగిపోతారు. సమాజం గురించి, అది అట్టడుగు వర్గాల గురించి ఆలోచించే తీరిక, ఓపిక ఎవరికీ లేకుండా పోయింది.  ఇట్లాంటి విపరీత, స్వార్థపూరిత కాలంలో,  ఎండి నెర్రెలిచ్చిన నేలలను, కంప చెట్లతో నిండిన కాల్వలను, కాల్వలు మింగిన ఊళ్ళను, సెజ్ రాక్షస పాదాల కింద నలిగే పల్లెలను, పొక్కిలి లేసిన ఇళ్ళను, శవమై తిరిగొచ్చిన వలస జీవులను, అప్పు కత్తై కుత్తుక పై వేలాడితే చూరుకు వేలాడిన నిర్జీవ దేహాలను,  ఇట్లా ఒకటేమిటి..., ఒక్కమాటలో చెప్పాలంటే ఎక్కడ సముద్రం కళ్ళల్లోంచి   దుఃఖమై ఎగిసి పారుతుందో ఆ చోటును  ఒక మనిషి వెతుక్కుంటూ వెళ్ళడం ఎంత ఆశ్చర్యమో! అంతకు మించిన అద్భుతం.  ఇట్లాంటి అద్భుతాలు ఈ కవి ప్రస్థానం లో అడుగడునా కనిపిస్తాయి.  పీడితుల పక్షాన చాలా మంది కవులు కవిత్వమై పలుకుతారు. పిడికిలెత్తమంటే మాత్రం జంకుతారు. ఆ రెండు చేయగల  ధైర్యమున్న సాహిత్య సృజనశీలి ఇక్బాల్ గారు.  అసలా మాటకొస్తే...సమాజాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టిన నాటి నుండి నేటి దాకా ఈ కవి జీవితానికి ఇదే ప్రధానమైపోయింది కూడా. ఈ కవి సమాజాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు, నీ వయసెంతంటారా? దానితో పనేలేదు. వారి సాహిత్యంలో వారి జీవితం కనబడదూ!? కవి జీవితం, అతని సాహిత్యం వేరు కాదు. వేరైనా సాహిత్యం వేరే ఉంటుంది. అది తాలులా తేలిపోతుంది. ఆమూలాగ్రం వీరి సాహిత్యం వీరి జీవితాన్ని ప్రతిబింబిస్తుంది కాబట్టే చిన్నవాడినైనా, పై మాటలు చెప్పే ధైర్యం చేశా.
   ఇరవై ఏళ్ల కిందట గట్టు అంటే రాజస్థాన్ ను తలపించే ఎడారి.  ఆ ఎడారిలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నప్పుడు, అక్కడి ఎడారి భూములను, అక్కడ తడారిన జీవితాలను చాలా దగ్గర నుండి చూసి, చలించిన జీవితం ఈ కవిది.  అందుకే ఈ కవి  కవితల నిండా, కథల నిండా వాళ్ళే. వాళ్ళ కన్నీటి గోసే. వాళ్ళ భాషే. వాళ్ళ యాసే దర్శనమిస్తుంది.  తన పక్కలే పాకులాడుతూ, తన చుట్టే తిరుగాడుతూ, తన మీదుగా లేత పాదాలతో జీవితాన్ని ప్రారంభించినందుకు  పుట్టిన ఊర్లో పచ్చటి అడవి భాషను పదును దేల్చి ఆయుధంగా ఎలా వాడాలో ఈ కవికి నేర్పితే,  పని చేసే ఎడారి భూమి, అక్కడి జీవితాలు భాషకు ఆర్ద్రతను ఎలా అద్దాలో నేర్పాయి.  అందుకే ఈ కవి సాహిత్యాన్ని స్థూలంగా నిర్వచించాలంటే కొన్ని ఆయుధాలు, కొన్ని కన్నీళ్లు అని చెప్పవచ్చు.   
 కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి దేవుడు అవతరిస్తాడని పురాణాలు చెప్పిన మాట నిజమని నిరూపించడానికి నా దగ్గర ఆధారాలు లేవు గాని,  ఎక్కడ కష్టముంటే అక్కడ ఈ కవి ప్రత్యక్షమవుతాడని చెప్పడానికి మాత్రం నా దగ్గర బోలడన్ని ఆధారాలు ఉన్నాయి.  పేదల ఇళ్ళను, ఊళ్ళను, పొలాలను, మూలాలను మింగి, పెద్దలకు సంపదలు తెచ్చి పెట్టడం కొరకు  కాలువలు కొండ చిలువలై  పాకుతూ వస్తున్నప్పుడు, ‘కాల్వ మింగిన ఊరు’ ను ప్రపంచానికి చూయించాడు. అధికార పీఠాలు అప్పనంగా పేదల భూములను దోచి పారిశ్రామిక  దొరలకు సెజ్జుల  పప్పు బెల్లాలుగా పంచి పెడుతున్నప్పుడు  పల్లెలన్ని చచ్చిన శవాలై ‘కఫన్ ‘ లు  కప్పుకుంటుంటే,  సహచరులతో సంఘటితమై ఊరూరు సంచరించి పల్లె పల్లెను తట్టి లేపుతూ మళ్ళీ పల్లెలకు ప్రాణాలు నింపిన ఆ అడుగుల ప్రయాణం నాకు తెలుసు. మైనింగ్ మాఫియా అచ్చంపేట అడవులను మాయం చేయడానికి రంగం సిద్ధమైతే, అడవులను హత్తుకున్న హృదయమార్దవం నాకు తెలుసు.  కరువు పీడిత పాలమూరు జిల్లాలో ఎక్కడ, ఏ  కారణం చేత ఏ రైతు ఉరిబోసుకున్నా, అక్కడ ఆ ఇంటి ముందు కన్నీళ్లు తుడిచే చుట్టమై వాలిపోవడం నాకు తెలుసు. పాలమూరు జిల్లాలో నీటి వనరులు, వాటి వాటాలు, భూములు వాటి స్వరూపాలు, లెక్కలు ప్రభుత్వం దగ్గర కన్నా ఈ కవి దగ్గరే భద్రంగా ఉండి ఉంటవన్నది నా ప్రగాఢ విశ్వాసం. ఇట్లా ఎన్నని చెప్పను గానీ, ఇప్పుడు తనకై తాను నడవడానికి కూడా ఈ కవికి  సహకరించని అరిగిపోయిన ఆ మోకాలి చిప్పలను (అడిగి) చూడండి. శ్రమజీవుల స్వేదం తుడువడానికి అలుపెరుగక ఆ పాదాలు తిరుగాడిన చరిత్రంతా మీకు తప్పక చెప్పవచ్చు.          

ఎన్. జయన్న, ఎస్. ఏ.(తెలుగు)
జి--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల*


ల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పూడూరు.