4, ఆగస్టు 2015, మంగళవారం

ఇప్పటికిక వెళ్ళొస్తా!

తల్లీ!
ఇప్పటికిక వెళ్ళొస్తా! 
వెళ్ళాలని లేదు
వెళ్ళక తప్పదు
అందుకే...
వీలైతే మళ్ళొస్తా!

నీ నీడన...
ఇంచుమించు దశాబ్ధ కాల ప్రయాణం
ఒక అస్థిరుడిగా నాకే ఆశ్చర్యం!
ఈ పయనంలో
ముళ్ళు, రాళ్ళు, పూలు అన్నీ...
ఈ పయనంలో...
నలుగురు ప్రధానోపాధ్యాయుల మార్గదర్శకాన నడవడం
పాఠాలు చెప్పడమే కాదు నేర్చుకోవడం కూడా
తప్పకుండా గమనంలో ఉంచుకుంటా


వెళ్ళినప్పుడు ఉన్నవారు
ఉన్నప్పుడు వచ్చినవారు
వచ్చి వెళ్ళినవారు
వచ్చేటప్పటికి మిగిలినవారు
ఏతావాతా ఓ నలభై  మంది ఉపాధ్యాయులతో
కాలాన్ని పంచుకోవడం, కలిసినడవడం
  మధుర జ్ఞాపకమే!

నీ దరికి చేరిన క్షణాన
మూడొందల అరవై మంది పిల్లలు
ఓ తొమ్మిది మంది గురువులు  

వొదిలి వొస్తున్న క్షణానికి
తొమ్మిది వందల డెబ్బై మంది పిల్లలు
ఇరవై అయిదు మంది ఉపాధ్యాయులు
నీ ఎదుగుదలను చూశాకా
ప్రభుత్వ పాఠశాలలు పతనమవుతున్నాయనే మాటలను
ఎలా ఒప్పుకోవడం?
తల్లీ!
నీకు నేనేమి చేశానో తెలియదు కాని,
నీవు నాకు ఇచ్చింది మాత్రం చాలా ఎక్కువే
నీవు నేర్పిన ప్రతి పాఠాన్ని గుర్తుంచుకుంటా
వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తా!
చేసే పనికి పునరంకితమవుతా
తల్లీ!
ఇప్పటికిక వెళ్ళొస్తా! 
వీలైతే మళ్ళొస్తా!!