10, డిసెంబర్ 2018, సోమవారం
9, డిసెంబర్ 2018, ఆదివారం
4, నవంబర్ 2018, ఆదివారం
ఒకడుండేవాడు
*ఒకడుండేవాడు*
(నా బడి - కొన్ని జ్ఞాపకాలు)
*మాకు పశువులంటే ప్రాణం* లాగా నాకు మనుషులంటే ప్రాణం. అదీ టాలెంటున్నోడంటే మరీ ప్రాణం. అట్లాంటోడొకడుండేవాడు మా తరగతిలో. అందరికీ కాదు కాని, కొందరికీ వాడిలో *డకాటికాడు* కనిపిస్తే,. నాకు మాత్రం *ఆల్ రౌండర్* కనిపించేవాడు. నాటకం వేయాలన్న వాడే, పాట పాడాలన్న వాడే, ఆట ఆడాలన్న వాడే, ఉపన్యాసం చెప్పాలన్నా వాడే, వ్యాసం రాయాలన్న వాడే. ఇక చదువు సంగతి సరేసరే. తిరుగే లేదు. జెండా పండుగలొస్తే మాటిమాటికి స్టేజి ఎక్కి దిగడమే పని వాడికి- బహుమతులు అందుకోవడానికి. ఇట్లాంటోడ్ని ఎవడైనా అభిమానించకుండా ఉంటాడా - అసూయ పడేవాడు తప్పా. అందుకే వాడంటే నాకు వల్ల మాలిన అభిమానం.
అదే అభిమానం వాడు నా మీద చూపాలని నేనేనాడు కోరుకోలేదు. వాడికి నాకన్నా గొప్ప స్నేహితులు, మంచి స్నేహితులు చాలా మందే. ఉంటే ఉండొచ్చు గాకా, నాకు మాత్రం వాడు స్నేహితుడే అనుకున్నా.
అప్పట్లో మా బడి కాలేజీతో కలిసి ఉండటం వలననో, పిల్లలకు ప్రజాస్వామ్య మంటే తెలియజెప్పాలనే ఉద్దేశ్యంతోనో బళ్ళో ఎన్నికలు నిర్వహించడమనే ఓ మంచి సాంప్రదాయం ఉండేది. కొన్ని దుస్సంఘటనల కారణంగా ఆ తర్వాత ఆ ప్రక్రియ ఆగిపోయింది. అది వేరే విషయం.
అట్లాంటి ఎన్నికలు ఒక సారి వచ్చాయి. వాడు తరగతి CR గా నిలబడ్డాడు. వాడికి ప్రత్యర్థిగా మా హాస్టల్ విద్యార్థి పోటీ చేశాడు. నాకు మాత్రం వీడి మీదే నమ్మకం. వీడిలో గొప్ప నాయకుడు ఉన్నాడనిపించేది. అందుకే మా (ప్రజాస్వామ్యానికి, పురోగతికి *మా* పెద్ద ప్రమాదం. మా కులమోడు, మా మతమోడు, మా ప్రాంతమోడు ఇత్యాది) హాస్టలోడిని కాదని వీడికే ఓటేశా. దురదృష్టమేమంటే వాడు ఓడిపోయాడు. ప్రతిభ మీద అసూయ గెలిచింది. ముందే చెప్పినట్టు వాడిలో నాకు ఆల్ రౌండర్ కనిపిస్తే, కొందరికి 'డకాటిగాడు' కనిపించాడు. మనిషిలో భిన్న కోణాలు ఉండటం సహజం. కానీ యద్భావం తద్భవతీ!. ఏమనుకుంటే అదే! అంతే!
నీకూ మీ హాస్టలలోడి మీదా అసూయే కదా! అనొచ్చు. కాదు వీడి నాయకత్వం మీద నమ్మకం. దానికీ ఓ ఉదాహరణ చెబుతా. కాలేజీ డే (మాకు బడి, కాలేజీ ఒకటే కాబట్టి) కు ముందు ఆటల పోటీలు జరిగాయి.
వాడు ఓ క్రికెట్ టీం కు నాయకత్వం వహించాడు. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. మంచి బౌలర్ ను కుడా. కానీ నేనూ ఆడుతానని ఎవరినడిగేది? ఎట్లా అడిగేది? నేను ఇప్పటిలాగే అప్పుడు కూడా అమాయకుడినే. పెద్ద మొహమాటస్తుడినే. అందుకే మౌనంగా కూర్చున్నానంతే.
వాడి టీంకు ఒక సభ్యుడు తక్కువ పడ్డాడు. వెతకడం మొదలెట్టాడు. నా కళ్ళల్లో ఆడాలన్న కాంక్ష కనబడిందేమో వాడికి. రా వచ్చేశేయ్ అన్నాడు. టీంలోకి తీసుకోవడమే కాదు. ఓ ఓవర్ ఇచ్చాడు కూడా. వాడి నమ్మకానికి అనుగుణంగానే ఇచ్చిన మొదటి ఓవర్, మొదటి బంతికే వికెట్ తీసి వాడికి కానుకగా ఇచ్చాను. పసిగట్టడం, నమ్మకం నాయకత్వానికి ఉండాల్సిన లక్షణాలో కొన్ని. అవి వాడిలో పుష్కలంగా ఉండేవి. కాబట్టే వాడికి ఓటేశాను. టీం లోకి తీసుకున్నందుకే ఓటేసినట్టున్నావంటారేమో! కానే కాదు. ఒక విద్యాసంవత్సరంలో ఎన్నికలు ఆగస్టులో అయితే ఆటలు ఫిబ్రవరిలో. ఓటేసినానని చెప్పినందుకే తీసుకుని ఉండొచ్చు కదా! మీరు లాజిక్ గా అడగటం తప్పేమీ కాదు. కానీ చెప్పా కదా! ఇప్పటిలాగే అప్పుడు కూడా అమాయకుడినే నని. వాడికి చెప్పింది లేదూ! వాడితో అంటకాగింది లేదు. వాడంటే అభిమానమంతే.
9 వ తరగతి తర్వాత వాడు కారణాంతరాలచే అనంతపురం వెళ్ళిపోయాడు. నా వరకు నాకో పెద్ద అగాధం, అనంత శూన్యం -తరగతి గదిలో.
మరో సంవత్సరం గడిచిపోయింది. బడి దాటేసి, కాలేజీల్లో పడి, పడీ లేచీ చదువు *లై* పోగొట్టుకుని, ఉద్యోగం తెచ్చుకొని జీవితంలో సెటిలయ్యా మనిపించుకొని, 27 ఏండ్లు గడిచిపోయాయి.
వాణ్ణి మాత్రం ఆలోచనల్లో మోస్తూనే వచ్చా. వాడు అనంతపురం వెళ్ళాడన్నమాటే గానీ, అక్కడే ఉన్నాడా? ఇంకెక్కడికైనా వెళ్ళాడా? ఏమి చేస్తున్నాడు? ఎట్లున్నాడు?
ఏమీ తెలిసేది కాదు. వాడికి నాకు తెలిసిన ప్రతివాడిని అడగటమే. వాడేడున్నడు? ఎట్లున్నడు? తెలియదు...తెలియదు...ప్రతి వాడి నుండి ఇదే సమాధానం. అయినా నేను అడగటం మానలేదు. నమ్మకం ఎప్పటికైనా ఫలిస్తుందన్న ఓ గుడ్డి నమ్మకం -నాకు. వాడి నుండి దూరమైన 27 ఏండ్ల తర్వాత నా నమ్మకం నిజమైంది.
నేను పనిచేసే ఊరిలో ఓ పెద్దాయన లైబ్రేరియన్ గా పని చేసేవాడు. ఆయన కుమారుడు నా శిష్యుడు. శిష్యుడితో ఓ మాటల సందర్భంలో మూలాలు బయటపడ్డాయి. తీగలాగితే డొంకంతా కదిలింది. మా విద్యార్థి మా వాడికి అల్లుడని, వాళ్ళ నాన్నకు మేనల్లుడని అని తేలింది. తేలిందన్న మాటే గానీ మాట్లాడటానికి మరో ఆర్నెళ్ళు పట్టింది.
వాడి ఫోన్ నెంబర్ పట్టేసి ఒక రోజు ఫోన్ చేశా. జస్ట్ నేను నీ క్లాస్ మేట్ ను అని చెప్పి ఫోన్ పెట్టేశా ఉడికిద్దామని. అరే ఎవర్రాబై చెప్పునీవు. అరె ఎవర్రాబై చెప్పు నీవు అంటూ ఫోన్లు, మేసేజ్ లు. చివరికి ఒక్కొక్క జ్ఞాపకం గుర్తు చేస్తుంటే వాడి కళ్ళల్లో నుంచి నీళ్ళు. ఇదే కదా స్నేహం.
ఇదే కదా అభిమానం. వాడెవడో కాదు నా బాల్యమిత్రుడు మద్దిలేటి.
ఆర్నెళ్ల తర్వాత ఒకసారి కలిసే ప్రయత్నం చేశాం. సమయానుకూలత లేకపోవడం వలన వీలుకాలేదు.
మరోసారి...మరోసారి...చివరికి ఎక్కడైతే చదువుకున్నమో అక్కడే కలిశాం. మరో ఇద్దరు క్లాస్ మేట్స్ కలిశారు. అందరం కలిస్తే బాగుంటుందనుకున్నాం. విజయ్ అనే మరో మిత్రుడు దానికి నేనే కారణమవుతా. నా తమ్ముడి పెళ్ళినే సందర్భం చేస్తానని మాటిచ్చాడు. ప్రతి మిత్రుడిని ఆహ్వానించాడు. వీలైన ఓ 25 మంది దాకా వచ్చారు. ఇక ఒకటే జ్ఞాపకాలు, ఒకటే నవ్వులు. ఇట్లాంటి సందర్భంలో నేను నోటి కన్నా చెవులకు, కళ్ళకే ఎక్కువగా పని పెడతా. వాళ్ళ కళ్ళల్లో కాంతిని, వాళ్ళు రాల్చిన మాటలను ఏరుకోవడానికి. ఇట్లా మీ ముందు కుప్పవోయడానికి.
మీ
"జయన్న*
(మరో జ్ఞాపకంతో... మరో సారి)
19, అక్టోబర్ 2018, శుక్రవారం
17, సెప్టెంబర్ 2018, సోమవారం
10, సెప్టెంబర్ 2018, సోమవారం
సాగిపో!
తోచిందేదో చేసేయ్ సోదరా!
చేసేదేదో మంచే చేయరా!
చేసేదేదో మంచే చేయరా!
చేసే పనిలో...
నడిచే దారిలో...
దిక్కు దిక్కున నక్కలు కొన్ని
అదును కోసం పొంచి ఉండురా!
నక్కల జిత్తులు చిత్తుచేయుచు
కవాతు తొక్కుతూ కదలిపొమ్మురా!
నడిచే దారిలో...
దిక్కు దిక్కున నక్కలు కొన్ని
అదును కోసం పొంచి ఉండురా!
నక్కల జిత్తులు చిత్తుచేయుచు
కవాతు తొక్కుతూ కదలిపొమ్మురా!
నడిచే దారిలో...
చేసే పనిలో...
పక్కపక్కన తిక్కతిక్కగా
కుక్కలు కొన్ని కూయుచుండురా!
కూసే కూతలు చెవినే పెట్టక
చేసే పనిపై ధ్యాసే పెట్టుక
సాగిపొమ్మురా అసాధ్యమేదిక!
సత్యం అయితే జయమేనీదిక!!
చేసే పనిలో...
పక్కపక్కన తిక్కతిక్కగా
కుక్కలు కొన్ని కూయుచుండురా!
కూసే కూతలు చెవినే పెట్టక
చేసే పనిపై ధ్యాసే పెట్టుక
సాగిపొమ్మురా అసాధ్యమేదిక!
సత్యం అయితే జయమేనీదిక!!
- ఎన్. జయన్న,
10.09.2018
3, సెప్టెంబర్ 2018, సోమవారం
గిడుగు సేవల స్మరణలో....
లేబుళ్లు:
న్యూస్ క్లిప్పింగ్స్
21, ఆగస్టు 2018, మంగళవారం
మూడు రంగుల జెండా!
లేబుళ్లు:
నా వీడియోలు,
పాటలు
5, ఆగస్టు 2018, ఆదివారం
లేబుళ్లు:
న్యూస్ క్లిప్పింగ్స్
24, జులై 2018, మంగళవారం
17, జులై 2018, మంగళవారం
4, జూన్ 2018, సోమవారం
పాలమూరు జలగోస
28, మే 2018, సోమవారం
సురవరం ప్రతాపరెడ్డి పై సినారె పద్యం
26, మే 2018, శనివారం
నీ ఇల్లు ఎక్కడో తెలుసా?
లేబుళ్లు:
నా వీడియోలు,
పాటలు
25, మే 2018, శుక్రవారం
10, మే 2018, గురువారం
అవనిశ్రీవీరేష్-మట్టి కుదురు- అనుభవైక కవిత్వం
అవనిశ్రీవీరేష్
ఆయన నడిగడ్డ మట్టిబిడ్డ
ఉత్సాహం ఉరకలెత్తే యువకుడు
అన్యాయంపై పిడికిలెత్తే పిడుగు
ఆయన కలం కళ్ళెం లేని గుర్రం.
కవిత్వాన్ని ప్రవాహంలా పరుగులెత్తించే ప్రజ్ఞాశాలి
కవిత్వక్యాన్వాస్ మీద పల్లెజనజీవన సౌందర్యాన్ని అందంగా చిత్రీకరిస్తున్న కవి
సమాజపురోగమనంలో సబ్బండ జాతుల శ్రామికత్యాగాన్ని
చరిత్రపుటల్లో చేరుస్తున్న చరిత్రకారుడు
మట్టి కుదురు
అవనిశ్రీ వెలువరించిన మొదటి కవితా సంపుటి.
ఇది అనుభవైక కవిత్వం
మట్టి కుదురు కవితా సంపుటికి నేనందించిన ఆత్మీయ పలుకులు.
గద్వాలది చరిత్రలో ఎప్పుడూ చెరగని ఓ అధ్యాయం. ఓ ప్రత్యేకమైన
ఉనికి. రెండు నదులు, రెండు రాష్ట్రాలతో అనుబంధం. విభిన్న
సంస్కృతులు, భిన్న మాండలికాలు, సంస్థాన
రాజసం, అపార విద్వత్తు, అడుగడుగున
విప్లవం. ఇదిగో వీటన్నిటి వారసత్వంతో...ఉదయించిన యువకవే 'అవనిశ్రీ
' వీరేష్. ఎదిగిన దానితో సంబంధం లేకుండా, అవని మీదే పాదాలను నిలిపెటోడు. అవనికి శిరస్సు వంచెటోడు. అడుగడుగున కవితతో
అవనిని అమాంతం అల్లుకున్నోడు. అక్షరం అతని ప్రాణం. వాక్యం అతని నినాదం. నేనిట్లా
పరిచయం చేయడం బాగుండదు కాని, అతని మాటల్లోనే విందాం...
"నేను
సమాజపు పాఠకుణ్ణి
జన ఆలోచనల భావకుణ్ణి" అర్థమైంది కదా! ఈ కవెవరో! మరి ఇలాంటి కవి
రాసేదేమిటి?ఎవరి కొరకు? అని
ప్రశ్నిస్తే..."నా కవిత క్రాంతి పథం/ నా కవిత జనహితం" అని సమాధనమిచ్చాకా,
మనకు ప్రశ్నలు మిగులుతాయా?!
ఈ కవి తానేమి రాయాలో, ఎవరి కొరకు రాయాలో
స్పస్టమైన అవగాహానతో ఉన్న కవి. అంతే కాదు తన తోటి కవులకు మార్గ నిర్దేశం చేయగల
శక్తి సామర్థ్యాలు ఉన్న కవి. కాబట్టే, కవులకు త్రికాలాలను
సంధానం చేసే శక్తుండాలని, అక్షరాలతో విప్లవాన్ని తెప్పించగల
పరిపూర్ణత ఉండాలని, ఆకలి బాధలను అక్షరాలలోకి వంపాలని,చెమట చుక్కల్లో పదాలను పులుమాలని, ఎక్కడే విపత్కర
సంఘటన జరిగినా నిద్రలో ఉలికిపడి కలాన్ని కదిలించాలని మార్గనిర్దేశం చేస్తాడు. కవుల
బాధ్యతను గుర్తు చేస్తాడు.
ఈ కవికి తన ఊరంటే వల్లమాలిన అభిమానం. ఊర్లో జనాలు. జనాల్లో
పిల్లలు. పిల్లల నవ్వులంటే మరీ ఇష్టం. ఆ నవ్వులు మామూలు నవ్వులు కాదని చందమామలో
పూసిన కలువపువ్వులని, ఆకాశంలో తారలని పిల్లలను ఎదలకు
హత్తుకుంటాడు.
ఈ కవి ఎవడెట్లా పోతే నాకేమి, లోకమెట్లుంటే
నాకేమనే బాపతు కాదు. అట్లా మిన్నుకుండిపోయే మన్ను తిన్నపాములను ఊరికే వదిలిపెట్టడు.
తాను లోకాన్ని గమనిస్తూ, తన కవిత్వంతో దాని గమనాన్ని
సరిజేస్తాడు. తల్లిదండ్రులు, గురువులు, రైతులు, ప్రకృతి చేసే నిస్వార్థమైన సేవ నుండి
ఏమైనా నేర్వండ్రా! కొద్దిగైనా లోకం కోసం చేసి చావండ్రా! అని వాతలు
పెడతాడు.
నాకు ఈ కవిలో ఒక శ్రీశ్రీ, ఒక గోరటి
కనిపిస్తాడు. వాళ్ళిద్దరూ ఆవహిస్తేనే రాసిన కవితేమో అనిపిస్తుంది- ఈ సంకలనంలో ఉన్న
'మేమే చరిత్ర పుటలం ' అన్న కవిత. ఒక వెలుగు వెనుక దాగిన చీకటి రహస్యాన్ని,
చెమట చుక్కలు సృష్టించిన చరిత్ర పాఠాన్ని, నాగరికత
నేర్పిన వృత్తులను అమితమైన ప్రేమతో గుండెల కద్దుకుంటాడు ఈ కవి.
సామాజిక మాధ్యమాలలో ఈ కవి రాస్తున్న కవిత్వాన్ని నిశితంగా
గమనిస్తూ వచ్చినప్పుడు, ఇది అనంత భావాలకొండ అని, ఈ కవికి కవిత్వం రాయడమంటే నీళ్ళు తాగినంత పనే అనుకున్నాను. కానీ నా అంచనాలను తలకిందులు చేస్తూ ఈ కవి ఇట్లా
అంటాడు..." ఒక కవిత రాయడమంటే/ ఒక మహా యుద్దం జరగటమే" నిజమే కదా! ఎంత
అంతః సంఘర్షణా యుద్దం మెదడులో, హృదయంలో జరిగితేనో ఒక కవిత పుట్టుకొస్తుంది. పురిటి
నొప్పుల బాధ తల్లికే గానీ, తనువు పంచుకొని పుట్టిన వాళ్ళకేమి
తెలుస్తుంది! పుట్టిన బిడ్డను చూసిన వాళ్ళకేమి తెలుస్తుంది. కవి కష్టం కవికే తప్పా,
కవితకూ, పాఠకుడికి అర్థం కావు. అయినా అది
అనుభూతే తప్పా, అనుభవం కాజాలదు. ఈ కవి కవిత్వమంతా ఎక్కువ
భాగం అట్లా అనుభవం నుండి పుట్టుకొచ్చిన కవిత్వమే. అందుకే అది ఆకలి వేసినప్పుడు
గొంతులో జారిపోయే సంకటిలా కమ్మగుంటది. దప్పికైనప్పుడు ఊరి నీటినిచ్చే చెలిమె అంత
చల్లగుంటది. వాస్తవాలను కళ్ళ ముందు కవిత్వంగా ఉంచినప్పుడు గొంతుకడ్డం పడ్డ
గొడ్డుకారం ముద్దలెక్క ఉంటది.
కవి కావాలని ఉత్త ఉబలాటం ఉంటే సరిపోదు. అదే చాలనుకుంటే
పొరపాటు. ప్రాంతం, పరిస్థితులు,
అనుభవాలు, నిశిత దృష్టి, హృదయ మార్ధవ్యం ఇట్లా చాలా చాలా ఆవశ్యకాలతో పాటూ, కొంత
సహజాతం, కొంత సాధన అవసరం. ఇవే కవికి ప్రాణం పోస్తాయనుకుంటా.
ఇవే కవిని వెతికి పట్టుకుంటాయనుకుంటా. నేనైతే ఇట్లా తయారైన వాడేనేమో ఈ కవి అని
నిర్ధారణకొస్తా. లేకపోతే సాగర కెరటమెందుకు ఎగసిపడుతుందో! పర్వతం మీది శిల ఎందుకు
ఎదురుచూస్తుందో! ఈ కవి ఎట్లా పసి గట్టేవాడు?
ఎంత ఎదిగిన ఒదిగి ఉండే గుణం ఈ కవిలో మస్తుగ కనిపిస్తది.
కాబట్టే 'ఎక్కువైతే కాదు ' కవిత రాయగలిగాడు. మేము ఉద్యమాలు
చేయవచ్చు. ఉద్యమాల కొరకు కవిత్వం రాయవచ్చు. ఇంకోటి...ఇంకోటీ...ప్రజల కొరకు ఏదైనా
కావొచ్చు. కానీ అవన్ని గతంలో చేసిన వారికన్న గొప్పవైతే కాదు. వారి దోవలో, వారి నీడలో
చేసిన చిరు ప్రయత్నాలేనని కవి వినమ్రతను కనబరుస్తాడు.
కవి జన సమూహంలో చేరిపోవాలా. జన సమూహాన్ని తన లోకంలోకి
లాక్కపోవాలా. ఈ రెండూ చేయగలవాడే అసలు కవి. 'యాదికుందా?' కవిత ద్వారా కవి తన బాల్యపు
గుర్తులను ఏరుకుంటూ వెళ్తూనే, మనల్ని మన బాల్యంలోకి నెట్టేస్తాడు.
సంసార సాగరంలో యవ్వన, మధ్య, వృద్ధాప్య
దశలతో వాటి వాటికి నిర్ధేశించిన లక్ష్యాల సాధనలో చతికిలపడి, ఒడ్డునపడ్డ
చేపల్లా గిలగిలా కొన ఊపిరితో తనుకులాడుతున్న మనకు మళ్ళీ బాల్యంలోకి తొంగి చూడటమంటే
తిరిగి చేపలను నీటిలోకి చేర్చడమే కదా. అదిగో ఆ అనుభూతినే కలిగిస్తాడు. ఇట్లా చెప్పుకుంటూ పొతే ఇది అనంతం. తినే వాడికి
రుచులు చెప్పడమెందుకు? మీరే చవి చూడండి. చివరగా ఒక ఆశ. ఈ కవి తన కవిత్వాన్ని మరింత చిక్కబరిచి,
మరింత వైవిధ్యమైన శిల్పంతో, భవిష్యత్తులో
విస్తృతమైన సాహిత్యాన్ని సృష్టించి, నడిగడ్డ సాహిత్య సంపదను
సుసంపన్నం చేయాలి. ఎన్నో పోరాటాల తర్వాత
ఆవిర్భవించిన జోగులాంబ గద్వాల జిల్లాలో తొలి వచన కవితా సంపుటిని
తీసుకొస్తున్న సోదరుడు అవనిశ్రీ వీరేష్ ను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.
నాయుడి గారి జయన్న,
తెలుగు ఉపాధ్యాయుడు,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పూడూరు.
04.10.2017.
--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
|
లేబుళ్లు:
కవులు,
తెలుగు కవులు,
పాలమూరు కవులు,
పుస్తక సమీక్షలు
8, మే 2018, మంగళవారం
ఇక్బాల్_ఝరి_కొన్ని ఆయుధాలు- కొన్ని కన్నీళ్ళు
ఇక్బాల్
కవి, రచయిత, ఉపాధ్యాయుడు అంతకు మించి ప్రజల మనిషి.
ఝరి
ఇక్బాల్ గారు ఉపాధ్యాయుడిగా పనిచేసి, ఉద్యోగ విరమణ చేసిన సందర్భంలో ఆయన జీవితం, సాహిత్యం, వారితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొంటూ హితులు, సహచరులు, శిష్యులు తమ స్పందనలతో తెచ్చిన పుస్తకం.
కొన్ని ఆయుధాలు- కొన్ని కన్నీళ్ళు
తన సాహిత్యాన్ని చదువుతూ, 15 ఏళ్ళ పరిచయంతో తనకు సమీపంలో నడుస్తూ, గమనిస్తూ వచ్చిన చనువుతో రాసిన కొన్ని మాటలు.
కొన్ని ఆయుధాలు... కొన్ని కన్నీళ్లు...
ఇక్బాల్' - పాలమూరు జిల్లా కరువు వ్యతిరేక పోరాట కమిటీ మొదటి సారి నాకు ఈ పేరును పరిచయం చేసింది. 2003లో పాలమూరు టౌన్ హాల్లో ఈ కమిటీ ఆధ్వర్యంలో ఓ రోజంతా
వందలాది మంది కవి గాయకులతో 'పాలమూరు గోస' అనే కార్యక్రమం
ఏర్పాటుచేసింది. పెద్దలు కె.సి.
వెంకటేశ్వర్లు గారి వలన ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చింది. వారి
ద్వారానే వీరి పరిచయ భాగ్యం కలగింది. అంటే వీరు ఉపాధ్యాయుడిగా కన్నా నాకు కవిగానే ముందు పరిచయం. ఆ పరిచయం నాటి నుండి
నేటి దాకా వీరితో సాహిత్యానుబంధం కొనసాగుతూనే ఉన్నది. కాబట్టే వీరి ఉపాధ్యాయజీవితం
కన్నా వీరి సాహిత్య జీవితం గురించే నేను ఎక్కువ చెప్పదలుచుకున్నాను.
కుటుంబం, వృత్తి, సమాజం ఈ మూడింటి
బాధ్యతల నుండి వ్యక్తి తప్పించుకోలేడు.
అట్లాగని వాటిని పూర్తి బ్యాలెన్స్ చేయలేడు. చాలా మంది మొదటి దాని దగ్గరో, కొంత మంది రెండవ దాని దగ్గరో ఆగిపోతారు. సమాజం గురించి, అది అట్టడుగు వర్గాల గురించి ఆలోచించే తీరిక, ఓపిక ఎవరికీ లేకుండా పోయింది. ఇట్లాంటి విపరీత, స్వార్థపూరిత కాలంలో, ఎండి
నెర్రెలిచ్చిన నేలలను, కంప చెట్లతో నిండిన కాల్వలను, కాల్వలు మింగిన ఊళ్ళను, సెజ్ రాక్షస పాదాల కింద నలిగే పల్లెలను, పొక్కిలి లేసిన ఇళ్ళను, శవమై తిరిగొచ్చిన వలస జీవులను, అప్పు కత్తై కుత్తుక పై వేలాడితే చూరుకు వేలాడిన నిర్జీవ
దేహాలను, ఇట్లా
ఒకటేమిటి..., ఒక్కమాటలో
చెప్పాలంటే ఎక్కడ సముద్రం కళ్ళల్లోంచి
దుఃఖమై ఎగిసి పారుతుందో ఆ చోటును
ఒక మనిషి వెతుక్కుంటూ వెళ్ళడం ఎంత ఆశ్చర్యమో! అంతకు మించిన అద్భుతం. ఇట్లాంటి అద్భుతాలు ఈ కవి ప్రస్థానం లో
అడుగడునా కనిపిస్తాయి. పీడితుల పక్షాన
చాలా మంది కవులు కవిత్వమై పలుకుతారు. పిడికిలెత్తమంటే మాత్రం జంకుతారు. ఆ రెండు
చేయగల ధైర్యమున్న సాహిత్య సృజనశీలి ఇక్బాల్
గారు. అసలా మాటకొస్తే...సమాజాన్ని అర్థం
చేసుకోవడం మొదలుపెట్టిన నాటి నుండి నేటి దాకా ఈ కవి జీవితానికి ఇదే
ప్రధానమైపోయింది కూడా. ఈ కవి సమాజాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు, నీ వయసెంతంటారా? దానితో పనేలేదు. వారి సాహిత్యంలో వారి జీవితం కనబడదూ!? కవి జీవితం, అతని సాహిత్యం వేరు కాదు. వేరైనా సాహిత్యం వేరే ఉంటుంది.
అది తాలులా తేలిపోతుంది. ఆమూలాగ్రం వీరి సాహిత్యం వీరి జీవితాన్ని
ప్రతిబింబిస్తుంది కాబట్టే చిన్నవాడినైనా, పై మాటలు చెప్పే ధైర్యం చేశా.
ఇరవై ఏళ్ల కిందట గట్టు అంటే రాజస్థాన్ ను
తలపించే ఎడారి. ఆ ఎడారిలో ఉపాధ్యాయుడిగా
పని చేస్తున్నప్పుడు, అక్కడి ఎడారి భూములను, అక్కడ తడారిన జీవితాలను చాలా దగ్గర
నుండి చూసి, చలించిన జీవితం ఈ కవిది.
అందుకే ఈ కవి కవితల నిండా, కథల
నిండా వాళ్ళే. వాళ్ళ కన్నీటి గోసే. వాళ్ళ భాషే. వాళ్ళ యాసే దర్శనమిస్తుంది. తన పక్కలే పాకులాడుతూ, తన చుట్టే తిరుగాడుతూ, తన
మీదుగా లేత పాదాలతో జీవితాన్ని ప్రారంభించినందుకు
పుట్టిన ఊర్లో పచ్చటి అడవి భాషను పదును దేల్చి ఆయుధంగా ఎలా వాడాలో ఈ కవికి
నేర్పితే, పని చేసే ఎడారి భూమి, అక్కడి
జీవితాలు భాషకు ఆర్ద్రతను ఎలా అద్దాలో నేర్పాయి.
అందుకే ఈ కవి సాహిత్యాన్ని స్థూలంగా నిర్వచించాలంటే కొన్ని ఆయుధాలు, కొన్ని
కన్నీళ్లు అని చెప్పవచ్చు.
కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి దేవుడు
అవతరిస్తాడని పురాణాలు చెప్పిన మాట నిజమని నిరూపించడానికి నా దగ్గర ఆధారాలు లేవు
గాని, ఎక్కడ కష్టముంటే అక్కడ ఈ కవి ప్రత్యక్షమవుతాడని
చెప్పడానికి మాత్రం నా దగ్గర బోలడన్ని ఆధారాలు ఉన్నాయి. పేదల ఇళ్ళను, ఊళ్ళను, పొలాలను, మూలాలను మింగి,
పెద్దలకు సంపదలు తెచ్చి పెట్టడం కొరకు కాలువలు
కొండ చిలువలై పాకుతూ వస్తున్నప్పుడు,
‘కాల్వ మింగిన ఊరు’ ను ప్రపంచానికి చూయించాడు. అధికార పీఠాలు అప్పనంగా పేదల
భూములను దోచి పారిశ్రామిక దొరలకు
సెజ్జుల పప్పు బెల్లాలుగా పంచి
పెడుతున్నప్పుడు పల్లెలన్ని చచ్చిన శవాలై
‘కఫన్ ‘ లు కప్పుకుంటుంటే, సహచరులతో సంఘటితమై ఊరూరు సంచరించి పల్లె
పల్లెను తట్టి లేపుతూ మళ్ళీ పల్లెలకు ప్రాణాలు నింపిన ఆ అడుగుల ప్రయాణం నాకు
తెలుసు. మైనింగ్ మాఫియా అచ్చంపేట అడవులను మాయం చేయడానికి రంగం సిద్ధమైతే, అడవులను
హత్తుకున్న హృదయమార్దవం నాకు తెలుసు.
కరువు పీడిత పాలమూరు జిల్లాలో ఎక్కడ, ఏ
కారణం చేత ఏ రైతు ఉరిబోసుకున్నా, అక్కడ ఆ ఇంటి ముందు కన్నీళ్లు తుడిచే
చుట్టమై వాలిపోవడం నాకు తెలుసు. పాలమూరు జిల్లాలో నీటి వనరులు, వాటి వాటాలు,
భూములు వాటి స్వరూపాలు, లెక్కలు ప్రభుత్వం దగ్గర కన్నా ఈ కవి దగ్గరే భద్రంగా ఉండి
ఉంటవన్నది నా ప్రగాఢ విశ్వాసం. ఇట్లా ఎన్నని చెప్పను గానీ, ఇప్పుడు తనకై తాను నడవడానికి
కూడా ఈ కవికి సహకరించని అరిగిపోయిన ఆ
మోకాలి చిప్పలను (అడిగి) చూడండి. శ్రమజీవుల స్వేదం తుడువడానికి అలుపెరుగక ఆ పాదాలు
తిరుగాడిన చరిత్రంతా మీకు తప్పక చెప్పవచ్చు.
ఎన్. జయన్న, ఎస్.
ఏ.(తెలుగు)
జి--------------------------------------------------------------------------------------------------------------------------
ల్లా పరిషత్ ఉన్నత
పాఠశాల, పూడూరు.
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
|
లేబుళ్లు:
కవులు,
తెలుగు కవులు,
పాలమూరు కవులు,
వ్యక్తులు
29, ఏప్రిల్ 2018, ఆదివారం
The difference between winners and losers
https://youtu.be/JqzPXRsUoEM
The difference between winners and losers
The difference between winners and losers
28, మార్చి 2018, బుధవారం
25, మార్చి 2018, ఆదివారం
శ్రీ నాగ మల్లేశ్వరరావు గారి పద్యాలు
16, మార్చి 2018, శుక్రవారం
13, మార్చి 2018, మంగళవారం
Animation Vs me
11, మార్చి 2018, ఆదివారం
8, మార్చి 2018, గురువారం
తంగెళ్ళ శ్రీదేవి రెడ్డి
తంగెళ్ళశ్రీదేవి రెడ్డి ఉమ్మడి
పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ తెలుగు నవలా రచయిత్రి. నవలలతో పాటు, కథలు, కవితలు
రాశారు. వీరు రచించిన నవలలు, కథలు అనేక
ప్రముఖ వార, మాస పత్రికలలో ప్రచురితమైనవి. నేటి వనపర్తి జిల్లాలోని ఒక మండల కేంద్రమైన అత్మకూర్ వీరి స్వస్థలం.
ప్రస్తుతం హైదరాబాద్ లో స్థిరపడ్డారు.
కుటుంబ నేపథ్యం : తల్లి తంగెళ్ళ సుజాత, తండ్రి తంగెళ్ళ శ్రీనివాస్ రెడ్డి.
విద్యాభ్యాసం: స్వస్థలమైన ఆత్మకూరులో పాఠశాల, కళాశాల విద్యను పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటి నుండి. ఎం.ఏ. తెలుగు పూర్తి చేశారు. అక్కడే తెలుగు వార పత్రికలు- సాహిత్య వికాసం అను అంశంపై పరిశోధన చేసి , పిహెచ్.డి పట్టాను పొందారు.
వృత్తి: వీరు తెలుగు ఉపన్యాసకులు. ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేశారు.
ఉస్మానియా విశ్వ విద్యాలయానికి చెందిన ఆచార్య జి. రాంరెడ్డి దూర విద్యా
కేంద్రానికి సంబంధించి ఎం. ఏ. తెలుగు పాఠ్యపుస్తకాల రూపకల్పన బృందంలో వీరు
సభ్యులుగానూ పని చేశారు.
రచనలు: ఇప్పటి వరకు వీరు 7 నవలలు, సుమారు 50 దాక కథలు, అనేక కవితలు, వివిధ అంశాలపై వ్యాసాలు రాశారు. వీరి నవలలు స్వాతి, చతుర వంటి మాస పత్రికలలో ప్రచురించబడినవి. వీరి కథలు వివిధ దిన, వార పత్రికలలో ప్రచురించబడినవి. రచయితలకు కులం మతం ప్రాంతం లేదన్నది వీరి అభిప్రాయం. ఆ అభిప్రాయంతోనే వీరు తెలంగాణకు చెందిన వారైనా, ఆంధ్ర ప్రదేశ్ కు దక్కవలసిన ‘ప్రత్యేక హోదా’ అంశంపై సాగుతున్న ఉద్యమానికి ఊతంగా ఈమె పాటలు రచించారు. అవి ఆంధ్ర ప్రాంతంలో ప్రాచుర్యం పొందాయి.
*నవలలు:
1. ఏడు రోజులు - చతుర, మే -2000
2. మైత్రి కరార్- స్వాతి, సచిత్ర మాస పత్రిక, సెప్టెంబర్,2000.
3. వీలునామా- చతుర,మార్చి,2002
4. స్వప్నసౌధం - చతుర, జూలై, 2003.
5. సితార - విద్యుల్లత, మాసపత్రిక,ఏప్రిల్,2008.
6. మంత్రపుష్పం
1. ఏడు రోజులు - చతుర, మే -2000
2. మైత్రి కరార్- స్వాతి, సచిత్ర మాస పత్రిక, సెప్టెంబర్,2000.
3. వీలునామా- చతుర,మార్చి,2002
4. స్వప్నసౌధం - చతుర, జూలై, 2003.
5. సితార - విద్యుల్లత, మాసపత్రిక,ఏప్రిల్,2008.
6. మంత్రపుష్పం
*కథలు: ప్లాస్టిక్ పూలు , మస్కా (ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రిక -20.11.2008), పరమవీర చక్ర (ఆంధ్రభూమి సచిత్ర వార
పత్రిక -09.11.1995), ఆశ్రమం, పూలు
నలుగుతున్నాయి మొదలుగున్నవి.
అవార్డులు: శ్రీదేవి రెడ్డి తెలుగు
విశ్వవిద్యాలయం వారు ప్రతిష్టాత్మకంగా ప్రకటించే 'కీర్తి పురస్కారాలకు ఎంపికైంది. 2015 సంవత్సరానికి సంబంధించి
ఆమె ఈ అవార్డును దక్కించుకున్నారు.
తెలంగాణ శాసన సభ స్పీకరు మధుసూదనాచారి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. 'వాసిరెడ్డి రంగనాయకమ్మ ' స్మారక
అవార్డును కూడా వీరు పొందడం జరిగింది.
--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
|
5, మార్చి 2018, సోమవారం
27, ఫిబ్రవరి 2018, మంగళవారం
కలగన్నానమ్మా! - పాట ||నాగ మోహన్ ||
లేబుళ్లు:
నా వీడియోలు,
పాటలు
24, ఫిబ్రవరి 2018, శనివారం
22, ఫిబ్రవరి 2018, గురువారం
17, ఫిబ్రవరి 2018, శనివారం
16, ఫిబ్రవరి 2018, శుక్రవారం
ఇదే కదా!
13, ఫిబ్రవరి 2018, మంగళవారం
7, ఫిబ్రవరి 2018, బుధవారం
ఇదే కదా!
లేబుళ్లు:
అవి ఇవి,
కార్టూన్స్,
చిత్రలేఖనం
6, ఫిబ్రవరి 2018, మంగళవారం
ఇదే కదా !
లేబుళ్లు:
అవి ఇవి,
కార్టూన్స్,
చిత్రలేఖనం
26, జనవరి 2018, శుక్రవారం
19, జనవరి 2018, శుక్రవారం
లే... నిద్ర లే!
"అర్రెర్రే ఎంకన్న బావా! ఎన్ని రోజులకు కన్పించినవ్. మా వీధి వైపే రావడం లేదేంటి? అంతా బాగానే కదా!"
" ఆఁ ఏం బాగలే బావా! కడుపుజించుకుంటే కాళ్ళ మీద పడుతది. ఎప్పుడూ ఏదో ఒక సమస్యా!"
"ఓర్నీ పాసుగూలా. ఎప్పుడు అట్టా దిగులు మొఖమేసుక కూర్చుంటే ఇట్టాగే ఉంటుంది మరి. అది సరే గానీ, ఇట్టా రా కాసేపు మాట్లాడుకుందాం "
"లేదు బావా! చాలా పనుంది. నేను బోవాలా"
"చాలా గొప్పోడివి మరి. ఈ దేశంలో పనిపాటా లేనోడు ఎవడటయ్యా. అడుక్కు తినేటోడికి....అబ్బే మధ్యలో వాళ్ళెందుకులే గానీ, మళ్ళీ వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయనుకో, మనకేవో దెబ్బ తింటయ్. ఎందుకొచ్చిన గొడవ గానీ, ఉంటయ్. ప్రతోడికి పనులుంటయ్. ఒకడు చేస్తడు. ఇంకోడు చేయడు అంతే. నీలా ఒకడు నాలా ఒకడు."
"సరే నీవొదలవు గానీ, సంగతేందో సెప్పు బావా! ఇంటి కాడ మీ సెల్లెలు ఎదురు జూస్తది.
" ఏమి లేదు బావా! రానున్న పండుగ గురించి మాట్లాడుదామని"
" ఏంది బావా యవ్వారం. నిన్న గాకా మొన్ననే గదా! పండుగ వోయింది. తిన్న కుడుములు, తునకలు కూడా అరిగినవో లేదో. మళ్ళప్పుడే రానున్న పండుగ గురించి ఎదురు సూపులా! "
"చూడెంకన్న బావా! నీకేమో ఉరుకులాటెక్కువ,ఆలోచన తక్కువ. ఏదీ ఒకపట్టాన అర్థం చేసుకోవు. ఈ పండుగలంటవా?! అమాస కొకటి పున్నానికొకటి ఉండనే ఉన్నవి. మరి అంత కాదనుకుంటే నెలకొకటన్న వొస్తవి. ఇవన్నీ, ఇగో ఇందాకా నీవన్నవు సూడు ఈ రోజు తింటే రేపరిగే పండుగలు బావా!"
"మరీ.."
"ఎంత తిన్న తరగని, అరగని పండుగ బావా!"
"గిదేంది బావా గిట్లనవడ్తివి. యాడ ఇనలా."
"అదే మరి నీకు చెప్పేది. నీవేమో వినకుండ ఉరుకులు తీస్తవాయే."
"నాన్చకుండ జెప్పు బావా ! జర పనుంది పోవాలా."
"అదే బావా అయిదేండ్ల కొకసారి వచ్చే పండుగ"
"ఓ ఎలచ్చన్లా?! గది పండుగెందుకైతది బావా? నీ మాటలు గానీ."
"ఓరీ పిచ్చి నా ఎంకి బావా! నీకు నాకు గాకపోవచ్చు గానీ, దోసుకునే టోడికి, దాసుకునే టోడికి గిదిగాక, ఇంకో పెద్ద పండుగ ఉందా?"
"ఇగో బావా! నీవు చేతిలో ఏదో దాచిపెడతవు. ముడ్డెనకల చేతులు దాపెడతవు. చెప్పుకో చెప్పుకో ఏమి దాచినానో అని ఎకసెక్కాలాడుతవు. నీవేమో రెండాకులు ఎక్కువ సదివినోడివైతివి. నాకేమో అర్థం గాదు."
"సరే చెబుతలే గానీ, ముందైతే గా ఛాయ్ నీళ్ళు తాగి కుదుటపడు."
"అబ్బ బావా! ఛాయ్ అంటే మాయక్క చేత సేసిన ఛాయ్ నే బావా! అమృతం లెక్క ఉంటదనుకో."
"మోస్తుంది కదా! అని గుర్రానికి దానపెడితే, పెట్టిన దాన తినుకుంట వచ్చిన దారిని మరిచిందట ఎనకటికో ఏడ్డి గుర్రం. అట్లా ఉంది బావా నీ యవ్వారం."
"నేనేం జేస్తి బావా! తాగిన ఛాయ్ బాగుందని చెప్పటం తప్పా!"
"తప్పు కాదు గానీ. అంతకన్నా పెద్ద తప్పు చేస్తున్నం బావా"
"ఇగో బావా నీవు మోకాలికి బోడిగుండుకు లంకె వెట్టకు"
"లేదు బావా! నిజ్జంగా చాలా పెద్ద తప్పే చేస్తుండం ప్రతి ఐదేండ్లకో మారు. వాడు నెత్తిన టోపి పెట్టుకొని వస్తాడా! మన నెత్తిన టోపి పెట్టిపోతడు. వీధి వీధి ఏం కర్మ ఇల్లిల్లు తిరుగుతడు. కనపడిన ప్రతిపిల్లవాడిని సంకకెత్తుకుంటడు. ముక్కుల సీమిడుంటే తుడ్సిపెడతడు. అవసరమైతే ముడ్డైనా కడిగిపెడతడు. చీరనో, సారనో పంచిపెడతడు. వంగి వంగి దండాలు పెడతడు. ఓట్లేమో అడుక్కుంటడు. గద్దె మీద కూకుంటడు. ఇక అక్కడ్నుంచి మన కుంటంది చూడూ ఆట. వాడు ఒక్క రోజు బిచ్చగాడైతే, మనల్ని ఐదేండ్లు బిచ్చగాళ్ల ను చేస్తడు. మా వీధికి కరెంటు లేదు, నీళ్ళు రావు, రోడ్లు లేవు మొర్రో అంటూ మనం చేతులు కట్టుకొని, వంగి దండాలెట్టి మొరపెట్టుకుంటుంటే, వాడు తాపీగా సోఫా మీద కూకొని చెవిల పుల్లెట్టుకొనో, ..........ఏళ్ళెట్టుకొనో గెలుక్కుంటూ, విని కూడా విననట్టు నటిస్తడు. తప్పెవడిది బావా! వాడిది కాదు మనదే. అమ్ముకున్నాం కదా! ఓటు. అడిగే హక్కు మనకెక్కడిది. అందుకే సెబుతున్నా ఈ సారీ అట్లా కాకూడదని, అట్లా జరగకూడదని.
ఇగ వచ్చే ఏడాదంతా ఎలక్షన్లే. పంచాయతీలు, ఎంపిటీసీలు, జెడ్పిటీసీలు, ఇట్లా ఒకటేమిటీ .... ఒకదానెనుక ఒకటి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా షురూ.
ఆఁ పంచాయతీలంటే గుర్తుకొస్తుంది. ఇప్పుడో కొత్త చట్టం రాబోతుంది. ఈ అధికారం ఉంది చూశావ్ బావా. అది చేతిలో ఉండటమంటే నెత్తికి గుబురుగా జుట్టుండటమేపో. ఎట్టైనా దువ్వొచ్చు. ఎట్టైనా కులుకొచ్చు. లేనోడిదేమో బోడిగుండు లెక్క పీక్కుందమంటే నాలుగెంటుకలన్న రావు. రాలవు.
క్యాంపు రాజకీయాలు, గెస్టౌసుల్లో తిష్టలు, మాటింటెనో, అమ్ముడు వోతెనో మందులు, విందులు, అవసరమనుకుంటే....ఆఁ ..అఁ. వినకుంటే కిడ్నాపులు. ఇవన్నీ ఎక్కడో మనకు దూరంగా జరిగేవి. ఏ సీ.ఎం. కుర్చీ కోసమో! ఏ జెడ్పీ కుర్చీ కోసమో. మన కెంత బాధుండేది. పేపర్లనో, టీవిల్లోనో వార్తలు చదువడం, చూడటమే తప్ప మన కళ్ళెదుట జరుగడం లేదని. ఇప్పుడు మనకా సరదా తీర్చడం కొరకే ఈ కొత్త చట్టం. ఇక అంతా వైభోగమే అనుకో.
ఈ కొత్త చట్టం వల్ల నాయకులకు ఎంత మేలనుకున్నవు బావా!. ఆఁ నాయకులకే, చట్టాలెప్పుడూ ప్రజల కొరకు రూపొందవు. నాయకుల కొరకే. కొత్త పంచాయతీ చట్టం వల్ల ఎంత మేలంటే నాయకులకు ఊరంతా తిరుగాల్సిన పని లేదు. ఊరంతా కొనాల్సిన పని అసలుకు లేదు. వార్డు కొకడిని కొనెస్తే సరి. ఇగ అన్ని వాడే చూసుకుంటడనుకో. గతంలో జనానికి ఊరికెవడు సరిపోతడో, వార్డు కెవడు సరిపోతడో సరి చూసుకుని ఓటేసే అధికారమూ, అవకాశమూ ఉండేది. ఇప్పుడదీ లేకుండా పోతుంది. నీ గేరి కాడికి నువ్వుజూసుకోవొయ్యి. మీగతాదంతా నే చూసుకుంటా అన్నట్టైపోతుంది యవ్వారం. ఇంకా ముందు ముందు ఎన్నెన్ని చిత్రాలు జూడాల్నో పో. సరే మాటల్లో పడి నీ పని సంగతే మర్చిపోయిన బావా! పదా పోదువు గానీ. ఏదీ ఈ మనిషి ఉలకడు. ఓర్నీ పాసుగూల నే చెప్పుకుంటూ వోతుంటే నీవు నిద్రపోయినావా! మనమిట్టా నిద్రపోవట్టే ....నాయకులట్టా ఆడవట్టిండ్రు. లే..నీ మనిషి గూలా నిద్రలే."
-నాయుడు గారి జయన్న
14, జనవరి 2018, ఆదివారం
12, జనవరి 2018, శుక్రవారం
అక్షరాగ్నికణం అలిశెట్టి
ఉద్యమానికి పర్యాయ పదం తెలంగాణ. తెలంగాణ ఉద్యమాలకు ఊపిరి కరీంనగర్. కరీంనగర్‌కు జవం, జీవం జగిత్యాల. ఆ జగిత్యాలలో జన్మించిన అక్షరాల అగ్నికణమే అలిశెట్టి ప్రభాకర్.
తండ్రి చిన రాజం, తల్లి లక్ష్మి. అలిశెట్టి ఇదే రోజు(12.01.1954) భూమ్మీదకు వచ్చిపడ్డాడు. ఇదే రోజు జీవితం నుండి నిష్క్రిమించాడు. పుట్టిన రోజే మరణించడం. మరణించిన రోజే పుట్టిన రోజు కావడం యాదృచ్చికం. అందుకే ఆయనకు మరణం లేదు. ఆయన కవిత్వానికి అంతకన్నా లేదు.
ఏడుగురు అక్కాచెల్లెళ్ళు, ఇద్దరు అన్నాదమ్ములు వెరసి మొత్తం పది మంది సంతానం తండ్రికి. పది మందిలో ఒకడిగా జన్మించాడు. కాబట్టే పది మంది మేలు కోరే కవిత్వం రాశాడు.
అసలు అలిశెట్టి ఎవరు?
పెన్సిల్‌తో, సరదాగా చాలా బొమ్మలను గీశాడు.
కెమెరా కంటితో సామాజిక దృశ్యాలను తీశాడు.
పెన్నును గన్ను చేసుకొని అస్తవ్యస్థ సమాజంపై కవితాస్త్రాన్ని సంధించాడు. ఆయనో చిత్రకారుడు. ఫోటోగ్రాఫర్, కవి. వెరసి ఆయనో బహుముఖ ప్రజ్ఞాశాలి. కుంచె, కెమెరా బతకడానికి పనికొచ్చాయి. మూడోది జీవింపజేసింది.
కవిత్వ భాషలో చెప్పాలంటే చెరబండరాజు తన గురించి తాను చెప్పుకున్న కవితను కొంచెం సరిజేసి చెప్తే అలిశెట్టికి అచ్చంగా సరిపోతుంది.
ఆకలి అతని పేరు
కలం అతని ఆయుధం
అభ్యుదయం అతని ఊరు.
11 ఏళ్ళకే తండ్రి మరణిస్తే, కుటుంబ పోషణ భారాన్ని తలకెత్తుకున్నాడు. ఆ క్రమంలోనే తలకెత్తుకున్న భారాన్ని తగ్గించుకోవడానికి బుజానికి కెమెరాను తగిలించుకున్నడు.
ఆదర్శాలను నేను, నీవు అందంగా వల్లిస్తాం. ఆచరణలో కొందరే పాటిస్తారు. ఈ రెండో కోవకు చెందినవాడే అలిశెట్టి. అందుకే భాగ్యం కన్నా మహాభాగ్యం ఏముంటుందని పేదింటి పిల్లైనా భాగ్యాన్ని తన ఇంటికి ఇల్లాలుగా తీసుకొచ్చాడు. ఎందుకంటే అందరికి డబ్బు విలువ తెలుసు. అలిశెట్టికి డబ్బుకు విలువ లేదని తెలుసు. ఆయనెప్పుడు డబ్బు వెంట వెంపర్లాడలేదు. డబ్బు సంపాదించే మార్గాలు మస్తుగున్న వాటన్నిటిని కాలదన్నాడు. కలాన్ని మాత్రమే అందుకున్నడు, నమ్ముకున్నడు. కాని అమ్ముకోలేదు.
మాటలతో మంట పుట్టించడం, అక్షరాలను అస్త్రాలుగా సంధించడం ఒక శ్రీశ్రీకి తెలుసు, చెరబండకు తెలుసు, అలిశెట్టికి కూడా తెలుసు. జీవితంలో కొరతగా ఉన్న డబ్బు నేర్పిందేమో! తక్కువ తక్కువగా వాడుకొమ్మని. అదే సూత్రాన్ని కవిత్వానికి వర్తింపజేశాడు. మిని కవితను అతను అందుకున్నడో!, మిని కవితే అతనల్లుకున్నదో! తెలువదు గానీ, అమ్మాకొడుకుల్లా అల్లుకపోయారు. ఎంతగా అంటే అలిశెట్టికి మిని కవిత తప్ప మరోటి రాదని విమర్శించెంతగా. అది తప్పని చెప్పడానికి ఆయన చురకలంటించాడులే గాని అది వేరే విషయం.
మూడు, నాలుగు పాదాలతో అద్భుత కవిత్వాన్ని సృస్టించడం అలిశెట్టికి మాత్రమే సాధ్యమైంది.బహుశా అది ఆకలి నేర్పిన పాఠం కావొచ్చు.
నిలబడు
బలపడు
సంతకాలపై కాదు
సొంతకాళ్ళపై అన్న కవితా ప్రేరణ కావొచ్చు.
లేకపోతే...
"తనువు పుండై..వేరొకరికి పండై
తను శవమై...వేరొకరికి వశమై
తను ఎడారై...వేరొకరికి ఒయాస్సిసై " అంటు వేశ్యల దయనీయ, దుర్భర జీవితాలకు చిత్రిక పట్టేవాడా? ఈ కవితెంత కరుణా సముద్రమో!, సంచలనమో! ఎన్ని వేదికల మీద ఎన్ని వేల గొంతుకలు ఉటంకించాయో వేరే చెప్పనక్కర్లేదనుకుంటా. ఆ విషయం కాలానికి తెలుసు, దాన్ని మోస్తున్న సాహిత్యానికి తెలుసు. కవిత్వాన్ని కోట్‌లా చేసి అభ్యుదయ తెలుగు సమాజం అత్యధికంగా ఉపయోగించుకున్నది శ్రీశ్రీ తరువాత అలిశెట్టినే అంటే అతిశయోక్తి కాదు.
జన్మించిన జగిత్యాలలో ఎర్రపావురాలు ఎగురవేశాడు. నిర్భందం వెంటాడితే కరీంనగర్ కొచ్చాడు ఆకలి జీవులకోసం మాట్లాడే మనిషి మౌనంగా ఉండగలడా? తన మాటలతో మంటల జెండాలు ఎగిరేశాడు. కరీంనగర్ కాదంటే హైదరాబద్ కొచ్చిపడ్డడు. ప్రాంతాలెన్ని మారినా, దోపిడి సమాజానికి చురకలు వేయడం మాత్రం మానలేదు. తన జీవితం రక్తరేఖ మీద నడుస్తున్నా...ఎన్నికల ఎండమావులు దాటుకుంటు , సంక్షోభ గీతాన్ని పాడుకుంటు సిటీ లైఫ్ అనుభవించాడు.
నగరం అర్థం కాని రసాయన శాల
చిక్కు వీడని పద్మ వ్యూహం అని అతనికి అనతి కాలంలోనే తెలిసిపోయింది. అయినా సిటీని వదల లేదు. సిటీలో తిరుగడం మానలేదు. సిటీపై రాయడం మానలేదు.
కాచీగూడా అంటే
కాచి వడబోసిన
కమ్మని కాఫీయే కదా! అంటు కాచిగూడాకు కవితొకటి కానుగ ఇచ్చాడు.
ఇరుకిరుకుగా ఉండే రేకుల సెడ్‌లో జీవితాన్ని నెట్టుకొచ్చాడు. అయితేనేం...
అర్ధాంగి చేటలో కన్నీళ్ళు చెరుగుతున్నప్పుడు/
సంసారం బరువును సమీక్షించగలిగాడు.
ఆయన దోపిడీ సమాజంపై సంధించిన కవితాస్త్రాలు అన్నీ, ఇన్నీ కాదు. ముఖ్యంగా రాజకీయాలను చీల్చి చెండాడు. ఒక పార్టీలో ఉంటునే మరో పార్టీ వైపు చూసే జంపు జిలానీలకు చురకలేశాడు.
"వాడు
ముందే వానపాము
ముడ్డెటో? మూతెటో? " అంటూ వాతలు పెట్టాడు.
"ఓ నక్క ప్రమాణ స్వీకారం చేస్తుంది
ఇంకెవరిని మోసం చేయనని
ఓ పులి పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తుంది
తోటి జంతువులను సంహరించనని
ఈ కట్టుకథ విన్న గొర్రెలు పుర్రెలు ఊపుతూనే ఉన్నాయి." అంటూ మోసగించే నేతలను, అమాయకత్వాన్ని వీడని జనాన్ని ఎద్దేవా చేస్తాదు. దురదృస్టమేమిటంటే అదే కట్టుకథలను నేతలు నేటికీ చెబుతున్న గొర్రెలు ఇంకా పుర్రెలు ఊపుతూనే ఉండటం. ఇంత పరిణాం చెందినా ఇంకా పరివర్తన చెందకపోవడం.
"గుడిసెలు
మేడల్ని కడతాయి
మేడలే
గుడిసెల్ని కొడతాయి" ఎన్ని తక్కువ మాటలు ఎంత గొప్ప మాటలు. ధనవంతుల అభివృద్ది సోపాన నేపథ్యాన్ని, దాని వెనుకే దాగున్న దోపిడీ వ్యవస్థను ఎంత అద్భుతంగా కళ్ళకు కట్టాడు.
"పాల రాతి బొమ్మైన
పార్లమెంట్ భవనమైన
వాడు చుడితేనే శ్రీకారం
వాడు కడితేనే ఆకారం" అంటూ శ్రమజీవి త్యాగాన్ని కీర్తిస్తాడు కవి.
ఇట్లా ఇది అది అని ఏమీ.. ఏదీ రాసినా పేదల కోసమే రాశాడు. వాళ్ళ కన్నీళ్ళు తుడువడానికే రాశాడు.
రాయనైతే రాశాడు కానీ రాసిన దానితో సంపాదించినదేమీ లేదు కీర్తి తప్ప. ఎందుకంటే ఆకలిని జయించాలన్న ఆరాటమే గానీ, ఆస్తులను కూడ బెట్టాలన్న ఆలోచన ఆయనకెప్పుడు లేదు. అందుకే ఆయన కవిత్వాన్నైతే జయించగలిగాడు గానీ వ్యక్తిగత జీవితాన్ని రోగానికి అప్పగించి ఓడిపోయాడు. అయితేనేం తెలుగు కవిత్వం ఉన్నంత కాలం అలిశెట్టి జీవించే ఉంటాడు. తెలుగు కవిత్వ యవనిక మీద అలిశెట్టి అభ్యుదయ పతాకై రెపరెపలాడుతూనే ఉంటాడు. ఆ స్ఫూర్తిని మనలో నింపుకొని సాగడమే మన ముందున్న కర్తవ్యం.
-నాయుడి గారి జయన్న
తండ్రి చిన రాజం, తల్లి లక్ష్మి. అలిశెట్టి ఇదే రోజు(12.01.1954) భూమ్మీదకు వచ్చిపడ్డాడు. ఇదే రోజు జీవితం నుండి నిష్క్రిమించాడు. పుట్టిన రోజే మరణించడం. మరణించిన రోజే పుట్టిన రోజు కావడం యాదృచ్చికం. అందుకే ఆయనకు మరణం లేదు. ఆయన కవిత్వానికి అంతకన్నా లేదు.
ఏడుగురు అక్కాచెల్లెళ్ళు, ఇద్దరు అన్నాదమ్ములు వెరసి మొత్తం పది మంది సంతానం తండ్రికి. పది మందిలో ఒకడిగా జన్మించాడు. కాబట్టే పది మంది మేలు కోరే కవిత్వం రాశాడు.
అసలు అలిశెట్టి ఎవరు?
పెన్సిల్‌తో, సరదాగా చాలా బొమ్మలను గీశాడు.
కెమెరా కంటితో సామాజిక దృశ్యాలను తీశాడు.
పెన్నును గన్ను చేసుకొని అస్తవ్యస్థ సమాజంపై కవితాస్త్రాన్ని సంధించాడు. ఆయనో చిత్రకారుడు. ఫోటోగ్రాఫర్, కవి. వెరసి ఆయనో బహుముఖ ప్రజ్ఞాశాలి. కుంచె, కెమెరా బతకడానికి పనికొచ్చాయి. మూడోది జీవింపజేసింది.
కవిత్వ భాషలో చెప్పాలంటే చెరబండరాజు తన గురించి తాను చెప్పుకున్న కవితను కొంచెం సరిజేసి చెప్తే అలిశెట్టికి అచ్చంగా సరిపోతుంది.
ఆకలి అతని పేరు
కలం అతని ఆయుధం
అభ్యుదయం అతని ఊరు.
11 ఏళ్ళకే తండ్రి మరణిస్తే, కుటుంబ పోషణ భారాన్ని తలకెత్తుకున్నాడు. ఆ క్రమంలోనే తలకెత్తుకున్న భారాన్ని తగ్గించుకోవడానికి బుజానికి కెమెరాను తగిలించుకున్నడు.
ఆదర్శాలను నేను, నీవు అందంగా వల్లిస్తాం. ఆచరణలో కొందరే పాటిస్తారు. ఈ రెండో కోవకు చెందినవాడే అలిశెట్టి. అందుకే భాగ్యం కన్నా మహాభాగ్యం ఏముంటుందని పేదింటి పిల్లైనా భాగ్యాన్ని తన ఇంటికి ఇల్లాలుగా తీసుకొచ్చాడు. ఎందుకంటే అందరికి డబ్బు విలువ తెలుసు. అలిశెట్టికి డబ్బుకు విలువ లేదని తెలుసు. ఆయనెప్పుడు డబ్బు వెంట వెంపర్లాడలేదు. డబ్బు సంపాదించే మార్గాలు మస్తుగున్న వాటన్నిటిని కాలదన్నాడు. కలాన్ని మాత్రమే అందుకున్నడు, నమ్ముకున్నడు. కాని అమ్ముకోలేదు.
మాటలతో మంట పుట్టించడం, అక్షరాలను అస్త్రాలుగా సంధించడం ఒక శ్రీశ్రీకి తెలుసు, చెరబండకు తెలుసు, అలిశెట్టికి కూడా తెలుసు. జీవితంలో కొరతగా ఉన్న డబ్బు నేర్పిందేమో! తక్కువ తక్కువగా వాడుకొమ్మని. అదే సూత్రాన్ని కవిత్వానికి వర్తింపజేశాడు. మిని కవితను అతను అందుకున్నడో!, మిని కవితే అతనల్లుకున్నదో! తెలువదు గానీ, అమ్మాకొడుకుల్లా అల్లుకపోయారు. ఎంతగా అంటే అలిశెట్టికి మిని కవిత తప్ప మరోటి రాదని విమర్శించెంతగా. అది తప్పని చెప్పడానికి ఆయన చురకలంటించాడులే గాని అది వేరే విషయం.
మూడు, నాలుగు పాదాలతో అద్భుత కవిత్వాన్ని సృస్టించడం అలిశెట్టికి మాత్రమే సాధ్యమైంది.బహుశా అది ఆకలి నేర్పిన పాఠం కావొచ్చు.
నిలబడు
బలపడు
సంతకాలపై కాదు
సొంతకాళ్ళపై అన్న కవితా ప్రేరణ కావొచ్చు.
లేకపోతే...
"తనువు పుండై..వేరొకరికి పండై
తను శవమై...వేరొకరికి వశమై
తను ఎడారై...వేరొకరికి ఒయాస్సిసై " అంటు వేశ్యల దయనీయ, దుర్భర జీవితాలకు చిత్రిక పట్టేవాడా? ఈ కవితెంత కరుణా సముద్రమో!, సంచలనమో! ఎన్ని వేదికల మీద ఎన్ని వేల గొంతుకలు ఉటంకించాయో వేరే చెప్పనక్కర్లేదనుకుంటా. ఆ విషయం కాలానికి తెలుసు, దాన్ని మోస్తున్న సాహిత్యానికి తెలుసు. కవిత్వాన్ని కోట్‌లా చేసి అభ్యుదయ తెలుగు సమాజం అత్యధికంగా ఉపయోగించుకున్నది శ్రీశ్రీ తరువాత అలిశెట్టినే అంటే అతిశయోక్తి కాదు.
జన్మించిన జగిత్యాలలో ఎర్రపావురాలు ఎగురవేశాడు. నిర్భందం వెంటాడితే కరీంనగర్ కొచ్చాడు ఆకలి జీవులకోసం మాట్లాడే మనిషి మౌనంగా ఉండగలడా? తన మాటలతో మంటల జెండాలు ఎగిరేశాడు. కరీంనగర్ కాదంటే హైదరాబద్ కొచ్చిపడ్డడు. ప్రాంతాలెన్ని మారినా, దోపిడి సమాజానికి చురకలు వేయడం మాత్రం మానలేదు. తన జీవితం రక్తరేఖ మీద నడుస్తున్నా...ఎన్నికల ఎండమావులు దాటుకుంటు , సంక్షోభ గీతాన్ని పాడుకుంటు సిటీ లైఫ్ అనుభవించాడు.
నగరం అర్థం కాని రసాయన శాల
చిక్కు వీడని పద్మ వ్యూహం అని అతనికి అనతి కాలంలోనే తెలిసిపోయింది. అయినా సిటీని వదల లేదు. సిటీలో తిరుగడం మానలేదు. సిటీపై రాయడం మానలేదు.
కాచీగూడా అంటే
కాచి వడబోసిన
కమ్మని కాఫీయే కదా! అంటు కాచిగూడాకు కవితొకటి కానుగ ఇచ్చాడు.
ఇరుకిరుకుగా ఉండే రేకుల సెడ్‌లో జీవితాన్ని నెట్టుకొచ్చాడు. అయితేనేం...
అర్ధాంగి చేటలో కన్నీళ్ళు చెరుగుతున్నప్పుడు/
సంసారం బరువును సమీక్షించగలిగాడు.
ఆయన దోపిడీ సమాజంపై సంధించిన కవితాస్త్రాలు అన్నీ, ఇన్నీ కాదు. ముఖ్యంగా రాజకీయాలను చీల్చి చెండాడు. ఒక పార్టీలో ఉంటునే మరో పార్టీ వైపు చూసే జంపు జిలానీలకు చురకలేశాడు.
"వాడు
ముందే వానపాము
ముడ్డెటో? మూతెటో? " అంటూ వాతలు పెట్టాడు.
"ఓ నక్క ప్రమాణ స్వీకారం చేస్తుంది
ఇంకెవరిని మోసం చేయనని
ఓ పులి పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తుంది
తోటి జంతువులను సంహరించనని
ఈ కట్టుకథ విన్న గొర్రెలు పుర్రెలు ఊపుతూనే ఉన్నాయి." అంటూ మోసగించే నేతలను, అమాయకత్వాన్ని వీడని జనాన్ని ఎద్దేవా చేస్తాదు. దురదృస్టమేమిటంటే అదే కట్టుకథలను నేతలు నేటికీ చెబుతున్న గొర్రెలు ఇంకా పుర్రెలు ఊపుతూనే ఉండటం. ఇంత పరిణాం చెందినా ఇంకా పరివర్తన చెందకపోవడం.
"గుడిసెలు
మేడల్ని కడతాయి
మేడలే
గుడిసెల్ని కొడతాయి" ఎన్ని తక్కువ మాటలు ఎంత గొప్ప మాటలు. ధనవంతుల అభివృద్ది సోపాన నేపథ్యాన్ని, దాని వెనుకే దాగున్న దోపిడీ వ్యవస్థను ఎంత అద్భుతంగా కళ్ళకు కట్టాడు.
"పాల రాతి బొమ్మైన
పార్లమెంట్ భవనమైన
వాడు చుడితేనే శ్రీకారం
వాడు కడితేనే ఆకారం" అంటూ శ్రమజీవి త్యాగాన్ని కీర్తిస్తాడు కవి.
ఇట్లా ఇది అది అని ఏమీ.. ఏదీ రాసినా పేదల కోసమే రాశాడు. వాళ్ళ కన్నీళ్ళు తుడువడానికే రాశాడు.
రాయనైతే రాశాడు కానీ రాసిన దానితో సంపాదించినదేమీ లేదు కీర్తి తప్ప. ఎందుకంటే ఆకలిని జయించాలన్న ఆరాటమే గానీ, ఆస్తులను కూడ బెట్టాలన్న ఆలోచన ఆయనకెప్పుడు లేదు. అందుకే ఆయన కవిత్వాన్నైతే జయించగలిగాడు గానీ వ్యక్తిగత జీవితాన్ని రోగానికి అప్పగించి ఓడిపోయాడు. అయితేనేం తెలుగు కవిత్వం ఉన్నంత కాలం అలిశెట్టి జీవించే ఉంటాడు. తెలుగు కవిత్వ యవనిక మీద అలిశెట్టి అభ్యుదయ పతాకై రెపరెపలాడుతూనే ఉంటాడు. ఆ స్ఫూర్తిని మనలో నింపుకొని సాగడమే మన ముందున్న కర్తవ్యం.
-నాయుడి గారి జయన్న
లేబుళ్లు:
కవులు,
సాహితీ వ్యాసాలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)