27, నవంబర్ 2019, బుధవారం

మేం మనుషులమేనా?


అమ్మా!
మేం గుండెలేని మొండి మనుషులం
కరుణలేని కఠినాత్ములం
అనంత పాపపంకిలంలో మునిగితేలుతున్న పాపాత్ములం
మీరు చస్తేనే చలించలేదు
ఈ కన్నీళ్ళకు కరిగిపోతమా?
మీరు మాలాగే బండగా బతకడం నేర్చుకొండి
మీ కష్టాలు మీవే
మీ కన్నీళ్ళు మీవే
మీ బతుకు ఇక్కడ ఎవరికి కాబట్టింది కనుక
ఎవడి పనుల్లో వాడున్నాడు
తోడొచ్చే ఉద్యోగులు ఎక్కడ తొంగొని ఉన్నారో ఎవరికి ఎరుక?
ఏసిన మెతుకులు ఏరుకోవటంలో కొందరు బిజీ
ప్రభువుల పల్లకీ మోయడానికి కొన్ని భుజాలు రెడీ
భజనలు, బాకాలు సరేసరి
న్యాయదేవత కళ్ళకు గంతలుండటం పాతమాట
నోటికి కూడా ఇప్పుడు కొత్త మూత
అందుకనే అటువైపు చూడకండి
మేము మనుషులమన్న మాట మర్చిపొండి
పైనున్నాడో లేదో తెలియదు
ఉన్నా లేకున్నా మీ ఉసురైతే ఊరికే పోదు
అది చూడడానికైనా అగండి
అది చూడడానికే బతుకండి.
- ఎన్. జయన్న

12, అక్టోబర్ 2019, శనివారం

ప్రగతిచక్రాల కింది ఖాకీ


ఉడికీఉడకని మెతుకులు
ఉప్పుడికిన బట్టలు
హీటెక్కిన కాళ్ళు
నిద్రకు నోచని కళ్ళు
హూనమైన ఒళ్ళు
గతుకుల రోడ్డుపై పయనం
సీట్లపైనే శయనం
రోజూ ఏదో ఒక యుద్ధం
తప్పదు అనునిత్యం.
వాన, చలి, ఎండ
కాలం ఏదైనా
కదలక తప్పని బతుకుచక్రం.
ఆగిపోతే చేరుటెట్లా గమ్యం?
- ఎన్. జయన్న

10, సెప్టెంబర్ 2019, మంగళవారం

గద్వాల పిజి సెంటర్
* గద్వాల పిజి సెంటర్ కు మంచి రోజులు
* సిద్దమవుతున్న వసతి గృహాలు
* విద్యార్థులకు తప్పనున్న అవస్థలు

        గద్వాల పిజి సెంటరు ప్రగతికి  ప్రధాన అవరోధమైన వసతి గృహాల సమస్య త్వరలో తీరనున్నది. స్త్రీ, పురుషులకు రెండు వసతి గృహాలు శరవేగంగా నిర్మాణమవుతున్నాయి.  కృష్ణానది తీరాన 17 ఎకరాల సువిశాల సుందర స్థలంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటైన పిజి సెంటర్లో  అధ్యయన కేంద్రం, వసతి గృహాల సముదాయం ఇక విద్యార్థులతో కళకళలాడనున్నాయి. వసతి గృహాలు ఏర్పాటుకావడం వలన ఇక్కడి పిజి సెంటర్లోని కోర్సులను ఎక్కువ మంది విద్యార్థులు ఎంపిక చేసుకొనే అవకాశం ఉంది. విద్యార్థుల సంఖ్య పెరిగితే మరిన్ని కొత్త కొర్సులు వచ్చే అవకాశం ఉంటుందని, తద్వారా అక్షరాస్యతలో వెనుకబడిన నడిగడ్డ ప్రాంతం విద్యలో పురోగతి సాధించగలదని ఇక్కడి ప్రజల విశ్వసిస్తున్నారు.
   1993లో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఎం.సి.ఏ., ఎం.కాం., కోర్సులతో గద్వాల పట్టణంలో పిజి సెంటర్ ఏర్పడింది.  పట్టణంలోని డి.కె. సత్యారెడ్డి బంగ్లాలో మొదట్లో తాత్కాలికంగా నిర్వహించారు. నదీ అగ్రహారం దగ్గర పిజి సెంటర్ నిర్మాణం అయ్యాకా పట్టణం నుండి అధ్యయన కేంద్రం అక్కడికి చేరింది.  కొంత కాలం పాటు పట్టణం పిజి విద్యార్థులతో కళకళలాడింది. తదనంతర కాలంలో ఎం.సి.ఏ., కోర్సుకు డిమాండ్ తగ్గడంతో విద్యార్థులు ఎవ్వరూ ఈ కేంద్రాన్ని ఎంపిక చేసుకోకపోవడంతో మూతపడింది. దానితో  కేంద్రంలోని కంప్యూటర్లు, ఇతర సామాగ్రి పాలమూరు విశ్వవిద్యాలయానికి తరలించారు. గద్వాలకు పిజి సెంటర్ వచ్చినట్లే వచ్చి, దూరమైపోయింది.  దేశంలోనే అక్షరాస్యతలో వెనుకబడిన ప్రాంతానికి ఒక దశాబ్దం పాటు ఆ విధంగా స్నాతకోత్తర విద్య దూరమయ్యింది.
అనేక అందోళనలు, అనేక పరిణామాల అనంతరం తిరిగి 2013 సంవత్సరంలో పాలమూరు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పునఃప్రారంభమైంది. విద్వద్గద్వాలగా పేరొందిన ప్రాంతం కావడం, సాహిత్యంతో విడదీయరాని అనుబందం కలిగిన ప్రాంతం కావండంతో   ఎం.ఏ., (తెలుగు) కోర్సుతో పునఃప్రారంభించారు. దీనితో పాటు ఎం.ఏ., (ఆంగ్లం), ఎం.కాం., కోర్సులు కూడా ప్రారంభించారు. పిజి సెంటరులో ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 6 ఆరుగురు అకాడమిక్ కన్సల్టెంట్లు, ఇద్దరు పార్టు టైం ఉపన్యాసకులు పనిచేస్తున్నారు.  సాఫీగా సాగుతున్న కళాశాల ప్రయాణంలో మళ్ళీ కుదుపులు.  సరైన వసతులు లేవని, రవాణా సౌకర్యం లేదని, వసతి గృహాలు లేవని విద్యార్థులు చేరటం తక్కువైంది. చేరిన వారు కూడా మధ్యలోనే వదిలేసి వెళ్ళడం సాధారణమైంది.  విద్యార్థులు తక్కువగా ఉన్నారని, అసలు చేరటం లేదని తెలుగును పాలమూరు సెంటరుకు, ఆంగ్లాన్ని  కొల్లాపూరు సెంటరుకు మార్చాలని  ప్రయత్నాలు జరిగాయని అంటారు.  విద్యావంతులు, విద్యార్థి సంఘాల ఆందోళనలతో  ఆ ప్రయత్నాలకు బ్రేకులు పడ్డాయని అంటారు.  కళాశాల ప్రస్తుతం సాఫీగా సాగుతుంది. 
స్త్రీలకు, పురుషులకు రెండు వసతి గృహాలు నిర్మాణమవుతున్నాయి.  ఇవి పూర్తైతే మరిన్ని కొత్త కోర్సుల ఆగమనంతో కళాశాల  విద్యార్థులతో కళకళలాడుతుంది.  వెనుకబడిన ప్రాంతానికి స్నాతకోత్తర విద్య మరింత అందుబాటులోకి వస్తుంది.  నడిగడ్డ ప్రాంత విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ప్రగతి బాటలో నడవాలని ఆశిస్తున్నాను.
-ఎన్. జయన్న


పురుషుల వసతి గృహం                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                  
  

                          స్త్రీల వసతి గృహం

2, ఆగస్టు 2019, శుక్రవారం

జాని తక్కెడశిల

జాని తక్కెడశిల వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన  తెలుగు యువకవి, రచయిత. తెలుగుతో పాటు హిందీ, ఆంగ్లంలోనూ కవిత్వం రాస్తున్న బహు భాషా కవి. సామాజిక సమస్యలను కవితావస్తువులుగా స్వీకరించి విస్తృతంగా కవిత్వం రాస్తున్నారు. కవిత్వంతో పాటు కథలు, గేయాలు, విమర్శలు, సమీక్షలు, నానోలు, నానీలు, నక్షత్రాలు రాశారు. బాల సాహిత్యంలోనూ విశేష కృషి చేస్తున్నారు. వీరు రచించిన అనేక కవితలు, కథలు, వ్యాసాలు దిన, వార, మాస పత్రికలలో ప్రచురితమైనవి. వైఎస్ఆర్ కడప జిల్లాలోని  పులివెందుల వీరి స్వస్థలం. ప్రస్తుతం వృత్తిరీత్యా బెంగుళూరులో స్థిరపడ్డారు.

విద్యాభ్యాసం 

జాని  పాఠశాల విద్యను తన స్వస్థలం పులివెందులలోని నాగార్జున హైస్కూల్ లోను, వైఎస్ఆర్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో ఎస్. బి మెమోరియల్ హైస్కూల్ లోనూ పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ నుండి ఇంటర్మీడియట్ బై.పి.సి పూర్తి చేశారు. అనంతరం పులివెందుల లయోలా పాల్ టెక్నికల్ కాలేజ్‌లో  ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేశారు. తెలంగాణ లోని రంగారెడ్డి జిల్లాలో అమీన ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో బి.టెక్ పూర్తి చేశారు. కడపలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో ఎం. టెక్., పూర్తి చేశారు.  దక్షిణ భారత హిందీ ప్రచార సభ నుండి హిందీ ప్రవీణ డిగ్రీ పట్టా పొందారు. కంప్యూటర్ మరియు సాంకేతిక విద్యలో సి, జావా, ఓరాకిల్ మొదలగు దాదాపు ఇరవైకి పైగా టెక్నికల్ కోర్సులు పూర్తిచేసారు.

వృత్తి

 మొదట సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా వివిధ సంస్థలలో పని చేశారు. ప్రస్తుతం ప్రతిలిపి తెలుగు సాహిత్య వెబ్ సైట్ కి మేనేజర్ గా ఉన్నారు.

రచనలు
ఇప్పటి వరకు వీరు కవిత్వానికి సంబంధించి ఆరు పుస్తకాలు వెలువరించారు. మరెన్నో కథలు, వ్యాసాలు వివిధ పత్రికలలో రాస్తూనే ఉన్నారు. జిందగీ కె హీరే అను పుస్తకాన్ని హిందీ భాషలో రాశారు. ఈ పుస్తకం నానోలను హిందీ సాహిత్యానికి పరిచయం చేసిన మొదటి పుస్తకం. 160 మంది కవులు అమ్మపై రాసిన కవితలను మాతృస్పర్శ పేరుతో వీరి సంపాదకత్వంలో సంకలనంగా తీసుకవచ్చారు. దాదాపు ఇరవైకి పైగా సంకలనాలలో  వీరి కథలు, కవితలు ముద్రించబడ్డాయి.
 వీరి ముద్రిత రచనలు 
1.అఖిలాశ
2.విప్లవ సూర్యుడు
3.నక్షత్ర జల్లులు (కొత్త సాహిత్య ప్రక్రియ)
4.వై (హిజ్రాలపై దీర్ఘ కావ్యం)
5.బురద నవ్వింది
6. జిందగీ కె హీరే (నానోలు హిందీలో)
7.లై అనే ఆంగ్ల కవిత్వ సంపుటి

 అముద్రిత రచనలు

1.బాలల కథలు
2.బాలల గేయాలు
3.ముస్లిం మైనార్టీ కథలు
4.శివారెడ్డి కవిత్వం-ఒక అవగాహన వ్యాస సంపుటి (శివారెడ్డి గారి సమగ్ర కవిత్వంపై విశ్లేషణలు)
5.డా. ఎన్ గోపి కవిత్వం-ఒక పరిశీలన (గోపి గారి సమగ్ర కవిత్వంపై వ్యాస సంపుటి)
6.డా. రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారి రచనలు - ఒక పరిశీలన

=== పురస్కారాలు ===
#సత్రయాగం సాహిత్య వేదిక నుండి కవి మిత్ర పురస్కారం
#ప్రతిలిపి సాహిత్య వేదిక నుండి కథా భారతి పురస్కారం
#కవి సమ్మేళనం సాహిత్య వేదిక నుండి ఉగాది పురస్కారం
#బాలానందం సాహిత్య సంస్థ నుండి బాలసాహిత్య పురస్కారం
#చెన్నై కి చెందిన తెలుగు రైటర్స్ ఫెడరేషన్ నుండి తెలుగు వెలుగు పురస్కారం
#ఉమ్మడిశెట్టి ఉత్తమ కవితా పురస్కారం
#కలిమిశ్రీ ఉత్తమ కవితా పురస్కారం
# “వై” పుస్తకానికి శ్రీమతి శకుంతలా జైని స్మారక కళా పురస్కారం-2019


14, జులై 2019, ఆదివారం

మరుపుకురాని అన్న వంటి మిత్రుడు
అతను
నా భుజం మీద భరోసా
నా కంచానికి అమృతం
నా వినోదానికి సినిమా.
నా గమ్యానికి సోపానం
నా లక్ష్యానికి ప్రోత్సాహం
వెరసి నా జీవితానికి అన్న వంటి మిత్రుడు.

***

   ఇంటికొచ్చిన బంధువులు ఊరెళతామంటే సాగనంపటానికి నిన్న మధ్యాహ్నం బస్టాండ్ వెళ్ళాను. అనుకోకుండా అక్కడ ఎల్లయ్య అనే నా బాల్యమిత్రుడు ఏదో పని మీద ఈ ఊరొచ్చి కనిపించాడు.  తాను నాకు   8 వ తరగతి నుండి ఇంటర్ దాకా క్లాస్ మేట్. మేం కలిసిన ఆ కాసేపట్లో పాత జ్ఞాపకాలు, పాత మిత్రులను గుర్తు చేసుకున్నాం. 
ఇంటికి వచ్చాకా భోజనం చేస్తూ ఉంటే ఎల్లయ్య ఇంటర్ వాట్సాప్ గ్రూపులో చేర్చిన మరో మిత్రుడు చిన్న సుంకన్న గుర్తుకొచ్చాడు. అతను కచ్చితంగా ఇలాంటి సమయంలో గుర్తుచేసుకోదగినవాడే. 
          తాను నాకంటే ఓ నాలుగైదేండ్లు పెద్దవాడు. కారణాంతరాల వల్ల ఇంటర్లో క్లాస్ మేట్. మా ఊరివాడే. కానీ, వేరే వేరే ఊర్లలో మా పాఠశాల చదువులు కొనసాగడం వలన ఇంటర్ కొచ్చేదాకా ఒకరికొకరం పరిచయం లేదు. పరిచయం అయ్యాకా ఇక వదిలింది లేదు. ఆ సంవత్సరం మా ఊరి నుండి అలంపూర్ వచ్చి ఇంటర్లో ఓ పది మంది దాకా చేరాం.  తాను సిఈసి, నేను బైపిసిలో చేరాం. నేను నా పాఠశాల మిత్రుడు, మా గ్రూపు వాడే అయిన వెంకట్రాముడితో  కలిసి రూంలో ఉండేవాడిని.  సుంకన్న  తన ఇద్దరు సోదరుల (చిన్నాన్నల కుమారులు)తో కలిసి రూం తీసుకుని ఉండేవాడు. 
     ఆ రూం ఇంటర్ బ్యాచ్ కో ధర్మ సత్రం. విడిది, వినోద కేంద్రం.  రూం నిండా సన్న బియ్యం సంచులు. ఏ లోటు లేని సరుకులు. ఇంటి నుంచి నెలనెలా కంట్రోలులో ఇచ్చిన దొడ్డు బియ్యాన్ని మూటల్లాగా  మోసుకొచ్చుకుని, గొడ్డు కారంతో తిని బతికే మా బోటి వారికి ఆ రూం ఎప్పుడూ ఓ ఆశ్చర్యంగాను, ఓ అద్భుతంగానూ ఉండేది. 

       కారణం ఇదని చెప్పలేను కానీ, మా ఊరి మిత్రులందరిలోకి సుంకన్నకు నాపై అభిమానం ఎక్కువ. నా రూమ్మేట్ మొదటి సంవత్సరం మిగిలిపోయిన సబ్జెక్ట్స్ భయపెట్టడం వల్ల, కుటుంబ ఆర్థిక కారణాలచే, చదువు మీద నిరాసక్తితో రెండవ సంవత్సరం మధ్యలోనే చదువు మానేసి, ఊరెళ్ళి పోయాడు. దానితో నిర్లిప్తంగా, నిరాశాజనకంగా, ఒంటరిగా సాగుతున్న నా జీవితానికి  ఆ సమయంలో సుంకన్న స్నేహం కొండంత అండైంది.  తన వల్లే నా జీవనపు దారులన్నీ ఆనందభరితమయ్యాయి.  
నా భుజం మీద భరోసా అయ్యాడు.
నా కంచానికి అమృతమయ్యాడు.
నా వినోదానికి సినిమా అయ్యాడు.
నా లక్ష్యానికి సోపానమయ్యాడు
నా గమ్యానికి ప్రోత్సాహమయ్యాడు
వెరసి నా జీవితానికి అన్న లేని లోటు తీర్చిన మిత్రుడయ్యాడు.

అతనితో ఎన్నెన్ని జ్ఞాపకాలో! 
ఒకసారి తాను ఊరెళ్ళినప్పుడు మా అమ్మతో  డబ్బులు తీసుకరామంటే తీసుకొచ్చి, ఇచ్చి ఒకటే నవ్వు.
" ఏమప్పా! మీ అమ్మ ఎప్పుడూ డబ్బులు చూసిలేదా? గీ రెండొందలియ్యనికా ఎంత తనుకులాడిందో! ఎన్ని సార్లు లెక్కబెట్టిందో! గీ చిల్లర మోసుకరానికా  నాతల ప్రాణం తోక కొచ్చిందిపో" అని ఆటబట్టిచ్చాడు.
" అన్నా! మీ లాగా మేం ఆస్తిపరులం కాదే. మా అమ్మ మోయలేని గడ్డి మోపులు తెచ్చి  బర్రెలకెస్తే, తిని ఆ కృతజ్ఞతతో అవిచ్చిన పాలమ్మగా వచ్చిన డబ్బులే అవి. అందుకే అవంటే మా అమ్మకు అంత ప్రేమ" అని నేనంటే గుండెలకత్తుకున్న నేస్తమతను.

నా రూమ్మేట్ గురించి చెబుతూ " ఏమప్పా! మీ వోడు ఆ అమ్మాయి కొరకు మా గ్రూపొదిలి (సిఈసి) మీ గ్రూపు(బైపీసీ)కొచ్చా. సదువంతా సంకనాకిచ్చా. సదువలేక ఇంటికొచ్చా. ఈడ ఉన్నన్ని రోజులు ఆ అమ్మాయి చుట్టూ తిరగవట్టే. ఆ అమ్మాయేమో నీ దిక్కు సూడవట్టే. నీవేమో పట్టిచ్చుకోవు. ఇకనైనా సూత్తావా లేదా?!" అంటూ సరదాగా సతాయించేటోడు.  ఆ సంగతి అవునో! కాదో! నాకు తెలియదు కాని. అతనా ప్రస్తావన తెచ్చినప్పుడల్లా నాకు కూసింత గర్వంగా ఉండేది. పర్వాలేదులే అమ్మాయిల్లో నాక్కూడా అభిమానులు ఉన్నారని ఆనందమేసేది. 

రెండవ సంవత్సరం చివర్లో కాలేజీ డే కొరకు సుంకన్న వాళ్ళ రూంలో రిహార్సల్స్ జరుగుతున్నవి. సుంకన్న నన్నూ రమ్మనేవాడు. ఆ ఊరి పోలీస్ కానిస్టేబుల్ ఒకాయన ఓ జానపద నృత్యాన్ని నేర్పేందుకు నిశ్చయించుకున్నాడు.
చాలా మందిని పరిశీలించాకా సిఈసి వెంకట్ ను ఎంపిక చేసుకొని ఏడెనిమిది రోజులు శిక్షణ ఇచ్చాడు. కాలేజీ డేకు రెండు రోజుల ముందు వెంకట్ అనుకోని కారణాలచే తప్పుకోవాల్సి వచ్చింది. తన శ్రమ అంతా వృథా అయ్యిందని కానిస్టేబుల్ బాధపడుతుంటే, సుంకన్న అతని ముందుకు నన్ను తోశాడు. "చేయగలడా?" అని అతనంటే... రోజూ చూస్తున్నాడన్నాడు. నేను అదేమాటంటే "అహే చేస్తవుపో!" అన్నాడు. ఎట్లా చేశానో! ఏమి చేశానో! తెలియదు గాని, కాలేజీ డే రోజు స్టేజి మీద 'కోడిపాయే లచ్చమ్మది, కోడిపుంజు పాయే లచ్చమ్మది' అంటూ ఎగిరి చిందులేశాను. అట్లా నన్ను రంగస్థలానికి పరిచయం చేసిన గురువు సుంకన్న.

పరీక్షలు దగ్గర పడుతున్నప్పుడు ఉన్న రూములు డిస్ట్రబ్ చేస్తున్నవని వాటిని అలాగే వదిలేసి న్యూప్లాట్స్ లో తెలిసిన వాళ్ళ రూం ఖాళీగా ఉందంటే, అక్కడే ఉండి చదువుకున్నాం. 
అట్లా ఇంటరంతా సుంకన్న ఒక ఎడతెగని జ్ఞాపకమే.

ఇంటర్ ముగిశాకా దారులు వేరయ్యాయి. దూరం పెరిగిపోయింది. తానో చోట. నేనో చోట. అదృష్టం కలిసి అప్పుడప్పుడు ఊర్లోనో! కర్నూలులోనో కలిసేవాళ్ళం. 
ఊరికి ఎప్పుడు వెళ్ళినా, ఊరిబయట ఊరికి స్వాగత ద్వారంలా ఉండే వాళ్ళింటి వైపు కళ్ళు దృష్టి సారించేవి.
తరుచూ నిరాశే ఎదురయ్యేది. కాలగమనంలో
27 ఏండ్లు గడిచిపోయాయి.

పోయిన ఏడాది ఇంటర్ మిత్రులు వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేశారు. ఆ గ్రూపులో నిన్న కలిసిన ఎల్లయ్యనే సుంకన్న ఫోన్ నెంబర్ చేర్చాడు. సేవ్ చేసి పెట్టుకున్నాను. మాట్లాడుదాం, మాట్లాడుదాం అంటూ వాయిదా వేస్తూ వచ్చాను. ఎల్లయ్యను కలిసి ఇంటికి వచ్చి భోజనం ముందు కూర్చున్నాను. అయిపోయేదాకా కూడా ఆగలేకపోయాను. ఫోనందుకుని సుంకన్నకు చేశాను. ఫోనెత్తగానే-
"సుంకన్నా! నేను జయన్న" అంటూ  ఆత్రంగా పరిచయం చేసుకున్నా.
"ఎవరు?” అవతలి నుంచి. సుంకన్న స్వరం వినపడకపోయే సరికి ఏదో అనుమానం.
"అమ్మా! నేను సుంకన్న దోస్తును"  
"ఎక్కడ దోస్తు?" మళ్ళీ ప్రశ్న.
"ఇంటర్ - అలంపూర్ లో అమ్మా"
"ఇంకేడ సుంకన్న నాయినా! మార్చిలోనే మాకు దూరమయినాడు. హార్ట్ఎటాక్ వచ్చి పోయాడు"
ఆ స్వరంలో స్పష్టత పోయింది. దుఃఖం నిండిపోయింది. తర్వాత మూగపోయింది. ఫోన్ కట్టైంది.
నాకిక ముద్ద దిగలేదు. గుండె బరువైంది. కంచంలో అసంకల్పితంగా టపటపా కన్నీటి బొట్లు రాలిపడ్డాయి. రాత్రంతా అతని జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. 
తనువులో ఊపిరున్నంత కాలం అవి అలాగే ఉండిపోతాయి.

- ఎన్. జయన్న


25, మే 2019, శనివారం

నేను ఓటరును


నేను...
కవిని
రచయితను
మేధావిని
వృత్తి నిపుణడను
సంఘ సంస్కర్తను
తత్వవేత్తను
వాన్ని
వీన్ని
వానమ్మ మొగుడిని
కాని,
నా ఓటు నా కులానికే
నా ఓటు నా మతానికే
అక్కడ వేరే మతం పార్టీ గెలిచిందని
పొర్లి పొర్లి దొర్లాడి ఏడుస్తా!
ఇక్కడ నా మతం పార్టీ గెలిచిందని
ఎగిరెగిరి సంకలు గుద్దుకుంటా!
ఎవడు దొరైతే నాకేంటి?
ఎవడు దొంగైతే నాకేంటి?
ఎవడు నీతి దప్పిన కొడుకైతే నాకేంటి?
ఎవడు నిజాయితీ పరుడైతే నాకేంటి?
నాక్కావలసిందంతా నా కులమోడు గెలవడమే!
నాక్కావలసిందంతా నా మతమోడు గెలవడమే!!
వాడు పచ్చని పొలాల మీద సెజ్జుల గద్దై వాలనీ
కనబడిన ఖాళీ భూమినంతా వామనుడై ఆక్రమించనీ
సంవత్సరానికో ఎనిమిది వేలు నా బ్యాంకు అకౌంట్లో పడతితే చాలదూ!
వాడు లక్షలకోట్లు మింగనీ,
బ్యాంకులకు పంగనామం పెట్టనీ
భృతి అనో, ఫించన్ అనో
నెలకో పచ్చ నోటు నా మొఖాన కొడితే చాలదూ!
వాడు రేపిస్టో! ఫ్యాక్షనిస్టో
పాపిస్టో, పనికిమాలిన పెసరట్టో
ఎవడైతే నాకేంటి?
నాకేంటన్నదే నాకు ముఖ్యం
కాలం మారినా, నేను మారను
నేను దరిద్రుడిని
నేను మూర్ఖుడిని
నేను ఓటరును

ఎన్. జయన్న
25.05.2019

11, మే 2019, శనివారం

ఎప్పుడు_ మాత్రం...ఎప్పుడు_ మాత్రం...

నడక మొదలైనప్పుడు శిఖరం వైపు
ఒక చెయ్యి కూడా మన వీపు మీద ఉండదు

శిఖరానికి చేరే క్రమంలో
ముళ్ళు, రాళ్ళు తొక్కి కందిన పాదానికి
ఏ హస్తమూ లేపనం రాయదు.

శిఖరం మీద ఉన్నంత కాలం
తలెత్తి ఒక నేత్రమన్న అసూయ నొదిలి
మన విజయాన్ని హర్షించదు

పడినా,
ఎవడైనా దొబ్బినా
శిఖరం మీద నుండి లోయలోకి
ఇక అంతే...

మనతో రాలేక
ఒక్క అడుగన్న వేయలేక
అక్కడే ఆగిపోయిన కాళ్ళు
తొక్కడానికి సిద్దంగా ఉంటాయి.
చూపడానికి వేళ్ళు వెర్రెత్తి పోతుంటాయి.

#నాయుడు_గారి_జయన్న

28, ఏప్రిల్ 2019, ఆదివారం

డా. ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్

డా. ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్  జోగులాంబ గద్వాల జిల్లా కి చెందిన  సంస్కృతాంధ్ర కవి, రచయిత. ఈ జిల్లాలోని ఉండవెల్లి మండలంలోని కంచుపాడు వీరి స్వగ్రామం. 1948 ఫిబ్రవరి 9 వ తేదిన జన్మించారు. ఫాతీమాబీబీ, హసన్ వీరి తల్లిదండ్రులు.  మహమ్మద్ హుసేన్ 1971లో తెలుగు భాషోపాధ్యాయులుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, 2001లో తెలుగు భాషోపన్యాసకులుగా  ఉద్యోగ విరమణ చేశారు. 'వేనరాజు - సమకాలీన సాంస్కృతికోద్యమాల ప్రభావం' అను అంశంపై ఎం.ఫిల్., 'అలంపూరు సీమ - సంస్కృతాంధ్ర సాహిత్యం' పై పి.హెచ్.డి., చేశారు.

రచనలు

1. అలంపురి జోగులాంబికా నక్షత్రమాల                               
2. కోయిల శతకం.
3. దేవదత్తం (పద్య సంపుటి)
4. హుసేన్ గీతములు
5. నేను - చుట్టూ (వచన కవితా సంపుటి)
6. విష్ణ్వష్టకం (సంస్కృతం)
7. విఘ్నేశ్వర స్తోత్రావళీ (సంస్కృతం)
8. చైతన్య ప్రవాహం (గేయ సంపుటి)
9. సర్కారు ఆసుపత్రి (నాటిక)
10. బతుకు బాగుచేసుకుంటా (నాటిక)
11. లోక సుఖం (నాటిక)
12. రైతులేని రాజ్యం (నాటిక)


--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల

1, జనవరి 2019, మంగళవారం

కలే!కడదామనుకున్నా
కలలోనైనా గాలి మేడలు.
కనిపిస్తే కదా!
కంటికి కునుకు జాడలు!