29, నవంబర్ 2015, ఆదివారం

ఒక కాలువ కథ - కన్నీటి వ్యథ


      ఇటిక్యాలపాడు దగ్గర  కాలువ    

  ఇది 44 వ జాతీయ రహదారిపై ఉన్న ఓ ప్రాజెక్టుకు 
సంబంధించిన ప్రధాన కాలువ. ఈ కాలువకు ఉత్తరాన, దక్షిణ భారతదేశంలో రెండవ అతి పెద్ద నది అయిన కృష్ణానది 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంచుమించు అంతే దూరంలో దక్షిణాన  తుంగభద్రానది ప్రవహిస్తుంది.  ఈ ప్రాంతపు అవధి ఉన్నంత మేర రెందు నదులను చుట్టుకొని, నడుముకు జూరాల                                                                                                 
  వడ్డాణం పెట్టుకొని ఈ కాలువ నిర్జీవంగా పడి ఉంది. కంపలతో నిండి ఉంది. 

        ఈ కాలువ ఇప్పుడే కాదు, సరాసరి రెండు దశాబ్దాల సంది ఇలాగే పడి ఉంది. ఇక్కడ ఇదొక్కటే కాదు.  ఈ కాలువ మొదలుకొని, మీరు నిత్యం దర్శించుకోవడానికి వచ్చే అలంపూరు జోగులాంబాదేవి గుడివరకు ఇలాంటివి లెక్కలేనన్ని నిర్జీవమైన కాలువలు మీకు దర్శనమిస్తాయి.
                                                                                                                                                                                ఉండవెల్లి దగ్గర కాలువ

  బతుకంతా ఈ కాలువలది ఇదే పరిస్థితిలా  ఉందే! అని నిర్ఘాంతపడిపోకండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నీళ్ళకై నోళ్ళు తెరిచిన నల్లరేగడి బీళ్ళను, ఒకనాడు మడులుగా చేసి నిండా నీటితో నింపి ముద్దాడిన కాలువలివి. నాటొడ్లతో పచ్చని పైరు చీరలతో కలకలలాడే భూములను చూసి మురిసిన కాలువలివి. గజఈతగాళ్ళమని ఇప్పుడు మీసాలు మెలేసే నడివయసు వాళ్ళకు బాల్యంలో ఈత నేర్పిన కాలువలివి. నీళ్ళ అమ్మకం గురించి, ట్యాంకులు , కొలాయిలు మొదలగు మాటలు పల్లెళ్ళో విని, వినబడని రోజుల్లో ఇక్కడి పల్లెలకు కడుపు నిండా నీటిని తాపిన కాలువలివి. 140 కిలోమీటర్ల దూరం ప్రవహించి, లక్ష ఎకరాలకు నీరందించిన కాలువలు.  అప్పటి కాలువలను చూస్తేనే కడుపు నిండేది. అట్లాంటి కాలువను ఇప్పుడిలా చూస్తూంటే కడుపు మండిపోతుంది. ఈ దారి వెంట వెళ్ళిన ప్రతిసారి జాలితో ఈ కాలువలు, నిస్సహయతతో నేను చూసుకుంటాం. మౌనంగా మాట్లాడుకుంటాం. ఒకరి బాధలనొకరం వెల్లబోసుకుంటాం. ఈ కాలువలను చూసినప్పుడల్లా, ఎంకన్న పెద్ద వాగు పాట, విశ్వం పెన్నేటి పాట గుర్తుకొస్తూనే ఉంటాయి. ఈ కాలువలకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణమేమిటి?     

                  భైరాపూర్ దగ్గర కాలువ

            నిజాం రాష్ట్రంలో అప్పటి రాయచూరు జిల్లా అవసరాలను దృష్టిలో ఉంచుకొని తుంగభద్రపై రాజోలిబండ దగ్గర  ఈ కాలువల తల్లి  ప్రాజెక్ట్ గా  పురుడోసుకుంది. తరువాత స్వాతంత్ర్యం సిద్దించటం, నిజాంపాలనా విముక్తి, భాషా ప్రతిపాదికన విశాలంధ్ర అవతరణ ఇవీ పరిణామాలు. రాయచూరు జిల్లాతో  గద్వాల, అలంపూరు తాలుకాలకు సంబంధాలు తెగిపోవడం కర్ణాటకకు ఈ ప్రాంతాలపై శీతకన్నుకు బీజావాపనం తొడిగింది.                                                                                                                         ఇమాంపూర్ దగ్గర కాలువ
      కాలక్రమంలో ఈ ప్రాంతంలో సాగు, తాగు నీటి అవసరాల కొరకు కృష్ణానదిపై జూరాల ప్రాజెక్టు రూపుదిద్దుకొంది. ఈ కాలువలపై గుదిబండ పడింది. చిత్రంగా ఉంది కదూ! నిజమే. క్రమంగా విశాలాంధ్రలో, తుంగబధ్రకు ఆవల, దక్షిణాన ఉన్న వారి పెత్తనం పెరగడం, దేన్నో చూసి ముంతొలక బోసుకున్నట్లు, జూరాలను చూసి, ఈ ప్రాజెక్టుపై ఇక్కడి నాయకులకు క్రమంగా ఉదాసీనత పెరగడం, కర్ణాటక పట్టనితనం ఇక్కడి ప్రాంత ప్రజలకు, కాలువలకు, పొలాలకు శాపంగా పరిణమించింది. కర్ణాటకలో అక్కడి రైతులు తోడేసుకోవలసినవన్ని తోడేసుకున్నాకా, అక్కడి నేలలో మరమ్మత్తులకు నోచుకోని 40 కిలోమీటర్ల పరిధిలో కాలువలను దాటి, తెలుగు ప్రాంతంలో 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి రావలసిన నీరు రానే లేదు. జూరాలా ఆయుకట్టు కిందకైనా ఈ ప్రాంతం చేరనే లేదు. ఇది ఒక విషాదం.         
     అలంపూర్ దగ్గర కాలువ
      ఈ జిల్లాలోని భీమా ప్రాజెక్టు, సరళా సాగర్, కోయిల్ సాగర్, నెట్టెంపాడ్, రంగసముద్రం, రామన్‌పాడ్ వంటి చిన్నచితకా సాగు, తాగు నీటి ప్రాజెక్టులెన్నిటికో ఊపిరిలూదటమే కాకా, పక్కనున్న రంగారెడ్డి,నల్గొండ జిల్లాలనే కాకా, అనంత దూరంలో ఉన్న పాకాల దాకైనా పారే సామర్థ్యమున్న జూరాలకు, గద్దెల మీది నాయకులకు, ప్రాజెక్టు ప్రణాళికలు రచించే ఏసీ గది మేధావులకు..  పక్కన అత్యంత సమీపంలో నిర్జీవంగా, నిస్తేజంగా ఉన్న ఈ కాలువలు,కాలువలకై నోరు తెరిచిన బీళ్ళు, బీళ్ళ మీద ఆధారపడిన బతుకులు కనిపించకపోవడం మరో విషాదం.  

ఇన్నాళ్ళ అంతర్మధనం, అనంత శోష, అఖండ గోష ఇప్పటికైనా చూపించటానికి, వినిపించటానికి కారణం లేకపోలేదు..ఇటీవలే వీటిని మళ్ళీ ఓ సారి చూసి వచ్చి రెండు రోజులన్న గడవకముందే ఓ సంఘటన జరిగింది. .ఈ కాలువల మీద ఆధారపడిన ఓ బతుకు ఊపిరితీసుకోవడానికి ప్రయత్నించి, విఫలమై, చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతుంది. ఇది ప్రారంభమూ కాదూ, ఇదే ఆఖరూ కాకపోవచ్చు కూడా. అందుకే ఇప్పటికైనా నేతలు కళ్ళు తెరువాల్సిన సమయం ఆసన్నమైంది. లేకపోతే ఇక్కడి ప్రజలే తెరుస్తారు-మూడో నేత్రం. ఇక దానికెవ్వడైనా మాడి మసవ్వల్సిందే.    


                                                               బూడ్దిపాడు క్యాంపు దుస్థితి  


                                                                                                       
                                                                            ---నాయుడుగారి జయన్న     
  

6, నవంబర్ 2015, శుక్రవారం

అసహనం

అసహనం! అసహనం!
అసహనం! అసహనం!!

వాణ్ణి చూస్తే వీడికి
వీణ్ణి చూస్తే వాడికి
వీళ్ళను చూస్తే నాకు
నన్ను చూస్తే మీకు
అసహనం! అసహనం!
అసహనం! అసహనం!!

మన కులం
మన మతం
మన ప్రాంతం
మన భాష
మన పార్టీ
మన రంగు
కాకుంటే అసహనం!
కాదంటే దహనం!!

మన మాట కాదంటే
మన బాట రానంటే
అంతులేని అసహనం!
అదుపులేని అసహనం!
అర్థం లేని అసహనం!

నాలో అసహనం
నీలో అసహనం
అందరిలో అసహనం


అసహనం! అసహనం!
అసహనం! అసహనం!!


 అందని కందిపప్పు
తీరని రైతు అప్పు
అన్నార్తుల ఆకలి కేకలు
అభాగ్యుల దరిద్రపు గీతలు
ఎండుతున్న పైరులు
రాలుతున్న రైతులు
నిరుద్యోగుల నిస్పృహలు
అబలలపై ఘోరాలు
నేతల నేరాలు
మూలుగుతున్న నల్లధనం
ముసుగేసిన వైనం
కనపడవా?
వినపడవా?

ఎందుకింత అసహనం?
ఎవరి మీద అసహనం?

తూ తూ అసహనం
చీ చీ అసహనం
పో పో అసహనం
అగుపడకు అసహనం