1, మే 2015, శుక్రవారం

నా యాత్రానుభవాలు-7 , శ్రావణబెళగొళ

                                                                                               14.10.2013
                                                                                             
హాలేబీడులో మధ్యాహ్నం భోజనం చేసి నేను, నా మిత్రుడు బషీర్ శ్రావణబెళగొళ వైపు బయలుదేరాం. ముందుగా హాలేబీడు నుండి హాసన్,  హాసన్ నుండి బెలగొళ స్టేజికి  వచ్చాం. అక్కడి నుండి (48 వ జాతియ రహదారి నుండి) ఓ  చిన్న ఆటోలో శ్రావణబెళగొళ బయలుదేరాం. దారి పొడువునా ఎటూ చూసినా కొబ్బరి చెట్లే కనిపించాయి. అక్కడక్కడా చెరువులు  ఆ ప్రాంతమంతా బహు సుందరంగా కనిపించింది.  ఓ అరగంట ప్రయాణం తర్వాత శ్రావనబెళగొళ చేరుకున్నాం. సుమారు సాయంత్రం నాలుగు గంటల సమయంలో బెళగొళకు వచ్చాం.

         శ్రావణబెళగొళ కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాలోని చెన్నగరాయపట్టణానికి సమీపంలోని పట్టణం. ఇది బెంగుళూరుకు 158 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జైనులకు ప్రీతిపాత్రమైన బాహుబలి (గోమఠేశ్వరుడి) అతి ఎత్తైన విగ్రహం ఇక్కడ ఉంది. ఇక్కడ 2000 ఏళ్ళ సంవత్సరాలకు పూర్వమే జైన మతం ఉండినట్లు తెలుస్తుంది.  పశ్చిమ గంగ సామ్రాజ్యపు శిల్ప,వాస్తు కళా నైపుణ్యానికి ఇది ఆలవాలం. మౌర్య రాజు చంద్ర గుప్త మౌర్యుడు యుద్ధ జీవితంతో విసిగి ఇక్కడికి వచ్చి ధ్యానంతో మనశ్శాంతిని పొందినట్లు తెలుస్తుంది. దక్షిణ కాశిగాను ఈ పట్టణాన్ని వ్యవహారిస్తారు. రాజస్థాన్‌లోని అబూ పర్వతం, ఒడిశాలోని ఉదయగిరి గుహలతో పాటు జైనులు శ్రావణబెళగొళను పరమ పవిత్ర స్థలంగా భావిస్తారు.

          ఈ పట్టణానికి  ఇరువైపుల చంద్రగిరి, వింధ్యగిరి అను రెండు కొండలు ఉన్నాయి. ఇక్కడ ఆచార్య బద్రబాహు మరియు అతని శిష్యుడు చంద్రగుప్త మౌర్యుడు తపస్సు ఆచరించినట్లు తెలుస్తుంది. క్రీస్తుపూర్వం 3 వ శతాబ్ధిలో అశోకడు ఇక్కడ చంద్రగుప్తుని పేరుతో మఠాన్ని ఏర్పాటు చేశాడు.  చంద్రగిరిపై గొప్ప ఆలయం ఉంది. దీనిని గంగ రాజు రాజమల్ల మంత్రి, మరియు నేమిచంద్రుని శిష్యుడిగా చెప్పబడె చాముండిరాయ నిర్మించాడు.  రెండు కొండల మధ్యలో ఓ పెద్ద కొలను ఉంది. చాలా సుందరంగా కనిపిస్తుంది.  దీనికి శ్వేతకొలను లేదా దవళ సరోవరం అని పేరు. ఈ శ్వేతకొలనుకు కన్నడంలో బెళగొళ అని పేరు.  శ్రవణుడి(గోమఠేశ్వరుడి) బెళగొళ కాబట్టి శ్రావణబెళగొళగా ఈ ప్రాంతానికి పేరు స్థిరపడిపోయింది. ఈ కొలనుకు శ్వేత కొలను  అని పేరు రావడానికి వెనుక ఓ జానపద ఐతిహ్యం ఉంది.
వింధ్యగిరిపై రాజమల్ల మంత్రి చాముండిరాయ ఎన్నో ప్రయాసలు పడి గోమఠేశ్వరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయించాడు. ఈ విగ్రహానికి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహామస్తకాభిషేకం జరిగేలా ఏర్పాటుచేశాడు. తొలినాళ్ళలో అభిషేకోత్సవం జరిపించాలని చాముండిరాయ నిర్ణయించాడు. గొప్ప విగ్రహాన్ని ఏర్పాటు చేయించిన తనకు తప్ప వేరే ఎవరికి ఆ అభిషేకోత్సవంలో పాల్గొనే అవకాశం లేదని ప్రకటించాడు. బాహుబలి అభిషేకానికి అన్ని ద్రవ్యాలు తెప్పించాడు చాముండిరాయ. అభిషేకోత్సవం మొదలైంది. చాముండి తెప్పించిన అన్ని ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అన్నీ ఐపోయాయి. కాని అభిషేక ద్రవ్యాలు బాహుబలి పాదాలకు కూడా చేరలేదు.  చాముండిరాయకు యేమిచేయాలో పాలుపోలేదు. చివరికి ఒక అజ్జి(ముసలవ్వ) గుల్లెకాయ(కొబ్బరికాయ)లో కొన్ని పాలు తీసుకొని వచ్చిందట. తనకు అభిషేకానికి అనుమతి ఇవ్వమని కోరిందట. భటులు ముందు అంగీకరించకపోయినా, చాముండిరాయ ఆజ్ఞతో అనుమతించారట. అవ్వ ఆ చిన్న కొబ్బరి చిప్పలోని పాలను బాహుబలి మస్తకంపై పోయగా, ఆ కొద్ది పాలే ఆశ్చర్యంగా  బాహుబలి శిరస్సు నుండి పాదాలకు చేరి మొత్తం తడిపివేశాయట. అంతటితో ఆగకుండా ఆ విగ్రహం నుండి పాలు కొండ మీదికి, ఆ వింధ్యగిరి మీద నుండి కిందికి ధారాపాతగా ప్రవహించాయట. అలా పారిన ఆ పాలతో ఏర్పడినదే ఈ సరస్సు అని, అందుకే ఇది తెల్లగా ఉన్నదని, దానికి శ్వేతకొలను లేదా దవళసరోవరమని పేరొచ్చిందని చెబుతారు.  చాముండిరాయ అవ్వ మహాత్యానికి  అబ్బురపడి, క్షమించమని కోరాడట. ఆ అవ్వ ఎవరో కాదని జైన జాతి రక్షక దేవత అని, భగవంతుడి సేవాభాగ్యాన్ని అందరికి కలిపించాలని చాటి చెప్పి, చాముండిరాయ కళ్ళు తెర్పించడానికి వచ్చిందని జైనులు విశ్వసిస్తారు. ఆ అవ్వకు ఒక ఆలయాన్ని నిర్మిచారు. ఆ ఆలయాన్ని గుల్లెకాయ అజ్జి ఆలయంగా పిలుస్తారు.

     అప్పటికే సాయంత్రం కావడం వలన వేగంగా వింధ్యగిరి వైపు అడుగులు వేశాం. కొండ మీదికి పోవడానికి సహజమైన మెట్లు ఉన్నాయి. కొండ బండలనే మలిచి ఏర్పాటు చేశారు. రెండు వరుసలలో, రెండు రకాలుగా మెట్లు మలిచారు. రెండు వరుసలను కూడా ఎక్కి దిగటానికి ఉపయోగిస్తారు. మెట్లు ఎక్కి, దిగలేని వారి కొరకు ఏటవాలుగా తయరు చేసినది రెండో వరుస ఏర్పాటన్న మాట. కొండ మీద గుళ్ళు, విగ్రహాలు, మరి ముఖ్యంగా గోమఠేశ్వరుడి విగ్రహం చూపరులను కట్టి పడేస్తాయి.   ఈ గోమఠేశ్వర విగ్రహాన్ని చాముండిరాయ ప్రతిష్టించాడు.  ఈ 58 అడుగుల ఎత్తైన , ఆకర్షణీయమైన గోమఠేశ్వరుడి ఏకశిలా విగ్రహం,  ప్రపంచంలో అతి పొడవైన ఏకశిలా విగ్రహంగా గుర్తింపు తెచ్చుకుంది. భారతదేశపు ఏడు అద్భుతాల జాబితా కొరకు టైంస్ ఆఫ్ ఇండియా (ఆంగ్ల దినపత్రిక)2007 ఆగస్ట్‌ లో ఒక సర్వేను నిర్వహించింది. అందులో 49 శాతం మంది గోమఠేశ్వర విగ్రహానికి తమ మద్ధతు తెలిపి మొదటి స్థానాన్ని కట్టబెట్టారు. ఈ విగ్రహాన్ని కన్నడ ప్రజలు గోమఠేశ్వరుడిగా పిలుస్తే, జైనులు బాహుబలిగా కొలుస్తారు. ఈ గోమఠేశ్వరుడికి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహామస్తకాభిషేక ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ సందర్భంగా పాలు, పెరుగు, నెయ్యి, కుంకుమపూలు, బంగారు నాణేలతో అభిషేకం చేస్తారట. ఈ ఉత్సవానికి దేశ నలుమూలల నుండి వేలకొలది జైనులు తరిలివస్తారట.  మళ్ళీ 2018లో మహామస్తకాభిషేకం జరుగుతుంది.


  ఈ విగ్రహం యొక్క పీఠంపై కన్నడ, ప్రాచీన కొంకణి, సంస్కృత సమ్మిళితమైన లిపిలో ఒక శాసనం ఉంది. ఈ శాసనం క్రీ.శ.981 నాటిదిగా చెప్పబడింది.  ఈ శాసనంతో పాటు ఈ వింధ్యగిరిపై, చంద్రగిరిపై, పట్టణంలోనూ దాదాపు 800కు పైగా శాసనాలు ఉండినట్లు తెలిసింది.  ఇవన్నీ క్రీ.శ.600 నుండి 1830 మధ్య వివిధ కాలాలకు చెందినవిగా గుర్తించారు. . వీటిలో అధిక భాగం  చంద్రగిరి పర్వతం మీద లభించాయట.  చంద్రగిరిపై లభించినవన్నీ  కూడా క్రీ.శ. 10 వ శతాబ్ధికి ముందు కాలానివని తెలిసింది.  వీటిలో ఎక్కువ భాగం ప్రాచీన కన్నడలో ఉండగా, మిగిలిన శాసనాలు  కొంకిణి, మరాఠి, తమిళ, సంస్కృత, మహజనీ భాషల్లో ఉన్నాయట.  వీటిలో చాలా శాసనాలు పశ్చిమ గంగ, రాష్ట్ర కూట, హొయసల, విజయనగర, ఒడయార్ సామ్రాజ్యాల ఉత్థానపతనాలకు సూచికలని తెలిసింది.  కొండ పై నుండి ఎటు చూసినా చుట్టుతా కొబ్బరి తోటలే. కేరల సౌందర్యాన్ని గుర్తు చేస్తుంది. ఆ సౌందర్యాన్ని మనసార ఆస్వాదిందించి, తిరుగు ప్రయణమయ్యాం. వింధ్యగిరి మీదునుండి తిరిగి వచ్చేటప్పటికే చీకటి పడటంతో చంద్రగిరి మీదుకు వెళ్ళలేక పోయాం. అక్కడి ఆలయాన్ని చూసే భాగ్యం కలుగలేదన్న విచారంతో తిరుగు ప్రయాణమయ్యం.

          వచ్చిన దారిలోనే జాతీయ రహదారి మీదుకొచ్చి, హాసన్‌ చేరుకొన్నాం.  ఆ రాత్రి హాసన్‌లో భొజనాలు కానిచ్చి బస్టాండ్‌కు వచ్చాం. ధర్మస్థల్‌కు వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. బస్ బయలుదేరి వెళ్ళే సమయం చాల ఉండటంతో పొద్దు పుచ్చటానికి, తెలుగు సినిమాను వెతుక్కుంటూ వెళ్ళాం. తెలుగుదేశంలో కన్నడ సినిమాలు కరువు కానీ, కన్నడదేశంలో తెలుగు సినిమాలకు కరువులేదు. మేం తిరిగిన చాలా వరకు కన్నడ దేశంలో ప్రతి పెద్ద పట్టణంలోనూ ఏదో మూలన, ఏదో ఒకటి తెలుగు సినిమా ఆడుతూనే ఉంటుంది. ఇది తెలుగు వాళ్ళ విస్తరణను సూచిస్తుంది.  రాత్రి రెండో ఆట మన దగ్గరలా తొమ్మిది గంటలకు కాకుండా  ఎనిమిది గంటలకే ప్రారంభించారు. తొమ్మిది గంటలకని వెళ్ళిన మాకు సగం సినిమానే మిగిలింది. రామయ్య వస్తవయ్యా! చూశాం. థియేటర్‌లో కన్నడిగులు ఉండినప్పటికి ఎక్కువ భాగం తెలుగు వాళ్ళేనని వాళ్ళ అరుపులు, కేకలతో తెలుసుకున్నాం. అంతమంది తెలుగు వాళ్ళను ఓ కన్నడ ప్రాంతంలో చూసే సరికి చాలా ఆనందం కలిగింది. సినిమా చూసి బస్టాండ్‌కు వచ్చాకా, చాలా సేపు బస్ కొరకు ఎదురు చూశాం. మా ఎదురుచూపులకు వీడ్కోలు చెబుతూ గంట తర్వాత బస్ వచ్చింది. కండక్టర్ తో టికెట్ తీసుకొని ఎక్కి కూర్చున్నాం. బస్ బయలుదేరింది. రోజంతా తిరిగి అలసిపోవడంతో కాసేపటికే కళ్ళు మూతలు పడ్డాయి.