19, జనవరి 2018, శుక్రవారం

లే... నిద్ర లే!










"అర్రెర్రే ఎంకన్న బావా! ఎన్ని రోజులకు కన్పించినవ్. మా వీధి వైపే రావడం లేదేంటి? అంతా బాగానే కదా!"

" ఆఁ ఏం బాగలే బావా! కడుపుజించుకుంటే కాళ్ళ మీద పడుతది. ఎప్పుడూ ఏదో ఒక సమస్యా!"

"ఓర్నీ పాసుగూలా. ఎప్పుడు అట్టా దిగులు మొఖమేసుక కూర్చుంటే ఇట్టాగే ఉంటుంది మరి. అది సరే గానీ, ఇట్టా రా కాసేపు మాట్లాడుకుందాం "

"లేదు బావా! చాలా పనుంది. నేను బోవాలా"

"చాలా గొప్పోడివి మరి. ఈ దేశంలో పనిపాటా లేనోడు ఎవడటయ్యా. అడుక్కు తినేటోడికి....అబ్బే మధ్యలో వాళ్ళెందుకులే గానీ, మళ్ళీ వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయనుకో, మనకేవో దెబ్బ తింటయ్. ఎందుకొచ్చిన గొడవ గానీ, ఉంటయ్. ప్రతోడికి పనులుంటయ్. ఒకడు చేస్తడు. ఇంకోడు చేయడు అంతే. నీలా ఒకడు నాలా ఒకడు."

"సరే నీవొదలవు గానీ, సంగతేందో సెప్పు బావా! ఇంటి కాడ మీ సెల్లెలు ఎదురు జూస్తది.

" ఏమి లేదు బావా! రానున్న పండుగ గురించి మాట్లాడుదామని"

" ఏంది బావా యవ్వారం. నిన్న గాకా మొన్ననే గదా! పండుగ వోయింది. తిన్న కుడుములు, తునకలు కూడా అరిగినవో లేదో. మళ్ళప్పుడే రానున్న పండుగ గురించి ఎదురు సూపులా! "

"చూడెంకన్న బావా! నీకేమో ఉరుకులాటెక్కువ,ఆలోచన తక్కువ. ఏదీ ఒకపట్టాన అర్థం చేసుకోవు. ఈ పండుగలంటవా?! అమాస కొకటి పున్నానికొకటి ఉండనే ఉన్నవి. మరి అంత కాదనుకుంటే నెలకొకటన్న వొస్తవి. ఇవన్నీ, ఇగో ఇందాకా నీవన్నవు సూడు ఈ రోజు తింటే రేపరిగే పండుగలు బావా!"

"మరీ.."

"ఎంత తిన్న తరగని, అరగని పండుగ బావా!"

"గిదేంది బావా గిట్లనవడ్తివి. యాడ ఇనలా."

"అదే మరి నీకు చెప్పేది. నీవేమో వినకుండ ఉరుకులు తీస్తవాయే."

"నాన్చకుండ జెప్పు బావా ! జర పనుంది పోవాలా."

"అదే బావా అయిదేండ్ల కొకసారి వచ్చే పండుగ"

"ఓ ఎలచ్చన్లా?! గది పండుగెందుకైతది బావా? నీ మాటలు గానీ."

"ఓరీ పిచ్చి నా ఎంకి బావా! నీకు నాకు గాకపోవచ్చు గానీ, దోసుకునే టోడికి, దాసుకునే టోడికి గిదిగాక, ఇంకో పెద్ద పండుగ ఉందా?"

"ఇగో బావా! నీవు చేతిలో ఏదో దాచిపెడతవు. ముడ్డెనకల చేతులు దాపెడతవు. చెప్పుకో చెప్పుకో ఏమి దాచినానో అని ఎకసెక్కాలాడుతవు. నీవేమో రెండాకులు ఎక్కువ సదివినోడివైతివి. నాకేమో అర్థం గాదు."

"సరే చెబుతలే గానీ, ముందైతే గా ఛాయ్ నీళ్ళు తాగి కుదుటపడు."

"అబ్బ బావా! ఛాయ్ అంటే మాయక్క చేత సేసిన ఛాయ్ నే బావా! అమృతం లెక్క ఉంటదనుకో."

"మోస్తుంది కదా! అని గుర్రానికి దానపెడితే, పెట్టిన దాన తినుకుంట వచ్చిన దారిని మరిచిందట ఎనకటికో ఏడ్డి గుర్రం. అట్లా ఉంది బావా నీ యవ్వారం." 

"నేనేం జేస్తి బావా! తాగిన ఛాయ్ బాగుందని చెప్పటం తప్పా!"

"తప్పు కాదు గానీ. అంతకన్నా పెద్ద తప్పు చేస్తున్నం బావా"

"ఇగో బావా నీవు మోకాలికి బోడిగుండుకు లంకె వెట్టకు"

"లేదు బావా! నిజ్జంగా చాలా పెద్ద తప్పే చేస్తుండం ప్రతి ఐదేండ్లకో మారు. వాడు నెత్తిన టోపి పెట్టుకొని వస్తాడా! మన నెత్తిన టోపి పెట్టిపోతడు. వీధి వీధి ఏం కర్మ ఇల్లిల్లు తిరుగుతడు. కనపడిన ప్రతిపిల్లవాడిని సంకకెత్తుకుంటడు. ముక్కుల సీమిడుంటే తుడ్సిపెడతడు. అవసరమైతే ముడ్డైనా కడిగిపెడతడు. చీరనో, సారనో పంచిపెడతడు. వంగి వంగి దండాలు పెడతడు. ఓట్లేమో అడుక్కుంటడు. గద్దె మీద కూకుంటడు. ఇక అక్కడ్నుంచి మన కుంటంది చూడూ ఆట. వాడు ఒక్క రోజు బిచ్చగాడైతే, మనల్ని ఐదేండ్లు బిచ్చగాళ్ల ను చేస్తడు. మా వీధికి కరెంటు లేదు, నీళ్ళు రావు, రోడ్లు లేవు మొర్రో అంటూ మనం చేతులు కట్టుకొని, వంగి దండాలెట్టి మొరపెట్టుకుంటుంటే, వాడు తాపీగా సోఫా మీద కూకొని చెవిల పుల్లెట్టుకొనో, ..........ఏళ్ళెట్టుకొనో   గెలుక్కుంటూ, విని కూడా విననట్టు నటిస్తడు. తప్పెవడిది బావా! వాడిది కాదు మనదే. అమ్ముకున్నాం కదా! ఓటు. అడిగే హక్కు మనకెక్కడిది. అందుకే సెబుతున్నా ఈ సారీ అట్లా కాకూడదని, అట్లా జరగకూడదని.
      ఇగ వచ్చే ఏడాదంతా ఎలక్షన్లే. పంచాయతీలు,  ఎంపిటీసీలు, జెడ్పిటీసీలు, ఇట్లా ఒకటేమిటీ ....   ఒకదానెనుక ఒకటి. గల్లీ   నుంచి ఢిల్లీ దాకా షురూ.  
ఆఁ పంచాయతీలంటే గుర్తుకొస్తుంది. ఇప్పుడో కొత్త చట్టం రాబోతుంది. ఈ అధికారం ఉంది చూశావ్ బావా. అది చేతిలో ఉండటమంటే నెత్తికి గుబురుగా జుట్టుండటమేపో. ఎట్టైనా దువ్వొచ్చు. ఎట్టైనా కులుకొచ్చు. లేనోడిదేమో బోడిగుండు లెక్క పీక్కుందమంటే నాలుగెంటుకలన్న రావు. రాలవు.
క్యాంపు రాజకీయాలు, గెస్టౌసుల్లో తిష్టలు, మాటింటెనో, అమ్ముడు వోతెనో మందులు, విందులు, అవసరమనుకుంటే....ఆఁ ..అఁ. వినకుంటే కిడ్నాపులు. ఇవన్నీ ఎక్కడో మనకు దూరంగా జరిగేవి. ఏ సీ.ఎం. కుర్చీ కోసమో! ఏ జెడ్పీ కుర్చీ కోసమో. మన కెంత బాధుండేది. పేపర్లనో, టీవిల్లోనో వార్తలు చదువడం, చూడటమే తప్ప మన కళ్ళెదుట జరుగడం లేదని. ఇప్పుడు మనకా సరదా తీర్చడం కొరకే ఈ కొత్త చట్టం. ఇక అంతా వైభోగమే అనుకో.
ఈ కొత్త చట్టం వల్ల నాయకులకు ఎంత మేలనుకున్నవు బావా!. ఆఁ నాయకులకే, చట్టాలెప్పుడూ ప్రజల కొరకు రూపొందవు. నాయకుల కొరకే. కొత్త పంచాయతీ చట్టం వల్ల ఎంత మేలంటే నాయకులకు ఊరంతా తిరుగాల్సిన పని లేదు. ఊరంతా కొనాల్సిన పని అసలుకు లేదు. వార్డు కొకడిని కొనెస్తే సరి. ఇగ అన్ని వాడే చూసుకుంటడనుకో. గతంలో జనానికి ఊరికెవడు సరిపోతడో, వార్డు కెవడు సరిపోతడో సరి చూసుకుని ఓటేసే అధికారమూ, అవకాశమూ ఉండేది. ఇప్పుడదీ లేకుండా పోతుంది. నీ గేరి కాడికి నువ్వుజూసుకోవొయ్యి. మీగతాదంతా నే చూసుకుంటా అన్నట్టైపోతుంది యవ్వారం. ఇంకా ముందు ముందు ఎన్నెన్ని చిత్రాలు జూడాల్నో పో. సరే మాటల్లో పడి నీ పని సంగతే మర్చిపోయిన బావా! పదా పోదువు గానీ. ఏదీ ఈ మనిషి ఉలకడు. ఓర్నీ పాసుగూల నే చెప్పుకుంటూ వోతుంటే నీవు నిద్రపోయినావా! మనమిట్టా నిద్రపోవట్టే ....నాయకులట్టా ఆడవట్టిండ్రు. లే..నీ మనిషి గూలా నిద్రలే."

-నాయుడు గారి జయన్న

12, జనవరి 2018, శుక్రవారం

అక్షరాగ్నికణం అలిశెట్టి

ద్యమానికి పర్యాయ పదం తెలంగాణ. తెలంగాణ ఉద్యమాలకు ఊపిరి కరీంనగర్. కరీంనగర్‌కు జవం, జీవం జగిత్యాల. ఆ జగిత్యాలలో జన్మించిన అక్షరాల అగ్నికణమే అలిశెట్టి ప్రభాకర్.

తండ్రి చిన రాజం, తల్లి లక్ష్మి. అలిశెట్టి ఇదే రోజు(12.01.1954) భూమ్మీదకు వచ్చిపడ్డాడు. ఇదే రోజు జీవితం నుండి నిష్క్రిమించాడు. పుట్టిన రోజే మరణించడం. మరణించిన రోజే పుట్టిన రోజు కావడం యాదృచ్చికం. అందుకే ఆయనకు మరణం లేదు. ఆయన కవిత్వానికి అంతకన్నా లేదు.

ఏడుగురు అక్కాచెల్లెళ్ళు, ఇద్దరు అన్నాదమ్ములు వెరసి మొత్తం పది మంది సంతానం తండ్రికి. పది మందిలో ఒకడిగా జన్మించాడు. కాబట్టే పది మంది మేలు కోరే కవిత్వం రాశాడు.

అసలు అలిశెట్టి ఎవరు?
పెన్సిల్‌తో, సరదాగా చాలా బొమ్మలను గీశాడు.
కెమెరా కంటితో సామాజిక దృశ్యాలను తీశాడు.
పెన్నును గన్ను చేసుకొని అస్తవ్యస్థ సమాజంపై కవితాస్త్రాన్ని సంధించాడు.  ఆయనో చిత్రకారుడు. ఫోటోగ్రాఫర్, కవి. వెరసి ఆయనో బహుముఖ ప్రజ్ఞాశాలి. కుంచె, కెమెరా బతకడానికి పనికొచ్చాయి. మూడోది జీవింపజేసింది.     

కవిత్వ భాషలో చెప్పాలంటే చెరబండరాజు తన గురించి తాను చెప్పుకున్న కవితను కొంచెం సరిజేసి చెప్తే అలిశెట్టికి అచ్చంగా సరిపోతుంది.

ఆకలి అతని పేరు
కలం అతని ఆయుధం
అభ్యుదయం అతని ఊరు.  

11 ఏళ్ళకే తండ్రి మరణిస్తే, కుటుంబ పోషణ భారాన్ని తలకెత్తుకున్నాడు. ఆ క్రమంలోనే  తలకెత్తుకున్న భారాన్ని తగ్గించుకోవడానికి బుజానికి కెమెరాను తగిలించుకున్నడు.

ఆదర్శాలను నేను, నీవు అందంగా వల్లిస్తాం. ఆచరణలో కొందరే పాటిస్తారు. ఈ రెండో కోవకు చెందినవాడే అలిశెట్టి. అందుకే భాగ్యం కన్నా మహాభాగ్యం ఏముంటుందని పేదింటి పిల్లైనా భాగ్యాన్ని తన ఇంటికి ఇల్లాలుగా తీసుకొచ్చాడు.  ఎందుకంటే అందరికి డబ్బు విలువ తెలుసు.  అలిశెట్టికి డబ్బుకు విలువ లేదని తెలుసు.  ఆయనెప్పుడు డబ్బు వెంట వెంపర్లాడలేదు. డబ్బు సంపాదించే మార్గాలు మస్తుగున్న వాటన్నిటిని కాలదన్నాడు. కలాన్ని మాత్రమే అందుకున్నడు, నమ్ముకున్నడు. కాని అమ్ముకోలేదు.

మాటలతో మంట పుట్టించడం, అక్షరాలను అస్త్రాలుగా సంధించడం ఒక శ్రీశ్రీకి తెలుసు, చెరబండకు తెలుసు, అలిశెట్టికి కూడా తెలుసు. జీవితంలో కొరతగా ఉన్న డబ్బు నేర్పిందేమో!  తక్కువ తక్కువగా వాడుకొమ్మని. అదే సూత్రాన్ని కవిత్వానికి వర్తింపజేశాడు. మిని కవితను అతను అందుకున్నడో!, మిని కవితే అతనల్లుకున్నదో! తెలువదు గానీ, అమ్మాకొడుకుల్లా అల్లుకపోయారు. ఎంతగా అంటే అలిశెట్టికి మిని కవిత తప్ప మరోటి రాదని విమర్శించెంతగా. అది తప్పని చెప్పడానికి ఆయన చురకలంటించాడులే గాని అది వేరే విషయం.

మూడు, నాలుగు పాదాలతో అద్భుత కవిత్వాన్ని సృస్టించడం అలిశెట్టికి మాత్రమే సాధ్యమైంది.బహుశా అది ఆకలి నేర్పిన పాఠం కావొచ్చు.
నిలబడు
బలపడు
సంతకాలపై కాదు
సొంతకాళ్ళపై అన్న కవితా ప్రేరణ కావొచ్చు.

లేకపోతే...
"తనువు పుండై..వేరొకరికి పండై
తను శవమై...వేరొకరికి వశమై
తను ఎడారై...వేరొకరికి ఒయాస్సిసై "  అంటు వేశ్యల దయనీయ, దుర్భర జీవితాలకు చిత్రిక పట్టేవాడా?  ఈ కవితెంత కరుణా సముద్రమో!, సంచలనమో! ఎన్ని వేదికల మీద ఎన్ని వేల గొంతుకలు    ఉటంకించాయో వేరే చెప్పనక్కర్లేదనుకుంటా. ఆ విషయం కాలానికి తెలుసు, దాన్ని మోస్తున్న  సాహిత్యానికి తెలుసు. కవిత్వాన్ని కోట్‌లా చేసి అభ్యుదయ తెలుగు సమాజం అత్యధికంగా ఉపయోగించుకున్నది శ్రీశ్రీ తరువాత అలిశెట్టినే అంటే అతిశయోక్తి కాదు.

జన్మించిన జగిత్యాలలో ఎర్రపావురాలు ఎగురవేశాడు.  నిర్భందం వెంటాడితే కరీంనగర్ కొచ్చాడు ఆకలి జీవులకోసం మాట్లాడే మనిషి మౌనంగా ఉండగలడా? తన మాటలతో మంటల జెండాలు ఎగిరేశాడు. కరీంనగర్ కాదంటే హైదరాబద్ కొచ్చిపడ్డడు. ప్రాంతాలెన్ని మారినా, దోపిడి సమాజానికి చురకలు వేయడం మాత్రం మానలేదు. తన జీవితం రక్తరేఖ మీద నడుస్తున్నా...ఎన్నికల ఎండమావులు దాటుకుంటు , సంక్షోభ గీతాన్ని పాడుకుంటు సిటీ లైఫ్ అనుభవించాడు.
నగరం అర్థం కాని రసాయన శాల
చిక్కు వీడని పద్మ వ్యూహం అని అతనికి అనతి కాలంలోనే తెలిసిపోయింది. అయినా సిటీని  వదల లేదు. సిటీలో తిరుగడం మానలేదు. సిటీపై రాయడం మానలేదు.
కాచీగూడా అంటే 
కాచి వడబోసిన
 కమ్మని కాఫీయే కదా! అంటు కాచిగూడాకు కవితొకటి కానుగ ఇచ్చాడు.

ఇరుకిరుకుగా ఉండే రేకుల సెడ్‌లో జీవితాన్ని నెట్టుకొచ్చాడు. అయితేనేం...
అర్ధాంగి చేటలో కన్నీళ్ళు చెరుగుతున్నప్పుడు/
 సంసారం బరువును సమీక్షించగలిగాడు.

ఆయన దోపిడీ సమాజంపై సంధించిన కవితాస్త్రాలు అన్నీ, ఇన్నీ కాదు. ముఖ్యంగా రాజకీయాలను చీల్చి చెండాడు. ఒక పార్టీలో ఉంటునే మరో పార్టీ వైపు చూసే జంపు జిలానీలకు చురకలేశాడు.
"వాడు
 ముందే వానపాము
ముడ్డెటో? మూతెటో? " అంటూ వాతలు పెట్టాడు.

"ఓ నక్క ప్రమాణ స్వీకారం చేస్తుంది 
ఇంకెవరిని మోసం చేయనని
ఓ పులి పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తుంది
తోటి జంతువులను సంహరించనని
ఈ కట్టుకథ విన్న గొర్రెలు పుర్రెలు ఊపుతూనే ఉన్నాయి." అంటూ మోసగించే నేతలను, అమాయకత్వాన్ని వీడని జనాన్ని ఎద్దేవా చేస్తాదు.  దురదృస్టమేమిటంటే అదే కట్టుకథలను నేతలు నేటికీ చెబుతున్న గొర్రెలు ఇంకా పుర్రెలు ఊపుతూనే ఉండటం. ఇంత పరిణాం చెందినా ఇంకా పరివర్తన చెందకపోవడం.

"గుడిసెలు
మేడల్ని కడతాయి
మేడలే 
గుడిసెల్ని కొడతాయి" ఎన్ని తక్కువ మాటలు ఎంత గొప్ప మాటలు. ధనవంతుల అభివృద్ది సోపాన నేపథ్యాన్ని, దాని వెనుకే దాగున్న దోపిడీ వ్యవస్థను ఎంత అద్భుతంగా కళ్ళకు కట్టాడు.
"పాల రాతి బొమ్మైన
పార్లమెంట్ భవనమైన
వాడు చుడితేనే శ్రీకారం
వాడు కడితేనే ఆకారం" అంటూ శ్రమజీవి త్యాగాన్ని కీర్తిస్తాడు కవి.

ఇట్లా ఇది అది అని ఏమీ.. ఏదీ రాసినా పేదల కోసమే రాశాడు. వాళ్ళ కన్నీళ్ళు తుడువడానికే రాశాడు.
రాయనైతే రాశాడు కానీ రాసిన దానితో సంపాదించినదేమీ లేదు కీర్తి తప్ప. ఎందుకంటే ఆకలిని జయించాలన్న ఆరాటమే గానీ, ఆస్తులను కూడ బెట్టాలన్న ఆలోచన ఆయనకెప్పుడు లేదు. అందుకే ఆయన కవిత్వాన్నైతే జయించగలిగాడు గానీ వ్యక్తిగత జీవితాన్ని రోగానికి అప్పగించి ఓడిపోయాడు. అయితేనేం తెలుగు కవిత్వం ఉన్నంత కాలం అలిశెట్టి జీవించే ఉంటాడు. తెలుగు కవిత్వ యవనిక మీద అలిశెట్టి అభ్యుదయ పతాకై రెపరెపలాడుతూనే ఉంటాడు. ఆ స్ఫూర్తిని మనలో నింపుకొని సాగడమే మన ముందున్న కర్తవ్యం.

-నాయుడి గారి జయన్న