5, డిసెంబర్ 2023, మంగళవారం

కుర్చికై కుస్తీ

 దీనమైన స్థితిలో ఉంటే

దిక్కు కొకడు పోతిరి

గోడ మీద పిల్లులై

దూకనీక చూస్తిరి,

దూకి మళ్ళి వస్తిరి

ఒక్కడై పోరుతుంటే

ఓరకంట చూస్తిరి

విజయతిలకం దిద్దగానే

వీరులమంటు వస్తిరి

సిగ్గులేని బతుకు నొదిలి

బుద్దిగ మరి బతుకండ్రా!

లోకం దృష్టిలోన

లోకువ మరి కాకండ్రా!

కుర్చి కొరకు కొట్లాడి 

కుక్కలమని చెప్పకండి

చెమటోడ్చి నోడికే

కుర్చి నప్పగించండి

- ఎన్. జయన్న





4, డిసెంబర్ 2023, సోమవారం

కుక్క- తోక

 కుక్కకు కన్ను ముఖ్యమే

చెవులు ముఖ్యమే 

వీటన్నిటికన్నా 

గతకడానికి నోరు మరీ ముఖ్యమే

కాదనలేని సత్యమే

కానీ... 

వెనుకుందని తోక 

అవసరం లేదా?

అన్నిటిలాగే అది కూడా భాగమే కదా!

కుక్క సంతోషానికి,

ఒదిగి ఉండే విధానానికి,

చూపే ప్రేమకు,

నిస్సహాయతకు,

తోకే కదా సంకేతం.

కుక్క నడకకు, పరుగుకు

తోకే కదా సంతులనం

అసలు కుక్కకు అందమే తోక


తోకంటివి

ఆడించకూడదంటివి

బస్సు చక్రాల కింద నలిపేస్తివి

ఒక చోట పెరికి,

మరో చోట అతికిస్తివి

కదపకుండా దశాబ్దం కట్టేస్తివి

నీ పతనకారకుల్లో

తోకకూ భాగమిస్తివి.

తోక కడ వాలమే కాదు

కరవాలం కూడా.

-ఎన్. జయన్న