12, డిసెంబర్ 2015, శనివారం

మరుగున పడుతున్న మన ఆటలు - పులి జూదం

పులి జూదం అనునది విశేష ఆదరణ గల ఒక గ్రామీణ క్రీడ. ఇది చదరంగం వలె ఆడు ఆట. ఒకనాడు పల్లెల్లో మేధావి తనానికి నిరూపణగా ఆటను ఆడేవారు. గ్రామీణ ప్రాంతాలలో, విరామ సమయాలలో నేటికీ ఆటను ఆడటాన్ని చూడవచ్చు. గ్రామ కూడలిలో, రచ్చబండ దగ్గరో, మరో చెట్టుకిందో, దేవాలయపు కట్టల మీదో, ఇంటి అరుగుల మీదో, ఎక్కడో ఒక ఇద్దరు కూర్చోవడానికి వీలుగా ఉండే ప్రాంతంలోనైనా ఆట ఆడుతూ పల్లెల్లో జనాలు కనిపిస్తారు.
1:3 పులి జూదం
ఆట ఆడుటకు కావలసినవి...
1. పులి జూదం చిత్రం
2. నాలుగు గచ్చకాయలు.
3. పద్దెనిమిది చింత బిచ్చలు.
    పులి జూదం చిత్రం రెండు  అభిముఖ లంబకోణ త్రిభుజాల సమ్మేళనం. దీనిలో రెండు దీర్ఘచతురస్రాలు అడ్డంగా అమరి ఉంటాయి(విశేష ఆదరణ పొందిన 3 వ రకం ఆట గురించి...)  పులి జూదం చిత్రాన్ని కొందరు లావుపాటి అట్ట మీద గీసుకొని ఆడుతారు. ఎక్కువమంది పరిచిన బండలపై పులి జూదం చిత్రాన్ని గీసి, ఆడుతారు. గచ్చకాయలకు, చింత బిచ్చలు(చింతపిచ్చలు) బదులుగా వాటి పరిమాణంలోని రాళ్ళతో కూడా ఆడుతారు. గచ్చకాయలు, చింత బిచ్చల సంఖ్య కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉండటాన్ని గమనించ వచ్చు. గచ్చకాయలను పులులుగా, చింత బిచ్చలను మేకలుగా వ్యవహరిస్తారు.


 ఆటగాళ్ళ సంఖ్య 
ఆట ఇద్దరు మాత్రమే ఆడే వీలు ఉంటుంది. ఇద్దరికి పక్కవాళ్ళు మద్దతుదారులుగా సలహాలు ఇవ్వవచ్చు.

3:15  పులి జూదం
 ఆట నియమాలు 
1.పులి జూదం ఇద్దరు మాత్రమే ఆడాలి.
2. ఆటగాళ్ళలో ఒకరు గచ్చకాయల(పులుల)తో, మరొకరు చింతబిచ్చల(మేకల)తో ఆడాలి.
3. త్రిభుజాకారంలోని మధ్య గీతపై నాలుగు పులులు ముందుగానే పెట్ట బడి ఉంటాయి.

4. ముందుగా మేకలతో ఆడే వ్యక్తి పులలకి అన్ని వైపుల సమీపంలోని బిందువలను వదిలిపెట్టి, తరువాతి బిందువు స్థానంలో ఒక మేకను ఉంచుతాడు.

5. పులలతో ఆడే వ్యక్తి తరువాత ఒక పులిని మేక సమీపానికి దగ్గరలోని బిందువు దగ్గరకు జరుపుతాడు.
మేకలతో ఆడే వ్యక్తి మరో మేకను పులలకు దూరంగా ఇంకో చోట ఉంచుతాడు.

6. ఈ విధంగా 18 (18:4;15:3;1:3)మేకలు అయిపోయెవరకు మేకలతో ఆడేవాడు పెడుతూ పోతే, పులతో  ఆడేవాడు  జరుపుతూ పోతాడు.

7.తదుపరి ఆట రసకందాయకంలో పడుతుంది. పులికి సమీపంలో ఏదేని మేక ఉండి దాని తరువాత బిందువు ఖాలిగా ఉంటే మేకను, పులి చంపుతుంది.
8. ఆవిధంగా మేకలను ఎక్కువగా పులులు చంపుతూ పోతే పులులతో ఆడేవాడు గెలిచినట్లు. పులులు ఎక్కడకు కదలటానికి వీలులేకుండా మేకలతో బందిస్తే మేకలతో ఆడేవాడు గెలిచినట్లు.

4:18 పులి జూదం


పులి జూదం రకాలు

పులి జూదంలో ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి. ఆటను ఆడే చిత్రాన్ని బట్టి, ఆడే గిల్లల సంఖ్యను బట్టి రకాలు ఉన్నాయి.

) 1 పులి పులి జూదం: ఆడటానికి తక్కువ సమయం ఉన్నప్పుడు ఆటను ఆడుతారు. చాలా తక్కువ సమయంలో ఆట ముగుస్తుంది. మూడు మేకలతో పులిని కట్టడి చేస్తారు. చేయలేకపోతే పులితో ఆడేవారు గెలిచినట్లు. ఆట తెలుగు ప్రాంతాలు అన్ని చోట్లా ఆడిన దాఖాలాలు ఉన్నాయి.

) 3 పులులు పులి జూదం: ఆటను 3 పులులు, 15 మేకలతో ఆడుతారు. ఆటను ఉత్తర సర్కారు జిల్లాలలో ఆడుతారు.

) 4 పులుల పులి జూదం: ఆటలో 4 పులులు, 18 మేకలతో ఆటను ఆడుతారు. ఆట దక్షిణ తెలంగాణాలోను, రాయలసీమలోనూ చూడవచ్చు

ఆట ప్రాచీనత:
  ఆటలు కాకతీయుల కాలం నాటివని తెలియుచున్నది. ( సురవరం ప్రతాప రెడ్డి: ఆంధ్రుల సాంఘీక చరిత్ర, ఓరియంట్ లాఙ్మ్న్ ప్రచురణ, 1996, పుట-130). తరువాత రెడ్డి రాజుల పాలనలో మరింత విస్త్రుతంగా వ్యాప్తిలోకి వచ్చాయి. ప్రజలకు వినోద వ్యాపకాలుగా మారాయి.      

కొరవి గోపరాజు రాసిన సింహాసన ద్వాత్రింశికలో ఒక చోట ...

"తగులు విరివియైన కడుమెచ్చుగ నాడుదు, పులుల మూట, జూదంబులలో మిగులగ నేర్పరి బాగిడి తిగుటన్ సాగటాల నే నతి ప్రౌఢుండన్.(కొరవి గోపరాజు: సింహాసన ద్వాత్రింశిక, రెండవ భాగం, పుట-85./ ఆంధ్రుల  సాంఘీక చరిత్ర, పుట-132 )
  పుస్తకంలో కవి మూడు రకాల పులి జూదములు కలవని గోపరాజు పేర్కొన్నట్టు ప్రతాపరెడ్డి చెప్పాడు.(పుట-132). అవి ఒక పులి జూదం, నాలుగు పులల జూదం. మూదవది స్పస్టంగా పేర్కొనలేదని ప్రతాపరెడ్డి చెప్పాడు. అయితే మూడవ ఆటపై సందిగ్థతలో ఉన్నప్పుడు రెడ్డికి సికింద్రాబాద్లోని మారేడుపల్లి వాసి తాడేపల్లి కృష్ణమూర్తి 3 పులుల ఆటను  సూచించినారు.  
మారుతున్న కాలంలో విడియో గేంస్, సెల్ ఫోన్లతో కాలక్షేపం చేసే పిల్లలకు మరుగున పడుతున్న మన ఆటలను పరిచయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. చదరంగానికి విధంగానూ తీసిపోని ఆట పిల్లల ఆలోచనా నైపుణ్యాన్ని పెంచుతుదనుటలో ఎలాంటి సందేహం అక్కర్లేదు


29, నవంబర్ 2015, ఆదివారం

ఒక కాలువ కథ - కన్నీటి వ్యథ


      ఇటిక్యాలపాడు దగ్గర  కాలువ    

  ఇది 44 వ జాతీయ రహదారిపై ఉన్న ఓ ప్రాజెక్టుకు 
సంబంధించిన ప్రధాన కాలువ. ఈ కాలువకు ఉత్తరాన, దక్షిణ భారతదేశంలో రెండవ అతి పెద్ద నది అయిన కృష్ణానది 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంచుమించు అంతే దూరంలో దక్షిణాన  తుంగభద్రానది ప్రవహిస్తుంది.  ఈ ప్రాంతపు అవధి ఉన్నంత మేర రెందు నదులను చుట్టుకొని, నడుముకు జూరాల                                                                                                 
  వడ్డాణం పెట్టుకొని ఈ కాలువ నిర్జీవంగా పడి ఉంది. కంపలతో నిండి ఉంది. 

        ఈ కాలువ ఇప్పుడే కాదు, సరాసరి రెండు దశాబ్దాల సంది ఇలాగే పడి ఉంది. ఇక్కడ ఇదొక్కటే కాదు.  ఈ కాలువ మొదలుకొని, మీరు నిత్యం దర్శించుకోవడానికి వచ్చే అలంపూరు జోగులాంబాదేవి గుడివరకు ఇలాంటివి లెక్కలేనన్ని నిర్జీవమైన కాలువలు మీకు దర్శనమిస్తాయి.
                                                                                                                                                                                ఉండవెల్లి దగ్గర కాలువ

  బతుకంతా ఈ కాలువలది ఇదే పరిస్థితిలా  ఉందే! అని నిర్ఘాంతపడిపోకండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నీళ్ళకై నోళ్ళు తెరిచిన నల్లరేగడి బీళ్ళను, ఒకనాడు మడులుగా చేసి నిండా నీటితో నింపి ముద్దాడిన కాలువలివి. నాటొడ్లతో పచ్చని పైరు చీరలతో కలకలలాడే భూములను చూసి మురిసిన కాలువలివి. గజఈతగాళ్ళమని ఇప్పుడు మీసాలు మెలేసే నడివయసు వాళ్ళకు బాల్యంలో ఈత నేర్పిన కాలువలివి. నీళ్ళ అమ్మకం గురించి, ట్యాంకులు , కొలాయిలు మొదలగు మాటలు పల్లెళ్ళో విని, వినబడని రోజుల్లో ఇక్కడి పల్లెలకు కడుపు నిండా నీటిని తాపిన కాలువలివి. 140 కిలోమీటర్ల దూరం ప్రవహించి, లక్ష ఎకరాలకు నీరందించిన కాలువలు.  అప్పటి కాలువలను చూస్తేనే కడుపు నిండేది. అట్లాంటి కాలువను ఇప్పుడిలా చూస్తూంటే కడుపు మండిపోతుంది. ఈ దారి వెంట వెళ్ళిన ప్రతిసారి జాలితో ఈ కాలువలు, నిస్సహయతతో నేను చూసుకుంటాం. మౌనంగా మాట్లాడుకుంటాం. ఒకరి బాధలనొకరం వెల్లబోసుకుంటాం. ఈ కాలువలను చూసినప్పుడల్లా, ఎంకన్న పెద్ద వాగు పాట, విశ్వం పెన్నేటి పాట గుర్తుకొస్తూనే ఉంటాయి. ఈ కాలువలకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణమేమిటి?     

                  భైరాపూర్ దగ్గర కాలువ

            నిజాం రాష్ట్రంలో అప్పటి రాయచూరు జిల్లా అవసరాలను దృష్టిలో ఉంచుకొని తుంగభద్రపై రాజోలిబండ దగ్గర  ఈ కాలువల తల్లి  ప్రాజెక్ట్ గా  పురుడోసుకుంది. తరువాత స్వాతంత్ర్యం సిద్దించటం, నిజాంపాలనా విముక్తి, భాషా ప్రతిపాదికన విశాలంధ్ర అవతరణ ఇవీ పరిణామాలు. రాయచూరు జిల్లాతో  గద్వాల, అలంపూరు తాలుకాలకు సంబంధాలు తెగిపోవడం కర్ణాటకకు ఈ ప్రాంతాలపై శీతకన్నుకు బీజావాపనం తొడిగింది.                                                                                                                         ఇమాంపూర్ దగ్గర కాలువ
      కాలక్రమంలో ఈ ప్రాంతంలో సాగు, తాగు నీటి అవసరాల కొరకు కృష్ణానదిపై జూరాల ప్రాజెక్టు రూపుదిద్దుకొంది. ఈ కాలువలపై గుదిబండ పడింది. చిత్రంగా ఉంది కదూ! నిజమే. క్రమంగా విశాలాంధ్రలో, తుంగబధ్రకు ఆవల, దక్షిణాన ఉన్న వారి పెత్తనం పెరగడం, దేన్నో చూసి ముంతొలక బోసుకున్నట్లు, జూరాలను చూసి, ఈ ప్రాజెక్టుపై ఇక్కడి నాయకులకు క్రమంగా ఉదాసీనత పెరగడం, కర్ణాటక పట్టనితనం ఇక్కడి ప్రాంత ప్రజలకు, కాలువలకు, పొలాలకు శాపంగా పరిణమించింది. కర్ణాటకలో అక్కడి రైతులు తోడేసుకోవలసినవన్ని తోడేసుకున్నాకా, అక్కడి నేలలో మరమ్మత్తులకు నోచుకోని 40 కిలోమీటర్ల పరిధిలో కాలువలను దాటి, తెలుగు ప్రాంతంలో 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి రావలసిన నీరు రానే లేదు. జూరాలా ఆయుకట్టు కిందకైనా ఈ ప్రాంతం చేరనే లేదు. ఇది ఒక విషాదం.         
     అలంపూర్ దగ్గర కాలువ
      ఈ జిల్లాలోని భీమా ప్రాజెక్టు, సరళా సాగర్, కోయిల్ సాగర్, నెట్టెంపాడ్, రంగసముద్రం, రామన్‌పాడ్ వంటి చిన్నచితకా సాగు, తాగు నీటి ప్రాజెక్టులెన్నిటికో ఊపిరిలూదటమే కాకా, పక్కనున్న రంగారెడ్డి,నల్గొండ జిల్లాలనే కాకా, అనంత దూరంలో ఉన్న పాకాల దాకైనా పారే సామర్థ్యమున్న జూరాలకు, గద్దెల మీది నాయకులకు, ప్రాజెక్టు ప్రణాళికలు రచించే ఏసీ గది మేధావులకు..  పక్కన అత్యంత సమీపంలో నిర్జీవంగా, నిస్తేజంగా ఉన్న ఈ కాలువలు,కాలువలకై నోరు తెరిచిన బీళ్ళు, బీళ్ళ మీద ఆధారపడిన బతుకులు కనిపించకపోవడం మరో విషాదం.  

ఇన్నాళ్ళ అంతర్మధనం, అనంత శోష, అఖండ గోష ఇప్పటికైనా చూపించటానికి, వినిపించటానికి కారణం లేకపోలేదు..ఇటీవలే వీటిని మళ్ళీ ఓ సారి చూసి వచ్చి రెండు రోజులన్న గడవకముందే ఓ సంఘటన జరిగింది. .ఈ కాలువల మీద ఆధారపడిన ఓ బతుకు ఊపిరితీసుకోవడానికి ప్రయత్నించి, విఫలమై, చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతుంది. ఇది ప్రారంభమూ కాదూ, ఇదే ఆఖరూ కాకపోవచ్చు కూడా. అందుకే ఇప్పటికైనా నేతలు కళ్ళు తెరువాల్సిన సమయం ఆసన్నమైంది. లేకపోతే ఇక్కడి ప్రజలే తెరుస్తారు-మూడో నేత్రం. ఇక దానికెవ్వడైనా మాడి మసవ్వల్సిందే.    


                                                               బూడ్దిపాడు క్యాంపు దుస్థితి  


                                                                                                       
                                                                            ---నాయుడుగారి జయన్న     
  

6, నవంబర్ 2015, శుక్రవారం

అసహనం

అసహనం! అసహనం!
అసహనం! అసహనం!!

వాణ్ణి చూస్తే వీడికి
వీణ్ణి చూస్తే వాడికి
వీళ్ళను చూస్తే నాకు
నన్ను చూస్తే మీకు
అసహనం! అసహనం!
అసహనం! అసహనం!!

మన కులం
మన మతం
మన ప్రాంతం
మన భాష
మన పార్టీ
మన రంగు
కాకుంటే అసహనం!
కాదంటే దహనం!!

మన మాట కాదంటే
మన బాట రానంటే
అంతులేని అసహనం!
అదుపులేని అసహనం!
అర్థం లేని అసహనం!

నాలో అసహనం
నీలో అసహనం
అందరిలో అసహనం


అసహనం! అసహనం!
అసహనం! అసహనం!!


 అందని కందిపప్పు
తీరని రైతు అప్పు
అన్నార్తుల ఆకలి కేకలు
అభాగ్యుల దరిద్రపు గీతలు
ఎండుతున్న పైరులు
రాలుతున్న రైతులు
నిరుద్యోగుల నిస్పృహలు
అబలలపై ఘోరాలు
నేతల నేరాలు
మూలుగుతున్న నల్లధనం
ముసుగేసిన వైనం
కనపడవా?
వినపడవా?

ఎందుకింత అసహనం?
ఎవరి మీద అసహనం?

తూ తూ అసహనం
చీ చీ అసహనం
పో పో అసహనం
అగుపడకు అసహనం





10, అక్టోబర్ 2015, శనివారం

పట్నం శేషాద్రి

పట్నం శేషాద్రి మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల ప్రాంతానికి చెందిన కవి. రెవిన్యూ శాఖలో ఉద్యోగిగా పని చేసి, విరమణ చేశారు. ప్రస్తుతం సాహిత్య ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. పరిపాలనలో భాగంగా విరివిగా తెలుగు భాష వాడకాన్ని ప్రోత్సహించిన అధికారిగా అప్పటి అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ నుండి అవార్డును స్వీకరించాడు.
 కుటుంబనేపథ్యం 
వీరి తండ్రి పట్నం నర్సప్ప, తల్లి పాగుంటమ్మ. వీరికి ఒక కొడుకు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
 విద్యాభ్యాసం 
గద్వాలలో డిగ్రీ వరకు చదివిన శేషాద్రి, తరువాత ఎం.ఎస్సీ., వృక్షశాస్త్రం చదివారు. అందులో పరిశోధన చేసి డాక్టరేట్ పట్టాను సాధించారు.
ఉద్యోగ జీవితం 
1985లో మెదక్ జిల్లాలోజగదేవ్‌పూ ర్మం డలంలో తాహశిల్దారుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. తరువాత వరంగల్ డి.ఆర్.వో. గానిజామాబాద్ జిల్లా అధనపు సంయుక్త కలెక్టర్ గానూ  పనిచేశారు.
 సాహిత్య జీవితం 
మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలంలో పని చేస్తున్నప్పుడు అక్షరాస్యతా ఉద్యమంలో భాగంగా ఆ జిల్లాలో మంజీరా అక్షరప్రభ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలోని పాటలు, సాహిత్యం వీరిని సాహిత్యం వైపు నడిపించాయి. ఆ తర్వాత తానే పాటలు, కవితలు, నానీలు రాయడం మొదలు పెట్టారు. ఇప్పటి వరకు మూడు పుస్తకాలు ప్రచురించబడ్డాయి. మరో రెండు పుస్తకాలు ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి. ఆచార్య ఎన్. గోపి తాను రాసిన 'రాతి కెరటాలు ' అనే వచన కవితాసంపుటిని శేషాద్రికి అంకితమిచ్చాడు.
రచనలు 
1.కవితాసుమాలు: 41 కవితలతో కూడిన ఈ సంకలనం 2007 లో వెలువడింది. దీనిని ప్రముఖ కవి [[ఎన్. గోపి]] ఆవిష్కరించారు.
2. అక్షరదళాలు: ఇది నానీల సంపుటి. 2008లో వెలువడిన ఈ పుస్తకాన్ని [[సి. నారాయణరెడ్డి]] ఆవిష్కరించారు.
3. విచిత్ర వర్ణాలు: ఇది వచన కవితా సంపుటి 2015 జనవరిలో వెలువడింది. దీనిని అప్పటి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ ఆవిష్కరించారు.

--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల*



7, అక్టోబర్ 2015, బుధవారం

'మాటల మడుగు '- కొన్ని మాటలు

మెర్సీ మార్గరేట్ కవిత్వం 'మాటల మడుగు '-  కొన్ని మాటలు 

ఉరుకులు పరుగుల ఆధునిక యాంత్రిక జీవితంలో కవిత్వాన్ని శ్వాసిస్తూకవిత్వంగా జీవిస్తూకవిత్వం కొరకు తపిస్తూ తిరుగాడే మనుషులు కొందరే ఉంటారు. ఆ కొందరిలో మెర్సీ మార్గరేట్ ఉంటారు. ఫేస్ బుక్ కవిత్వ వేదిక 'కవి సంగమంలో నిరంతరం తన స్పందనలకు కవితా రూపమద్దుతూ వచ్చింది. మరెంతో మందికి కవిత్వంపై ఆసక్తి కలిగించడానికి కవిత్వశాలను నిర్వహించింది. ఆంధ్రా నుండి ఆటా వరకుతెలంగాణ నుండి తెలుగోడుండె ప్రతి నేల వరకు తన గొంతును వినిపించింది. ఇప్పుడు మాటల మడుగుతో మనముందుకొచ్చింది.

  మాటల మడుగు 53 కవితలతో కూడిన కవిత్వ సంకలనం. వీటిలో కొన్ని కవితలు ఇదివరకే ఫేస్ బుక్‌లోనోమరో పత్రికలోనోఇంకో వేదిక మీదో ప్రచురించబడినవే. వినిపించబడినవే. ఏ ముందీ కవితల్లోఅని ప్రశ్నించుకుంటే...నీ గురించినా గురించిమన గురించిమన చుట్టూ ఆవరించిన సమాజం గురించే అనిపిస్తుంది. ఎట్లా రాసిందిహృదయమెట్లా స్పందిస్తే అట్లా రాసింది. మనిషిలో మనిషి తనం మిగిలే ఉంటే ఇట్లానే రాస్తారనిపించేలా రాసింది. ఎందుకు రాసిందో కూడా అడుగాలనిపిస్తేఅడుగేయండి--
పునర్లిఖించుకోవాలిప్పుడు
 నన్ను నేను
కొత్త కాగితంపైకి అడుగేస్తూ..." అంటూ సమాధనమిస్తుంది.

  కాలం మారడం నిత్యం. సమాజం మారడం సత్యం. కాని ఆ మారేదేదో మంచి కొరకు మారితే ఎంత బాగుండు. అదే మన దురదృష్టం. ఈ కవి ఆవేదన కూడా అదే. గడిచిన గతాన్నినేటి నిరర్థక సత్యాన్ని పోలుస్తూ రాసిన మాటల మడుగు కవితలో ...
ఒకప్పుడు
 నోటి నిండా మాటలుండేవి...
మసక కన్నుల్ని వెలిగించే నిప్పురవ్వలుండేవి
చెమట చుక్కల్ని కౌగిలించుకొనే చేతులుండేవి.."  

ఇప్పుడూ మాటలున్నాయి. కాని అవన్నీ గాలికి తేలిపోయే తాలు మాటలే అంటూ చెబుతుంది. ఈ సంకలనంలో ఇది గొప్ప కవిత. ఈ కవితా శీర్షికే ఈ సంకలనానికి పేరుగా మారడంలో ఔచిత్యమూ ఉంది. అర్హతా ఉంది. మనల్ని మనం అన్ని విధాలుగా శారీరకంగా తీర్చిదిద్దుకోగలిగే అవకాశమే ఉండి ఉంటేపురుషులందరు ఏ సల్మాన్ లాగోస్త్రీలందరూ ఏ ఐశ్వర్యరాయ్ లాగో  తీర్చిదిద్దుకొనేవారు. మన ప్రమేయంలేని జన్యుపర అంశాలను అర్థం చేసుకోకుండాఅంతర సౌందర్యాన్ని అవగతం చేసుకోకుండాశారీరక బాహ్య సౌందర్యానికే విలువిచ్చే మనుషులు అన్నం మెతుకుల్లాగే అర్ధాంగి హృదయాన్ని కూడా చిదిమేసినప్పుడుఅనుభవించే వేదన బరువెంతో  తూచే కొత్త యంత్రమేమో అనిపిస్తుంది 'హృదయపు మెతుకు ' కవిత. నిజంగానే హృదయాన్ని ద్రవింప జేసే కవితిది. 
భాష ఒక్కోరికి ఒక్కో తీరుగా ఉపయోగపడుతుంది. మరి ఈమెకు? " మాయమవని కాలిన గాయం".  సమాజ శ్రేయస్సుకై జీవితాల్ని ఫణంగా పెట్టేఅదృష్టవంతుల కోసం నిరంతరం దురదృష్ట వంతులుగా బతికే శ్రామికులు నిజంగా కోల్పోతుందేమిటో చెబుతూ...
" మా అరచేతుల గీతల్నిఅస్తిత్వాన్నికాలాన్ని" అంటూ తానూ శ్రామిక పక్షపాతినేనని నిరూపించుకుంటుందీ కవి.
 ప్రపంచపు బాధ శ్రీశ్రీ నెట్లా మెలిపెట్టిందోఈమెనూ అంతే. అందుకే సిరియా పిల్లల కొరకు కన్నీళ్ళు పెడుతూనే...
" స్వేచ్చగా తలెత్తుకుని శ్వాసించే అస్తిత్వ కేతనాలు " అంటూ పిడికళ్ళకు కొత్త నిర్వచనాన్నిస్తుంది. 

గడియారంతో పోటి పడుతుబండెడు పుస్తకాలతో కుస్తీ పడుతుమనిషిని మనిషిగా నిలుపలేని చదువులకు బంధీ అయిపోయిన బాల్యాన్ని గడిపే చిన్నారులుస్వేచ్చగా ఎగిరే పక్షులను చూసినప్పుదుఆ పిల్లల కళ్ళు " బస్సు కిటికీ చువ్వలతో చేసే సంభాషణ" ను  మనం వినగలమాఅర్థం చేసుకోగలమాఈ కవి వినగలిగింది. 'అవసరం ' కవిత రాయగలిగింది.
మనసుండే మనుషులుండాలిగానీఆ మనుషులు మాట్లాడగలగాలి కానీశవాలైనా జీవం పోసుకొని తిరుగాడవూఅదే చెబుతుంది 'జీవనది ' కవిత.
 కమ్యూనికేషన్ స్కిల్ఆర్ట్ ఆఫ్ లివింగ్పచ్చిగా చెప్పాలంటే బతుక నేర్వడం తెలిసిన మనుషుల భాగోతాలను చూపే కవిత 'ఎక్స్‌క్లూసివ్ నవ్వులు '. నవ్వులనుమరి ముఖ్యంగా నానార్థాలు తెలిసిన నవ్వులను మనిషి ఉపయోగించినత నైపుణ్యంగా మరే జంతువూ   ఉపయోగించకపోవడం మనిషి సాధించిన విజయమే.  దుఃఖాన్ని భరించడంపంచుకోవడం సులువే. కానీవెటకారపు నవ్వులను భరించడం మాత్రం మహా కష్టమే.
 ఈ కవి తన కవిత్వంలో సూర్యుడిని ఎట్లా ఉదయింపజేస్తుందో చూడండి-
" సూర్యుడు చుక్కల్ని పట్టుకొని
పగటి గంప కింద కప్పిపెట్టి
తన పనికి ఉపక్రమిస్తూ..." అంటుంది. రాత్రిళ్ళు ఊళ్ళల్లో గంప కింద కోడిపిల్లలను మూసిపెట్టిఉదయం కాగానే తెరువడం మామూలే. దాన్నే ఇట్లా తిరిగేసి కాల సూచిగా వాడుకోవడం కవి సాధించిన కవితా మాయజాలం.

"అరువు భాషను
 హావభావాలనువేషధారణను
 చంకలోని బతుకు బరువును
సంచిలో వేసుకొని
నన్ను నేను అమ్ముకోవడానికి బయలుదేరుతా '' ననటంలోకేవలం బతకటం కోసం మన ఇష్టాలనెట్లా దూరం చేకోవాలో తెలిపే ధైన్యంఅయిష్టాలనెట్లా బలవంతంగా నెత్తికెత్తుకోవాలో తెలిపే దౌర్భాగ్యం ' జంతర్ మంతర్ ' కవితతో మనకు చూపిస్తూందీ కవి. ఇదే కవితలో ఒక చోట " నాలుకకు ఇరవై ఆరు అక్షరాల నరకాన్ని కట్టుకొని/ బయలుదేరుతాను" అని అనటంలో పరాయి భాషెప్పుడూ మన సమస్త భావ వ్యక్తీకరణావసరాలను తీర్చలేదని చెప్పటం లేదూ?  ఆ ప్రయత్నం చేయడం నరకంతో సమానమేననే భావం కనిపించటం లేదూ?  ఉద్యోగమంటే ఆషామాషి కాదనిఏ రోజుకారోజు పోరాటమేననిఆ రోజును ముగించటమంటేఆ యుద్ధంలో గెలవటమేనని చెప్పినట్లుగా ఉంటుందీ కవిత. ఈ సంకలనంలో ఆణిముత్యాల్లాంటి కవితల్లో ఇదీ ఒకటి.

  కొన్ని పరిచయాలు బౌతికంగా ముగిసినట్లు అనిపించినావాటి అనుబంధపు తాలుకూ పరిమళాలేవో మనుసుకు అంటుకొని గుభాలిస్తూనే  ఉంటాయని," జ్ఞాపకాల వెన్నని/ చేతిలో చల్లని ముద్దగా ఉంచి వెళ్తాయనికొత్త అనుబంధానికి నాందిగా నిలుస్తాయని ఈ కవి చెబుతుంది.

"అదేంటో
 కడుపులోకి
 పదునైన బాధ దిగిన ప్రతిసారి
 అక్షరాలు గుండెను చీల్చుకొని
 బయటకు వచ్చి
 పసిపిల్లల్లా నవ్వుతాయి " అంటూ ఈ కవి కవిత్వావిర్భావ రహస్యాన్ని మన ముందు ఉంచుతుంది.

చీత్కారాల ఘాటు గాయాల లోతెంతో తెలిపే కవితలుచెమ్మ కన్నుల నీటి సాంద్రతను తెలిపే కవితలు,విరహ వేదననుస్నేహపు విలువను తెలిపే కవితలు,కవులకుకవిత్వానికి,కన్నీళ్ళకు నిర్వచనమిచ్చే కవితలుమొసలి కన్నీరు కార్చే సమాజానికి హితోపదేశం చేసే కవితలుఅనాగరికపు అంటరాని తనాన్నిదాని విషాదకర ప్రతి ఫలనాలను చూపే కవితలుచక్కటి ఉపమానాలతో కూడిన కవితలుఅరుదైన భావచిత్రాలతో కూడిన కవితలు ఈ సంకలనంలో ఎన్నో! చక్కటి కవితా సంకలనాన్ని అందించిన కవిని అభినందిస్తూమరింత చిక్కబడిమరింత పదునుదేలి  ఈ కవి కవిత్వం సమాజానికి దిక్సూచిగా నిలువాలని ఆకాంక్షిస్తున్నాను.
                                                                                            
                                                                                           -నాయుడుగారి  జయన్న