8, మార్చి 2018, గురువారం

తంగెళ్ళ శ్రీదేవి రెడ్డి


తంగెళ్ళశ్రీదేవి రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ తెలుగు  నవలా రచయిత్రి. నవలలతో పాటు, కథలు, కవితలు రాశారు. వీరు రచించిన నవలలు,  కథలు అనేక ప్రముఖ వార, మాస పత్రికలలో ప్రచురితమైనవి. నేటి  వనపర్తి జిల్లాలోని  ఒక మండల కేంద్రమైన అత్మకూర్ వీరి స్వస్థలం. ప్రస్తుతం హైదరాబాద్ లో స్థిరపడ్డారు.

కుటుంబ  నేపథ్యం :  తల్లి తంగెళ్ళ సుజాత,  తండ్రి తంగెళ్ళ శ్రీనివాస్ రెడ్డి.

విద్యాభ్యాసం: స్వస్థలమైన ఆత్మకూరులో  పాఠశాల, కళాశాల విద్యను పూర్తి చేశారు.  ఉస్మానియా యూనివర్సిటి నుండి.  ఎం.ఏ. తెలుగు పూర్తి చేశారు. అక్కడే  తెలుగు వార పత్రికలు- సాహిత్య వికాసం అను అంశంపై పరిశోధన చేసి , పిహెచ్.డి పట్టాను పొందారు.

వృత్తి: వీరు తెలుగు ఉపన్యాసకులు.  ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్  కళాశాలలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేశారు. ఉస్మానియా విశ్వ విద్యాలయానికి చెందిన ఆచార్య జి. రాంరెడ్డి దూర విద్యా కేంద్రానికి సంబంధించి ఎం. ఏ. తెలుగు   పాఠ్యపుస్తకాల రూపకల్పన బృందంలో వీరు సభ్యులుగానూ పని చేశారు.    

రచనలు: ఇప్పటి వరకు వీరు 7 నవలలు, సుమారు 50 దాక కథలు,  అనేక కవితలు, వివిధ అంశాలపై వ్యాసాలు రాశారు. వీరి నవలలు స్వాతి, చతుర వంటి మాస పత్రికలలో ప్రచురించబడినవి. వీరి కథలు వివిధ  దిన, వార పత్రికలలో ప్రచురించబడినవి. రచయితలకు  కులం మతం ప్రాంతం లేదన్నది వీరి అభిప్రాయం.  ఆ అభిప్రాయంతోనే వీరు తెలంగాణకు చెందిన వారైనా,  ఆంధ్ర ప్రదేశ్ కు  దక్కవలసిన  ‘ప్రత్యేక హోదా’  అంశంపై సాగుతున్న ఉద్యమానికి ఊతంగా ఈమె  పాటలు రచించారు. అవి  ఆంధ్ర ప్రాంతంలో ప్రాచుర్యం పొందాయి.
*నవలలు:
1. ఏడు రోజులు - చతుర, మే -2000
2. మైత్రి కరార్-  స్వాతి, సచిత్ర మాస పత్రిక, సెప్టెంబర్,2000.
3.  వీలునామా-  చతుర,మార్చి,2002
4. స్వప్నసౌధం - చతుర, జూలై, 2003.
5. సితార - విద్యుల్లత, మాసపత్రిక,ఏప్రిల్,2008.
6. మంత్రపుష్పం 

*కథలు: ప్లాస్టిక్ పూలు , మస్కా (ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రిక -20.11.2008),  పరమవీర చక్ర (ఆంధ్రభూమి సచిత్ర వార పత్రిక -09.11.1995),  ఆశ్రమం,  పూలు నలుగుతున్నాయి  మొదలుగున్నవి.

   
అవార్డులు: శ్రీదేవి రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రతిష్టాత్మకంగా ప్రకటించే 'కీర్తి పురస్కారాలకు ఎంపికైంది.  2015 సంవత్సరానికి  సంబంధించి  ఆమె ఈ అవార్డును దక్కించుకున్నారు. తెలంగాణ శాసన సభ స్పీకరు మధుసూదనాచారి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.   'వాసిరెడ్డి రంగనాయకమ్మ ' స్మారక అవార్డును  కూడా వీరు పొందడం జరిగింది.
--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల*