సాహితీ వ్యాసాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సాహితీ వ్యాసాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, మే 2025, మంగళవారం

పవనపుత్ర శతకం - వెనుక మాట

                                                                      పవనపుత్ర శతకం - వెనుక మాట                                                                               

                                                        -ఎం.డి. ఉస్మాన్, 
                                                   ఎస్.ఏ. (ఆంగ్లం), నల్గొండ 


వెనుకమాట. వినడానికి ఎబ్బెట్టుగా ఉంది కదా! నాకు కూడా అలానే అనిపించింది. కానీ it's a spontaneous word that arose in my mind immediately after reading the poetry. Moreover the great poet William Wordsworth said that "poetry is a spontaneous overflow of poets emotions", like wise, I got this word spontaneously. కాబట్టి ఈ పదాన్ని వాడా..! మన జయన్న  కూడా ఈ శతకంలో అన్నారు "వచన కవిత యనుచు వంత వద్దు" అని, కాబట్టి నేను కరెక్టే... అని నా భావన. దీనికి ఇంకొక కారణం కూడా ఉంది అదేమంటే "ముందుమాట" రాసే అవకాశం, అదృష్టం నాకు రాదేమో ఎందుకంటే అది అంత అలవోక కాదు మరియు నేను అంత అర్హుడిని కూడా కాదు.


జయన్న శతకం మొదటి పద్యం చదవగానే , వేమన శతకం కోసం google లో చూడాలనిపించింది శతకానికి కూడా invocation ఉంటుందా అని? A great English poet Milton the "Paradise Lost" (an epic)  ప్రారంభంలో అంటాడు.. "I invoke Thy aid to my adventurous song"అని. మన జయన్న గారు కూడా తన శతక ప్రారంభంలో " దీన కవికి తమ దీవెనలొసుగుము" అన్న మాటలు తనప్రభు భక్తికి వినమ్రతకు నిదర్శనం. 


ఇక పద్యాల విషయానికొస్తే... బాగున్నాయి... చాలా బాగున్నాయి.... అద్భుతంగా ఉన్నాయి... ఇలా ఏమన్నా, మీ పదాలను, పద్యాలను తక్కువ చేసినట్లు అవుతుందేమో. ఎందుకంటే those are not simply words.. those are your deepest thoughts which were adorned with grammar and syntax.

"సిరుల కంటే విద్య గొప్పదనే" విషయాన్ని మీరు వర్ణించిన తీరు అద్వితీయం."ఎదుటివాడి గుణము నెంచవలదు" కూడా బాగా నచ్చింది ఎందుకంటే మనకు నచ్చనిది ఎదుటివారికి కూడా నచ్చకపోతే దాని గురించి చర్చిస్తుంటే ఇంకా బాగా అనిపిస్తుంది. గురువులను గౌరవించడానికి రెండు చేతులు ఉంటే చాలు అన్న మాట, అక్షలారా నిజము . "కడుపు నిండిన వాడి మాట కడుపు మండిన వాడి మాట"ల మధ్య వ్యత్యాసం బాగా వర్ణించారు. 


 "I know your simplicity and sensibility." "యముడి బాధ కన్నా నదికమ్ముగదనింద".. చదవగానే మీతో నేను గడిపిన రోజులలో చూసిన మీ వ్యక్తిత్వం  గుర్తుకు వచ్చింది."కష్టమేది కలుగ కనిపించదరు మీరు"..

నిజమే.. కష్టాలు వచ్చినప్పుడు మనిషికి దేవుడు గుర్తుకొస్తాడు. ఇది చదివినప్పుడు చిన్నప్పుడు పరీక్షల సమయంలో "మసీదు"కు వెళ్లడం గుర్తుకొచ్చింది. "కులము పేరు చెప్పి బలము పెంచుకొనుచు" ప్రస్తుత పరిస్థితిని ,రాజకీయ నాయకులకు కుస్తీ ని తెలియజేస్తుంది.


"రాతదుడిచి గొప్ప గీత గియ్యవ స్వామి".. as teachers we teach  all the students at  the same valume,  ఎవరెట్లా స్వీకరిస్తారు అనేది వారిపై ఆధారపడి ఉంటుంది in the same way , a mother looks after her all children with the same love and affection, కానీ ఆ సామి అందరి గీతలు ఒకే రకంగా ఎందుకు గీయడో... సమాధానం దొరకని ప్రశ్న. 


"కలల యందు మనకు కానిదేముందిరా" సాధారణ, మధ్యతరగతి ప్రజల ఆలోచనలకు ప్రతిబింబం."చదువుకొనగ రాదు చదువు"కొనగ"వచ్చు.. సరళ పదాలతో నేటి విద్యా దుస్థితి కి అద్దం పడుతుంది. ఇక నేటి రాజకీయ నాయకుల పరిస్థితిపై, రాజకీయ దుస్థితిపై  కవి ఎక్కుపెట్టిన బాణం గురి తప్పలేదు.


నిజమే.."పేద ఇంట ధనము పిసరైనా నిలవదు". ఈ పద్యం ద్వారా పునస్మరణ జరిగింది, కానీ కారణం దొరకలేదు."వాగులన్నీ గలసి వార్థి జేరువిధము" తో పోల్చడం జయన్న గారి సాహిత్య జ్ఞాన పరిపక్వతకు నిదర్శనం."రవిని వెతికినటుల రాతిరి సమయాన" మరొకటి. 


చివరిగా ఒక విషయం చెప్పదలుచుకున్న.. ఈ పుస్తకం ప్రారంభం నుండి చివరి వరకు ఒకే sitting లో చదివా. అంత ఉత్సాహాన్ని, ఆనందాన్ని, ఆలోచనలను రేకెత్తించింది ఈ పుస్తకం. వెనువెంటనే నా అభిప్రాయాన్ని రాస్తూ చదివిన పద్యాలను నెమరు వేసుకుంటున్న.. ఇలాంటి మరెన్నో ప్రతిష్టాత్మక సంకలనాలు మీ కలము వెంట జాలువారాలని మనసారా కోరుకుంటున్న..

                                                                                                                      -ఎం.డి. ఉస్మాన్,                     

                             ఎస్.ఏ. (ఆంగ్లం), నల్గొండ 

25, ఏప్రిల్ 2025, శుక్రవారం

ఆధునిక సమాజాన్ని అద్దంలో చూపిన శతకం.


 ఆధునిక సమాజాన్ని అద్దంలో చూపిన భక్తిపూర్వక నివేదన శతకం.                              

          తన మనోభావాలను అక్షరరూపంలో వ్యక్తంచేసి సమాజంలో చైతన్యాన్ని నింపేవాడే నిజమైన  కవిగా పరిగణింపబడతాడు. ఎందరో కవులు వివిధ ప్రక్రియలలో రచనలు చేశారు. కాలం ఎంత మారినా మంచి పునాది గల పద్యరచన ఇంకా కొనసాగుతూనే ఉంది. సామాజిక దృక్పథంతో భక్తిపూర్వక నివేదనగా పండితపామర ప్రశంసల నందుకొన్న చక్కని గ్రంథం శ్రీ నాయుడుగారి జయన్నగారు రచించిన పవనపుత్ర శతకం.                                         

        ఈ కవి జోగులాంబ గద్వాల జిల్లా జల్లాపురం అను గ్రామంలో శ్రీమతి లక్ష్మీదేవి, శ్రీయుత గోపాలనాయుడు దంపతులకు జన్మించి , పెద్దమ్మ శంకరమ్మ కడ పెరిగి శ్రద్ధా భక్తులతో విద్యనభ్యసించి ఎం.ఏ., బి.యిడి., పట్టాపుచ్చుకొని  ఉత్తమఉపాధ్యాయుడుగా పేరుపొందారు.  దృక్కోణం(వ్యాసములు),నడిగడ్డ(దీర్ఘ కవిత)  వంటి రచనలతో సాహితీ లోకంలో ప్రశంసలు పొందారు. వీరి బాల్యం పెద్దమ్మ గారి ఊరయిన పల్లెపాడులో గడిచింది. ఆ ఊరిలో గల ఆంజనేయస్వామి గుడిప్రాంగణంలో మిత్రబృందంతో తిరిగినందువలనను, కొత్త ఊరిలోను, ఉద్యోగము చేసిన బీచుపల్లిలోను ఆంజనేయుని గుడులు ఉన్నందువల్ల వీరికి ఆంజనేయస్వామిపై భక్తి కుదిరింది. అనంతరకాలంలో తనకు కలిగిన అనుభవాలు , ఆవేదనలూ, సమాజంపట్ల తనకున్న అభిప్రాయాలను ఆంజనేయస్వామికి చెప్పుకోవాలని భావించి చక్కని ఆటవెలది పద్యములతో ఒక శతకాన్ని రచించారు. తను పెరిగిన ఊరిపేరును కలిపి 'పల్లెపాటి వాస పవనపుత్ర ' అనే మకుటంతో ఆ స్వామికి తన భావాలను నివేదించి దీవెనలు కోరుతూ సామాజిక మార్పును అభిలషించారు.                        

          ఈ శతకంలో సామాజిక అంశాలు చక్కగా ప్రస్తావించబడ్డాయి. పేద ధనికులమధ్యగల వ్యత్యాసాలు పేర్కొంటూ ఉన్నవారు లేనివారికి సహాయపడాలని సలహా ఇచ్చారు. కులాలు మతాల పేరుతో నేటి పాలకులు ప్రజలను వంచించి గద్దెనెక్కుతున్నారని, కూటికి లేని వాణ్ణి గమనించడంలేదని బాధపడ్డాడు. చదువు రాని మొద్దులకు రాజకీయం రాచబాట  అయ్యిందని, కాసులున్నవాడు ఏదిచేసినా చెల్లుతూ ఉన్నదని నేటిసమాజాన్ని చూచి బాధపడతాడు.                     

 "కులము పేరు జెప్పి బలము పెంచుకొనుచు            

మతము పేరు జెప్పి మాయజేసి                     

గద్దె నెక్కి కులుకు మొద్దులున్నరు జూడు' అని నివేదిస్తూ,

  

కూడు లేక నొకడు కూలిపోవుచునుండె                  

రాజులాగ నొకడు రాలుచుండె        

రాత దులిపి మంచిగీతగీయవ సామి! (34,35 పద్యాలు) అని పేదలబతుకులనుమార్చుమని స్వామిని అభ్యర్ధించారు.                  

     ఉన్న ఊరును వలె మాతృభాషను గూడ చక్కగా ప్రశంసించారు.                           

అమ్మ పాలలోని కమ్మదనంబును                     

 తేనెకన్న మించు తియ్యదనము                         

తెలుగు బాస గాక దేనిలో నుండురా                            

పల్లె పాటి వాస పవన పుత్ర  (3)      

అని కమ్మగా మాతృభాషయైన తెలుగును   వర్ణించాడు.  

  

 పద్యకవితయైనా, గద్యకవితయైనా సమానంగా ఆదరించాలని కవి పాఠకులకు సందేశమిచ్చాడు.    "పద్యమనుచు కవులు పలుచజేయ వలదు                   

వచన కవిత యనుచు వంత వద్దు                                            

 దేని ఘనత జూడ  దానిదే లోకాన"  అని పద్యగద్యములకు సమాన ప్రాధాన్యత   నిచ్చారు.   

      లోకంలో నేడు మంచివారికంటె చెడ్డవారు అధికంగా ఉన్నారని చెబుతూ మంచినీటికంటె ఉప్పునీరు ఎక్కువగా ఉంటుంది గదా అని దృష్టాంతం తో సమర్థించారు.(4) కోపం గర్వం పనికిరానివని, చింత మనిషిని దహిస్తుందని, త్రాగుడుకు బానిసకావద్దని, బాలల్లో బ్రహ్మ ఉన్నాడని,ధనంకంటె గుణంగొప్పదని వ్యక్తిత్వవికాసలక్షణాలను పేర్కొన్నాడు.                         వ్యావహారిక పదాలను ప్రయోగిస్తూ భాషను సామాన్యజనులకు చేరువజేశాడు. సంపద ఉన్నపుడు భగవంతుడుగుర్తుకురాడని  తెలుపుతూ ఈ సమాజాన్ని మార్చిఅందరినీ చల్లగా చూడు స్వామీ! అని ఆ పవనపుత్రుణ్ణి అభ్యర్థించాడు.                 

      మొత్తమ్మీద ఈ శతకం సమాజహితాన్ని కాంక్షిస్తూ నీతి బోధకంగా అలరారుతూ ఉంది. 

           ఈ గ్రంథమును చదివి, ముందు మాటవ్రాసి, ఆశీర్వదించి,  ముద్రణకు తోడ్పడిన ప్రముఖ పద్యకవులు అవధానులు శ్రీ కోట రాజశేఖర్ గారికి ధన్యవాదములు సమర్పిస్తూ ఈ కవి, భక్తిపూర్వకంగా ఈ కృతిని వారికి అంకితమియ్యడం హర్షించదగ్గ విషయం.

             ఆంజనేయస్వామి వర్ణముఖచిత్రంతో, ఆటవెలది సొగసులతో, అందమైన పలుకుబళ్ళతో ఆకర్షణీయంగా ఉంది. ప్రతి ఒక్కరు దీనిని చదివి, ఆనందించి, ఆచరించగలరని ఆశిస్తున్నాను. 

         రచనలో ఈ కవి మరింత ముందుకు సాగాలని ఆశీర్వదిస్తున్నాను.           


                                                                                              - డాక్టర్ చీమకుర్తి వేంకటేశ్వరరావు,      

                                                                                             విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు, నెల్లూరు

పవనపుత్ర శతకంపై డా. చీమకుర్తి సమీక్ష


 నెల్లూరు నుండి వెలువడే లాయర్ వారపత్రికలో నా పవనపుత్ర శతకంపై డా. చీమకుర్తి వేంకటేశ్వరరావు గారి  సమీక్ష.

15, డిసెంబర్ 2024, ఆదివారం

నా కొత్త పుస్తకం

 కొన్ని పుస్తకాలపై, కొందరు రచయితలపై అప్పుడప్పుడు రాసిన కొన్ని వ్యాసాలను ఇలా పుస్తకంగా తీసుకవస్తున్నాను.



3, మార్చి 2024, ఆదివారం

నేనూ - గొరుసు - గజఈతరాలు

                                                                                                                                                             హాజనిత కల్పిత కథాజగత్తును దాటి వాస్తవ జీవితాలను చిత్రించిన కథలను చదవడం మొదలుపెట్టి అప్పటికి చాలా కాలమే అయ్యింది. కానీ వాటిలోనూ తెలియని మనుషులు, తెలియని భాష, తెలియనిఊర్లూ, వీధులూ అన్ని పరాయివే. ఎవరో తెలియని మనుషుల జీవితాలు చదువుతున్నట్లూ, చూస్తున్నట్లూ ఉండేది. మొదటిసారి 1998 మార్చిలో ఆంధ్రప్రభ వార పత్రికలో ‘ఉసుళ్ళు ‘ పేరుతో ఓ కథ కంటపడింది. ఆ తర్వాత 1999 డిసెంబర్లో ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో మరో కథ ‘గజఈతరాలు’ చూశాను. అంతవరకు మావి అనిపించిన కథలను చూడని నాకు ఈ రెండు కథలు ఆ లోటును తీర్చేశాయి. ఈ కథలు మావే. ఈ భాషా మాదే. ఈ కథల్లో ప్రస్తావించబడిన మహబూబ్ నగర్, గద్వాల, ఉప్పేరు,పెబ్బేరు, బీచుపల్లి, రంగాపురం, వనపర్తి, దేవునిపాలెం, గుడ్లనర్వ అన్నీ మా ఊర్లే. వల్లభనగర్, రాయిగడ్డ, మర్రికుంట అన్నీ మా వీధులే. సాయమ్మ, బాలామణీ, పూర్ణమ్మ అందరూ మా మనుషులే అన్పించింది. ఈ కథలు మనుసుకు ఎంతో దగ్గరైపోయాయి. 

              ‘గజఈతరాలు’ పూర్ణమ్మ అయితే మా అత్తలాగా, ఆమె వెంట తిరిగాడిన పిల్లల్లో నేనొకడినై ఉన్నానేమో! ఆ అనుభవాలన్నీ మావేనేమో! ఆ భాషా మా నోటి నుండి రాలిపడితే ఏరి, రచయిత ఈ కథలో పొందుపర్చాడేమోననిపించింది. అందుకే ఆ కథ నన్ను నేను చూసుకోవడానికి మళ్లీ మళ్లీ ఎన్నిసార్లు చదివానో! గజఈతరాలైన పూర్ణమ్మ, వందమందికి ఈత నేర్పిన పూర్ణమ్మ, కష్టాలని, జీవితాన్ని ఒంటరిగా, ధైర్యంగా ఎదుర్కొని బతుకు సాగించిన పూర్ణమ్మ చివరికి బావిలో పడి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో! చెపుతుందీ కథ. సహజ సంఘటనలకు, సున్నితమైన హాస్యాన్ని జోడించి, సమకాలీన సమస్యలు బతుకులను ఎట్లా చిందరవందర చేస్తాయో, చావులకు కారణం ఎలా అవుతాయో చెప్పిన కథ. చాలా కాలం నన్ను వెంటాడిన కథ. ఇప్పటికీ మరిచిపోని కథ. ఎన్ని కథలు చదివినా, ఎప్పటికీ మనసులో ప్రథమ స్థానంలో పదిలపరుచుకున్న కథ.


       ‘ఉసుళ్ళు’ అడుక్కుతినే మనషులను, వారి ఆర్తనాదాలను అల్లంత దూరంలోనే ఉంచి, కుక్కలకు మాంసం ముక్కలు పెడుతూ సంతోషించే సమాజాన్ని ఓ పార్శ్వాన చూపిన కథ. అంతకుమించి, ఎలాగోలా ఆకలిని జయించాలని నానా అవస్థలు పడే బతుకుల్ని, మరో రకమైన ఆకలి ఎట్లా బలితీసుకుందో హృదయ విదారకంగా చెప్పిన కథ. కథ చదివాకా ‘తుమ్మ ముళ్ళు దిగబడిన తూనీగలాగా’ హృదయాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తాం. 

     ఉసుళ్ళు, గజఈతరాలు మా కథలు, మా ఊరి కథలు. మా మనుషుల కథలు. మరి ఈ కథలు రాసిన ఈ రచయిత ఎవరు? ఎక్కడ ఉంటాడు? ఎలా కలవడం? చాలా కాలం ఈ ప్రశ్నలు వేదించాయి. అన్వేషణ మొదలైంది. 

      ఒకసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణల విభాగంలో కొత్త పుస్తకాల కొరకు వెతుకుతుంటే ఏదో సంవత్సరానికి సంబంధించిన కథావార్షిక ఒకటి కంటపడింది. దాని సంపాద వర్గంలో వీరి పేరు కనబడింది. పుస్తకం చివర్లో వీరి చిరునామా దొరికింది. ఇక నా ఆనందానికి అవధులు లేవు. పుస్తకం తీసుకోలేదు కానీ చిరునామా తెచ్చుకున్నాను. ఈ రెండు కథలపైన నా అభిప్రాయాలను, స్పందనలను తెలియజేస్తూ సుదీర్ఘంగా ఒక ఉత్తరం రాశాను. అప్పుడు ఏం రాశానో! ఎట్లా రాశానో! తెలియదు. తిరిగి జవాబు రాలేదు. చేరిందో! లేదో! కూడా తెలియదు. ఒక రచన చదివి, స్పందించి, దాని రచయితకు ఉత్తరం రాయడం నా వరకు నాకు అదే మొదలు, అదే ఆఖరు కూడా. 

     ఆ తర్వాత మరికొంత కాలానికి ఈ రెండు కథలతో పాటు వలసపక్షులు, చీడ, వాల్తేరత్త, ఖాయిలా బతుకులు మొదలగు మరో ఎనిమిది కథలను కలిపి నాకెంతో ఇష్టమైన ‘గజఈతరాలు’ కథ పేరుతోనే కథా సంపుటిని వెలువరించారు రచయిత. మళ్ళీ చిరునామా సంపాదించి, మనియార్డర్ చేసి, పుస్తకం పంపమని ఉత్తరం రాశాను. పుస్తకం వచ్చింది. దానితోపాటు మనియార్డర్ కూడా తిరిగి వచ్చింది. 

     ఉసుళ్లు, గజఈతరాలుతో పాటు నాకు బాగా నచ్చిన మరో కథ ఖాయిలా బతుకులు. ప్రభుత్వరంగ సంస్థల్లో జరిగే మోసాలు, లీలలు మన కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. పరిశ్రమలో పెద్ద తలకాయలు, వాటిని బటటి నుండి నడిపే శక్తులు పరిశ్రమల మూతకు ఎలా కారణమవుతాయో, తత్ఫలితంగా వాటి మీద ఆధారపడిన బతుకులు ఎలా చిద్రమవుతాయో! చూపిన కథ. ఈ పుస్తకంలోని కథలన్నీ ఆకట్టుకునే కథలే. అన్నీ వాస్తవజీవిత చిత్రణలే. ఈ రచయితకు పాలమూరు మాండలికం మీద ఎంత పట్టు ఉందో, ఉత్తరాంధ్ర మాండలికం మీద కూడా అంతే పట్టు ఉంది. ఈ రచయిత ఈ పుస్తకం తప్ప మరో పుస్తకం వెలువరించినట్లు కనపడదు. అయితేనేం ఇవి తెలుగు కథాసాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోదగ్గ కథలు.

       గొరుసు జగదీశ్వరరెడ్డి గారు ఆదివారం ఆంధ్రజ్యోతికి ప్రముఖుల ఇంటర్వ్యూలు చేసి పెడుతున్నప్పుడు వారి ఫోన్ నెంబర్ దొరికింది. తీరిక దొరికిన ఒకరోజు ఫోన్ చేశాను. ఆనందంగా మాట్లాడారు. నేను రాసిన ఉత్తరం గురించి చెప్పారు. మా ప్రాంతంతో పెనవేసుకున్న వారి బాల్యం, జ్ఞాపకాలు, అనుభవాలు అన్నీ పంచుకున్నారు. చాలా కాలం తీరిక దొరికినప్పుడల్లా ఫోన్లో పలకరించేవారు.

       ఒకసారి ఉద్యోగరీత్యా ఓ 12 రోజుల పాటు వృత్త్యంతర శిక్షణార్థమై హైదరాబాదులో ఉండవలసి వచ్చింది. ఆ సందర్భంలో నగరంలోనే ఉన్నానని వారికి ఫోన్ చేస్తే, అమీర్పేటలోని సారథి స్టూడియోకి వచ్చేయమన్నారు. అక్కడి ప్రివ్యూ థియేటర్లో ఆరోజు సాయంత్రం, పేరు గుర్తుకు లేదు కానీ ఏదో ఇరానీ సినిమాను చూపించారు. సినిమా అయిపోయాకా బయట కేఫ్ లో ఇరానీ చాయ్ తాగుతూ. చాలాసేపు మాట్లాడుకున్నాం. అది నా జీవితంలో అత్యంత ఆనందాన్ని ఇచ్చిన రోజులలో ఒకటి. ఒక అభిమాన రచయితను అట్లా ప్రత్యక్షంగా కలవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. తను బాల్యమంతా గడిపిన ఈ ప్రాంతాలలో, ఈ వీధులలో తనతో కలిసి తిరుగాలని, చూడాలని ఉందని, అందు కోసం ఓ రెండు రోజులు నాకు కేటాయించాలని కోరాను. వారు ఇచ్చే రోజు కోసం ఎదురుచూస్తూ.... 
- నాయుడు గారి జయన్న
      03.03.2024

12, జనవరి 2018, శుక్రవారం

అక్షరాగ్నికణం అలిశెట్టి

ద్యమానికి పర్యాయ పదం తెలంగాణ. తెలంగాణ ఉద్యమాలకు ఊపిరి కరీంనగర్. కరీంనగర్‌కు జవం, జీవం జగిత్యాల. ఆ జగిత్యాలలో జన్మించిన అక్షరాల అగ్నికణమే అలిశెట్టి ప్రభాకర్.

తండ్రి చిన రాజం, తల్లి లక్ష్మి. అలిశెట్టి ఇదే రోజు(12.01.1954) భూమ్మీదకు వచ్చిపడ్డాడు. ఇదే రోజు జీవితం నుండి నిష్క్రిమించాడు. పుట్టిన రోజే మరణించడం. మరణించిన రోజే పుట్టిన రోజు కావడం యాదృచ్చికం. అందుకే ఆయనకు మరణం లేదు. ఆయన కవిత్వానికి అంతకన్నా లేదు.

ఏడుగురు అక్కాచెల్లెళ్ళు, ఇద్దరు అన్నాదమ్ములు వెరసి మొత్తం పది మంది సంతానం తండ్రికి. పది మందిలో ఒకడిగా జన్మించాడు. కాబట్టే పది మంది మేలు కోరే కవిత్వం రాశాడు.

అసలు అలిశెట్టి ఎవరు?
పెన్సిల్‌తో, సరదాగా చాలా బొమ్మలను గీశాడు.
కెమెరా కంటితో సామాజిక దృశ్యాలను తీశాడు.
పెన్నును గన్ను చేసుకొని అస్తవ్యస్థ సమాజంపై కవితాస్త్రాన్ని సంధించాడు.  ఆయనో చిత్రకారుడు. ఫోటోగ్రాఫర్, కవి. వెరసి ఆయనో బహుముఖ ప్రజ్ఞాశాలి. కుంచె, కెమెరా బతకడానికి పనికొచ్చాయి. మూడోది జీవింపజేసింది.     

కవిత్వ భాషలో చెప్పాలంటే చెరబండరాజు తన గురించి తాను చెప్పుకున్న కవితను కొంచెం సరిజేసి చెప్తే అలిశెట్టికి అచ్చంగా సరిపోతుంది.

ఆకలి అతని పేరు
కలం అతని ఆయుధం
అభ్యుదయం అతని ఊరు.  

11 ఏళ్ళకే తండ్రి మరణిస్తే, కుటుంబ పోషణ భారాన్ని తలకెత్తుకున్నాడు. ఆ క్రమంలోనే  తలకెత్తుకున్న భారాన్ని తగ్గించుకోవడానికి బుజానికి కెమెరాను తగిలించుకున్నడు.

ఆదర్శాలను నేను, నీవు అందంగా వల్లిస్తాం. ఆచరణలో కొందరే పాటిస్తారు. ఈ రెండో కోవకు చెందినవాడే అలిశెట్టి. అందుకే భాగ్యం కన్నా మహాభాగ్యం ఏముంటుందని పేదింటి పిల్లైనా భాగ్యాన్ని తన ఇంటికి ఇల్లాలుగా తీసుకొచ్చాడు.  ఎందుకంటే అందరికి డబ్బు విలువ తెలుసు.  అలిశెట్టికి డబ్బుకు విలువ లేదని తెలుసు.  ఆయనెప్పుడు డబ్బు వెంట వెంపర్లాడలేదు. డబ్బు సంపాదించే మార్గాలు మస్తుగున్న వాటన్నిటిని కాలదన్నాడు. కలాన్ని మాత్రమే అందుకున్నడు, నమ్ముకున్నడు. కాని అమ్ముకోలేదు.

మాటలతో మంట పుట్టించడం, అక్షరాలను అస్త్రాలుగా సంధించడం ఒక శ్రీశ్రీకి తెలుసు, చెరబండకు తెలుసు, అలిశెట్టికి కూడా తెలుసు. జీవితంలో కొరతగా ఉన్న డబ్బు నేర్పిందేమో!  తక్కువ తక్కువగా వాడుకొమ్మని. అదే సూత్రాన్ని కవిత్వానికి వర్తింపజేశాడు. మిని కవితను అతను అందుకున్నడో!, మిని కవితే అతనల్లుకున్నదో! తెలువదు గానీ, అమ్మాకొడుకుల్లా అల్లుకపోయారు. ఎంతగా అంటే అలిశెట్టికి మిని కవిత తప్ప మరోటి రాదని విమర్శించెంతగా. అది తప్పని చెప్పడానికి ఆయన చురకలంటించాడులే గాని అది వేరే విషయం.

మూడు, నాలుగు పాదాలతో అద్భుత కవిత్వాన్ని సృస్టించడం అలిశెట్టికి మాత్రమే సాధ్యమైంది.బహుశా అది ఆకలి నేర్పిన పాఠం కావొచ్చు.
నిలబడు
బలపడు
సంతకాలపై కాదు
సొంతకాళ్ళపై అన్న కవితా ప్రేరణ కావొచ్చు.

లేకపోతే...
"తనువు పుండై..వేరొకరికి పండై
తను శవమై...వేరొకరికి వశమై
తను ఎడారై...వేరొకరికి ఒయాస్సిసై "  అంటు వేశ్యల దయనీయ, దుర్భర జీవితాలకు చిత్రిక పట్టేవాడా?  ఈ కవితెంత కరుణా సముద్రమో!, సంచలనమో! ఎన్ని వేదికల మీద ఎన్ని వేల గొంతుకలు    ఉటంకించాయో వేరే చెప్పనక్కర్లేదనుకుంటా. ఆ విషయం కాలానికి తెలుసు, దాన్ని మోస్తున్న  సాహిత్యానికి తెలుసు. కవిత్వాన్ని కోట్‌లా చేసి అభ్యుదయ తెలుగు సమాజం అత్యధికంగా ఉపయోగించుకున్నది శ్రీశ్రీ తరువాత అలిశెట్టినే అంటే అతిశయోక్తి కాదు.

జన్మించిన జగిత్యాలలో ఎర్రపావురాలు ఎగురవేశాడు.  నిర్భందం వెంటాడితే కరీంనగర్ కొచ్చాడు ఆకలి జీవులకోసం మాట్లాడే మనిషి మౌనంగా ఉండగలడా? తన మాటలతో మంటల జెండాలు ఎగిరేశాడు. కరీంనగర్ కాదంటే హైదరాబద్ కొచ్చిపడ్డడు. ప్రాంతాలెన్ని మారినా, దోపిడి సమాజానికి చురకలు వేయడం మాత్రం మానలేదు. తన జీవితం రక్తరేఖ మీద నడుస్తున్నా...ఎన్నికల ఎండమావులు దాటుకుంటు , సంక్షోభ గీతాన్ని పాడుకుంటు సిటీ లైఫ్ అనుభవించాడు.
నగరం అర్థం కాని రసాయన శాల
చిక్కు వీడని పద్మ వ్యూహం అని అతనికి అనతి కాలంలోనే తెలిసిపోయింది. అయినా సిటీని  వదల లేదు. సిటీలో తిరుగడం మానలేదు. సిటీపై రాయడం మానలేదు.
కాచీగూడా అంటే 
కాచి వడబోసిన
 కమ్మని కాఫీయే కదా! అంటు కాచిగూడాకు కవితొకటి కానుగ ఇచ్చాడు.

ఇరుకిరుకుగా ఉండే రేకుల సెడ్‌లో జీవితాన్ని నెట్టుకొచ్చాడు. అయితేనేం...
అర్ధాంగి చేటలో కన్నీళ్ళు చెరుగుతున్నప్పుడు/
 సంసారం బరువును సమీక్షించగలిగాడు.

ఆయన దోపిడీ సమాజంపై సంధించిన కవితాస్త్రాలు అన్నీ, ఇన్నీ కాదు. ముఖ్యంగా రాజకీయాలను చీల్చి చెండాడు. ఒక పార్టీలో ఉంటునే మరో పార్టీ వైపు చూసే జంపు జిలానీలకు చురకలేశాడు.
"వాడు
 ముందే వానపాము
ముడ్డెటో? మూతెటో? " అంటూ వాతలు పెట్టాడు.

"ఓ నక్క ప్రమాణ స్వీకారం చేస్తుంది 
ఇంకెవరిని మోసం చేయనని
ఓ పులి పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తుంది
తోటి జంతువులను సంహరించనని
ఈ కట్టుకథ విన్న గొర్రెలు పుర్రెలు ఊపుతూనే ఉన్నాయి." అంటూ మోసగించే నేతలను, అమాయకత్వాన్ని వీడని జనాన్ని ఎద్దేవా చేస్తాదు.  దురదృస్టమేమిటంటే అదే కట్టుకథలను నేతలు నేటికీ చెబుతున్న గొర్రెలు ఇంకా పుర్రెలు ఊపుతూనే ఉండటం. ఇంత పరిణాం చెందినా ఇంకా పరివర్తన చెందకపోవడం.

"గుడిసెలు
మేడల్ని కడతాయి
మేడలే 
గుడిసెల్ని కొడతాయి" ఎన్ని తక్కువ మాటలు ఎంత గొప్ప మాటలు. ధనవంతుల అభివృద్ది సోపాన నేపథ్యాన్ని, దాని వెనుకే దాగున్న దోపిడీ వ్యవస్థను ఎంత అద్భుతంగా కళ్ళకు కట్టాడు.
"పాల రాతి బొమ్మైన
పార్లమెంట్ భవనమైన
వాడు చుడితేనే శ్రీకారం
వాడు కడితేనే ఆకారం" అంటూ శ్రమజీవి త్యాగాన్ని కీర్తిస్తాడు కవి.

ఇట్లా ఇది అది అని ఏమీ.. ఏదీ రాసినా పేదల కోసమే రాశాడు. వాళ్ళ కన్నీళ్ళు తుడువడానికే రాశాడు.
రాయనైతే రాశాడు కానీ రాసిన దానితో సంపాదించినదేమీ లేదు కీర్తి తప్ప. ఎందుకంటే ఆకలిని జయించాలన్న ఆరాటమే గానీ, ఆస్తులను కూడ బెట్టాలన్న ఆలోచన ఆయనకెప్పుడు లేదు. అందుకే ఆయన కవిత్వాన్నైతే జయించగలిగాడు గానీ వ్యక్తిగత జీవితాన్ని రోగానికి అప్పగించి ఓడిపోయాడు. అయితేనేం తెలుగు కవిత్వం ఉన్నంత కాలం అలిశెట్టి జీవించే ఉంటాడు. తెలుగు కవిత్వ యవనిక మీద అలిశెట్టి అభ్యుదయ పతాకై రెపరెపలాడుతూనే ఉంటాడు. ఆ స్ఫూర్తిని మనలో నింపుకొని సాగడమే మన ముందున్న కర్తవ్యం.

-నాయుడి గారి జయన్న 

26, ఏప్రిల్ 2016, మంగళవారం

తెల్ల కాగితం - కొన్ని రాతలు


యశస్వి  సతీష్  తెల్ల కాగితం పై కొన్ని రాతలు

 ఫేస్ బుక్  కవిత్వ వేదిక కవి సంగమం కు  నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి.  ఎందుకంటే దానికై  నేను పెద్దగా రాసినదేమి లేదు.  ఓ నాలుగు పద్యాలు, ఓ మూడు కవితలు , ఓ రెండు పుస్తక సమీక్షలు అంతే. కానీ  కవి సంగమం నాకు లెక్కలేనంత మంది కవులను పరిచయం చేసింది.  వారి కవిత్వాన్ని ఆస్వాదించే అదృష్ణాన్ని ఇచ్చింది.  మహా మహుల సరసన వేదిక ఎక్కి కవిత్వాన్ని వినిపించే భాగ్యాన్ని ఇచ్చింది.  వీటన్నిటికి మించి వెళ్ళిన ప్రతి సారి కొన్ని పుస్తకాలను నాకు బహుమతిగా ఇచ్చింది.  అలా నా చేతికొచ్చిన  వాటిలో యశస్వి సతీష్ తెల్ల కాగితం కూడా ఒకటి. యర్రంశెట్టి సతీష్ యశస్వి కలం  పేరుతో కవిత్వం రాస్తుంటాడు.  తన బ్లాగ్ లో , ఫేస్ బుక్ లో అనేక కవితలు రాశాడు. వాటిలో కొన్ని కవితలను ఏర్చి  కూర్చి వెలువరించిన పుస్తకమే తెల్లకాగితం.  ఇందులో 53 కవితలు ఉన్నాయి. 
      కిటికీ ...ఒంటరి ప్రపంచం నుండి విశ్వాన్ని చూపే ద్వారం.  ఈ పుస్తకం ముఖపత్రానికి ఒక కిటికీ ఉంది.  అందులోంచి చూస్తే, తెల్లకాగితం కనిపిస్తుంది.  తెలుపు ఒక   స్వచ్చత,  శాంతి, ఒక స్వేచ్చ.   మబ్బులకవతల ఆకాశాన్ని చూడగలిగితే  నిర్మలినంగా, నిమ్మళంగా , నిశ్చలంగా కనిపిస్తుంది.  కానీ, అంతర్గతంగా ఎన్నెన్ని గ్రహాలు,  ఉల్కలు, అసంఖ్యాక  నక్షత్రాలు, కమ్మే మబ్బులు, కాసే ఎండలు, కురిసే వానలు.   ఇందులోనూ అంతే  కిటికీ గుండా  చూడగానే  తెల్లకాగితం కనిపిస్తుంది. దానిని  దాటుకుని లోపలికి ప్రవేశిస్తే,  నిస్వార్థం, నిర్భయం,  విశాలత్వం,  స్వచ్చత , స్వేచ్చా ,  ధైర్యం, కోపం, బాధ, దిగులు, జాలి అన్ని కనిపిస్తాయి.  వాటి గురించి మాట్లాడటానికి ముందు మరో మాట చెప్పుకోవాలి.  ఏ కవికైనా తన కవిత్వాన్ని పుస్తకంగా చూడాలని ఉంటుంది.  ఆ పుస్తకాన్ని పాఠకులు చదివి, ఆదరించాలని కోరుకుంటాడు. అంతే. కవి  పాఠకుడి గురించి అంతకు మించి వేరే పట్టించుకోడు.  కానీ ఈ కవి పుస్తకానికి పాఠకుడే ప్రాణమని నమ్మిన వాడు.  కాబట్టి ,  చాలా ప్రాధాన్యమే ఇచ్చాడు.  ఇచ్చేవాడికి  ప్రేమతో ఇవ్వడానికి , వాడి పేరు రాయడానికి  కొంత స్థలం,  చదువుకోవడానికే గాకా రాసుకోవడానికి సగ భాగం,  అంకితం తీసుకోనేవాళ్ళలో అంతర్భాగం చేయడం మొదలుగునవి పాఠకుడికి దక్కిన గౌరవం.  ఇందులో మరో ప్రత్యేకతా ఉందండోయ్!  పుస్తకంలోని పేజీల సంఖ్యలకు బదులుగా వర్ణమాలలోని అక్షరాలతో సూచించడం...  ఎంతటి తెలుగు దనం!  అ తో మొదలై క్ష తో ముగియటం.  నిజంగా వర్ణ  మాలే. ఎన్నెన్ని రంగులను అద్దుకున్న తెల్లకాగితం ఇది!  ఇదంతా కవిత్వానికి ముందుమాట.   ఇక కవిత్వంలోకి వెళితే...

నాది నాదే.  నీది కూడా నాదే అనే స్వార్థ ప్రపంచంలో
  '' నాది నీదైనప్పుడు
    నిజంగా నేను మనిషినవుతాను.'' అని చెప్పగల త్యాగనిరతి ఎంత మందిలో ఉంటుంది.  ఈ కవి అలాంటివాడే.  కాబట్టే

 '' నాకు నచ్చని నా ని పుచ్చుకొని నడువలేను  అని ప్రకటిస్తాడు.

 మన పేరు కోసం, మనమెన్ని ప్రయత్నాలు చేస్తాం, ఎన్నెన్ని పడవాట్లు పడతాం. కవి ఇతరులలో తనను చూసుకొని మురిసిపోవడం కవిదెంత  విశాలహృదయం!  కవిత్వం కళ్ళ జోడుతో లోకాన్ని చూసే కవికి కనిపించినంత స్పష్టంగా ప్రపంచం మరెవరికి కనిపించదు. 

      ఈ కవికి శబ్దాలంకారాల మీద మమకార మెక్కువ.  యతి మైత్రిలు , ప్రాసల లాగా చాలానే కనిపిస్తాయి.  చూడండి... 

'' జగతి ముందు యువతని '',

''పంచుకున్న ప్రేమల్లో ఎంచుకున్న చదువుల్లో''

''తలపుల తనువులను తడమాలని లేదు.''

''తిరిగిరాని తీరాలకు తరలి పోవాలని''  ఇట్లాంటి వృత్త్యానుప్రాసాలంకార వాక్యాలు ఇందులో కొల్లలుకొల్లలుగా కనిపిస్తాయి.

 ఇంకా ఈ  కవి శబ్ధవిన్యాసాలు  చూడండి...

"నీ మునివేళ్ళను ముని మాపు వేళ్ళల్లో"

"నిను వారించాలని, వరించాలని"

 "ఆడి ఆడి వాడేలోగా"

" తడుముతోంది..తరుముతోంది" ఇలా శబ్ధాల మీద తన మమకారాన్ని చాటుకుంటాడు కవి.

శ్రీశ్రీలా తిరిగేసి మరిగేసి చెప్పడం ఈ కవికీ చేతనవును చూడండీ...

''నువ్ తుర్రుమన్నప్పుడు

నే కేర్ మన్ననో!

నే కేర్ మన్నప్పుడు

నువ్ తుర్రు మన్నావో!" అంటాడు.
కవితలకు నేపథ్యాలు చూపడం ఇబ్బందికరమే. పాఠకుడి యొక్క ఊహా శక్తిని పరిమితం చేయడమే. కానీ ఒక్కోసారి మేలు కూడా జరుగుతుందండోయ్! కవి కవితను పాఠకుడు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు. కానీ అపార్థం చేసుకోకూడదు. అలా జరుగకుండ ఉండాలంటే, కవి దృష్టి కోణంలో కవితను చూడాలంటే నేపథ్యాలు అవసరమే. అందుకే ఈ కవి తన పుస్తకంలో చాలా వాటికీ నేపథ్యాలను చూపించాడు. ఇది సమంజసమే.

 ఈ పుస్తకంలోని అద్భుత కవిత 'బొమ్మరాళ్ళు ' అమ్మల ఆవేదనకు, నిర్వేదానికి, అచేతనానికీ, ఆనందానికి అద్దంపట్టిన కవిత ఇది. సుదూరప్రాంతాలలో ఉన్న తన వారి కోసం ఎదురు చూసి, ఎదురు చూసి కళ్ళు కాయలు కాసిన తల్లులు, అవ్వలు తమ వారు తమ దరికి రాగానే, ఆ పిల్లల కోసం చేసే ఏర్పాట్ల గురించి చెబుతూ కవి...

" ఇన్నాళ్ళు కళ్ళకు కాసిన కాయలు
   ఇక చెట్లకు కాస్తాయి" అంటాడు. 
   అరిగిన మోకాళ్ళ మధ్య తిరుగలి తిరుగుతుంది

  నలిగిన వేళ్ళ మధ్య కవ్వం చిలుకుతుంది " అంటూ పిల్లలకై పెద్దలు ప్రేమతో శక్తినంతా కూడదీసుకొని చేసే పనులను దృశ్యాలు, దృశ్యాలుగా మనముందుంచుతాడు కవి.     

ఈ కవి రాజకీయ ఆశావాది. అందుకే..

"ఖద్దరు ముసుగుల లొసుగులు

తొలగిపోయే క్షణాలు...తారాడే రోజుని

మేం చూస్తాం! చూసి తీరుతాం!! " అని ఖచ్చితంగా  ప్రకటిస్తాడు.

 
" సామాన్యుడి బతుకుబండి గతుకుల దారి

పూలబాటైన రోజుని

రోజువారి పనిలో అలసట

 ఆటపాటైన రోజుని

మేం చూస్తాం! చూసి తీరుతాం!! అని గుండెలనిండా ఆశావాదాన్ని నింపుకొంటాడు. ఆశే కదా జీవితానికి భరోసా! ఆశే కదా జీవితానికి శ్వాస.

 ఆధునిక హైటెక్ యుగంలో మనుషుల పద్ధతులు మారిపోయాయి. తమ పేర్లు, పిల్లల పేర్లూ మార్చేస్తున్నారు.

పేర్లలో ఎక్కడా తెలుగు దనం కనిపించకపోవడాన్ని ఈ కవి నిరసిస్తాడు. అందుకే...

" అజంతంగా ఉండలేని నామం పొల్లుతో నేమవుతుంది" అంటాడు.

 

కలహాలతో కాపురం చెడగొట్టుకుంటే అది పిల్లలకు  ఎంత శాపంగా మారుతుందో తెలిపే కవిత 'నాతో ఆడవా?'.

    కొందరి దృష్టిలో మనకు పాకిస్తాన్ శత్రుదేశమే కావొచ్చు. కానీ అక్కడ అందరూ మనకు శత్రువులు కాదు కదా! ఒక చైతన్యం, ఒక పోరాటం ఎక్కడైనా మన అస్తిత్వమే కదా! అందుకే కవి 'మలాలా ' గురించి గుల్ మకాయి ' కవిత రాశాడు. అందులో...

" నా కంటి చెమ్మ సాక్షిగా చెబుతున్నా

పాకిస్తాన్ లోగిలిలో పూచిన మానవతా ప్రియ నేస్తమా!

నువ్ విరబూయడం కాంతి పంచే సూరీడుకి అవసరం " అని నొక్కి చెబుతూ, హృదయానికి హత్తుకుంటాడు. 

 నేర్చుకోవడానికే తప్ప జీవించడానికి, జీవితాన్ని నడపడానికీ  ఏ మాత్రం ఉపయోగపడని నేటి మన విద్యా వ్యవస్థను నిరసిస్తూ...

"మొగ్గల్ని పువ్వులవ్వనివ్వని మొరటుతనాన్ని

నాగరికత నేర్పుతుంది.

చేసిందే చేయడం ఇప్పుడో లెక్క

బొంగరపు జీవితాలు కొత్తపుంతలెక్కవు" అంటూ అన్ని విషయాల ( సబ్జెక్ట్ల) దోరణిని తప్పుపడతాడు.

 ' ఓ సరదా దండకం...సీరియస్ గా ' అంటూ రాసిన వినాయకుడి దండకంలోనూ ఈ కవికి పర్యావరణ స్పృహే. భక్తులకు కళ్ళు తెరిపిస్తాడిందులో.

 ఇంత చెప్పినా మీకు  ఈ కవి పూర్తిగా అర్థం కాలేదా? అయితే మీరు ఖచ్చితంగా ఈ పుస్తకంలోని 'నాకే గనక చేతనవుతే ' కవితను చదవాల్సిందే!

  " జెండాలో  రంగులు పైనా కింద పడి

  తెల్లదనాన్ని కుమ్ముతూ" ఉన్నాయంటూ  దేశంలోని మతకలహాల గురించి, శాంతి అనిశ్చితి గురించి అన్యాపదేశంగా  ప్రస్తావిస్తాడు కవి.

అలాగే...అలాగే అను కవిత మధ్యతరగతి మహాభారతానికి చెందినది. కేవలం ఇది కవిత మాత్రమే కాదు. ఒక్కో వాక్యం ఒక్కో జీవితం. చదివిన ప్రతి ఒక్కరు ఏదో వాక్యంలో తమను తాము చూసుకుంటారు.

 'ఓ రైలు ప్రయాణం' అన్న కవితలో కన్న ఊరిని వదిలి వచ్చే సందర్భాన్ని చెప్తూ కవి  ఓ చక్కటి ఉపమానాన్ని మన ముందు ఉంచుతాడు...

" తెగవలసినదని తెలిసినా

తోడొచ్చే తల్లిపేగులా..."   ఆ జ్ఞాపకాలు వెంటాడుతాయని చెబుతాడు.

కోట్లాది రూపాయల ప్రజాదనాన్ని వృధా చేసే ప్రభుత్వాలకు, దేశాలకు, సంస్థలకు ప్రణాళికలు, సమావేశాల మీద ఉన్న మోజు వాటి ఆచరణ మీద ఉండదన్న పచ్చి నిజాన్ని తెలిపే కవిత ' భయ్యా! డైవర్సిటీ ఎక్కడా? '

" జీవ వైవిధ్య సదస్సు ముగిసింది

ఇక కాగితాలపై అభయారణ్యాలు పెరుగుతాయి " అంటూ కవి తన కలం పోటుతో దెప్పి పొడుస్తాడు. ఎప్పుడో చేనేత వారోత్సవాలపై వినాయకుడి వీణ పేరుతో గోరా శాస్త్రి రాసిన చేనేత దృక్పతం వార్తావ్యాఖ్యను  గుర్తుకు తెస్తాడు కవి.

  ఆచరణకు విలువివ్వని జీవవైవిధ్య సదస్సులంటే ఈ కవికి చికాకే కానీ, జీవులంటే కాదు. అందుకే ఉడుత గురించి, పిచ్చుక గురించి, పాముల గురించి ప్రేమతో కవితలు రాశాడు.

ఇంకా ఈ పుస్తకంలో స్వేచ్చ పేరుతో కొనసాగుతున్న ఆధునిక కాలపు విచ్చలవిడితనాన్ని,పండుగల పరమార్థాన్ని మరిచి వాటిని వికృతంగా మార్చేసినా భక్తుల మూర్ఖత్వాన్ని, హింస, అతివాదం,పశుత్వం, విధ్వంసం, పక్కవాడి నిర్లక్ష్యం మొదలగువాటిని  నిరసించే కవితలు, శ్రమ విలువను తెలిపే కవితలు తల్లీదండ్రులతో అనుబంధాన్ని తెలిపే కవితలు ఇందులో చాలానే ఉన్నాయి.  కవిత్వాన్ని ప్రేమించే వాళ్ళకు  ఈ పుస్తకం ఓ మంచి బహుమతి అని మాత్రం నే ఖచ్చితంగా చెప్పగలను.

ఇంకా ఈ కవి నుండి మరింత వైవిధ్యమైన శిల్పంతో, వస్తువుతో కవిత్వం రావాలని ఆశిద్దాం!!

                                                                  

                                                                                          ---నాయుడుగారి జయన్న

                                                                                              

 

 

2, ఏప్రిల్ 2016, శనివారం

హల్‌ధార్ నాగ్

కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని చెప్పటానికి చక్కటి ఉదాహరణ హల్‌ధార్ నాగ్. అతి సాధారణ జీవితం నుండి విశ్వ విద్యాలయ విద్యార్థులు తన రచనలపై పరిశోధనలు చేసే స్థాయికి ఎదిగిన కృషీవలుడు.  పశ్చిమ ఒడిశా ప్రాంతానికి చెందిన హాల్దార్ నాగ్  కోస్లి భాషాకవి. 1950లో ఒడిశాలోని బార్‌గఢ్ జిల్లాలో జన్మించాడు. పదేళ్ళ వయసులోనే తండ్రి మరణించాడు. దానితో చదువు ఆగిపోయింది. మూడవ తరగతి వరకు మాత్రమే చదువుకోగలిగాడు. చదువుకు స్వస్తి చెప్పిన పిదప ఓ మిఠాయి దుకాణంలో పాత్రలు కడిగే పనికి కుదిరాడు. ఆ తర్వాత కొద్ది కాలం పాటు ఓ బడిలో వంట పనివాడిగా పనిచేశాడు. అక్కడా కుదురుకోలేకా బ్యాంక్‌లో అప్పు చేసి పుస్తకాల దుకాణం తెరిచాడు. ఆ పుస్తకాల దుకాణమే అతని జీవితాన్ని మార్చి వేసింది.  అతనికి సాహిత్యంపై మక్కువ కలిగేలా చేసింది. ఆవిధంగా సాహిత్య రచనలు  చేయడం ప్రారంభించాడు. ఆయన రాసిన తొలి పద్యం ధోడో బార్‌గజ్ (పెద్ద మర్రిచెట్టు) ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టింది. 1990లో స్థానిక పత్రికలో ఈ రచన ప్రచురించబడింది. ఆ తర్వాత నాగ్ సాహిత్య రచనలో అంచెలంచెలుగా ఎదిగాడు. ఉన్నత స్థితికి చేరుకున్నాడు. ఒడిశాలో 'లోక్‌ కవిరత్న 'గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మూడో తరగతి వరకు మాత్రమే చదువుకున్న ఈ కవి రచనలపై విశ్వవిద్యాలయాల్లో ఐదుగురు విద్యార్థులు పి.హెచ్.డి. పట్టా కొరకు సిద్ధాంత గ్రంథాలను సమర్పించారంటే ఎంతటి గొప్ప సాహిత్య కారుడో మనం ఉహించవచ్చు.  అతని సాహిత్య కృషికి గుర్తింపుగా  ఇటీవల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా నాగ్ పద్మశ్రీ పురస్కారాన్ని కుడా  అందుకున్నాడు. ఒడిశాలోని సంబల్ వర్సిటీ హల్‌ధార్ రచనలను గ్రంథబలీ-2 పేరుతో రూపొందించిన విశ్వవ్విద్యాలయ పాఠ్యప్రణాళికలో భాగం చేసింది. తెల్లటి పంచె, బనీను నిత్య వస్త్రధారణగా కలిగి అతి సాధారణ జీవితం గడిపే హల్‌ధార్ నాగ్ ఎందరికో ఆదర్శప్రాయుడు. కవిత్వం గురించి నాగ్ మాట్లాడుతూ...'' నా దృష్టిలో కవిత్వానికి నిజ జీవితంతో సంబంధం ఉండాలి. ప్రజలకు ఓ సందేశాన్ని అందించాలి అంటాడు.''  నిజమే కదా! ఇప్పటి తరం కవులెంత మంది ఈ ప్రాతిపదిక మీద కవిత్వ రాస్తున్నారంటే చెప్పడం కష్టమే.

 

 

7, అక్టోబర్ 2015, బుధవారం

'మాటల మడుగు '- కొన్ని మాటలు

మెర్సీ మార్గరేట్ కవిత్వం 'మాటల మడుగు '-  కొన్ని మాటలు 

ఉరుకులు పరుగుల ఆధునిక యాంత్రిక జీవితంలో కవిత్వాన్ని శ్వాసిస్తూకవిత్వంగా జీవిస్తూకవిత్వం కొరకు తపిస్తూ తిరుగాడే మనుషులు కొందరే ఉంటారు. ఆ కొందరిలో మెర్సీ మార్గరేట్ ఉంటారు. ఫేస్ బుక్ కవిత్వ వేదిక 'కవి సంగమంలో నిరంతరం తన స్పందనలకు కవితా రూపమద్దుతూ వచ్చింది. మరెంతో మందికి కవిత్వంపై ఆసక్తి కలిగించడానికి కవిత్వశాలను నిర్వహించింది. ఆంధ్రా నుండి ఆటా వరకుతెలంగాణ నుండి తెలుగోడుండె ప్రతి నేల వరకు తన గొంతును వినిపించింది. ఇప్పుడు మాటల మడుగుతో మనముందుకొచ్చింది.

  మాటల మడుగు 53 కవితలతో కూడిన కవిత్వ సంకలనం. వీటిలో కొన్ని కవితలు ఇదివరకే ఫేస్ బుక్‌లోనోమరో పత్రికలోనోఇంకో వేదిక మీదో ప్రచురించబడినవే. వినిపించబడినవే. ఏ ముందీ కవితల్లోఅని ప్రశ్నించుకుంటే...నీ గురించినా గురించిమన గురించిమన చుట్టూ ఆవరించిన సమాజం గురించే అనిపిస్తుంది. ఎట్లా రాసిందిహృదయమెట్లా స్పందిస్తే అట్లా రాసింది. మనిషిలో మనిషి తనం మిగిలే ఉంటే ఇట్లానే రాస్తారనిపించేలా రాసింది. ఎందుకు రాసిందో కూడా అడుగాలనిపిస్తేఅడుగేయండి--
పునర్లిఖించుకోవాలిప్పుడు
 నన్ను నేను
కొత్త కాగితంపైకి అడుగేస్తూ..." అంటూ సమాధనమిస్తుంది.

  కాలం మారడం నిత్యం. సమాజం మారడం సత్యం. కాని ఆ మారేదేదో మంచి కొరకు మారితే ఎంత బాగుండు. అదే మన దురదృష్టం. ఈ కవి ఆవేదన కూడా అదే. గడిచిన గతాన్నినేటి నిరర్థక సత్యాన్ని పోలుస్తూ రాసిన మాటల మడుగు కవితలో ...
ఒకప్పుడు
 నోటి నిండా మాటలుండేవి...
మసక కన్నుల్ని వెలిగించే నిప్పురవ్వలుండేవి
చెమట చుక్కల్ని కౌగిలించుకొనే చేతులుండేవి.."  

ఇప్పుడూ మాటలున్నాయి. కాని అవన్నీ గాలికి తేలిపోయే తాలు మాటలే అంటూ చెబుతుంది. ఈ సంకలనంలో ఇది గొప్ప కవిత. ఈ కవితా శీర్షికే ఈ సంకలనానికి పేరుగా మారడంలో ఔచిత్యమూ ఉంది. అర్హతా ఉంది. మనల్ని మనం అన్ని విధాలుగా శారీరకంగా తీర్చిదిద్దుకోగలిగే అవకాశమే ఉండి ఉంటేపురుషులందరు ఏ సల్మాన్ లాగోస్త్రీలందరూ ఏ ఐశ్వర్యరాయ్ లాగో  తీర్చిదిద్దుకొనేవారు. మన ప్రమేయంలేని జన్యుపర అంశాలను అర్థం చేసుకోకుండాఅంతర సౌందర్యాన్ని అవగతం చేసుకోకుండాశారీరక బాహ్య సౌందర్యానికే విలువిచ్చే మనుషులు అన్నం మెతుకుల్లాగే అర్ధాంగి హృదయాన్ని కూడా చిదిమేసినప్పుడుఅనుభవించే వేదన బరువెంతో  తూచే కొత్త యంత్రమేమో అనిపిస్తుంది 'హృదయపు మెతుకు ' కవిత. నిజంగానే హృదయాన్ని ద్రవింప జేసే కవితిది. 
భాష ఒక్కోరికి ఒక్కో తీరుగా ఉపయోగపడుతుంది. మరి ఈమెకు? " మాయమవని కాలిన గాయం".  సమాజ శ్రేయస్సుకై జీవితాల్ని ఫణంగా పెట్టేఅదృష్టవంతుల కోసం నిరంతరం దురదృష్ట వంతులుగా బతికే శ్రామికులు నిజంగా కోల్పోతుందేమిటో చెబుతూ...
" మా అరచేతుల గీతల్నిఅస్తిత్వాన్నికాలాన్ని" అంటూ తానూ శ్రామిక పక్షపాతినేనని నిరూపించుకుంటుందీ కవి.
 ప్రపంచపు బాధ శ్రీశ్రీ నెట్లా మెలిపెట్టిందోఈమెనూ అంతే. అందుకే సిరియా పిల్లల కొరకు కన్నీళ్ళు పెడుతూనే...
" స్వేచ్చగా తలెత్తుకుని శ్వాసించే అస్తిత్వ కేతనాలు " అంటూ పిడికళ్ళకు కొత్త నిర్వచనాన్నిస్తుంది. 

గడియారంతో పోటి పడుతుబండెడు పుస్తకాలతో కుస్తీ పడుతుమనిషిని మనిషిగా నిలుపలేని చదువులకు బంధీ అయిపోయిన బాల్యాన్ని గడిపే చిన్నారులుస్వేచ్చగా ఎగిరే పక్షులను చూసినప్పుదుఆ పిల్లల కళ్ళు " బస్సు కిటికీ చువ్వలతో చేసే సంభాషణ" ను  మనం వినగలమాఅర్థం చేసుకోగలమాఈ కవి వినగలిగింది. 'అవసరం ' కవిత రాయగలిగింది.
మనసుండే మనుషులుండాలిగానీఆ మనుషులు మాట్లాడగలగాలి కానీశవాలైనా జీవం పోసుకొని తిరుగాడవూఅదే చెబుతుంది 'జీవనది ' కవిత.
 కమ్యూనికేషన్ స్కిల్ఆర్ట్ ఆఫ్ లివింగ్పచ్చిగా చెప్పాలంటే బతుక నేర్వడం తెలిసిన మనుషుల భాగోతాలను చూపే కవిత 'ఎక్స్‌క్లూసివ్ నవ్వులు '. నవ్వులనుమరి ముఖ్యంగా నానార్థాలు తెలిసిన నవ్వులను మనిషి ఉపయోగించినత నైపుణ్యంగా మరే జంతువూ   ఉపయోగించకపోవడం మనిషి సాధించిన విజయమే.  దుఃఖాన్ని భరించడంపంచుకోవడం సులువే. కానీవెటకారపు నవ్వులను భరించడం మాత్రం మహా కష్టమే.
 ఈ కవి తన కవిత్వంలో సూర్యుడిని ఎట్లా ఉదయింపజేస్తుందో చూడండి-
" సూర్యుడు చుక్కల్ని పట్టుకొని
పగటి గంప కింద కప్పిపెట్టి
తన పనికి ఉపక్రమిస్తూ..." అంటుంది. రాత్రిళ్ళు ఊళ్ళల్లో గంప కింద కోడిపిల్లలను మూసిపెట్టిఉదయం కాగానే తెరువడం మామూలే. దాన్నే ఇట్లా తిరిగేసి కాల సూచిగా వాడుకోవడం కవి సాధించిన కవితా మాయజాలం.

"అరువు భాషను
 హావభావాలనువేషధారణను
 చంకలోని బతుకు బరువును
సంచిలో వేసుకొని
నన్ను నేను అమ్ముకోవడానికి బయలుదేరుతా '' ననటంలోకేవలం బతకటం కోసం మన ఇష్టాలనెట్లా దూరం చేకోవాలో తెలిపే ధైన్యంఅయిష్టాలనెట్లా బలవంతంగా నెత్తికెత్తుకోవాలో తెలిపే దౌర్భాగ్యం ' జంతర్ మంతర్ ' కవితతో మనకు చూపిస్తూందీ కవి. ఇదే కవితలో ఒక చోట " నాలుకకు ఇరవై ఆరు అక్షరాల నరకాన్ని కట్టుకొని/ బయలుదేరుతాను" అని అనటంలో పరాయి భాషెప్పుడూ మన సమస్త భావ వ్యక్తీకరణావసరాలను తీర్చలేదని చెప్పటం లేదూ?  ఆ ప్రయత్నం చేయడం నరకంతో సమానమేననే భావం కనిపించటం లేదూ?  ఉద్యోగమంటే ఆషామాషి కాదనిఏ రోజుకారోజు పోరాటమేననిఆ రోజును ముగించటమంటేఆ యుద్ధంలో గెలవటమేనని చెప్పినట్లుగా ఉంటుందీ కవిత. ఈ సంకలనంలో ఆణిముత్యాల్లాంటి కవితల్లో ఇదీ ఒకటి.

  కొన్ని పరిచయాలు బౌతికంగా ముగిసినట్లు అనిపించినావాటి అనుబంధపు తాలుకూ పరిమళాలేవో మనుసుకు అంటుకొని గుభాలిస్తూనే  ఉంటాయని," జ్ఞాపకాల వెన్నని/ చేతిలో చల్లని ముద్దగా ఉంచి వెళ్తాయనికొత్త అనుబంధానికి నాందిగా నిలుస్తాయని ఈ కవి చెబుతుంది.

"అదేంటో
 కడుపులోకి
 పదునైన బాధ దిగిన ప్రతిసారి
 అక్షరాలు గుండెను చీల్చుకొని
 బయటకు వచ్చి
 పసిపిల్లల్లా నవ్వుతాయి " అంటూ ఈ కవి కవిత్వావిర్భావ రహస్యాన్ని మన ముందు ఉంచుతుంది.

చీత్కారాల ఘాటు గాయాల లోతెంతో తెలిపే కవితలుచెమ్మ కన్నుల నీటి సాంద్రతను తెలిపే కవితలు,విరహ వేదననుస్నేహపు విలువను తెలిపే కవితలు,కవులకుకవిత్వానికి,కన్నీళ్ళకు నిర్వచనమిచ్చే కవితలుమొసలి కన్నీరు కార్చే సమాజానికి హితోపదేశం చేసే కవితలుఅనాగరికపు అంటరాని తనాన్నిదాని విషాదకర ప్రతి ఫలనాలను చూపే కవితలుచక్కటి ఉపమానాలతో కూడిన కవితలుఅరుదైన భావచిత్రాలతో కూడిన కవితలు ఈ సంకలనంలో ఎన్నో! చక్కటి కవితా సంకలనాన్ని అందించిన కవిని అభినందిస్తూమరింత చిక్కబడిమరింత పదునుదేలి  ఈ కవి కవిత్వం సమాజానికి దిక్సూచిగా నిలువాలని ఆకాంక్షిస్తున్నాను.
                                                                                            
                                                                                           -నాయుడుగారి  జయన్న