26, ఫిబ్రవరి 2021, శుక్రవారం

నేను - నా ఉద్యోగం

డిగ్రీ అయిపోయే వరకు కూడా పలానా ఉద్యోగమే చేయాలంటూ నాకు పెద్ద కలలేమీ లేవు. మా తల్లిదండ్రులు కూడా పెద్దగా చదువుకున్నవారేమీ కాదు కాబట్టి నా కలలను నాకే వొదిలేశారు.
ఏదో బొమ్మలు బాగా వేయగలనని, పనికొస్తుందని పది తర్వాత ఇంటర్లో బైపిసీ తీసుకున్నాను. ఆ తర్వాత బి.ఎస్సీ., అంతే.
బతకడానికి ఈ మాత్రం చదువు చాలని, పెట్టే,బేడా సర్దుకుని, అప్పటికే హైదరాబాద్లో ఉన్న నా చిన్నప్పటి దోస్తుగాన్ని , నా బతుకుదారిని అన్వేషిస్తూ, నగరానికి వచ్చి పడ్డాను.
ఎస్టీడీ బూతులు, మార్కెటింగ్, నాకొచ్చిన పెయింటింగ్ అన్నీ ప్రయత్నించా, ప్రయోగించా, పనిచేశా. రెండేండ్లు అట్లా నేను నగరానికి అప్పగిస్తే, నాకది ఆకలి, అల్సర్లు, అవమానం బహుమతిగా ఇచ్చింది. ఇక దానితో నాకు, నాతో దానికి పొసగక విడిపోయాం. ఊరికి తిరిగి వచ్చాకా, ఊరికే తిని తిరిగేంత ఆస్తులేమీ లేవు కాబట్టి, అప్పటికి నాకు వచ్చిన, చేతనైన పని చదువుకున్న చదువుతో చదువు చెప్పడం.

అంతే ఓ ఇరవై మంది పిల్లలను పోగేసుకుని చిన్న బడి ఒకటి ప్రారంభించాను. కొంత కాలం గడిచాకా, ప్రభుత్వ బడిలో పిల్లల సంఖ్య తగ్గిపోతుందని, కాబట్టి ఆ పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్చితే, ఈ బడిలోనే ప్యారాటీచర్ గా చేరవచ్చని, ఊరి ఉపాధ్యాయులు చెబితే, పిల్లల తల్లిదండ్రుల అంగీకారంతో బడిలో ప్యారా టీచర్గా చేరిపోయాను.

ఎక్కడైతే చదువు నేర్చుకోవడం మొదలు పెట్టానో! అదే చోట చదువు నేర్పటం మొదలుపెట్టాను.
అప్పుడు మొదలైంది అసలు కల.
పిల్లలకు నేర్పడం ద్వారా కలిగిన సంతృప్తి, వచ్చిన గౌరవం నన్ను జీవితంలో ఉపాధ్యాయుడిగా స్థిరపడిపోవాలనే కలల వైపు నెట్టింది.
అప్పటికీ డిగ్రీ మాత్రమే పూర్తైంది. అది సరిపోదు. బి.ఎడ్., పూర్తి చేయాలి.
బి. ఎడ్.,లో సీటు అంత తేలికగా దొరక లేదు.
దండయాత్ర మొదలైంది. వరుసగా నాలుగేండ్లు ఎంట్రన్స్ రాశాను. మొదటి మూడేండ్లు ఇరవై వేలు, పదహారు వేలు, మూడు వేల ర్యాంకులు వచ్చాయి. సమయం వృధా చేయకుండా ఈ మధ్య కాలంలోనే ఎం.ఏ.,(తెలుగు) పూర్తి చేశాను. నాలుగో ప్రయత్నం లో మూడు వందల ర్యాంకుతో ప్రభుత్వ కళాశాలలో ఫ్రీ సీటు సంపాదించి, పూర్తి చేశాను. ఆ వెనువెంటనే ప్రకటించిన డిఎస్సీ  పరీక్ష రాసి, జిల్లాలో మొదటి ర్యాంకు సాధించి, గ్రేడ్ -1 తెలుగు పండితుడి గా ఎంపికై ఉపాధ్యాయుడిని కావాలనే నా కలను నెరవేర్చుకున్నాను. 16 ఏండ్ల సంది ఈ వృత్తిలో కొనసాగుతున్నాను. సమాజంలో గౌరవాన్నిచ్చింది. బతుకడానికి భరోసానిచ్చింది. ఏనాడు అసంతృప్తి లేదు కృతజ్ఞత తప్పా.

18, ఫిబ్రవరి 2021, గురువారం

పద్య ప్రభంజనం

పద్య ప్రభంజనం దేశభక్తి అంశంపై అవుసుల భానుప్రకాశ్ సంపాదకత్వంలో  వెలువడిన పద్య బృహత్సంకలనం. ఈ పుస్తకంలో రాష్ట్రేతర కవుల రచనలు ఉండినప్పటికీ, అవి స్వల్పమే,  తెలంగాణ ఉమ్మడి జిల్లాల కవుల రచనలే అధికం.   సుమారు 610 మంది కవుల రచనలతో 624 పేజీలతో వెలువడిన బృహత్సంకలనం ఇది.

ఈ గ్రంథాన్ని మెతుకు సీమ సాహితీ సాంస్కృతిక సంస్థ సంగారెడ్డి  ప్రచురించింది. ఈ సంకలనం జనవరి 2021 లో వెలువడింది. ఆచార్య కసిరెడ్డి,  ఆచార్య బేతవోలు రామబ్రహ్మం ఈ గ్రంథానికి మార్గదర్శనం చేశారు.

కంది శంకరయ్య, డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ, డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, దోరవేటి చెన్నయ్య, గుండు మధుసూదన్,  పి విట్టుబాబు సంపాదక మండలిగా వ్యవహరించారు.

ఆదిలాబాద్ నుండి డాక్టర్ మాడుగుల నారాయణ మూర్తి, కరీంనగర్ నుండి నంది శ్రీనివాస్, ఖమ్మం నుండి ఎన్. సి. ఎచ్. చక్రవర్తి, నల్గొండ నుండి  సాగర్ల సత్తయ్య, నిజామాబాద్ నుండి  ఎన్. సాయి ప్రసాద్, మహబూబ్ నగర్ నుండి అంబటి భానుప్రకాష్, బస్వోజు సుధాకర్ ఆచారి,  మెదక్ నుండి వడ్ల రాజయ్య, వర్కోలు లక్ష్మయ్య,  రంగారెడ్డి నుండి గోగులపాటి కృష్ణమోహన్, జి కృష్ణ గౌడ్,  వరంగల్ నుండి గుండు మధుసూదన్,  హైదరాబాద్ నుండి డాక్టర్ మరుమాముల దత్తాత్రేయ శర్మ, రాష్ట్రేతర ప్రాంతాల నుండి పి. విట్టుబాబు జిల్లాల వారి సమన్వయకర్తలుగా వ్యవహరించి, ఈ పుస్తకం రూపకల్పనలో సహకారాన్ని అందించారు.

అష్టకాల నరసింహ రామశర్మ, డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య,  డాక్టర్ నందిని సిద్ధారెడ్డి,  డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, మామిడి హరికృష్ణ, దేశపతి శ్రీనివాస్, గన్నమ రాజు గిరిజా మనోహర్ బాబు, ఆచార్య సూర్య ధనుంజయ్, ఆచార్య బన్న అయిలయ్య, డాక్టర్  ఎన్. రఘు,  డాక్టర్ సాగి కమలాకర శర్మ,  డాక్టర్ పత్తిపాక మోహన్, డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి గౌరవ సలహా మండలి సభ్యులుగా వ్యవహరించారు.

ఈ గ్రంథంలో అనుక్రమణిక ఈ విధముగా ఉన్నది

#ప్రముఖుల ఆశీరభినందనలు,

 #పద్య ప్రబోధం- ఆచార్య కసిరెడ్డి,

 #కవితా ప్రభంజనం- శ్రీ పెరంబదూరు రంగాచార్య

  #అభినందనం- మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్

 #సుస్వాగతం -డాక్టర్ పూసల లింగా గౌడ్

#సంపాదకీయం -అవుసుల భానుప్రకాష్

#ఆదిలాబాద్ జిల్లా కవుల కవిత్వం

 #కరీంనగర్ జిల్లా కవుల కవిత్వం

#ఖమ్మం జిల్లా కవుల కవిత్వం

 #నల్గొండ జిల్లా కవుల కవిత్వం

#నిజామాబాద్ జిల్లా కవుల కవిత్వం

 #మహబూబ్ నగర్ జిల్లా కవుల కవిత్వం

#మెదక్  జిల్లా కవుల కవిత్వం

#రంగారెడ్డి జిల్లా కవుల కవిత్వం

#వరంగల్ జిల్లా కవుల కవిత్వం

#హైదరాబాద్ జిల్లా కవుల కవిత్వం

#రాష్ట్రేతర కవుల కవిత్వం

  పుస్తకావిష్కరణ 

 జనవరి 24,2021,  రోజు హైదరాబాద్లోని తెలంగాణ సారస్వత భవన్ సమావేశ మందిరంలో ఎమ్మెల్సీ కవిత గారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.