తురిమెళ్ళ రాధాకృష్ణమూర్తి జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన కవి. ప్రధానంగా వీరు పద్య కవులు. శతకాలు, సమస్యా పూరణలు వీరు రచించారు. అవధానాలలో పృచ్ఛకులుగా పాల్గొన్నారు. సంస్కృత ప్రచారం, హిందూ ధర్మ ప్రచారం వీరి ప్రవృత్తి. ఆకాశవాణి, దూరదర్శన్ లలో అనేక సాహిత్య కార్యక్రమాలలో వీరు పాల్గొన్నారు.
స్వస్థలం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా దొనకొండ మండలం రామాపురం వీరి స్వస్థలం. 1951 జనవరి ఒకటవ తేదీన వీరు జన్మించారు. తల్లి నరసమ్మ, తండ్రి తురిమెళ్ళ చిన్న పిచ్చయ్య. తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మండలం శాంతినగర్ లో వృత్తి రీత్యా ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ స్థిరపడ్డారు.
విద్యాభ్యాసం
నరసరావుపేట సంస్కృత ఓరియంటల్ కళాశాలలో భాషాప్రవీణను పూర్తి చేశారు. ఆ తర్వాత ఎంఏ తెలుగు, ఎంఏ సంస్కృతం, తెలుగు పండిత శిక్షణను పూర్తి చేశారు.
వృత్తి
జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మండలం శాంతినగర్ లోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలైన రవీంద్ర ఉన్నత పాఠశాలలో ప్రథమ శ్రేణి తెలుగు పండితులుగా పనిచేసి, ఉద్యోగవిరమణ చేశారు.
రచనలు
1.కమలనాభ ద్విశతి
2. శ్రీకృష్ణ శతకం
3. శ్రీ గౌరీ శతకం
4. హనుమత్ శతకం
5. శతసమస్యా పూరణం
కవిగా వీరి మొదటి రచన కమలనాభ ద్విశతి. విజ్ఞాన చంద్రిక అని దీనికి గల మరొక పేరు. 2008 మేలో ఈ రచనను ప్రచురించారు. ఈ రచనను తన తల్లిదండ్రులైన నరసమ్మ తురిమెళ్ళ పిచ్చయ్యలకు అంకితం చేశారు.
ఈ పుస్తకానికి కపిలవాయి లింగమూర్తి, పల్లెర్ల రామమోహన్ రావు, బాబు దేవిదాస్ రావు, ఎస్. ఎమ్. మహమ్మద్ హుస్సేన్, పోలోజు వేణుగోపాలాచారి ముందుమాటలు రాశారు. ఇది ఆటవెలదిలో రాయబడిన గ్రంథమైనప్పుటికి...కందంతో మొదలై కందంతో ముగిసే ద్విశతి.
శ్రీ రఘు రామాశ్రిత మం
దార! దశరథాత్మజ! హరి! దానవ హరణా!
కారుణ్య నిధీ! మాధవ!
భారమనక నన్ను బ్రోవు భద్రగిరీశా!
అన్న పద్యంతో మొదలై,
శ్రీ లక్ష్మీ రమణా! వన
మాలి! దివిజ సన్నుత! పరమాత్మా! శ్ఙ్గారీ!
ఏలుము, మది నమ్మితి నిను,
బాల మురళి! భద్రమొసగు భవహర! కృష్ణా! అను పద్యంతో ముగిసే ఈ ద్విశతిలో 204 పద్యాలు ఉన్నాయి.
తురిమెళ్ళ రాధాకృష్ణ మూర్తి రచించిన రెండో పుస్తకం శ్రీ కృష్ణ శతకం. ఇది పద్య స్తుతి. 2010 సంవత్సరంలో ఈ పుస్తకాన్ని ముద్రించారు. ఇది కందంలో రాయబడిన శతకం. మొత్తం 108 పద్యాలు ఈ శతకం లో ఉన్నాయి. శతావధాని గండ్లూరి దత్తాత్రేయ శర్మ, విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు భూమరాజు సీతారామయ్య ఈ పుస్తకానికి ముందు మాటలు రాశారు. కవి తన అన్నావదినలైన తురిమెళ్ళ కోటేశ్వరరావు, సుగుణావతమ్మలకు ఈ పుస్తకాన్ని అంకితమిచ్చాడు.
2010 సంవత్సరం లోనే వచ్చిన మరో గ్రంథం శ్రీ గౌరీ శతకం.
కంద పద్యంలో వ్రాయబడిన ఈ శతకంలో 109 పద్యాలున్నాయి. ఈ పుస్తకానికి శతావధాని గండ్లూరి దత్తాత్రేయ శర్మ, సాహితీ పరిశోధకులు కపిలవాయి లింగమూర్తి, లలితానంద స్వామి ముందుమాటలు రాశారు.
హనుమత్ శతకం 2017వ సంవత్సరంలో ముద్రించబడింది. ఇది కందంలో రాయబడిన శతకం. ఇందులో 120 పద్యాలున్నాయి. ఈ పుస్తకానికి శతావధాని గండ్లూరి దత్తాత్రేయ శర్మ, అష్టావధాని మద్దూరి రామమూర్తి, బాబు దేవిదాస్ రావు, కే బాలస్వామి ముందుమాటలు రాశారు.
శత సమస్య పూరణం- 2001 నుండి 2004 వరకు ఆకాశవాణి హైదరాబాద్ దూరదర్శన్ వారు ప్రసారం చేసిన సమస్యాపూరణ కార్యక్రమంలో ఇచ్చిన సమస్యలకు పూరణలు ఈ గ్రంథంలోని సమస్యాపూరణలు. ఇందులో 120 సమస్యలకు పూరణలు ఉన్నాయి. ఇందులో సమస్యలు, దత్తపదులు, వర్ణనలు మొదలగునవి ఉన్నాయి.
ఈ పుస్తకానికి కపిలవాయి లింగమూర్తి, శతావధాని గండ్లూరి దత్తాత్రేయ శర్మ, బాబు దేవిదాస్ రావు, అవధానం సుధాకర్ శర్మ, కే బాలస్వామి ముందుమాటలు రాశారు.
అముద్రిత రచనలు
1. అంతర్యామి
2. శ్రీరామచంద్ర శతకం
3. వాయు సందేశం
4. భీష్మపితామహుడు అనునవి వీరి అముద్రిత రచనలు.
పురస్కారాలు
1. గద్వాల డివిజన్ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు (2003)
2. మహబూబ్ నగర్ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు (2005)
3. భగవద్గీత ప్రచారం నందు సంస్కృత భాషా ప్రచార సమితి వారి పురస్కారం.
4. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉత్తమ సాహితీవేత్తగా రాష్ట్ర ప్రభుత్వంచే పురస్కారం.
5. ఉత్తమ ఉపాధ్యాయుడిగా సాహితీవేత్తగా జాతీయ సాహిత్య పరిషత్ వారిచే పురస్కారం.