15, ఏప్రిల్ 2024, సోమవారం

మాట్లాడే నాగలి



 
మలయాళ రచయిత 'పొన్కున్నం వర్కెయ్' రచించిన 'మాట్లాడే నాగలి' కథను ఎన్. వేణుగోపాలరావు తెలుగులోకి అనువాదం చేశారు. ఈ కథను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జంతుప్రేమ భూమికగా  8వ తరగతి తెలుగు వాచకంలో పాఠ్యాంశంగా చేర్చింది.‌
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఈ పాఠాన్ని కళ్ళల్లో కన్నీటిజాడలను పిల్లలకు కనపడకుండా దాచేస్తూ, బోధించడ మనేది నాకో సమస్యా, సవాల్ కూడా.

రైతు -ఓసెఫ్, ఎద్దు -కన్నన్...పన్నెండేళ్ల పాటు ఒకరి కోసం ఒకరు జీవితాన్ని ఎట్లా ధార పోసుకున్నారు. ఒకరి పట్ల ఒకరు ఎలాంటి ఆప్యాయతలను చూపుకున్నారు. ఎంతో ప్రేమగా చూసుకున్న కన్నన్ ను ఓసెఫ్ ఎందుకు అమ్ముకోవలసి వచ్చింది? చివరికి కన్నన్ ఎక్కడికి చేరింది? అన్నదే కథ. రైతుకు ఎద్దులకు మధ్య ఉండే అనుబంధాన్ని అద్భుతంగా చిత్రించిన కథ.

జంతువుల మీద ఇంత ప్రేమను చూపించే ఇట్లాంటి మనుషులు ఇప్పుడు కూడా మన చుట్టూ ఉంటారా? అంటే, ఈ వీడియోనే సాక్ష్యం. గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం యాక్తాపూర్ గ్రామానికి చెందిన ఎల్లన్న  తన ఇంట్లోనే పుట్టిన దూడలను పెంచాడు. 14 సంవత్సరాలు వాటితో అనుబంధాన్ని పెంచుకున్నాడు. కుటుంబ అవసరాల రీత్యా ఆ ఎద్దులను అమ్ముకున్నాడు. ఇద్దరు రైతుల చేతులు మారాకా మూడోసారి సంతకు అమ్మకానికి వచ్చాయి. అక్కడే వాటిని చూసిన ఎల్లన్న కన్నీళ్ళు పెట్టుకున్నాడు. మాట్లాడే నాగలి ఓసెఫ్ ను గుర్తు చేశాడు. రైతులకు పశువులకు మధ్య ఉండే అవ్యాజమైన ప్రేమకు మరోసారి నిదర్శనమయ్యాడు.