25, మే 2019, శనివారం

నేను ఓటరును


నేను...
కవిని
రచయితను
మేధావిని
వృత్తి నిపుణడను
సంఘ సంస్కర్తను
తత్వవేత్తను
వాన్ని
వీన్ని
వానమ్మ మొగుడిని
కాని,
నా ఓటు నా కులానికే
నా ఓటు నా మతానికే
అక్కడ వేరే మతం పార్టీ గెలిచిందని
పొర్లి పొర్లి దొర్లాడి ఏడుస్తా!
ఇక్కడ నా మతం పార్టీ గెలిచిందని
ఎగిరెగిరి సంకలు గుద్దుకుంటా!
ఎవడు దొరైతే నాకేంటి?
ఎవడు దొంగైతే నాకేంటి?
ఎవడు నీతి దప్పిన కొడుకైతే నాకేంటి?
ఎవడు నిజాయితీ పరుడైతే నాకేంటి?
నాక్కావలసిందంతా నా కులమోడు గెలవడమే!
నాక్కావలసిందంతా నా మతమోడు గెలవడమే!!
వాడు పచ్చని పొలాల మీద సెజ్జుల గద్దై వాలనీ
కనబడిన ఖాళీ భూమినంతా వామనుడై ఆక్రమించనీ
సంవత్సరానికో ఎనిమిది వేలు నా బ్యాంకు అకౌంట్లో పడతితే చాలదూ!
వాడు లక్షలకోట్లు మింగనీ,
బ్యాంకులకు పంగనామం పెట్టనీ
భృతి అనో, ఫించన్ అనో
నెలకో పచ్చ నోటు నా మొఖాన కొడితే చాలదూ!
వాడు రేపిస్టో! ఫ్యాక్షనిస్టో
పాపిస్టో, పనికిమాలిన పెసరట్టో
ఎవడైతే నాకేంటి?
నాకేంటన్నదే నాకు ముఖ్యం
కాలం మారినా, నేను మారను
నేను దరిద్రుడిని
నేను మూర్ఖుడిని
నేను ఓటరును

ఎన్. జయన్న
25.05.2019

11, మే 2019, శనివారం

ఎప్పుడు_ మాత్రం...



ఎప్పుడు_ మాత్రం...

నడక మొదలైనప్పుడు శిఖరం వైపు
ఒక చెయ్యి కూడా మన వీపు మీద ఉండదు

శిఖరానికి చేరే క్రమంలో
ముళ్ళు, రాళ్ళు తొక్కి కందిన పాదానికి
ఏ హస్తమూ లేపనం రాయదు.

శిఖరం మీద ఉన్నంత కాలం
తలెత్తి ఒక నేత్రమన్న అసూయ నొదిలి
మన విజయాన్ని హర్షించదు

పడినా,
ఎవడైనా దొబ్బినా
శిఖరం మీద నుండి లోయలోకి
ఇక అంతే...

మనతో రాలేక
ఒక్క అడుగన్న వేయలేక
అక్కడే ఆగిపోయిన కాళ్ళు
తొక్కడానికి సిద్దంగా ఉంటాయి.
చూపడానికి వేళ్ళు వెర్రెత్తి పోతుంటాయి.

#నాయుడు_గారి_జయన్న