10, సెప్టెంబర్ 2019, మంగళవారం

గద్వాల పిజి సెంటర్
* గద్వాల పిజి సెంటర్ కు మంచి రోజులు
* సిద్దమవుతున్న వసతి గృహాలు
* విద్యార్థులకు తప్పనున్న అవస్థలు

        గద్వాల పిజి సెంటరు ప్రగతికి  ప్రధాన అవరోధమైన వసతి గృహాల సమస్య త్వరలో తీరనున్నది. స్త్రీ, పురుషులకు రెండు వసతి గృహాలు శరవేగంగా నిర్మాణమవుతున్నాయి.  కృష్ణానది తీరాన 17 ఎకరాల సువిశాల సుందర స్థలంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటైన పిజి సెంటర్లో  అధ్యయన కేంద్రం, వసతి గృహాల సముదాయం ఇక విద్యార్థులతో కళకళలాడనున్నాయి. వసతి గృహాలు ఏర్పాటుకావడం వలన ఇక్కడి పిజి సెంటర్లోని కోర్సులను ఎక్కువ మంది విద్యార్థులు ఎంపిక చేసుకొనే అవకాశం ఉంది. విద్యార్థుల సంఖ్య పెరిగితే మరిన్ని కొత్త కొర్సులు వచ్చే అవకాశం ఉంటుందని, తద్వారా అక్షరాస్యతలో వెనుకబడిన నడిగడ్డ ప్రాంతం విద్యలో పురోగతి సాధించగలదని ఇక్కడి ప్రజల విశ్వసిస్తున్నారు.
   1993లో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఎం.సి.ఏ., ఎం.కాం., కోర్సులతో గద్వాల పట్టణంలో పిజి సెంటర్ ఏర్పడింది.  పట్టణంలోని డి.కె. సత్యారెడ్డి బంగ్లాలో మొదట్లో తాత్కాలికంగా నిర్వహించారు. నదీ అగ్రహారం దగ్గర పిజి సెంటర్ నిర్మాణం అయ్యాకా పట్టణం నుండి అధ్యయన కేంద్రం అక్కడికి చేరింది.  కొంత కాలం పాటు పట్టణం పిజి విద్యార్థులతో కళకళలాడింది. తదనంతర కాలంలో ఎం.సి.ఏ., కోర్సుకు డిమాండ్ తగ్గడంతో విద్యార్థులు ఎవ్వరూ ఈ కేంద్రాన్ని ఎంపిక చేసుకోకపోవడంతో మూతపడింది. దానితో  కేంద్రంలోని కంప్యూటర్లు, ఇతర సామాగ్రి పాలమూరు విశ్వవిద్యాలయానికి తరలించారు. గద్వాలకు పిజి సెంటర్ వచ్చినట్లే వచ్చి, దూరమైపోయింది.  దేశంలోనే అక్షరాస్యతలో వెనుకబడిన ప్రాంతానికి ఒక దశాబ్దం పాటు ఆ విధంగా స్నాతకోత్తర విద్య దూరమయ్యింది.
అనేక అందోళనలు, అనేక పరిణామాల అనంతరం తిరిగి 2013 సంవత్సరంలో పాలమూరు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పునఃప్రారంభమైంది. విద్వద్గద్వాలగా పేరొందిన ప్రాంతం కావడం, సాహిత్యంతో విడదీయరాని అనుబందం కలిగిన ప్రాంతం కావండంతో   ఎం.ఏ., (తెలుగు) కోర్సుతో పునఃప్రారంభించారు. దీనితో పాటు ఎం.ఏ., (ఆంగ్లం), ఎం.కాం., కోర్సులు కూడా ప్రారంభించారు. పిజి సెంటరులో ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 6 ఆరుగురు అకాడమిక్ కన్సల్టెంట్లు, ఇద్దరు పార్టు టైం ఉపన్యాసకులు పనిచేస్తున్నారు.  సాఫీగా సాగుతున్న కళాశాల ప్రయాణంలో మళ్ళీ కుదుపులు.  సరైన వసతులు లేవని, రవాణా సౌకర్యం లేదని, వసతి గృహాలు లేవని విద్యార్థులు చేరటం తక్కువైంది. చేరిన వారు కూడా మధ్యలోనే వదిలేసి వెళ్ళడం సాధారణమైంది.  విద్యార్థులు తక్కువగా ఉన్నారని, అసలు చేరటం లేదని తెలుగును పాలమూరు సెంటరుకు, ఆంగ్లాన్ని  కొల్లాపూరు సెంటరుకు మార్చాలని  ప్రయత్నాలు జరిగాయని అంటారు.  విద్యావంతులు, విద్యార్థి సంఘాల ఆందోళనలతో  ఆ ప్రయత్నాలకు బ్రేకులు పడ్డాయని అంటారు.  కళాశాల ప్రస్తుతం సాఫీగా సాగుతుంది. 
స్త్రీలకు, పురుషులకు రెండు వసతి గృహాలు నిర్మాణమవుతున్నాయి.  ఇవి పూర్తైతే మరిన్ని కొత్త కోర్సుల ఆగమనంతో కళాశాల  విద్యార్థులతో కళకళలాడుతుంది.  వెనుకబడిన ప్రాంతానికి స్నాతకోత్తర విద్య మరింత అందుబాటులోకి వస్తుంది.  నడిగడ్డ ప్రాంత విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ప్రగతి బాటలో నడవాలని ఆశిస్తున్నాను.
-ఎన్. జయన్న


పురుషుల వసతి గృహం                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                  
  

                          స్త్రీల వసతి గృహం