26, సెప్టెంబర్ 2014, శుక్రవారం

గద్వాల కోటగద్వాల కోట మహబూబ్ నగర్ జిల్లాలోని కోటలన్నిటిలోకి ప్రసిద్ధిచెందినది. ఇది గద్వాల పట్టణం నడి బొడ్డున ఉంది. ఈ కోటను రాజా పెద్ద సోమభూపాలుడు క్రీ.శ.1662లో నిర్మించాడు. ఇతనికే నల్ల సోమనాద్రి అనే పేరు కూడా ఉంది. ఇదే కోటలో చెన్నకేశవస్వామి దేవాలయాన్ని సోమనాద్రియే అత్యంత సుందరంగా నిర్మించాడు. దేవాలయ గోడలపై ఉన్న శిల్పకళ, దేవాలయం ఎదుట ఉన్న 90 అడుగుల గాలిగోపురం ఇప్పటికీ చూపురులను ఆకట్టుకుంటాయి. కోట లోపల ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల నడుస్తున్నవి.
కోటలోని నిర్మాణాలు
ఇది వలయాకారంలో ఉన్న మట్టికోట. కోట బయటి వైపు ఎత్తైన పెద్ద పెద్ద బురుజులతో  మట్టితో నిర్మించబడింది. లోపలి వైపు కోట మొత్తానికి రాతి గోడ ఒక పొరగా నిర్మించబడింది. బయటి మట్టి గోడలు వర్షాకాలంలో తరుచుగా కూలిపోతున్నప్పటికీ, లోపలి వైపు రాతి గోడ ఏ మాత్రం చెక్కు చెదరలేదు. కోటలోకి శత్రువులు ప్రవేశించకుండా కోట బయట చుట్టూరా నీటితో నింపడానికి కందకం నిర్మించారు. నేటికీ కందకం పట్టణంలోని మురికి నీటితో నిండి నాటి దృశ్యాన్ని తలపిస్తుంది.  పశ్చిమాన కోట ప్రవేశద్వారం ఉంది. కోటలోనికి ప్రవేశించగానే, కుడివైపు శిథిలమైన అధికారుల, భటుల నివాస స్థావరాలు కనిపిస్తాయి. వాటిని దాటుకుని ముందుకు వెళ్తే, కుడివైపే ఎత్తైన ఆలయాల ప్రహరీ గోడ కనిపిస్తుంది. ప్రహరీలోపల ఆలయాల సముదాయం కనిపిస్తుంది. వీటిలో  మూడు ఆలయాలు చెప్పుకోదగినవి. వాటిలో ప్రధానమైనది. గద్వాల సంస్థాన ప్రభువుల ఇలవేల్పైన శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం. ఇది మిగిలిన
ఆలయాలకు మధ్యలో ఉండి, ఎత్తైన వేదిక మీద నిర్మించబడి ఉంది.  ఆలయం ముందు గాలి గోపురం పట్టణం మొత్తానికి కనిపించేంత ఎత్తుగా ఉండి, బహు ఆకర్షణీయంగా ఉంటుంది. గాలి గోపురం ద్వారా ఆలయంలోని వచ్చే దారిలో  మెట్ల దగ్గర గంటా వేదిక ఉంది. రాతి స్తంభాలకు చాలా పెద్దదైన గంట వేలాడి ఉంటుంది.  ఈ ఆలయానికి ఇరువైపుల మరో రెండు ఆలయాలు ఉన్నాయి. వీటిలో ఒకటి శివాలయం. ఈ ఆలయాలలోని శిల్పాలు ఆకట్టుకుంటాయి. ఈ మూడు అలయాలు ఒకే ఆవరణలో ఉన్నాయి. ఆలయాల ఆవరణలోకి ప్రవేశించడానికి రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి. తూర్పు వైపు ఉన్న గాలి గోపురం ద్వారా, ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించవచ్చు. దక్షిణం వైపు కూడా మరో ద్వారం ఉండినప్పటికీ అది ప్రవేశ ద్వారం కాదు. ఆ ద్వారం గుండా వెళితే కోటలోపలి పురాతన బావి

కనిపిస్తుంది. ఆలయాల ప్రహరీకి  ఆనుకొని ఆగ్నేయాన రెండు వరుసలలో ఎదురెదురుగా  రాజ భవనాలు ఉండేవి. ఈ భవనాలలో ఒకటైన దక్షిణం వైపు భవనంలో,  కోటలో తర్వాత ఏర్పాటుచేసిన డిగ్రీ కళాశాలకు చెందిన భౌతిక, రసాయన శాస్త్ర ప్రయోగశాలలు ఏర్పాటు చేశారు. పాత భవనం శిథిలమయ్యే కొద్ది ప్రయోగశాలల నిమిత్తం తరుచుగా ఆధునీకీకరించబడి, పూర్తిగా రూపు రేఖలు మారిపోయింది. ఈ భవనానికి దక్షిణం వైపు కొన్ని శిథిలాలు మాత్రం మిగిలి గత చరిత్రకు ఆనవాళ్ళుగా కనిపిస్తాయి. ఈ భవనం దక్షిణం వైపు నుండి కోటలోని బావిలోకి దారి ఉంది. ఈ బావి నాడు తాగు నీటికి, ఈతకు ఉపయోగించినట్లు తెలుస్తుంది. నేటికీ ఈ బావిలోని నీరు స్వచ్చంగా కనిపిస్తుంది. దక్షిణం వైపు భవనానికి అభిముఖంగా మరో రాజభవనం ఉండేది. ఇది రెండంతస్తుల భవనం. ఈ భవనంలోని లోపలి గోడలు అందమైన చిత్రకళతో అలరారేవి. ఉత్తరం వైపు అంతఃపురాన్ని ప్రతిబింభించేలా కలపతో ఏర్పాటుచేసిన అందమైన నిర్మాణాలు కళానైపుణ్యంతో

ఉట్టిపడేవి. భవనం శిథిలదశలో ఉండినప్పుడు
,  ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న రెండు గదులను మాత్రం ఆటలు, ఎన్. సి. సి. నిమిత్తం కళాశాల వారు ఉపయోగించుకునేవారు. అందమైన చారిత్రక భవనాలను పరిరక్షించాల్సిందిపోయి. స్థలం కొరకు కక్కుర్తితో  ప్రభుత్వాలు ఇక్కడ  నూతన నిర్మాణాల కొరకు ఈ భవనపు శిథిలాలను కూడా పూర్తిగా తొలగించారు. ఈ రెండు భవనాల మధ్య అందమైన  ఉద్యానవనం ఉండేది. వనం మధ్యలో సింహాసనం మీద అసీనుడై ఉన్న పెద సోమభూపాలుడి(సోమనాద్రి) పెద్ద విగ్రహం ఉండేది. అది కూడా నేడు ద్వంసమైపోయింది. రాజగోపురానికి తూర్పు వైపు, గోపురానికి అభిముఖంగా రాజా కృష్ణరాంభూపాల్ శిలా విగ్రహం ఉంది. ఈ విగ్రహానికి వెనుక వైపు ఇప్పుడు నూతనంగా నిర్మించబడిన డిగ్రీ కళాశాల భవన సముదాయం ఉంది. రాజ గోపురానికి దగ్గరలో ఇటీవల డిగ్రీ కళాశాల స్వర్ణోత్సవాల సందర్భంగా నాటి సంస్థానపు వీర వనిత మహారాణి ఆదిలక్ష్మిదేవమ్మ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. కోటలోకి ప్రవేశించేటప్పుడు ఎడమవైపు జూనియర్ కళాశాల భవనం కనిపిస్తుంది. కోటలో ఉత్తరం వైపు ఆటస్థలం, తూర్పు వైపు ఎల్లమ్మ దేవాలయం ఉన్నాయి.
కోట చారిత్రక నేపథ్యం
రాజా పెదసోమభూపాలుడు (నలసోమనాద్రి) పూడూరు రాజధానిగా పరిపాలించేవాడు. పూడూరు కోటను మరమ్మత్తు చేస్తుండగా గుప్తనిధి లభించగా, శత్రు ధుర్భేధ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో గద్వాలలో మట్టి కోటను కట్టించాడు. కోట నిర్మాణంలో ఎన్నో అవాంతరాలు రావడముతో కేశవాచారి అనే బ్రాహ్మణుడిని బలి ఇచ్చారని, ఆ పాప పరిహారానికి గాను గద్వాల కోటలో చెన్నకేశవ దేవాలయాన్ని నిర్మించారని కథ ప్రచారంలో ఉంది. చెన్నకేశవ స్వామి ఆలయాన్ని నిర్మించిన తరువాత రాజధానిని పూడూరు నుంచి గద్వాలకు మార్చినాడు. పూడూరును చాళుక్యులు పరిపాలించగా, చాళుక్యులకు, పల్లవులకు మధ్య జరిగిన యుద్దంలో పెదసోమభూపాలుడు కూడా పాల్గొని గదను, వాలమును ప్రయోగించడము వలన ఈ ప్రాంతానికి "గదవాల(గద్వాల)" అన పేరు వచ్చినదని చెబుతారు. ఆవిధంగా ఈ కోట గద్వాల కోటగా చరిత్రలో మిగిలిపోయింది. 1663 నుండి 1950 వరకు గద్వాల సంస్థానాధీశుల ఆధీనంలో ఉండిన ఈ కోట, సంస్థానాల రద్దు తరువాత ప్రభుత్వ పరమైంది.  రాష్ట్ర ప్రభుత్వం  తరువాత 1962లో జిల్లాలోనే మొట్టమొదటి డిగ్రీ కళాశాలను ఈ కోటలోపల ఏర్పాటు చేసింది. డిగ్రీ కళాశాల పేరు కూడా రాణి పేరు మీదుగా మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ డిగ్రీ కళాశాలగా పెట్టబడింది. గద్వాల సంస్థానాధీశులు సాహితీప్రియులు కావడంతో కోటలో తరుచుగా సాహిత్య సభలు జరిగేవి. కవులకు సంస్థానాధీశులు బహుమతులను కూడా అందజేసేవారు. చినసోమభూపాలుని హయంలో అష్టదిగ్గజాలనే 8మంది కవులుండేవారు. వీరి కాలంలో సాహిత్యం బాగా అభివృద్ధి చెందినది. అందుకే గద్వాలకు ''విద్వద్గద్వాల '' అని పేరు. తిరుపతి వేంకట కవులు కూడా గద్వాల సంస్థానాన్ని సందర్శించారు. 
 ఆధారాలు
  * గద్వాల సంస్థాన తెలుగు సాహిత్య పోషణం -డాక్టర్ కట్టా వేంకటేశ్వర శర్మ
  * ఆంధ్రజ్యోతి దినపత్రిక మహబూబ్ నగర్ ఎడిషన్ ప్రారంభోత్సవ ప్రత్యేక సంచిక

8, సెప్టెంబర్ 2014, సోమవారం

గఫార్


గఫార్ మహబూబ్ నగర్ జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రానికి చెందిన కవి. మాతృభాష ఉర్దూ అయినా బాల్యం నుండి తెలుగు భాష మీద మక్కువ ఎక్కువ. ఆ ఇష్టంతోనే  తెలుగు సాహిత్యాన్ని, మరి ముఖ్యంగా శతకాలను  అధ్యయనం చేశారు. ఆ కోవలోనే తెలుగు మీద పట్టు సాధించి, కవిత్వం రాసి పలువురిచే ప్రశంసలందుకున్నారు.
 వృత్తి
గఫార్ విశ్రాంత ఉపాధ్యాయుడు. అచ్చంపేట, సిద్ధాపూర్ తదితర ప్రాంతాలలో  ఉపాధ్యాయులుగా సేవలందించారు. ప్రధానోపాధ్యాయులుగానూ విధులు నిర్వహించారు.
సాహితీ ప్రస్థానం
1981లో తొలిసారి  ''మారుతున్నది సమాజమా?'' అనే కవిత రాసి, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారు ప్రసారం చేసిన యువవాణి కార్యక్రంలో తన కవితావాణిని వినిపించారు. రేడియోలో ప్రసారమైన తన కవితాపఠనానికి వచ్చిన స్పందన ప్రేరణతో మరింత సంకల్పంతో కవిత్వం రాయడం ప్రారంభించారు. సారా వ్యతిరేక ఉద్యమంలోను, జిల్లాలో చేపట్టిన అక్షరకిరణం కార్యక్రమంలోనూ అనేక గీతాలు రాసి ప్రజలను చైతన్యపరిచారు. మరిముఖ్యంగా అచ్చంపేట ప్రాంతంలోని గిరిజనులలో చైతన్యదీప్తికి తోడ్పడ్డారు. 1993లో సారా వ్యతిరేక ఉద్యమంలో భాగంగా తాను రాసిన ''సారాక్షసి '', ''మరణగీతం'' కవితలు వారికి కవిగా మంచి పేరును తీసుకవచ్చాయి. ఇప్పటికీ పలు సామాజిక సమస్యలపై కవితలు రాస్తూనే ఉన్నారు. ఇటీవల నానీలపై దృష్టిసారించి రాస్తున్నారు. త్వరలో నానీలతో ఓ కవితా సంకలనాన్ని వెలువరించటానికి సిద్దమవుతున్నారు.
రచనలు
ఇప్పటికి వారు వెలువరించిన పుస్తకాలు
1. చైతన్య దీపిక (2008)
2.నల్లమల రత్నాలు (2010)
3. ప్రజా ప్రస్థానం (2011)
ప్రశంసలు
వీరి సాహిత్య కృషికి పలు సాహితీ సంస్థలు వీరిని సన్మానించాయి. స్నేహా సేవాసంస్థ, పొద్దుటూరు వారు, గురజాడ లలిత కళావేదిక వారు, ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా జిల్లాలో నిర్వహించిన  సన్నాహక కార్యక్రమాలలో కలెఖ్టర్ కార్యాలయం వారు వీరిని సన్మానించారు.

--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల*
6, సెప్టెంబర్ 2014, శనివారం

పానగల్‌ కోట

పానగల్‌ కోట మహబూబ్ నగర్ జిల్లాలోని గిరి దుర్గాలలో ప్రముఖమైనది. కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఒక మండల కేంద్రమైన పానగల్ సమీపంలో ఈ కోట ఉంది. ఎంతో ఘనమైన చరిత్ర కలిగి, ఈ ప్రాంత ప్రజల సామరస్యానికి ప్రతీకగా నిలిచే అనేక నిర్మాణాలు ఇక్కడ ఉన్నాయి. కోటలో  తటాకాలు, ఉయ్యాల మండపం మొదలగు నిర్మాణాలు కనిపిస్తాయి, కోట లోపల అనేక నిర్మాణాలలో శిల్పకళా నైపుణ్యం అబ్బురపరుస్తుంది. ఈ ప్రాంతపు జానపదుల అనేక కథలలోనూ ఈ కోట ప్రస్తావన ఉంది. కోటలోని పరివారానికి నాడు ఆహారం కొరకు రకరకాల పళ్ళ చెట్లు కూడా కోటలో పెంచేవారని తెలుస్తుంది. కోటకు వెళ్ళడానికి ఎలాంటి సౌకర్యాలను ప్రభుత్వాలు కల్పించకపోయినా, తరుచుగా సందర్శకులు ఇక్కడి వస్తూనే ఉన్నారు. గుప్త నిధుల వేటగాళ్ళ బారినపడి ఇక్కడి అపురూపమైన ప్రాచీన సంస్కృతిక కట్టడాలు నేలమట్టమైపోతున్నాయి. విగ్రహాలు ధ్వంసమైపోతున్నాయి. ఈ ప్రాంతంలో లభించిన అనేక శాసనాలను, ఫిరంగులను జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో భద్రపరిచారు.
ఉనికి
వనపర్తి నుండి కొల్లాపూర్‌కు వెళ్ళేదారిలో వనపర్తికి 14 కిలోమీటర్ల దూరంలో పానగల్ సమీపంలో ఈ కోట కనిపిస్తుంది,
కోట నిర్మాణం
ఈ కోటను ఎత్తైన దుర్గం మీద నిర్మించారు. ఈ పర్వతశ్రేణి మూడు వైపుల గుర్రం నాడా ఆకారంలో ఉండి, తూర్పు దిక్కున రెండు మొనలను కలిగి ఉంది. కొండపై  20 అడుగుల ఎత్తున ప్రాకారాలను నిర్మించారు. సముద్ర మట్టానికి 1600 అడుగుల ఎత్తులో, ఐదు చదరపు మైళ్ళ వైశాల్యంలో కోటను నిర్మించారు. పెద్ద పెద్ద బండరాళ్ళతో ఈ కోటను నిర్మించారు. ఇది 11 వ శతాబ్దిలో కళ్యాణి చాళుక్యుల సామంతులచే నిర్మింపబడినదని అంటారు. శత్రు దుర్బేధ్యమైన ఈ కోటలో 60 దాకా బురుజులు ఉన్నాయి. ఎత్తైన ఈ దుర్గం మీద విశాలమైన పల్లం కలిగి అందులో బావులు, గుడులు, గోపురాలు, మసీదులు ఉన్నాయి. కోట తూర్పు భాగంలో నాలుగు ప్రాకారాలు, వాటిపై ఫిరంగుల స్థావరాలు, సైన్యానికి ఏర్పాటుచేసిన విడిది శాలలు కనిపిస్తాయి.
 సప్త ప్రాకారాలు
చాలా విశాలమైన ఈ కోటలోకి ప్రవేశించడానికి  సప్త ప్రాకారాలు దాటాల్సి ఉంటుంది.  వీటిలో చాలా వరకు నేడు శిథిలమై ఉన్నాయి. కాని ప్రధాన ప్రాకార ద్వారం మాత్రం నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. ఈ ద్వారానికి ''ముండ్లగౌని '' ద్వారమని పేరు. ఈ ద్వారంపై ఉన్న కళానైపుణ్యం ఇప్పటికీ చూపరులను ఆకట్టుకుంటుంది. ద్వారం తలుపులపై బంగారం, పంచలోహాలతో చేసిన చెక్కడాలు, తాపడాలు ఉండేవట. వాటిని గుప్తనిధుల వేటగాళ్ళ దొంగిలించారట. 
రామ గుండం
ఈ కోటలో ఒకే రాతిపై పెద్ద నడబావిని తవ్వించి దానికి రామ గుండం అని పేరు పెట్టారు. నాడు రామగుండంలోని నీటిని తోడి పల్లపు ప్రాంతంలో ఉన్న భూములకు పారించి, పంటలు పండించేవారట. ఇప్పటికీ బావికి రెండువైపులా పెద్ద మోట, చిన్న మోట అనే కట్టడాలు కనిపిస్తాయి.
సీతారాముల పాదాలు
రామ గుండం రాతిపై దక్షిణం వైపు  పాదముద్రలు ఉన్నాయి. వీటికి సీతారాముల పాదముద్రలని పేరు. అందుకే చుట్టు పక్కల గ్రామాల ప్రజలు నేటికీ హైందవ పర్వదినాలైన తొలి ఏకాదశి, శివరాత్రి, శ్రీరామ నవమి మొదలగు రోజుల్లో ఇక్కడికి అధిక సంఖ్యలో వచ్చి, రామగుండంలో స్నానాలు చేసి, సీతారాముల పాదాలకు పూజలు నిర్వహిస్తుంటారు.
శాసనాలు
ఈ కోటలో చాలా శాసనాలు లభించాయి. ఒకటి తెలుగు, కన్నడ మిశ్రమలిపిలో రాయబడిన శాసనం లభించింది. కాని ఇది శిథిలమైనందున, అందులోని విషయం పూర్తిగా తెలిసిరాలేదు. కోటలో గణపతి గుండు అను పాశానంపై మరో శాసనం ఉంది. దీనికి ''ఖైరాత్‌ఖాన్‌ శాసనం'' అని పేరు. ఇది తెలుగు, కన్నడ, అరబిక్ భాషలలో మిశ్రమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ శాసనాలను చిన్న మంత్రి అనే శాసన రచయిత చెక్కినట్లు తెలుస్తుంది.
మక్కా మసీదు
కోటలో మక్కా మసీదు పేరుతో నిర్మించిన ప్రార్థనామందిరం ఉంది. అది ఇప్పటికీ చెక్కుచెదరలేదు. మసీదుపై ఉన్న మినారులను మాత్రం కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఈ మసీదు ముందు ప్రధాన ద్వారానికి రెండువైపుల రాతి సింహాలు ఉన్నాయి. ఇవి సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

ఉయ్యా;ల మండపం
కోటలో నాటి రాజులు విరామ సమయాలు గడపడానికి, సరదాగా ఊగడానికి ఒక పెద్ద ఊయలను, దానికో ఆరామాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. దీనికి ఉయ్యాల మండపం అని పేరు. 
దుర్గంలో దర్గాలు
హజ్రత్ అగా దావుద్ దర్గా ఉంది. ఇక్కడికి హిందూ, ముస్లిం భక్తులు విరివిగా వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. దుర్గం దిగువ భాగంలోనూ ప్రసిద్ధ బార్లాపీర్ల దర్గా ఉంది. హిందూ ముస్లింల సమైక్యతకు ఈ దర్గాలు ఈ ప్రాంతంలో ప్రతీకలుగా నిలుస్తున్నాయి.

4, సెప్టెంబర్ 2014, గురువారం

ఆటవెలది        ఏమి జేయ పసిడి నేమి జేయ పదవి
 గుణము గల్గినట్టి గురువు కిలను
 కాంచి గారవించె కరము లుంటే జాలు
 జయుడి మాట యిదియె జాబిలమ్మ!