30, సెప్టెంబర్ 2013, సోమవారం

మతమా!మతమా!
నీ మత్తు నాకొద్దు
నీ గమ్మత్తులు నాతో చేయొద్దు
నన్నిలాగే మనిషిలాగే ఉండనివ్వు
నాలో మానవత్వాన్ని మిగలనివ్వు
నన్నిలాగే నలుగురితో తిరుగనివ్వు
మతమా!
నీకో దండమే
నీకు కోదండమే
మనిషికి మనిషికి మధ్య కలతలు రేపి
మనసుకు మనసుకు మధ్య గోడలు కట్టి
కులకడం నీకలవాటే కదా!
రాజ్యాలను కూల్చడం
దేశాలను విడగొట్టటం
మానవదేహ యూపదారువులతో
మారణహోమాలు చేయడం
నీకు ఆటే కదా !
అందుకే....
మతమా!
నీకో దండమే !
నీకో పిండమే!!

29, సెప్టెంబర్ 2013, ఆదివారం

విజయం కొరకు...కళ్ళల్లో కాంక్షల ఒత్తులు
అలాగే వెలుగుతూనే ఉన్నాయి
విజయం కొరకు నిర్మించిన మెట్లు
అలాగే ఒరుగుతూనే ఉన్నాయి
ఎన్ని సార్లు ఆత్మన్యూనతా పంక్చరు ట్యూబులోకి
ఆత్మవిశ్వాసపు గాలి పంపినా తుస్సుమంటూనే ఉంది
లక్ష్యం వైపు విసురుతున్న బాణాలన్ని
గురి తప్పుతూనే ఉన్నాయి
విజయం వైపు పరుగులు తీయాలన్న ప్రతిసారి
అపజయాల అవమానపు గుర్తులు చేతులు చాచి
వెనక్కి లాగుతూనే ఉన్నాయి
ఎన్ని తప్పటడుగులు పడుతున్నా ...
ఎన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నా...
నడక నేర్వాలని తపించే పసివాడిలా
అస్తమించే సూర్యుడు ఉదయించట్లేదాని
విజయం కొరకు అర్రులు చాస్తూనే ఉన్నా!


-నాయుడు గారి జయన్న


జాబిలమ్మ!

కన్ను జేరి నలుసు కలత బెట్టిన గాని,
వొళ్ళు జీరి బోవ వోర్వ వచ్చు
యముని బాధ కన్న యధికమేరా నింద
జయుడి మాట నిజము జాబిలమ్మ!

28, సెప్టెంబర్ 2013, శనివారం

జాబిలమ్మ!

పదవి పట్టుకోని  పాకు లాడునొకడు
ఉద్యమమని నొకడు వూగిపోవు
జనము బాధ జూచు జనులు యేడగలరు?
జాలి చూపి చెప్పు జాబిలమ్మ!

24, సెప్టెంబర్ 2013, మంగళవారం

పారాహుషార్

న్యాయం ఓడింది
అవినీతి గెలిచింది
ప్రజల్లారా! పారాహుషార్

చిట్టి కవిత

ఏ మాయ మాటలు
వినిందో
మట్టి లేచిపోతుంది
 సుడిగాలితో కలిసి

23, సెప్టెంబర్ 2013, సోమవారం

చిట్టి కవిత

బాల్యంలో ఇసుక గుడి కట్టాను
వాగు ఒడ్డున.
ఇంకా చెదిరిపోలేదు-
వాటి జ్ఞాపకాలు

22, సెప్టెంబర్ 2013, ఆదివారం

కళ్ళు


కళ్ళకూ  తెలుసు
కాలంలా ...
భావావేశ ఋతు రంగులను మార్చడం.

ఆగ్రహ గ్రీష్మమందు
ప్రచండ కాంతి దృక్ కిరణాలను  ప్రసరించి
నేత్ర గగనాన్ని ఎరుపెక్కించి, మండించడమూ తెలుసు


హర్షాతిరేక వర్షాకాలమందు
శాంతి శ్రావణ మేఘాలను కప్పుకుని
జలజలా కన్నీటి చినుకులను రాల్చడమూ వచ్చు.

                                                                                                                 
- నాయుడిగారి జయన్న
    22. 09. 2013

13, సెప్టెంబర్ 2013, శుక్రవారం

చిట్టి కవిత

ఏమి ఆనందమో!
ఆడుకుంటుంది విస్తరాకు
సుడిగాలిలో విహరిస్తూ...

చిట్టి కవిత

                             


                                   పట్టాలు ఎవరేశారేమో!
                                   గుండెల్లో ...
                                   భయమేస్తే చాలు రైళ్ళే