26, ఏప్రిల్ 2016, మంగళవారం

తెల్ల కాగితం - కొన్ని రాతలు


యశస్వి  సతీష్  తెల్ల కాగితం పై కొన్ని రాతలు

 ఫేస్ బుక్  కవిత్వ వేదిక కవి సంగమం కు  నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి.  ఎందుకంటే దానికై  నేను పెద్దగా రాసినదేమి లేదు.  ఓ నాలుగు పద్యాలు, ఓ మూడు కవితలు , ఓ రెండు పుస్తక సమీక్షలు అంతే. కానీ  కవి సంగమం నాకు లెక్కలేనంత మంది కవులను పరిచయం చేసింది.  వారి కవిత్వాన్ని ఆస్వాదించే అదృష్ణాన్ని ఇచ్చింది.  మహా మహుల సరసన వేదిక ఎక్కి కవిత్వాన్ని వినిపించే భాగ్యాన్ని ఇచ్చింది.  వీటన్నిటికి మించి వెళ్ళిన ప్రతి సారి కొన్ని పుస్తకాలను నాకు బహుమతిగా ఇచ్చింది.  అలా నా చేతికొచ్చిన  వాటిలో యశస్వి సతీష్ తెల్ల కాగితం కూడా ఒకటి. యర్రంశెట్టి సతీష్ యశస్వి కలం  పేరుతో కవిత్వం రాస్తుంటాడు.  తన బ్లాగ్ లో , ఫేస్ బుక్ లో అనేక కవితలు రాశాడు. వాటిలో కొన్ని కవితలను ఏర్చి  కూర్చి వెలువరించిన పుస్తకమే తెల్లకాగితం.  ఇందులో 53 కవితలు ఉన్నాయి. 
      కిటికీ ...ఒంటరి ప్రపంచం నుండి విశ్వాన్ని చూపే ద్వారం.  ఈ పుస్తకం ముఖపత్రానికి ఒక కిటికీ ఉంది.  అందులోంచి చూస్తే, తెల్లకాగితం కనిపిస్తుంది.  తెలుపు ఒక   స్వచ్చత,  శాంతి, ఒక స్వేచ్చ.   మబ్బులకవతల ఆకాశాన్ని చూడగలిగితే  నిర్మలినంగా, నిమ్మళంగా , నిశ్చలంగా కనిపిస్తుంది.  కానీ, అంతర్గతంగా ఎన్నెన్ని గ్రహాలు,  ఉల్కలు, అసంఖ్యాక  నక్షత్రాలు, కమ్మే మబ్బులు, కాసే ఎండలు, కురిసే వానలు.   ఇందులోనూ అంతే  కిటికీ గుండా  చూడగానే  తెల్లకాగితం కనిపిస్తుంది. దానిని  దాటుకుని లోపలికి ప్రవేశిస్తే,  నిస్వార్థం, నిర్భయం,  విశాలత్వం,  స్వచ్చత , స్వేచ్చా ,  ధైర్యం, కోపం, బాధ, దిగులు, జాలి అన్ని కనిపిస్తాయి.  వాటి గురించి మాట్లాడటానికి ముందు మరో మాట చెప్పుకోవాలి.  ఏ కవికైనా తన కవిత్వాన్ని పుస్తకంగా చూడాలని ఉంటుంది.  ఆ పుస్తకాన్ని పాఠకులు చదివి, ఆదరించాలని కోరుకుంటాడు. అంతే. కవి  పాఠకుడి గురించి అంతకు మించి వేరే పట్టించుకోడు.  కానీ ఈ కవి పుస్తకానికి పాఠకుడే ప్రాణమని నమ్మిన వాడు.  కాబట్టి ,  చాలా ప్రాధాన్యమే ఇచ్చాడు.  ఇచ్చేవాడికి  ప్రేమతో ఇవ్వడానికి , వాడి పేరు రాయడానికి  కొంత స్థలం,  చదువుకోవడానికే గాకా రాసుకోవడానికి సగ భాగం,  అంకితం తీసుకోనేవాళ్ళలో అంతర్భాగం చేయడం మొదలుగునవి పాఠకుడికి దక్కిన గౌరవం.  ఇందులో మరో ప్రత్యేకతా ఉందండోయ్!  పుస్తకంలోని పేజీల సంఖ్యలకు బదులుగా వర్ణమాలలోని అక్షరాలతో సూచించడం...  ఎంతటి తెలుగు దనం!  అ తో మొదలై క్ష తో ముగియటం.  నిజంగా వర్ణ  మాలే. ఎన్నెన్ని రంగులను అద్దుకున్న తెల్లకాగితం ఇది!  ఇదంతా కవిత్వానికి ముందుమాట.   ఇక కవిత్వంలోకి వెళితే...

నాది నాదే.  నీది కూడా నాదే అనే స్వార్థ ప్రపంచంలో
  '' నాది నీదైనప్పుడు
    నిజంగా నేను మనిషినవుతాను.'' అని చెప్పగల త్యాగనిరతి ఎంత మందిలో ఉంటుంది.  ఈ కవి అలాంటివాడే.  కాబట్టే

 '' నాకు నచ్చని నా ని పుచ్చుకొని నడువలేను  అని ప్రకటిస్తాడు.

 మన పేరు కోసం, మనమెన్ని ప్రయత్నాలు చేస్తాం, ఎన్నెన్ని పడవాట్లు పడతాం. కవి ఇతరులలో తనను చూసుకొని మురిసిపోవడం కవిదెంత  విశాలహృదయం!  కవిత్వం కళ్ళ జోడుతో లోకాన్ని చూసే కవికి కనిపించినంత స్పష్టంగా ప్రపంచం మరెవరికి కనిపించదు. 

      ఈ కవికి శబ్దాలంకారాల మీద మమకార మెక్కువ.  యతి మైత్రిలు , ప్రాసల లాగా చాలానే కనిపిస్తాయి.  చూడండి... 

'' జగతి ముందు యువతని '',

''పంచుకున్న ప్రేమల్లో ఎంచుకున్న చదువుల్లో''

''తలపుల తనువులను తడమాలని లేదు.''

''తిరిగిరాని తీరాలకు తరలి పోవాలని''  ఇట్లాంటి వృత్త్యానుప్రాసాలంకార వాక్యాలు ఇందులో కొల్లలుకొల్లలుగా కనిపిస్తాయి.

 ఇంకా ఈ  కవి శబ్ధవిన్యాసాలు  చూడండి...

"నీ మునివేళ్ళను ముని మాపు వేళ్ళల్లో"

"నిను వారించాలని, వరించాలని"

 "ఆడి ఆడి వాడేలోగా"

" తడుముతోంది..తరుముతోంది" ఇలా శబ్ధాల మీద తన మమకారాన్ని చాటుకుంటాడు కవి.

శ్రీశ్రీలా తిరిగేసి మరిగేసి చెప్పడం ఈ కవికీ చేతనవును చూడండీ...

''నువ్ తుర్రుమన్నప్పుడు

నే కేర్ మన్ననో!

నే కేర్ మన్నప్పుడు

నువ్ తుర్రు మన్నావో!" అంటాడు.
కవితలకు నేపథ్యాలు చూపడం ఇబ్బందికరమే. పాఠకుడి యొక్క ఊహా శక్తిని పరిమితం చేయడమే. కానీ ఒక్కోసారి మేలు కూడా జరుగుతుందండోయ్! కవి కవితను పాఠకుడు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు. కానీ అపార్థం చేసుకోకూడదు. అలా జరుగకుండ ఉండాలంటే, కవి దృష్టి కోణంలో కవితను చూడాలంటే నేపథ్యాలు అవసరమే. అందుకే ఈ కవి తన పుస్తకంలో చాలా వాటికీ నేపథ్యాలను చూపించాడు. ఇది సమంజసమే.

 ఈ పుస్తకంలోని అద్భుత కవిత 'బొమ్మరాళ్ళు ' అమ్మల ఆవేదనకు, నిర్వేదానికి, అచేతనానికీ, ఆనందానికి అద్దంపట్టిన కవిత ఇది. సుదూరప్రాంతాలలో ఉన్న తన వారి కోసం ఎదురు చూసి, ఎదురు చూసి కళ్ళు కాయలు కాసిన తల్లులు, అవ్వలు తమ వారు తమ దరికి రాగానే, ఆ పిల్లల కోసం చేసే ఏర్పాట్ల గురించి చెబుతూ కవి...

" ఇన్నాళ్ళు కళ్ళకు కాసిన కాయలు
   ఇక చెట్లకు కాస్తాయి" అంటాడు. 
   అరిగిన మోకాళ్ళ మధ్య తిరుగలి తిరుగుతుంది

  నలిగిన వేళ్ళ మధ్య కవ్వం చిలుకుతుంది " అంటూ పిల్లలకై పెద్దలు ప్రేమతో శక్తినంతా కూడదీసుకొని చేసే పనులను దృశ్యాలు, దృశ్యాలుగా మనముందుంచుతాడు కవి.     

ఈ కవి రాజకీయ ఆశావాది. అందుకే..

"ఖద్దరు ముసుగుల లొసుగులు

తొలగిపోయే క్షణాలు...తారాడే రోజుని

మేం చూస్తాం! చూసి తీరుతాం!! " అని ఖచ్చితంగా  ప్రకటిస్తాడు.

 
" సామాన్యుడి బతుకుబండి గతుకుల దారి

పూలబాటైన రోజుని

రోజువారి పనిలో అలసట

 ఆటపాటైన రోజుని

మేం చూస్తాం! చూసి తీరుతాం!! అని గుండెలనిండా ఆశావాదాన్ని నింపుకొంటాడు. ఆశే కదా జీవితానికి భరోసా! ఆశే కదా జీవితానికి శ్వాస.

 ఆధునిక హైటెక్ యుగంలో మనుషుల పద్ధతులు మారిపోయాయి. తమ పేర్లు, పిల్లల పేర్లూ మార్చేస్తున్నారు.

పేర్లలో ఎక్కడా తెలుగు దనం కనిపించకపోవడాన్ని ఈ కవి నిరసిస్తాడు. అందుకే...

" అజంతంగా ఉండలేని నామం పొల్లుతో నేమవుతుంది" అంటాడు.

 

కలహాలతో కాపురం చెడగొట్టుకుంటే అది పిల్లలకు  ఎంత శాపంగా మారుతుందో తెలిపే కవిత 'నాతో ఆడవా?'.

    కొందరి దృష్టిలో మనకు పాకిస్తాన్ శత్రుదేశమే కావొచ్చు. కానీ అక్కడ అందరూ మనకు శత్రువులు కాదు కదా! ఒక చైతన్యం, ఒక పోరాటం ఎక్కడైనా మన అస్తిత్వమే కదా! అందుకే కవి 'మలాలా ' గురించి గుల్ మకాయి ' కవిత రాశాడు. అందులో...

" నా కంటి చెమ్మ సాక్షిగా చెబుతున్నా

పాకిస్తాన్ లోగిలిలో పూచిన మానవతా ప్రియ నేస్తమా!

నువ్ విరబూయడం కాంతి పంచే సూరీడుకి అవసరం " అని నొక్కి చెబుతూ, హృదయానికి హత్తుకుంటాడు. 

 నేర్చుకోవడానికే తప్ప జీవించడానికి, జీవితాన్ని నడపడానికీ  ఏ మాత్రం ఉపయోగపడని నేటి మన విద్యా వ్యవస్థను నిరసిస్తూ...

"మొగ్గల్ని పువ్వులవ్వనివ్వని మొరటుతనాన్ని

నాగరికత నేర్పుతుంది.

చేసిందే చేయడం ఇప్పుడో లెక్క

బొంగరపు జీవితాలు కొత్తపుంతలెక్కవు" అంటూ అన్ని విషయాల ( సబ్జెక్ట్ల) దోరణిని తప్పుపడతాడు.

 ' ఓ సరదా దండకం...సీరియస్ గా ' అంటూ రాసిన వినాయకుడి దండకంలోనూ ఈ కవికి పర్యావరణ స్పృహే. భక్తులకు కళ్ళు తెరిపిస్తాడిందులో.

 ఇంత చెప్పినా మీకు  ఈ కవి పూర్తిగా అర్థం కాలేదా? అయితే మీరు ఖచ్చితంగా ఈ పుస్తకంలోని 'నాకే గనక చేతనవుతే ' కవితను చదవాల్సిందే!

  " జెండాలో  రంగులు పైనా కింద పడి

  తెల్లదనాన్ని కుమ్ముతూ" ఉన్నాయంటూ  దేశంలోని మతకలహాల గురించి, శాంతి అనిశ్చితి గురించి అన్యాపదేశంగా  ప్రస్తావిస్తాడు కవి.

అలాగే...అలాగే అను కవిత మధ్యతరగతి మహాభారతానికి చెందినది. కేవలం ఇది కవిత మాత్రమే కాదు. ఒక్కో వాక్యం ఒక్కో జీవితం. చదివిన ప్రతి ఒక్కరు ఏదో వాక్యంలో తమను తాము చూసుకుంటారు.

 'ఓ రైలు ప్రయాణం' అన్న కవితలో కన్న ఊరిని వదిలి వచ్చే సందర్భాన్ని చెప్తూ కవి  ఓ చక్కటి ఉపమానాన్ని మన ముందు ఉంచుతాడు...

" తెగవలసినదని తెలిసినా

తోడొచ్చే తల్లిపేగులా..."   ఆ జ్ఞాపకాలు వెంటాడుతాయని చెబుతాడు.

కోట్లాది రూపాయల ప్రజాదనాన్ని వృధా చేసే ప్రభుత్వాలకు, దేశాలకు, సంస్థలకు ప్రణాళికలు, సమావేశాల మీద ఉన్న మోజు వాటి ఆచరణ మీద ఉండదన్న పచ్చి నిజాన్ని తెలిపే కవిత ' భయ్యా! డైవర్సిటీ ఎక్కడా? '

" జీవ వైవిధ్య సదస్సు ముగిసింది

ఇక కాగితాలపై అభయారణ్యాలు పెరుగుతాయి " అంటూ కవి తన కలం పోటుతో దెప్పి పొడుస్తాడు. ఎప్పుడో చేనేత వారోత్సవాలపై వినాయకుడి వీణ పేరుతో గోరా శాస్త్రి రాసిన చేనేత దృక్పతం వార్తావ్యాఖ్యను  గుర్తుకు తెస్తాడు కవి.

  ఆచరణకు విలువివ్వని జీవవైవిధ్య సదస్సులంటే ఈ కవికి చికాకే కానీ, జీవులంటే కాదు. అందుకే ఉడుత గురించి, పిచ్చుక గురించి, పాముల గురించి ప్రేమతో కవితలు రాశాడు.

ఇంకా ఈ పుస్తకంలో స్వేచ్చ పేరుతో కొనసాగుతున్న ఆధునిక కాలపు విచ్చలవిడితనాన్ని,పండుగల పరమార్థాన్ని మరిచి వాటిని వికృతంగా మార్చేసినా భక్తుల మూర్ఖత్వాన్ని, హింస, అతివాదం,పశుత్వం, విధ్వంసం, పక్కవాడి నిర్లక్ష్యం మొదలగువాటిని  నిరసించే కవితలు, శ్రమ విలువను తెలిపే కవితలు తల్లీదండ్రులతో అనుబంధాన్ని తెలిపే కవితలు ఇందులో చాలానే ఉన్నాయి.  కవిత్వాన్ని ప్రేమించే వాళ్ళకు  ఈ పుస్తకం ఓ మంచి బహుమతి అని మాత్రం నే ఖచ్చితంగా చెప్పగలను.

ఇంకా ఈ కవి నుండి మరింత వైవిధ్యమైన శిల్పంతో, వస్తువుతో కవిత్వం రావాలని ఆశిద్దాం!!

                                                                  

                                                                                          ---నాయుడుగారి జయన్న

                                                                                              

 

 

17, ఏప్రిల్ 2016, ఆదివారం

తృప్తీ దేశాయ్

తృప్తీ దేశాయ్  మహారాష్ట్రలో లంచగొండితనం, స్త్రీల అసమానత, గృహహింస, అధికార దుర్వినియోగం మొదలగు సామాజిక సమస్యలపై పోరాటం చేస్తున్న సామాజిక ఉద్యమకర్త. పదవ తరగతిలోనే సామాజిక సమస్యలపై పోరాటం మొదలుపెట్టిన ఆమె, ఇటీవల శనిసింగణాపూర్ ఆలయంలో మహిళల ప్రవేశం ఉదంతంతో మరింత వెలుగులోకి వచ్చింది. తృప్తీ దేశాయ్ కుటుంబం మహారాష్ట్రలో సరిహద్దు ప్రాంతమైన నిపానీలో ఉండేవారు. దేశాయ్ ఎనిమిదేళ్ళ వయసులో కుటుంబం పుణెకు తరలివచ్చింది.

సామాజిక ఉద్యమ ప్రస్థానం
తృప్తీ పదవ తరగతి చదువుతున్నప్పుడే 'క్రాంతివీర్ జోప్దీ వికాస్ సంఘ్ ' కలిసి మురికి వాడల్లో ప్రజల స్థితిగతుల మెరుగై పాటుపడింది. వారికందాల్సిన నిత్యావసరాల సరుకులు దళారుల పాలు కాకుండా చూసింది. పేదలకు ఉపాధి అవకాశాలు దక్కేలా వారికి వివిధ అంశాలలో నైపుణ్య శిక్షణను ఇప్పించింది. తృప్తీ శ్రీమతినాథ్ బాయి దామోదర్ థాకర్సే మహిళా విశ్వవిద్యాలయంలో హోం సైన్స్ విద్యార్థిగా ఉన్న సమయంలో, అజిత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ దివాళా తీసింది. దాంతో ముప్పై ఐదు వేల మంది ఖాతాదారుల జీవితాలు రోడ్డున పడ్డాయి. 20 ఏళ్ళ యువకురాలైన తృప్తీ ఖాతాదారుల పక్షం వహించి ఉద్యమించింది. చంపుతామని ఆమెకు హెచ్చరికలు వచ్చాయి. కాని వాటిని లెక్క చేయకుండా పోరాడింది. ఆమె పోరాటం ఫలించి ఇరవై తొమ్మిది వేల మంది ఖాతాదారులు తిరిగి తమ సొమ్మును తాము దక్కించుకోగలిగారు. 2015 నవంబర్ 29 వ తేదిన అహ్మద్ నగర్ లోని శనిసింగణాపూర్లో ఓ మహిళ 400 ఏళ్ళనాటి ఆచారాన్ని కాదని ఒక దేవాలయంలోకి ప్రవేశించి ఆలయంలోని ప్రధాన విగ్రహాన్ని పూజించడం వివాదాస్పదమైంది. ఈ అంశంపై ఆమె ఉద్యమించి, హైకోర్టు సహాయంతో నాలుగు వందల మందితో కలిసి ఆలయ ప్రవేశం చేసింది. కొల్హాపూర్ ఆలయంలోకి స్త్రీలు చీరతోనే ప్రవేశించాలన్న నియమాన్ని నిరసిస్తూ, కమీజ్‌తో ప్రవేశించడానికి ప్రయత్నించి, స్థానికుల దాడిలో గాయపడింది. ఆస్పత్రిలో చేరింది. అయినా ఉద్యమాన్ని ఆపనని ప్రకటించింది.
;భూమాత బ్రిగేడ్: ఏ కులంలో పుట్టినా స్త్రీకి సమానత్వం తప్పని సరి అన్న లక్ష్యంగా 40 మంది సభ్యులతో మహారాష్ట్రలో 'భూమాత బ్రిగేడ్ ' సంస్థను స్థాపించింది. దీనిద్వారానే లంచగొండితనం, రైతు ఆత్మహత్యల నివారణ, అధికార దుర్వినియోగం మరికొన్ని సామాజిక సమస్యలపై పోరాడుతుంది. ప్రస్తుతం ఆ సంస్థలో నాలుగు వేల మంది సభ్యలు ఉన్నారు.
 విమర్శలు 

అజిత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ దివాళా తీసిన సందర్భంలో ఆమె ఉద్యమించడానికి కారణం రాజకీయాలలో చేరాలనుకోవడమేనని విమర్శలు వచ్చాయి. అది నిజమేనేమోననుకొనేలా ఆమె ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించారు. ఓ జాతీయ పార్టీ తరపున ఎన్నికలలో పోటీ చేశారు కూడా. ఆ ఎన్నికలలో ఓటమి చవిచూసిన తృప్తీ దేశాయ్ తన లక్ష్యాలను నెరవేర్చుకోవటానికి రాజకీయాలు ఆటంకంగా మారడాన్ని గమనించి వాటికి దూరం జరిగింది. అనేక హిందూ సంస్థలు ఆమె కార్యకలాపాలను తీవ్రంగా దుయ్యబట్టాయి.

2, ఏప్రిల్ 2016, శనివారం

హల్‌ధార్ నాగ్

కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని చెప్పటానికి చక్కటి ఉదాహరణ హల్‌ధార్ నాగ్. అతి సాధారణ జీవితం నుండి విశ్వ విద్యాలయ విద్యార్థులు తన రచనలపై పరిశోధనలు చేసే స్థాయికి ఎదిగిన కృషీవలుడు.  పశ్చిమ ఒడిశా ప్రాంతానికి చెందిన హాల్దార్ నాగ్  కోస్లి భాషాకవి. 1950లో ఒడిశాలోని బార్‌గఢ్ జిల్లాలో జన్మించాడు. పదేళ్ళ వయసులోనే తండ్రి మరణించాడు. దానితో చదువు ఆగిపోయింది. మూడవ తరగతి వరకు మాత్రమే చదువుకోగలిగాడు. చదువుకు స్వస్తి చెప్పిన పిదప ఓ మిఠాయి దుకాణంలో పాత్రలు కడిగే పనికి కుదిరాడు. ఆ తర్వాత కొద్ది కాలం పాటు ఓ బడిలో వంట పనివాడిగా పనిచేశాడు. అక్కడా కుదురుకోలేకా బ్యాంక్‌లో అప్పు చేసి పుస్తకాల దుకాణం తెరిచాడు. ఆ పుస్తకాల దుకాణమే అతని జీవితాన్ని మార్చి వేసింది.  అతనికి సాహిత్యంపై మక్కువ కలిగేలా చేసింది. ఆవిధంగా సాహిత్య రచనలు  చేయడం ప్రారంభించాడు. ఆయన రాసిన తొలి పద్యం ధోడో బార్‌గజ్ (పెద్ద మర్రిచెట్టు) ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టింది. 1990లో స్థానిక పత్రికలో ఈ రచన ప్రచురించబడింది. ఆ తర్వాత నాగ్ సాహిత్య రచనలో అంచెలంచెలుగా ఎదిగాడు. ఉన్నత స్థితికి చేరుకున్నాడు. ఒడిశాలో 'లోక్‌ కవిరత్న 'గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మూడో తరగతి వరకు మాత్రమే చదువుకున్న ఈ కవి రచనలపై విశ్వవిద్యాలయాల్లో ఐదుగురు విద్యార్థులు పి.హెచ్.డి. పట్టా కొరకు సిద్ధాంత గ్రంథాలను సమర్పించారంటే ఎంతటి గొప్ప సాహిత్య కారుడో మనం ఉహించవచ్చు.  అతని సాహిత్య కృషికి గుర్తింపుగా  ఇటీవల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా నాగ్ పద్మశ్రీ పురస్కారాన్ని కుడా  అందుకున్నాడు. ఒడిశాలోని సంబల్ వర్సిటీ హల్‌ధార్ రచనలను గ్రంథబలీ-2 పేరుతో రూపొందించిన విశ్వవ్విద్యాలయ పాఠ్యప్రణాళికలో భాగం చేసింది. తెల్లటి పంచె, బనీను నిత్య వస్త్రధారణగా కలిగి అతి సాధారణ జీవితం గడిపే హల్‌ధార్ నాగ్ ఎందరికో ఆదర్శప్రాయుడు. కవిత్వం గురించి నాగ్ మాట్లాడుతూ...'' నా దృష్టిలో కవిత్వానికి నిజ జీవితంతో సంబంధం ఉండాలి. ప్రజలకు ఓ సందేశాన్ని అందించాలి అంటాడు.''  నిజమే కదా! ఇప్పటి తరం కవులెంత మంది ఈ ప్రాతిపదిక మీద కవిత్వ రాస్తున్నారంటే చెప్పడం కష్టమే.