జ్ఞాపకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జ్ఞాపకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, మార్చి 2024, ఆదివారం

నేనూ - గొరుసు - గజఈతరాలు

                                                                                                                                                             హాజనిత కల్పిత కథాజగత్తును దాటి వాస్తవ జీవితాలను చిత్రించిన కథలను చదవడం మొదలుపెట్టి అప్పటికి చాలా కాలమే అయ్యింది. కానీ వాటిలోనూ తెలియని మనుషులు, తెలియని భాష, తెలియనిఊర్లూ, వీధులూ అన్ని పరాయివే. ఎవరో తెలియని మనుషుల జీవితాలు చదువుతున్నట్లూ, చూస్తున్నట్లూ ఉండేది. మొదటిసారి 1998 మార్చిలో ఆంధ్రప్రభ వార పత్రికలో ‘ఉసుళ్ళు ‘ పేరుతో ఓ కథ కంటపడింది. ఆ తర్వాత 1999 డిసెంబర్లో ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో మరో కథ ‘గజఈతరాలు’ చూశాను. అంతవరకు మావి అనిపించిన కథలను చూడని నాకు ఈ రెండు కథలు ఆ లోటును తీర్చేశాయి. ఈ కథలు మావే. ఈ భాషా మాదే. ఈ కథల్లో ప్రస్తావించబడిన మహబూబ్ నగర్, గద్వాల, ఉప్పేరు,పెబ్బేరు, బీచుపల్లి, రంగాపురం, వనపర్తి, దేవునిపాలెం, గుడ్లనర్వ అన్నీ మా ఊర్లే. వల్లభనగర్, రాయిగడ్డ, మర్రికుంట అన్నీ మా వీధులే. సాయమ్మ, బాలామణీ, పూర్ణమ్మ అందరూ మా మనుషులే అన్పించింది. ఈ కథలు మనుసుకు ఎంతో దగ్గరైపోయాయి. 

              ‘గజఈతరాలు’ పూర్ణమ్మ అయితే మా అత్తలాగా, ఆమె వెంట తిరిగాడిన పిల్లల్లో నేనొకడినై ఉన్నానేమో! ఆ అనుభవాలన్నీ మావేనేమో! ఆ భాషా మా నోటి నుండి రాలిపడితే ఏరి, రచయిత ఈ కథలో పొందుపర్చాడేమోననిపించింది. అందుకే ఆ కథ నన్ను నేను చూసుకోవడానికి మళ్లీ మళ్లీ ఎన్నిసార్లు చదివానో! గజఈతరాలైన పూర్ణమ్మ, వందమందికి ఈత నేర్పిన పూర్ణమ్మ, కష్టాలని, జీవితాన్ని ఒంటరిగా, ధైర్యంగా ఎదుర్కొని బతుకు సాగించిన పూర్ణమ్మ చివరికి బావిలో పడి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో! చెపుతుందీ కథ. సహజ సంఘటనలకు, సున్నితమైన హాస్యాన్ని జోడించి, సమకాలీన సమస్యలు బతుకులను ఎట్లా చిందరవందర చేస్తాయో, చావులకు కారణం ఎలా అవుతాయో చెప్పిన కథ. చాలా కాలం నన్ను వెంటాడిన కథ. ఇప్పటికీ మరిచిపోని కథ. ఎన్ని కథలు చదివినా, ఎప్పటికీ మనసులో ప్రథమ స్థానంలో పదిలపరుచుకున్న కథ.


       ‘ఉసుళ్ళు’ అడుక్కుతినే మనషులను, వారి ఆర్తనాదాలను అల్లంత దూరంలోనే ఉంచి, కుక్కలకు మాంసం ముక్కలు పెడుతూ సంతోషించే సమాజాన్ని ఓ పార్శ్వాన చూపిన కథ. అంతకుమించి, ఎలాగోలా ఆకలిని జయించాలని నానా అవస్థలు పడే బతుకుల్ని, మరో రకమైన ఆకలి ఎట్లా బలితీసుకుందో హృదయ విదారకంగా చెప్పిన కథ. కథ చదివాకా ‘తుమ్మ ముళ్ళు దిగబడిన తూనీగలాగా’ హృదయాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తాం. 

     ఉసుళ్ళు, గజఈతరాలు మా కథలు, మా ఊరి కథలు. మా మనుషుల కథలు. మరి ఈ కథలు రాసిన ఈ రచయిత ఎవరు? ఎక్కడ ఉంటాడు? ఎలా కలవడం? చాలా కాలం ఈ ప్రశ్నలు వేదించాయి. అన్వేషణ మొదలైంది. 

      ఒకసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణల విభాగంలో కొత్త పుస్తకాల కొరకు వెతుకుతుంటే ఏదో సంవత్సరానికి సంబంధించిన కథావార్షిక ఒకటి కంటపడింది. దాని సంపాద వర్గంలో వీరి పేరు కనబడింది. పుస్తకం చివర్లో వీరి చిరునామా దొరికింది. ఇక నా ఆనందానికి అవధులు లేవు. పుస్తకం తీసుకోలేదు కానీ చిరునామా తెచ్చుకున్నాను. ఈ రెండు కథలపైన నా అభిప్రాయాలను, స్పందనలను తెలియజేస్తూ సుదీర్ఘంగా ఒక ఉత్తరం రాశాను. అప్పుడు ఏం రాశానో! ఎట్లా రాశానో! తెలియదు. తిరిగి జవాబు రాలేదు. చేరిందో! లేదో! కూడా తెలియదు. ఒక రచన చదివి, స్పందించి, దాని రచయితకు ఉత్తరం రాయడం నా వరకు నాకు అదే మొదలు, అదే ఆఖరు కూడా. 

     ఆ తర్వాత మరికొంత కాలానికి ఈ రెండు కథలతో పాటు వలసపక్షులు, చీడ, వాల్తేరత్త, ఖాయిలా బతుకులు మొదలగు మరో ఎనిమిది కథలను కలిపి నాకెంతో ఇష్టమైన ‘గజఈతరాలు’ కథ పేరుతోనే కథా సంపుటిని వెలువరించారు రచయిత. మళ్ళీ చిరునామా సంపాదించి, మనియార్డర్ చేసి, పుస్తకం పంపమని ఉత్తరం రాశాను. పుస్తకం వచ్చింది. దానితోపాటు మనియార్డర్ కూడా తిరిగి వచ్చింది. 

     ఉసుళ్లు, గజఈతరాలుతో పాటు నాకు బాగా నచ్చిన మరో కథ ఖాయిలా బతుకులు. ప్రభుత్వరంగ సంస్థల్లో జరిగే మోసాలు, లీలలు మన కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. పరిశ్రమలో పెద్ద తలకాయలు, వాటిని బటటి నుండి నడిపే శక్తులు పరిశ్రమల మూతకు ఎలా కారణమవుతాయో, తత్ఫలితంగా వాటి మీద ఆధారపడిన బతుకులు ఎలా చిద్రమవుతాయో! చూపిన కథ. ఈ పుస్తకంలోని కథలన్నీ ఆకట్టుకునే కథలే. అన్నీ వాస్తవజీవిత చిత్రణలే. ఈ రచయితకు పాలమూరు మాండలికం మీద ఎంత పట్టు ఉందో, ఉత్తరాంధ్ర మాండలికం మీద కూడా అంతే పట్టు ఉంది. ఈ రచయిత ఈ పుస్తకం తప్ప మరో పుస్తకం వెలువరించినట్లు కనపడదు. అయితేనేం ఇవి తెలుగు కథాసాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోదగ్గ కథలు.

       గొరుసు జగదీశ్వరరెడ్డి గారు ఆదివారం ఆంధ్రజ్యోతికి ప్రముఖుల ఇంటర్వ్యూలు చేసి పెడుతున్నప్పుడు వారి ఫోన్ నెంబర్ దొరికింది. తీరిక దొరికిన ఒకరోజు ఫోన్ చేశాను. ఆనందంగా మాట్లాడారు. నేను రాసిన ఉత్తరం గురించి చెప్పారు. మా ప్రాంతంతో పెనవేసుకున్న వారి బాల్యం, జ్ఞాపకాలు, అనుభవాలు అన్నీ పంచుకున్నారు. చాలా కాలం తీరిక దొరికినప్పుడల్లా ఫోన్లో పలకరించేవారు.

       ఒకసారి ఉద్యోగరీత్యా ఓ 12 రోజుల పాటు వృత్త్యంతర శిక్షణార్థమై హైదరాబాదులో ఉండవలసి వచ్చింది. ఆ సందర్భంలో నగరంలోనే ఉన్నానని వారికి ఫోన్ చేస్తే, అమీర్పేటలోని సారథి స్టూడియోకి వచ్చేయమన్నారు. అక్కడి ప్రివ్యూ థియేటర్లో ఆరోజు సాయంత్రం, పేరు గుర్తుకు లేదు కానీ ఏదో ఇరానీ సినిమాను చూపించారు. సినిమా అయిపోయాకా బయట కేఫ్ లో ఇరానీ చాయ్ తాగుతూ. చాలాసేపు మాట్లాడుకున్నాం. అది నా జీవితంలో అత్యంత ఆనందాన్ని ఇచ్చిన రోజులలో ఒకటి. ఒక అభిమాన రచయితను అట్లా ప్రత్యక్షంగా కలవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. తను బాల్యమంతా గడిపిన ఈ ప్రాంతాలలో, ఈ వీధులలో తనతో కలిసి తిరుగాలని, చూడాలని ఉందని, అందు కోసం ఓ రెండు రోజులు నాకు కేటాయించాలని కోరాను. వారు ఇచ్చే రోజు కోసం ఎదురుచూస్తూ.... 
- నాయుడు గారి జయన్న
      03.03.2024

14, జులై 2021, బుధవారం

నేను - దేవుడు

 జీవితంలో నాకు కొంచెం స్థిరత్వం తక్కువ. అనేకానేక ప్రభావాలకు చాలా తేలికగా లోనై తరుచూ అభిప్రాయాలు మార్చుకుంటుపోతాను. ఈ విషయంలో మరీనూ.


బాల్యమంతా మా పెద్దమ్మ ఊర్లో గడిచిపోయింది. ఇంటి ముందరే హనుమాన్ గుడి. పొద్దున లేవగానే దైవ దర్శనం. వేసవి కాలం గుడి కట్ట మీదే నిద్ర. యవ్వనంలో అర్ధరాత్రి దాకా మిత్రబృందంతో బాతాఖానీ అక్కడే. సరదాగా శనివారాలు, శ్రావణ మాసాలు భజన బృందాలతో మా మిత్రబృందం కలిసిపోయి తాళాలు, గొంతులు, అడుగులు (అడుగు భజన) కలిపే వాళ్ళం.  కొత్తకొత్త పాటలు రాసుకొని కొత్తకొత్త బాణీలతో పాడుకొంటు గడిపేవాళ్ళం. అట్లా సహజంగానే దైవం పట్ల సానుకూలత ఏర్పడింది.

డిగ్రీలోకి ప్రవేశించటంతో పరిస్థితులు మారటం మొదలుపెట్టాయి. కొత్త ఊరు. కొత్త పరిచయాలు. కాలేజీ గొడలపై నినాదాలు, కాలేజీ నేపథ్యం. శ్రీశ్రీ, తిలక్ కవిత్వం (శ్రీశ్రీ ప్రతిజ్ఞ, తిలక్ తపాలా బంట్రోత్ డిగ్రీలో పాఠాలుగా ఉండేవి. దాంతో మహాప్రస్థానం, అమృతం కురిసిన రాత్రి ఇంటికి వచ్చేశాయి. దిన,వార,మాస పత్రికలు కాకుండా సాహిత్యానికీ సంబంధించి నేను కొన్న మొదటి పుస్తకాలు ఇవే) నన్ను మార్చడం మొదలు పెట్టాయి.
వీటికి తోడు దిగజారిపోయిన ఇంటి ఆర్థిక పరిస్థితులు, ముందుకు సాగని చదువు, అధికమైన అవమానాలు, ఆకలి నన్ను దేవుడికి దూరం చేశాయి.
ఇవే పరిస్థితులు ఇంకొంత కాలం ఉండి ఉంటే, ఇంకొంచెం తీవ్రమై ఉంటే అడవి దారి పట్టేవాడినేమో! ఏ పరిస్థితి ఎల్లకాలం ఒకే తీరుగా ఉండదు కదా!  పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. అడవికి దూరమయ్యాను కానీ దేవుడికి దగ్గర కాలేకపోయాను. ఒక దశాబ్దం పాటు ఎర్రజెండకు సమీపంలో నడిచాను.
జీవితంలో మెరుగుపడిన పరిస్థితులు, ప్రభుత్వ ఉద్యోగం, పెళ్ళి, కూతురు, వయసు, అనుభవాలు నన్ను ఒక్కొక్కటి మార్చుకుంటూ వచ్చేశాయి. వీటన్నింటికి మించి అభ్యుదయ మిత్రుల డొల్లతనమూ ఎర్రజెండకూ దూరం చేసింది.‌  కులమతాలు అవమానాలకు, అణచివేతలకు కారణమైనప్ఫుడు తిరుగబడటం నేరం కానేకాదు. ఆ కారణం చేత పొందే ప్రతిఫలాలను కూడా కాలదన్ని, ఏ హద్దులైన దాటి స్వేచ్చగా నచ్చిన కులం, మతంలో చేరిపోయి, నచ్చిన దేవుడిని భుజం మీద మోస్తూ, హీనత్వానికి కారణమైన మతం మీద, దేవుడి మీద యుద్దం చేయడం నికార్సైన మనుషుల పని. అట్లాంటి మనుషులు నాకక్కడ కనపడటం మానేశారు.  ప్రతిఫలాలు అనుభవిస్తూనే, ఎవడి మతం మురికిని వాడు తొలిగించుకోకుండానే, ఎదుటి మతంపై దాడి చేసే సహచరులతో కలిసి నడవడం నాకు కొంచెం కష్టమైపోయింది. పూర్తిగా ఎర్రజెండా నీడ నుండి బయటికి వచ్చేశాను. అట్లాగని భక్తిలో మునిగిందీ లేదు. కుటుంబ సభ్యులతో, మిత్రులతో తప్పని సరి అయినప్పుడు గుడికి వెళ్తాను. దేవుడి ముందుకు వెళ్ళను. కోర్కెల చిట్టా విప్పను. మొక్కినా, చెప్పినా, అరిచినా, ఏడ్చినా, గీపెట్టినా, పొర్లినా, దొర్లినా మనకు ఇవ్వకూడదనిది ఇవ్వడని, ఇవ్వాల్సినవి, ఇవ్ళాల్సిన సమయంలో అడగకపోయినా తప్పకుండా ఇస్తాడని నమ్ముతాను. దేవుడు గుడిలో మాత్రమే ఉంటాడని, చూడాలని, అడగాలని తాపత్రయపడే మనుషులకు అడ్డుతగలడం, ముందునిలబడం భావ్యం కాదని బయటే ఉండిపోతాను. గుడిని, దాని నిర్మాణాన్ని, వాటి శిల్పసౌందర్యాన్ని ఆరాధిస్తూ బయటే ఉండిపోతాను.
ఈ మొత్తం జీవితంలో ఇప్పటికి నేను నేర్చుకున్నది ఏమిటంటే...దేవుడున్నాడో లేడో తేల్చి చెప్పడం కష్టం. ఏది తేల్చినా, వాటికి ఋజువులు చూపడం మరింత కష్టం. ఉంటే అన్ని మతాల దేవుడొక్కడే. ఒక మతం దేవుడు మంచి, ఒక మతం దేవుడు చెడు అంటూ లేడు. మనుషుల దృష్టికోణంలోనే ఈ వ్యత్యాసమంతా. దేవుడు ఉన్నాడనుకుంటే...ఎక్కడెక్కడికో వెతుక్కుంటూ, వెళ్ళాలిసిన అవసరం లేదు. నువ్వున్న చోటే, నీలోనే, నీవు చేసే పనిలోనే ఉండి ఉంటాడు. అన్నిటికి మించి,  తిండి పెట్టే పనికి మించిన దేవుడు ప్రపంచంలో ఏ మతంలోనూ లేడు. కార్యాలయమే  గొప్పగుడి అని భావిస్తాను. 

5, జూన్ 2021, శనివారం

నేను - చిరంజీవి

మా ఊర్లో ప్రతి సంవత్సరం తిరునాళ్ళ జరిగేది. ఒక సంవత్సరం ఆ తిరునాళ్ళలో తోటి పిల్లలు కొంత మంది తమ అంగి జేబుల మీద పువ్వులు, పక్షులు, దేవుళ్ళు వంటి వాటిలో వాళ్బకు నచ్చిన బొమ్మల ముద్రలు వేయించుకున్నారు. నేను కూడా నా జేబు మీద ఒక బొమ్మ ముద్రవేయించాను. అది చిరంజీవి బొమ్మ. ఆ అంగీ, అంగి మీది జేబు, జేబు మీది బొమ్మ ఎప్పుడో చిరిగిపోయాయి, చెరిగిపోయాయి. కానీ, జేబు కింది గుండెలో మాత్రం ఆ బొమ్మ ఇప్పటికీ భద్రంగా ఉండిపోయింది. ఎప్పటికీ ఉంటుంది.


ఊర్లోకి అప్పుడప్పుడూ బట్ట సినిమాలు (టూరింగ్ టాకీస్) వచ్చేవి. అందులో ఎక్కువగా ఎన్టీఆర్, చిరంజీవి సినిమాలే. సువర్ణ సుందరి, భట్టి విక్రమార్క లాంటి సినిమాలు పెద్దవాళ్ళకు వినోదాన్ని పంచిపెడితే, ఇంటి గుట్టు, టింగురంగడు, దేవాంతకుడు, మంత్రి గారి వియ్యంకుడు, బిల్లా రంగా, పులిబెబ్బులి, మగమహారాజు వంటి సినిమాలు మాకు పండుగ వాతావరణం తెచ్చేవి. సినిమా వచ్చిన రోజు సాయంత్రం ఆ పరిసరాల్లో ఎంత సందడి చేసేవారమో! ఈ సినిమాలే అంగి జేబు మీదికి, దాని కింది గుండెలోకి చిరంజీవి బొమ్మ చేరేలా చేశాయి. మేము బడిలో ఒక్కో తరగతి దాటి పోతున్న కాలం, చిరంజీవి ఒక్కో మెట్టూ ఎదుగుతున్న కాలం ఒకటే కావటంతో ఆ అభిమానబంధం మరింత బలపడింది. ఆ డ్యాన్సులు, ఫైట్లు, స్టైల్, డైలాగులు అన్నీ మైమరిపించేవి.


ఆరవ తరగతిలో ఉన్నప్పుడు కరణం విమలమ్మ గారని మాకు ట్యూషన్ చెప్పేది. సాధారణంగా ఉదయం సాయంకాలం ట్యూషన్ ఉండేది. మా తరగతిలో ఓ నలుగురు మిత్రులం మాత్రం రాత్రి భోజనాల తర్వాత కూడా ట్యూషన్ కు వెళ్లి, అక్కడే చదువుకొని, అక్కడే నిద్రపోయే వాళ్ళం. మళ్ళీ తెల్లవారుజామున లేచి చదువుకోవడం చేసేవాళ్ళం. మాకిచ్చిన ఈ సౌలభ్యానికి వారికి మేము చెల్లించవలసిన అదనపు ఫీజు ఏమిటంటే బావి నుండి ఓ పది కడవల నీళ్ళు తెచ్చిపోయడం. ఇలా ఉండగా ఒకరోజు ఊర్లోకి ఖైదీ సినిమా వచ్చింది. అదీ రంగుల సినిమా. అప్పటి దాకా బట్ట మీద నలుపు తెలుపు సినిమాలు మాత్రమే చూసిన అనుభవం. రంగుల సినిమా ఎలా ఉంటుందో చూడాలనే ఉబలాటం. దానికి తోడు అభిమాన హీరో సూపర్ హిట్టు సినిమా. ఆ రాత్రి సినిమా మీద మనుసు పీకుతుంది. మనుషులమేమో ట్యూషన్ లో బంధీ అయిపోయాం. మా ఉబలాటాన్ని గమనించే టీచర్ " ఎవడైనా సినిమాకు వెళ్ళాడో! మరి ట్యూషన్ కు రాడు" అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది. చేసేదేమీలేక పుస్తకంలో తలలు దూర్చాం. అక్షరాలన్నీ గజిబిజిగా కనిపిస్తున్నాయి. పక్కల మా బడి మైదానంలో వేసిన సినిమా మాటలు, పాటలు చెవిలోకి చొరబడుతున్నాయి. టీచర్ హెచ్చరిక ఓ అరగంట మాత్రమే మమ్మల్ని ఆపింది. టీచర్ ఇంట్లో నిద్రపోయిందన్న నిర్ణయానికి వచ్చాకా, బయట అరుగుల మీద పుస్తకాలు, పరుపులు పక్కన పెట్టేసి సినిమాకు వెళ్ళిపోయాం. బ్రహ్మానందభరితంగా సినిమా చూసి వచ్చి, ఏమీ ఎరుగనట్లు చడీచప్పుడు కాకుండా దొంగల్లా వచ్చి చేరి ఎప్పట్లాగే నిద్రపోయాం. పొద్దుగాల లేవగానే "పరుపులు చుట్టుకొని ఇంటికి వెళ్ళండి. దొంగ వెదవల్లారా! వద్దంటే కూడా సినిమాకు వెళ్తరా?" అంటూ టీచర్ కోపంతో ఇంటికి పంపించి వేసింది. మా పెద్దవాళ్ళు బతిమిలాడితే మూడు రోజుల బహిష్కరణ తర్వాత ట్యూషన్ కు రానిచ్చింది టీచర్. మొదట్లో భయపడినా, చివరకు 'చిరంజీవి ఎంత పని చేశాడురా!' అని నవ్వుకున్నాం.

మా ఊర్లో ఏడు వరకు మాత్రమే బడి ఉండేది. హైస్కూలుకు మండల కేంద్రానికి సైకిళ్ళపై వెళ్ళి చదువుకునే వారు మా సీనియర్లు. సీనియర్లకు సినిమా టిక్కెట్ పెడితే చాలు, సైకిళ్ళ మీద మండల కేంద్రంలో ఆదివారం మాత్రమే వేసే మ్యాట్నీ షో చూపించి తీసుకొచ్చేవారు. అలా చూసిన చిరంజీవి సినిమాలు చాలానే ఉన్నాయి.

ఏడవ తరగతిలో మా గురువుగారు గడియారం సాంఖ్యాయన శర్మ గారు (గడియారం రామకృష్ణ శర్మ గారి పెద్ద కుమారుడు). మాకు ఇంగ్లీష్ చెప్పేవారు. బళ్ళో ఒక రోజు ఎక్సర్సైజ్లో భాగంగా కొన్ని ప్రశ్నలు ఇచ్చి జవాబులు రాయమన్నారు. అందులో హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో? అనే ప్రశ్న కూడా ఒకటి. తరగతిలో ఎక్కువ మందిమి చిరంజీవనే రాశాం. ఆయన ఆశ్చర్యపోయి, హో గ్రేట్! నాక్కూడా చిరంజీవంటే ఇష్టమన్నారు. ఇక మా ఆనందానికి అవధుల్లేవు. సారూ కూడా మా పార్టే అంటూ వేయ్యేనుగులు ఎక్కినంత సంతోషపడి పోయాం.


ఏడో తరగతి తర్వాత ఊర్లో చదువు లేకపోవడంతో అందరిలాగే మేము మా మండల కేంద్రానికి వెళ్ళలేదు. మా గురువు శర్మ గారు మా మిత్రబృందాన్ని వారి సొంతూరు అలంపూరుకు తీసుకువెళ్ళి చేర్పించారు. అక్కడే ఎనిమిది నుండి ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నాం. ఈ ఐదేళ్లలో మాకు కావలసినంత స్వేచ్ఛ లభించడం, అలంపూరు నుండి ఆరు కిలోమీటర్ల కాలినడక నడిచి తుంగభద్ర దాటితే కర్నూలు అందుబాటులో ఉండటం, అక్కడ సినిమాలకు కొదువ లేకపోవడం వంటి అంశాలు మా సినిమా పిచ్చికి, చిరంజీవిపై ఇష్టానికి ఆజ్యం పోశాయి.

మా ఊర్లో చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ఉండేది. చిరంజీవి సినిమా విడుదలైతే చాలు థియేటర్ల దగ్గర బ్యానర్లు కట్టేవాళ్ళు. చిరంజీవి మీద అభిమానంతో నాకొచ్చిన కళను మరింత మెరుగుపరుచుకోవచ్చన్న ఆశతో అప్పుడప్పుడు వారికి బ్యానర్లు రాసిచ్చి సహాయపడే వాడిని.


చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చాలా ఆశలు ఉండేవి. అవన్నీ కల్లలైపోయినప్పుడు, రక్తదానం, నేత్రదానం వంటి సేవాకార్యక్రమాలు చేపట్టి రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ అందుకున్న వ్యక్తి మీదే తోటి నటులు అసూయతో అభాండాలు వేసి, అవమానపరిచినప్పుడు చాలా బాధేసింది. తిరిగి సినిమాల్లోకి వచ్చాకా మళ్ళీ కొంత ఊరట కలిగింది. తెలుగు సినీరంగంలో చిరంజీవి ఎప్పటికీ చిరంజీవే!



2, జూన్ 2021, బుధవారం

బాల్యంలో నా అమాయకత్వం

 నాకు ఊహా తెలియకముందే మా పెద్దమ్మ తెచ్చి పెంచుకుంది. నా చదువు అట్లా పెద్దమ్మ ఊరైన పల్లెపాడు(జో.గద్వాల)లో ప్రారంభమైంది. అదో చిన్న పల్లెటూరు. ఐదవ తరగతి వరకు మాత్రమే బడి ఉండేది. మా తరగతిలో ఐదుగురం ఉండేవారం. అందులో శ్యామసుందర్ రెడ్డి నాకు అత్యంత ప్రియమిత్రుడు. బడిలో చదువులు, మైదానాల్లో ఆటలు, వంకల్లో ఈతలు...ఏడున్న ఒకరి భుజం మీద మరొకరి చేయి ఉండాల్సిందే. అట్లా నాలుగేండ్లు గడిచిపోయాయి. ఐదో తరగతికి వచ్చాకా ఆలోచన మొదలైంది. 'ఇది చివరి సంవత్సరం. వచ్చే సంవత్సరం బడి వదలాలి. ఊరు విడువాలి. మరి ఎక్కడ చదవాలి?' ఎక్కడ చదివినా ఇద్దరం ఒకేచోట చదవాలని నిర్ణయించుకున్నాం. అప్పటికి మా ఊరి పిల్లలకు రెండు అవకాశాలు ఉండేవి. ఒకటి మా సొంతూరు జల్లాపురం. అక్కడ ఏడు వరకు మాత్రమే బడి ఉండేది. రెండు ధర్మవరం. అక్కడ పది దాకా బడి ఉండేది. కొంచెం దూరమెక్కువైనా రెండోదే ఎంపిక చేసుకునేవారు మా ఊరి పిల్లలు ఎక్కువ కాలం ఒకే దగ్గర చదువొచ్చని.

రెండ్లేండ్లకే మారాల్సి ఉంటుందని మొదటిది, దూరమెక్కువని రెండోది వద్దనుకున్నాం. మూడో ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తున్నప్పుడు నా మిత్రుడు చెప్పాడు..."మనం వనపర్తి దగ్గర ఉండే మా మేనమామ ఊరికి వెళ్దాం. అక్కడే ఉంటూ చదువుకుందాం. మనకే ఇబ్బంది రాకుండా వాళ్ళు చూసుకుంటారు" అని చెప్పేవాడు. పెద్దల నిర్ణయాల ప్రమేయం లేకుండా పిల్లల ఆలోచనలు కార్యరూపం దాల్చవన్న సత్యాన్ని గ్రహించకుండా అది నిజమైతదనే అమాయకంగా నమ్మాం. ఎన్నెన్నో కలలు కన్నాం. ఆనందంగా ఆ సంవత్సరం ఐదో తరగతి పూర్తి చేశాం. మనం ఒకటి తలిస్తే విధి ఒకటి చేస్తది కదా! పెద్దల నిర్ణయాల మేరకు ఆరవ తరగతికి నేను మా సొంతూరు జల్లాపూర్ కు, తాను వనపర్తికి వెళ్ళిపోయాం. పదేండ్లు గడిచిపోయాయి.

డిగ్రీ పూర్తయ్యాక...

తాను హైదరాబాద్ నగరానికి రమ్మని, తన రూంలోనే ఉండమని, పని కూడా చూసి పెడతానని మాటిచ్చి, బతుకుదారి చూపాడు. చిన్నప్పుడు ఇచ్చిన మాటను ఇలా నెరవేర్చుకున్నాడా అన్పించింది.


26, ఫిబ్రవరి 2021, శుక్రవారం

నేను - నా ఉద్యోగం

డిగ్రీ అయిపోయే వరకు కూడా పలానా ఉద్యోగమే చేయాలంటూ నాకు పెద్ద కలలేమీ లేవు. మా తల్లిదండ్రులు కూడా పెద్దగా చదువుకున్నవారేమీ కాదు కాబట్టి నా కలలను నాకే వొదిలేశారు.
ఏదో బొమ్మలు బాగా వేయగలనని, పనికొస్తుందని పది తర్వాత ఇంటర్లో బైపిసీ తీసుకున్నాను. ఆ తర్వాత బి.ఎస్సీ., అంతే.
బతకడానికి ఈ మాత్రం చదువు చాలని, పెట్టే,బేడా సర్దుకుని, అప్పటికే హైదరాబాద్లో ఉన్న నా చిన్నప్పటి దోస్తుగాన్ని , నా బతుకుదారిని అన్వేషిస్తూ, నగరానికి వచ్చి పడ్డాను.
ఎస్టీడీ బూతులు, మార్కెటింగ్, నాకొచ్చిన పెయింటింగ్ అన్నీ ప్రయత్నించా, ప్రయోగించా, పనిచేశా. రెండేండ్లు అట్లా నేను నగరానికి అప్పగిస్తే, నాకది ఆకలి, అల్సర్లు, అవమానం బహుమతిగా ఇచ్చింది. ఇక దానితో నాకు, నాతో దానికి పొసగక విడిపోయాం. ఊరికి తిరిగి వచ్చాకా, ఊరికే తిని తిరిగేంత ఆస్తులేమీ లేవు కాబట్టి, అప్పటికి నాకు వచ్చిన, చేతనైన పని చదువుకున్న చదువుతో చదువు చెప్పడం.

అంతే ఓ ఇరవై మంది పిల్లలను పోగేసుకుని చిన్న బడి ఒకటి ప్రారంభించాను. కొంత కాలం గడిచాకా, ప్రభుత్వ బడిలో పిల్లల సంఖ్య తగ్గిపోతుందని, కాబట్టి ఆ పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్చితే, ఈ బడిలోనే ప్యారాటీచర్ గా చేరవచ్చని, ఊరి ఉపాధ్యాయులు చెబితే, పిల్లల తల్లిదండ్రుల అంగీకారంతో బడిలో ప్యారా టీచర్గా చేరిపోయాను.

ఎక్కడైతే చదువు నేర్చుకోవడం మొదలు పెట్టానో! అదే చోట చదువు నేర్పటం మొదలుపెట్టాను.
అప్పుడు మొదలైంది అసలు కల.
పిల్లలకు నేర్పడం ద్వారా కలిగిన సంతృప్తి, వచ్చిన గౌరవం నన్ను జీవితంలో ఉపాధ్యాయుడిగా స్థిరపడిపోవాలనే కలల వైపు నెట్టింది.
అప్పటికీ డిగ్రీ మాత్రమే పూర్తైంది. అది సరిపోదు. బి.ఎడ్., పూర్తి చేయాలి.
బి. ఎడ్.,లో సీటు అంత తేలికగా దొరక లేదు.
దండయాత్ర మొదలైంది. వరుసగా నాలుగేండ్లు ఎంట్రన్స్ రాశాను. మొదటి మూడేండ్లు ఇరవై వేలు, పదహారు వేలు, మూడు వేల ర్యాంకులు వచ్చాయి. సమయం వృధా చేయకుండా ఈ మధ్య కాలంలోనే ఎం.ఏ.,(తెలుగు) పూర్తి చేశాను. నాలుగో ప్రయత్నం లో మూడు వందల ర్యాంకుతో ప్రభుత్వ కళాశాలలో ఫ్రీ సీటు సంపాదించి, పూర్తి చేశాను. ఆ వెనువెంటనే ప్రకటించిన డిఎస్సీ  పరీక్ష రాసి, జిల్లాలో మొదటి ర్యాంకు సాధించి, గ్రేడ్ -1 తెలుగు పండితుడి గా ఎంపికై ఉపాధ్యాయుడిని కావాలనే నా కలను నెరవేర్చుకున్నాను. 16 ఏండ్ల సంది ఈ వృత్తిలో కొనసాగుతున్నాను. సమాజంలో గౌరవాన్నిచ్చింది. బతుకడానికి భరోసానిచ్చింది. ఏనాడు అసంతృప్తి లేదు కృతజ్ఞత తప్పా.

29, నవంబర్ 2020, ఆదివారం

అనుభవాలు - జ్ఞాపకాలు -1

1992, ఆగస్ట్, 25 మంగళవారం,

సాయంత్రం 6.30 గంటలు. మోమిన్ మహల్లా వీధికి ఎదురు గుండా చేనేత సొసైటీ కార్యాలయానికి రెండు ఇళ్ళకు అవతల చిన్న గది.  గదిలో ఒంటరిగా నేను. నెత్తికింద పుస్తకాలు దిండుగా పెట్టుకొని, చిరిగిన పరుపొకటి పరుచుకొని పడుకున్నా. ఎదురుగా తెరిచిన తలుపు గుండా బయటికి వీధి వైపు చూస్తున్నా. వీధి చివరి వరకు స్పష్టంగానే కనిపిస్తుంది. చాల సేపటి నుండి చిన్నగా వాన తుంపర్లుగా కురుస్తూనే ఉంది. పిల్లలు ఇళ్ళల్లో నుండి వీధిలోకి వచ్చిచినుకుల్లో తడుస్తూ, ఆడుకుంటూ, అల్లరి చేస్తున్నారు.చాలా సేపు అట్లా వాళ్ళను చూస్తూనే ఉండిపోయాను. చూస్తూ ఉండగానే చినుకుల జోరు పెరిగింది. మంత్రమేసినట్లు పిల్లలందరు మాయమైపోయారు ఇళ్ళల్లోకి. ఒంటరిగా వీధంతా ఏడుస్తున్నట్లుంది జోరుగా కురుస్తున్న వానను చూస్తుంటే...బాగా చీకటి కమ్మింది. ఎక్కడో మెరుపు మెరిసింది. గదిలో కరెంట్ పోయింది. హఠాత్తుగ ఉన్నట్లుండి వీచిన పెద్ద గాలికి వొలిపిరి చినుకులు వచ్చి వొళ్ళో పడ్డాయి. బట్టలు తడిసిపోయాయి. తలుపు మూసేసి, మూలన ఉన్న కిరోసిన్ స్టౌవ్  బయటకు లాగి ఒత్తులన్ని తగ్గించేసి, ఒక ఒత్తిని మాత్రమే పెద్దగా ఉంచి వెలిగించా. గదంతా పలుచటి వెలుగు పరుచుకున్నాకా, తడిసిన బట్టలు దండెం మీద వేసి, టవలుతో తుడుచుకొని, దాన్నే అడ్డంగా చుట్టుకొని పడుకున్నా. బయట ఉరుములు మెరుపులు ఎక్కువయ్యాయి. గదిలో మాత్రం నిశ్శబ్ధం. పోయిన సంవత్సరం వచ్చిన స్కాలర్షిప్ తో తెచ్చుకున్న అలారం వాచ్ మాత్రం గూటిలో టిక్...టిక్..మంటూ శబ్ధం చేస్తుంది.

 

   అరగంట పైనే గడిచిందేమో! టక్..టక్..మంటూ శబ్ధం వచ్చింది. వాచీ వైపు చూశా. అది టిక్..టిక్.. మంటూనే ఉంది.

మళ్ళీ టక్..టక్...???

జాగ్రత్తగా వింటే ఎవరో తలుపు బాదుతున్నట్లు ఉంది. ఎవరు? ఎందుకొచ్చి ఉంటారు? రాత్రి, వర్షంలో, నా కోసం ఎవరొచ్చి ఉంటారు? మొఖం నిండా ప్రశ్నల కొడవళ్ళే. అంతటి చల్లని వాతావరణములో కూడ బుర్ర వేడెక్కినట్లు అనిపించింది.

 

మళ్ళీ టక్..టక్...

చల్ల గాలికో! ఎదో తెలియని భయానికో! తెలియదు కాని వణుకుతూనే  మెల్లగా లేచి తలుపు తెరిచా. విసురుగా బయటి నుండి వచ్చిన చల్ల గాలి వెలుగుతున్న స్టౌవ్ దీపాన్ని ఆర్పేసింది. బాగా తడిసి ముద్దైన ఆకారం. చీకట్లో పోల్చుకోవడం కష్టమైంది. ఉన్నట్టుండి మెరుపొకటి మెరిసిపోయింది.

 

 అసంకల్పితంగా నా నోటి నుండి "దేవరాజ్" ...

(ఇంకా ఉంది)

12, సెప్టెంబర్ 2020, శనివారం

మిత్రమా! శుభాకాంక్షలు

 

















ఇంచుమించు ఒకే ఈడు వాళ్ళం.
ఒకే వీధి వాళ్ళం కూడా
బాల్యంలో
నే కొంచెం ముందు అడుగుపెట్టా బళ్ళో
వెనుక నుండి రివ్వున దూసుకొచ్చాడతను
దత్తపుత్రుని కదా! ఒక్కన్నే పెద్దమ్మకు
నాకే లోటు కనపల్లా!
జీవితమూ అర్థం కాలా!
ఆడిందే ఆట పాడిందే పాట
అవి కుదరనప్పుడు మధ్యలో కాసింత చదువు
అతనట్లా కాదు
ఉమ్మడి పెద్ద కుటుంబం
అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు
పరిస్థితులను, కుటుంబాన్ని, సమాజాన్ని
కష్టపడి పనిచేయడం ఇష్టపడి చదవడం రెండే వ్యాపకాలు
నానా వ్యాపకాలతో నేను పడుతూ లేస్తూ అలసిపోయి, ఆగిపోయా!
దాటి ముందుకెళ్ళిపోయాడు
తలెత్తి చూస్తే అందనంత ఎత్తులో
శిఖరం మీద
అంతర్మథనం...
అలసిపోయానా?
ఆగిపోయానా?
అందుకోలేనా?
లేదు...లేవాలి
సత్తువనంత కూడదీసుకొని లేవాలి!
నడవాలి
ఓపికున్నంతదాకా నడవాలి!
తప్పకుండా అతన్నందుకోవాలి!!
గమ్యానికై సాగే గమనం కట్టుతప్పి పోతున్నప్పుడో
జీవితం పట్టుతప్పి పడిపోతున్నప్పుడో
అతనిట్లా
నాకో ప్రేరణ
నాకో స్ఫూర్తి
నాకో అద్దం
నన్ను నేను సరిచేసుకోవడానికి
అతన్నందుకోవడమైతే చేశా
ఆ వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవడం నాకిప్పటికీ సాధ్యం కాలా.
మా మామ
నా జాన్ జిగిరి
బషీర్ అహ్మద్
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డుకు ఎంపికైన
శుభసందర్భంగా శుభాకాంక్షలతో...-ఎన్. జయన్న

14, జులై 2019, ఆదివారం

మరుపుకురాని అన్న వంటి మిత్రుడు




అతను
నా భుజం మీద భరోసా
నా కంచానికి అమృతం
నా వినోదానికి సినిమా.
నా గమ్యానికి సోపానం
నా లక్ష్యానికి ప్రోత్సాహం
వెరసి నా జీవితానికి అన్న వంటి మిత్రుడు.

***

   ఇంటికొచ్చిన బంధువులు ఊరెళతామంటే సాగనంపటానికి నిన్న మధ్యాహ్నం బస్టాండ్ వెళ్ళాను. అనుకోకుండా అక్కడ ఎల్లయ్య అనే నా బాల్యమిత్రుడు ఏదో పని మీద ఈ ఊరొచ్చి కనిపించాడు.  తాను నాకు   8 వ తరగతి నుండి ఇంటర్ దాకా క్లాస్ మేట్. మేం కలిసిన ఆ కాసేపట్లో పాత జ్ఞాపకాలు, పాత మిత్రులను గుర్తు చేసుకున్నాం. 
ఇంటికి వచ్చాకా భోజనం చేస్తూ ఉంటే ఎల్లయ్య ఇంటర్ వాట్సాప్ గ్రూపులో చేర్చిన మరో మిత్రుడు చిన్న సుంకన్న గుర్తుకొచ్చాడు. అతను కచ్చితంగా ఇలాంటి సమయంలో గుర్తుచేసుకోదగినవాడే. 
          తాను నాకంటే ఓ నాలుగైదేండ్లు పెద్దవాడు. కారణాంతరాల వల్ల ఇంటర్లో క్లాస్ మేట్. మా ఊరివాడే. కానీ, వేరే వేరే ఊర్లలో మా పాఠశాల చదువులు కొనసాగడం వలన ఇంటర్ కొచ్చేదాకా ఒకరికొకరం పరిచయం లేదు. పరిచయం అయ్యాకా ఇక వదిలింది లేదు. ఆ సంవత్సరం మా ఊరి నుండి అలంపూర్ వచ్చి ఇంటర్లో ఓ పది మంది దాకా చేరాం.  తాను సిఈసి, నేను బైపిసిలో చేరాం. నేను నా పాఠశాల మిత్రుడు, మా గ్రూపు వాడే అయిన వెంకట్రాముడితో  కలిసి రూంలో ఉండేవాడిని.  సుంకన్న  తన ఇద్దరు సోదరుల (చిన్నాన్నల కుమారులు)తో కలిసి రూం తీసుకుని ఉండేవాడు. 
     ఆ రూం ఇంటర్ బ్యాచ్ కో ధర్మ సత్రం. విడిది, వినోద కేంద్రం.  రూం నిండా సన్న బియ్యం సంచులు. ఏ లోటు లేని సరుకులు. ఇంటి నుంచి నెలనెలా కంట్రోలులో ఇచ్చిన దొడ్డు బియ్యాన్ని మూటల్లాగా  మోసుకొచ్చుకుని, గొడ్డు కారంతో తిని బతికే మా బోటి వారికి ఆ రూం ఎప్పుడూ ఓ ఆశ్చర్యంగాను, ఓ అద్భుతంగానూ ఉండేది. 

       కారణం ఇదని చెప్పలేను కానీ, మా ఊరి మిత్రులందరిలోకి సుంకన్నకు నాపై అభిమానం ఎక్కువ. నా రూమ్మేట్ మొదటి సంవత్సరం మిగిలిపోయిన సబ్జెక్ట్స్ భయపెట్టడం వల్ల, కుటుంబ ఆర్థిక కారణాలచే, చదువు మీద నిరాసక్తితో రెండవ సంవత్సరం మధ్యలోనే చదువు మానేసి, ఊరెళ్ళి పోయాడు. దానితో నిర్లిప్తంగా, నిరాశాజనకంగా, ఒంటరిగా సాగుతున్న నా జీవితానికి  ఆ సమయంలో సుంకన్న స్నేహం కొండంత అండైంది.  తన వల్లే నా జీవనపు దారులన్నీ ఆనందభరితమయ్యాయి.  
నా భుజం మీద భరోసా అయ్యాడు.
నా కంచానికి అమృతమయ్యాడు.
నా వినోదానికి సినిమా అయ్యాడు.
నా లక్ష్యానికి సోపానమయ్యాడు
నా గమ్యానికి ప్రోత్సాహమయ్యాడు
వెరసి నా జీవితానికి అన్న లేని లోటు తీర్చిన మిత్రుడయ్యాడు.

అతనితో ఎన్నెన్ని జ్ఞాపకాలో! 
ఒకసారి తాను ఊరెళ్ళినప్పుడు మా అమ్మతో  డబ్బులు తీసుకరామంటే తీసుకొచ్చి, ఇచ్చి ఒకటే నవ్వు.
" ఏమప్పా! మీ అమ్మ ఎప్పుడూ డబ్బులు చూసిలేదా? గీ రెండొందలియ్యనికా ఎంత తనుకులాడిందో! ఎన్ని సార్లు లెక్కబెట్టిందో! గీ చిల్లర మోసుకరానికా  నాతల ప్రాణం తోక కొచ్చిందిపో" అని ఆటబట్టిచ్చాడు.
" అన్నా! మీ లాగా మేం ఆస్తిపరులం కాదే. మా అమ్మ మోయలేని గడ్డి మోపులు తెచ్చి  బర్రెలకెస్తే, తిని ఆ కృతజ్ఞతతో అవిచ్చిన పాలమ్మగా వచ్చిన డబ్బులే అవి. అందుకే అవంటే మా అమ్మకు అంత ప్రేమ" అని నేనంటే గుండెలకత్తుకున్న నేస్తమతను.

నా రూమ్మేట్ గురించి చెబుతూ " ఏమప్పా! మీ వోడు ఆ అమ్మాయి కొరకు మా గ్రూపొదిలి (సిఈసి) మీ గ్రూపు(బైపీసీ)కొచ్చా. సదువంతా సంకనాకిచ్చా. సదువలేక ఇంటికొచ్చా. ఈడ ఉన్నన్ని రోజులు ఆ అమ్మాయి చుట్టూ తిరగవట్టే. ఆ అమ్మాయేమో నీ దిక్కు సూడవట్టే. నీవేమో పట్టిచ్చుకోవు. ఇకనైనా సూత్తావా లేదా?!" అంటూ సరదాగా సతాయించేటోడు.  ఆ సంగతి అవునో! కాదో! నాకు తెలియదు కాని. అతనా ప్రస్తావన తెచ్చినప్పుడల్లా నాకు కూసింత గర్వంగా ఉండేది. పర్వాలేదులే అమ్మాయిల్లో నాక్కూడా అభిమానులు ఉన్నారని ఆనందమేసేది. 

రెండవ సంవత్సరం చివర్లో కాలేజీ డే కొరకు సుంకన్న వాళ్ళ రూంలో రిహార్సల్స్ జరుగుతున్నవి. సుంకన్న నన్నూ రమ్మనేవాడు. ఆ ఊరి పోలీస్ కానిస్టేబుల్ ఒకాయన ఓ జానపద నృత్యాన్ని నేర్పేందుకు నిశ్చయించుకున్నాడు.
చాలా మందిని పరిశీలించాకా సిఈసి వెంకట్ ను ఎంపిక చేసుకొని ఏడెనిమిది రోజులు శిక్షణ ఇచ్చాడు. కాలేజీ డేకు రెండు రోజుల ముందు వెంకట్ అనుకోని కారణాలచే తప్పుకోవాల్సి వచ్చింది. తన శ్రమ అంతా వృథా అయ్యిందని కానిస్టేబుల్ బాధపడుతుంటే, సుంకన్న అతని ముందుకు నన్ను తోశాడు. "చేయగలడా?" అని అతనంటే... రోజూ చూస్తున్నాడన్నాడు. నేను అదేమాటంటే "అహే చేస్తవుపో!" అన్నాడు. ఎట్లా చేశానో! ఏమి చేశానో! తెలియదు గాని, కాలేజీ డే రోజు స్టేజి మీద 'కోడిపాయే లచ్చమ్మది, కోడిపుంజు పాయే లచ్చమ్మది' అంటూ ఎగిరి చిందులేశాను. అట్లా నన్ను రంగస్థలానికి పరిచయం చేసిన గురువు సుంకన్న.

పరీక్షలు దగ్గర పడుతున్నప్పుడు ఉన్న రూములు డిస్ట్రబ్ చేస్తున్నవని వాటిని అలాగే వదిలేసి న్యూప్లాట్స్ లో తెలిసిన వాళ్ళ రూం ఖాళీగా ఉందంటే, అక్కడే ఉండి చదువుకున్నాం. 
అట్లా ఇంటరంతా సుంకన్న ఒక ఎడతెగని జ్ఞాపకమే.

ఇంటర్ ముగిశాకా దారులు వేరయ్యాయి. దూరం పెరిగిపోయింది. తానో చోట. నేనో చోట. అదృష్టం కలిసి అప్పుడప్పుడు ఊర్లోనో! కర్నూలులోనో కలిసేవాళ్ళం. 
ఊరికి ఎప్పుడు వెళ్ళినా, ఊరిబయట ఊరికి స్వాగత ద్వారంలా ఉండే వాళ్ళింటి వైపు కళ్ళు దృష్టి సారించేవి.
తరుచూ నిరాశే ఎదురయ్యేది. కాలగమనంలో
27 ఏండ్లు గడిచిపోయాయి.

పోయిన ఏడాది ఇంటర్ మిత్రులు వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేశారు. ఆ గ్రూపులో నిన్న కలిసిన ఎల్లయ్యనే సుంకన్న ఫోన్ నెంబర్ చేర్చాడు. సేవ్ చేసి పెట్టుకున్నాను. మాట్లాడుదాం, మాట్లాడుదాం అంటూ వాయిదా వేస్తూ వచ్చాను. ఎల్లయ్యను కలిసి ఇంటికి వచ్చి భోజనం ముందు కూర్చున్నాను. అయిపోయేదాకా కూడా ఆగలేకపోయాను. ఫోనందుకుని సుంకన్నకు చేశాను. ఫోనెత్తగానే-
"సుంకన్నా! నేను జయన్న" అంటూ  ఆత్రంగా పరిచయం చేసుకున్నా.
"ఎవరు?” అవతలి నుంచి. సుంకన్న స్వరం వినపడకపోయే సరికి ఏదో అనుమానం.
"అమ్మా! నేను సుంకన్న దోస్తును"  
"ఎక్కడ దోస్తు?" మళ్ళీ ప్రశ్న.
"ఇంటర్ - అలంపూర్ లో అమ్మా"
"ఇంకేడ సుంకన్న నాయినా! మార్చిలోనే మాకు దూరమయినాడు. హార్ట్ఎటాక్ వచ్చి పోయాడు"
ఆ స్వరంలో స్పష్టత పోయింది. దుఃఖం నిండిపోయింది. తర్వాత మూగపోయింది. ఫోన్ కట్టైంది.
నాకిక ముద్ద దిగలేదు. గుండె బరువైంది. కంచంలో అసంకల్పితంగా టపటపా కన్నీటి బొట్లు రాలిపడ్డాయి. రాత్రంతా అతని జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. 
తనువులో ఊపిరున్నంత కాలం అవి అలాగే ఉండిపోతాయి.

- ఎన్. జయన్న