5, జూన్ 2021, శనివారం

నేను - చిరంజీవి

మా ఊర్లో ప్రతి సంవత్సరం తిరునాళ్ళ జరిగేది. ఒక సంవత్సరం ఆ తిరునాళ్ళలో తోటి పిల్లలు కొంత మంది తమ అంగి జేబుల మీద పువ్వులు, పక్షులు, దేవుళ్ళు వంటి వాటిలో వాళ్బకు నచ్చిన బొమ్మల ముద్రలు వేయించుకున్నారు. నేను కూడా నా జేబు మీద ఒక బొమ్మ ముద్రవేయించాను. అది చిరంజీవి బొమ్మ. ఆ అంగీ, అంగి మీది జేబు, జేబు మీది బొమ్మ ఎప్పుడో చిరిగిపోయాయి, చెరిగిపోయాయి. కానీ, జేబు కింది గుండెలో మాత్రం ఆ బొమ్మ ఇప్పటికీ భద్రంగా ఉండిపోయింది. ఎప్పటికీ ఉంటుంది.


ఊర్లోకి అప్పుడప్పుడూ బట్ట సినిమాలు (టూరింగ్ టాకీస్) వచ్చేవి. అందులో ఎక్కువగా ఎన్టీఆర్, చిరంజీవి సినిమాలే. సువర్ణ సుందరి, భట్టి విక్రమార్క లాంటి సినిమాలు పెద్దవాళ్ళకు వినోదాన్ని పంచిపెడితే, ఇంటి గుట్టు, టింగురంగడు, దేవాంతకుడు, మంత్రి గారి వియ్యంకుడు, బిల్లా రంగా, పులిబెబ్బులి, మగమహారాజు వంటి సినిమాలు మాకు పండుగ వాతావరణం తెచ్చేవి. సినిమా వచ్చిన రోజు సాయంత్రం ఆ పరిసరాల్లో ఎంత సందడి చేసేవారమో! ఈ సినిమాలే అంగి జేబు మీదికి, దాని కింది గుండెలోకి చిరంజీవి బొమ్మ చేరేలా చేశాయి. మేము బడిలో ఒక్కో తరగతి దాటి పోతున్న కాలం, చిరంజీవి ఒక్కో మెట్టూ ఎదుగుతున్న కాలం ఒకటే కావటంతో ఆ అభిమానబంధం మరింత బలపడింది. ఆ డ్యాన్సులు, ఫైట్లు, స్టైల్, డైలాగులు అన్నీ మైమరిపించేవి.


ఆరవ తరగతిలో ఉన్నప్పుడు కరణం విమలమ్మ గారని మాకు ట్యూషన్ చెప్పేది. సాధారణంగా ఉదయం సాయంకాలం ట్యూషన్ ఉండేది. మా తరగతిలో ఓ నలుగురు మిత్రులం మాత్రం రాత్రి భోజనాల తర్వాత కూడా ట్యూషన్ కు వెళ్లి, అక్కడే చదువుకొని, అక్కడే నిద్రపోయే వాళ్ళం. మళ్ళీ తెల్లవారుజామున లేచి చదువుకోవడం చేసేవాళ్ళం. మాకిచ్చిన ఈ సౌలభ్యానికి వారికి మేము చెల్లించవలసిన అదనపు ఫీజు ఏమిటంటే బావి నుండి ఓ పది కడవల నీళ్ళు తెచ్చిపోయడం. ఇలా ఉండగా ఒకరోజు ఊర్లోకి ఖైదీ సినిమా వచ్చింది. అదీ రంగుల సినిమా. అప్పటి దాకా బట్ట మీద నలుపు తెలుపు సినిమాలు మాత్రమే చూసిన అనుభవం. రంగుల సినిమా ఎలా ఉంటుందో చూడాలనే ఉబలాటం. దానికి తోడు అభిమాన హీరో సూపర్ హిట్టు సినిమా. ఆ రాత్రి సినిమా మీద మనుసు పీకుతుంది. మనుషులమేమో ట్యూషన్ లో బంధీ అయిపోయాం. మా ఉబలాటాన్ని గమనించే టీచర్ " ఎవడైనా సినిమాకు వెళ్ళాడో! మరి ట్యూషన్ కు రాడు" అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది. చేసేదేమీలేక పుస్తకంలో తలలు దూర్చాం. అక్షరాలన్నీ గజిబిజిగా కనిపిస్తున్నాయి. పక్కల మా బడి మైదానంలో వేసిన సినిమా మాటలు, పాటలు చెవిలోకి చొరబడుతున్నాయి. టీచర్ హెచ్చరిక ఓ అరగంట మాత్రమే మమ్మల్ని ఆపింది. టీచర్ ఇంట్లో నిద్రపోయిందన్న నిర్ణయానికి వచ్చాకా, బయట అరుగుల మీద పుస్తకాలు, పరుపులు పక్కన పెట్టేసి సినిమాకు వెళ్ళిపోయాం. బ్రహ్మానందభరితంగా సినిమా చూసి వచ్చి, ఏమీ ఎరుగనట్లు చడీచప్పుడు కాకుండా దొంగల్లా వచ్చి చేరి ఎప్పట్లాగే నిద్రపోయాం. పొద్దుగాల లేవగానే "పరుపులు చుట్టుకొని ఇంటికి వెళ్ళండి. దొంగ వెదవల్లారా! వద్దంటే కూడా సినిమాకు వెళ్తరా?" అంటూ టీచర్ కోపంతో ఇంటికి పంపించి వేసింది. మా పెద్దవాళ్ళు బతిమిలాడితే మూడు రోజుల బహిష్కరణ తర్వాత ట్యూషన్ కు రానిచ్చింది టీచర్. మొదట్లో భయపడినా, చివరకు 'చిరంజీవి ఎంత పని చేశాడురా!' అని నవ్వుకున్నాం.

మా ఊర్లో ఏడు వరకు మాత్రమే బడి ఉండేది. హైస్కూలుకు మండల కేంద్రానికి సైకిళ్ళపై వెళ్ళి చదువుకునే వారు మా సీనియర్లు. సీనియర్లకు సినిమా టిక్కెట్ పెడితే చాలు, సైకిళ్ళ మీద మండల కేంద్రంలో ఆదివారం మాత్రమే వేసే మ్యాట్నీ షో చూపించి తీసుకొచ్చేవారు. అలా చూసిన చిరంజీవి సినిమాలు చాలానే ఉన్నాయి.

ఏడవ తరగతిలో మా గురువుగారు గడియారం సాంఖ్యాయన శర్మ గారు (గడియారం రామకృష్ణ శర్మ గారి పెద్ద కుమారుడు). మాకు ఇంగ్లీష్ చెప్పేవారు. బళ్ళో ఒక రోజు ఎక్సర్సైజ్లో భాగంగా కొన్ని ప్రశ్నలు ఇచ్చి జవాబులు రాయమన్నారు. అందులో హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో? అనే ప్రశ్న కూడా ఒకటి. తరగతిలో ఎక్కువ మందిమి చిరంజీవనే రాశాం. ఆయన ఆశ్చర్యపోయి, హో గ్రేట్! నాక్కూడా చిరంజీవంటే ఇష్టమన్నారు. ఇక మా ఆనందానికి అవధుల్లేవు. సారూ కూడా మా పార్టే అంటూ వేయ్యేనుగులు ఎక్కినంత సంతోషపడి పోయాం.


ఏడో తరగతి తర్వాత ఊర్లో చదువు లేకపోవడంతో అందరిలాగే మేము మా మండల కేంద్రానికి వెళ్ళలేదు. మా గురువు శర్మ గారు మా మిత్రబృందాన్ని వారి సొంతూరు అలంపూరుకు తీసుకువెళ్ళి చేర్పించారు. అక్కడే ఎనిమిది నుండి ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నాం. ఈ ఐదేళ్లలో మాకు కావలసినంత స్వేచ్ఛ లభించడం, అలంపూరు నుండి ఆరు కిలోమీటర్ల కాలినడక నడిచి తుంగభద్ర దాటితే కర్నూలు అందుబాటులో ఉండటం, అక్కడ సినిమాలకు కొదువ లేకపోవడం వంటి అంశాలు మా సినిమా పిచ్చికి, చిరంజీవిపై ఇష్టానికి ఆజ్యం పోశాయి.

మా ఊర్లో చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ఉండేది. చిరంజీవి సినిమా విడుదలైతే చాలు థియేటర్ల దగ్గర బ్యానర్లు కట్టేవాళ్ళు. చిరంజీవి మీద అభిమానంతో నాకొచ్చిన కళను మరింత మెరుగుపరుచుకోవచ్చన్న ఆశతో అప్పుడప్పుడు వారికి బ్యానర్లు రాసిచ్చి సహాయపడే వాడిని.


చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చాలా ఆశలు ఉండేవి. అవన్నీ కల్లలైపోయినప్పుడు, రక్తదానం, నేత్రదానం వంటి సేవాకార్యక్రమాలు చేపట్టి రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ అందుకున్న వ్యక్తి మీదే తోటి నటులు అసూయతో అభాండాలు వేసి, అవమానపరిచినప్పుడు చాలా బాధేసింది. తిరిగి సినిమాల్లోకి వచ్చాకా మళ్ళీ కొంత ఊరట కలిగింది. తెలుగు సినీరంగంలో చిరంజీవి ఎప్పటికీ చిరంజీవే!



2, జూన్ 2021, బుధవారం

బాల్యంలో నా అమాయకత్వం

 నాకు ఊహా తెలియకముందే మా పెద్దమ్మ తెచ్చి పెంచుకుంది. నా చదువు అట్లా పెద్దమ్మ ఊరైన పల్లెపాడు(జో.గద్వాల)లో ప్రారంభమైంది. అదో చిన్న పల్లెటూరు. ఐదవ తరగతి వరకు మాత్రమే బడి ఉండేది. మా తరగతిలో ఐదుగురం ఉండేవారం. అందులో శ్యామసుందర్ రెడ్డి నాకు అత్యంత ప్రియమిత్రుడు. బడిలో చదువులు, మైదానాల్లో ఆటలు, వంకల్లో ఈతలు...ఏడున్న ఒకరి భుజం మీద మరొకరి చేయి ఉండాల్సిందే. అట్లా నాలుగేండ్లు గడిచిపోయాయి. ఐదో తరగతికి వచ్చాకా ఆలోచన మొదలైంది. 'ఇది చివరి సంవత్సరం. వచ్చే సంవత్సరం బడి వదలాలి. ఊరు విడువాలి. మరి ఎక్కడ చదవాలి?' ఎక్కడ చదివినా ఇద్దరం ఒకేచోట చదవాలని నిర్ణయించుకున్నాం. అప్పటికి మా ఊరి పిల్లలకు రెండు అవకాశాలు ఉండేవి. ఒకటి మా సొంతూరు జల్లాపురం. అక్కడ ఏడు వరకు మాత్రమే బడి ఉండేది. రెండు ధర్మవరం. అక్కడ పది దాకా బడి ఉండేది. కొంచెం దూరమెక్కువైనా రెండోదే ఎంపిక చేసుకునేవారు మా ఊరి పిల్లలు ఎక్కువ కాలం ఒకే దగ్గర చదువొచ్చని.

రెండ్లేండ్లకే మారాల్సి ఉంటుందని మొదటిది, దూరమెక్కువని రెండోది వద్దనుకున్నాం. మూడో ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తున్నప్పుడు నా మిత్రుడు చెప్పాడు..."మనం వనపర్తి దగ్గర ఉండే మా మేనమామ ఊరికి వెళ్దాం. అక్కడే ఉంటూ చదువుకుందాం. మనకే ఇబ్బంది రాకుండా వాళ్ళు చూసుకుంటారు" అని చెప్పేవాడు. పెద్దల నిర్ణయాల ప్రమేయం లేకుండా పిల్లల ఆలోచనలు కార్యరూపం దాల్చవన్న సత్యాన్ని గ్రహించకుండా అది నిజమైతదనే అమాయకంగా నమ్మాం. ఎన్నెన్నో కలలు కన్నాం. ఆనందంగా ఆ సంవత్సరం ఐదో తరగతి పూర్తి చేశాం. మనం ఒకటి తలిస్తే విధి ఒకటి చేస్తది కదా! పెద్దల నిర్ణయాల మేరకు ఆరవ తరగతికి నేను మా సొంతూరు జల్లాపూర్ కు, తాను వనపర్తికి వెళ్ళిపోయాం. పదేండ్లు గడిచిపోయాయి.

డిగ్రీ పూర్తయ్యాక...

తాను హైదరాబాద్ నగరానికి రమ్మని, తన రూంలోనే ఉండమని, పని కూడా చూసి పెడతానని మాటిచ్చి, బతుకుదారి చూపాడు. చిన్నప్పుడు ఇచ్చిన మాటను ఇలా నెరవేర్చుకున్నాడా అన్పించింది.