14, జులై 2019, ఆదివారం

మరుపుకురాని అన్న వంటి మిత్రుడు




అతను
నా భుజం మీద భరోసా
నా కంచానికి అమృతం
నా వినోదానికి సినిమా.
నా గమ్యానికి సోపానం
నా లక్ష్యానికి ప్రోత్సాహం
వెరసి నా జీవితానికి అన్న వంటి మిత్రుడు.

***

   ఇంటికొచ్చిన బంధువులు ఊరెళతామంటే సాగనంపటానికి నిన్న మధ్యాహ్నం బస్టాండ్ వెళ్ళాను. అనుకోకుండా అక్కడ ఎల్లయ్య అనే నా బాల్యమిత్రుడు ఏదో పని మీద ఈ ఊరొచ్చి కనిపించాడు.  తాను నాకు   8 వ తరగతి నుండి ఇంటర్ దాకా క్లాస్ మేట్. మేం కలిసిన ఆ కాసేపట్లో పాత జ్ఞాపకాలు, పాత మిత్రులను గుర్తు చేసుకున్నాం. 
ఇంటికి వచ్చాకా భోజనం చేస్తూ ఉంటే ఎల్లయ్య ఇంటర్ వాట్సాప్ గ్రూపులో చేర్చిన మరో మిత్రుడు చిన్న సుంకన్న గుర్తుకొచ్చాడు. అతను కచ్చితంగా ఇలాంటి సమయంలో గుర్తుచేసుకోదగినవాడే. 
          తాను నాకంటే ఓ నాలుగైదేండ్లు పెద్దవాడు. కారణాంతరాల వల్ల ఇంటర్లో క్లాస్ మేట్. మా ఊరివాడే. కానీ, వేరే వేరే ఊర్లలో మా పాఠశాల చదువులు కొనసాగడం వలన ఇంటర్ కొచ్చేదాకా ఒకరికొకరం పరిచయం లేదు. పరిచయం అయ్యాకా ఇక వదిలింది లేదు. ఆ సంవత్సరం మా ఊరి నుండి అలంపూర్ వచ్చి ఇంటర్లో ఓ పది మంది దాకా చేరాం.  తాను సిఈసి, నేను బైపిసిలో చేరాం. నేను నా పాఠశాల మిత్రుడు, మా గ్రూపు వాడే అయిన వెంకట్రాముడితో  కలిసి రూంలో ఉండేవాడిని.  సుంకన్న  తన ఇద్దరు సోదరుల (చిన్నాన్నల కుమారులు)తో కలిసి రూం తీసుకుని ఉండేవాడు. 
     ఆ రూం ఇంటర్ బ్యాచ్ కో ధర్మ సత్రం. విడిది, వినోద కేంద్రం.  రూం నిండా సన్న బియ్యం సంచులు. ఏ లోటు లేని సరుకులు. ఇంటి నుంచి నెలనెలా కంట్రోలులో ఇచ్చిన దొడ్డు బియ్యాన్ని మూటల్లాగా  మోసుకొచ్చుకుని, గొడ్డు కారంతో తిని బతికే మా బోటి వారికి ఆ రూం ఎప్పుడూ ఓ ఆశ్చర్యంగాను, ఓ అద్భుతంగానూ ఉండేది. 

       కారణం ఇదని చెప్పలేను కానీ, మా ఊరి మిత్రులందరిలోకి సుంకన్నకు నాపై అభిమానం ఎక్కువ. నా రూమ్మేట్ మొదటి సంవత్సరం మిగిలిపోయిన సబ్జెక్ట్స్ భయపెట్టడం వల్ల, కుటుంబ ఆర్థిక కారణాలచే, చదువు మీద నిరాసక్తితో రెండవ సంవత్సరం మధ్యలోనే చదువు మానేసి, ఊరెళ్ళి పోయాడు. దానితో నిర్లిప్తంగా, నిరాశాజనకంగా, ఒంటరిగా సాగుతున్న నా జీవితానికి  ఆ సమయంలో సుంకన్న స్నేహం కొండంత అండైంది.  తన వల్లే నా జీవనపు దారులన్నీ ఆనందభరితమయ్యాయి.  
నా భుజం మీద భరోసా అయ్యాడు.
నా కంచానికి అమృతమయ్యాడు.
నా వినోదానికి సినిమా అయ్యాడు.
నా లక్ష్యానికి సోపానమయ్యాడు
నా గమ్యానికి ప్రోత్సాహమయ్యాడు
వెరసి నా జీవితానికి అన్న లేని లోటు తీర్చిన మిత్రుడయ్యాడు.

అతనితో ఎన్నెన్ని జ్ఞాపకాలో! 
ఒకసారి తాను ఊరెళ్ళినప్పుడు మా అమ్మతో  డబ్బులు తీసుకరామంటే తీసుకొచ్చి, ఇచ్చి ఒకటే నవ్వు.
" ఏమప్పా! మీ అమ్మ ఎప్పుడూ డబ్బులు చూసిలేదా? గీ రెండొందలియ్యనికా ఎంత తనుకులాడిందో! ఎన్ని సార్లు లెక్కబెట్టిందో! గీ చిల్లర మోసుకరానికా  నాతల ప్రాణం తోక కొచ్చిందిపో" అని ఆటబట్టిచ్చాడు.
" అన్నా! మీ లాగా మేం ఆస్తిపరులం కాదే. మా అమ్మ మోయలేని గడ్డి మోపులు తెచ్చి  బర్రెలకెస్తే, తిని ఆ కృతజ్ఞతతో అవిచ్చిన పాలమ్మగా వచ్చిన డబ్బులే అవి. అందుకే అవంటే మా అమ్మకు అంత ప్రేమ" అని నేనంటే గుండెలకత్తుకున్న నేస్తమతను.

నా రూమ్మేట్ గురించి చెబుతూ " ఏమప్పా! మీ వోడు ఆ అమ్మాయి కొరకు మా గ్రూపొదిలి (సిఈసి) మీ గ్రూపు(బైపీసీ)కొచ్చా. సదువంతా సంకనాకిచ్చా. సదువలేక ఇంటికొచ్చా. ఈడ ఉన్నన్ని రోజులు ఆ అమ్మాయి చుట్టూ తిరగవట్టే. ఆ అమ్మాయేమో నీ దిక్కు సూడవట్టే. నీవేమో పట్టిచ్చుకోవు. ఇకనైనా సూత్తావా లేదా?!" అంటూ సరదాగా సతాయించేటోడు.  ఆ సంగతి అవునో! కాదో! నాకు తెలియదు కాని. అతనా ప్రస్తావన తెచ్చినప్పుడల్లా నాకు కూసింత గర్వంగా ఉండేది. పర్వాలేదులే అమ్మాయిల్లో నాక్కూడా అభిమానులు ఉన్నారని ఆనందమేసేది. 

రెండవ సంవత్సరం చివర్లో కాలేజీ డే కొరకు సుంకన్న వాళ్ళ రూంలో రిహార్సల్స్ జరుగుతున్నవి. సుంకన్న నన్నూ రమ్మనేవాడు. ఆ ఊరి పోలీస్ కానిస్టేబుల్ ఒకాయన ఓ జానపద నృత్యాన్ని నేర్పేందుకు నిశ్చయించుకున్నాడు.
చాలా మందిని పరిశీలించాకా సిఈసి వెంకట్ ను ఎంపిక చేసుకొని ఏడెనిమిది రోజులు శిక్షణ ఇచ్చాడు. కాలేజీ డేకు రెండు రోజుల ముందు వెంకట్ అనుకోని కారణాలచే తప్పుకోవాల్సి వచ్చింది. తన శ్రమ అంతా వృథా అయ్యిందని కానిస్టేబుల్ బాధపడుతుంటే, సుంకన్న అతని ముందుకు నన్ను తోశాడు. "చేయగలడా?" అని అతనంటే... రోజూ చూస్తున్నాడన్నాడు. నేను అదేమాటంటే "అహే చేస్తవుపో!" అన్నాడు. ఎట్లా చేశానో! ఏమి చేశానో! తెలియదు గాని, కాలేజీ డే రోజు స్టేజి మీద 'కోడిపాయే లచ్చమ్మది, కోడిపుంజు పాయే లచ్చమ్మది' అంటూ ఎగిరి చిందులేశాను. అట్లా నన్ను రంగస్థలానికి పరిచయం చేసిన గురువు సుంకన్న.

పరీక్షలు దగ్గర పడుతున్నప్పుడు ఉన్న రూములు డిస్ట్రబ్ చేస్తున్నవని వాటిని అలాగే వదిలేసి న్యూప్లాట్స్ లో తెలిసిన వాళ్ళ రూం ఖాళీగా ఉందంటే, అక్కడే ఉండి చదువుకున్నాం. 
అట్లా ఇంటరంతా సుంకన్న ఒక ఎడతెగని జ్ఞాపకమే.

ఇంటర్ ముగిశాకా దారులు వేరయ్యాయి. దూరం పెరిగిపోయింది. తానో చోట. నేనో చోట. అదృష్టం కలిసి అప్పుడప్పుడు ఊర్లోనో! కర్నూలులోనో కలిసేవాళ్ళం. 
ఊరికి ఎప్పుడు వెళ్ళినా, ఊరిబయట ఊరికి స్వాగత ద్వారంలా ఉండే వాళ్ళింటి వైపు కళ్ళు దృష్టి సారించేవి.
తరుచూ నిరాశే ఎదురయ్యేది. కాలగమనంలో
27 ఏండ్లు గడిచిపోయాయి.

పోయిన ఏడాది ఇంటర్ మిత్రులు వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేశారు. ఆ గ్రూపులో నిన్న కలిసిన ఎల్లయ్యనే సుంకన్న ఫోన్ నెంబర్ చేర్చాడు. సేవ్ చేసి పెట్టుకున్నాను. మాట్లాడుదాం, మాట్లాడుదాం అంటూ వాయిదా వేస్తూ వచ్చాను. ఎల్లయ్యను కలిసి ఇంటికి వచ్చి భోజనం ముందు కూర్చున్నాను. అయిపోయేదాకా కూడా ఆగలేకపోయాను. ఫోనందుకుని సుంకన్నకు చేశాను. ఫోనెత్తగానే-
"సుంకన్నా! నేను జయన్న" అంటూ  ఆత్రంగా పరిచయం చేసుకున్నా.
"ఎవరు?” అవతలి నుంచి. సుంకన్న స్వరం వినపడకపోయే సరికి ఏదో అనుమానం.
"అమ్మా! నేను సుంకన్న దోస్తును"  
"ఎక్కడ దోస్తు?" మళ్ళీ ప్రశ్న.
"ఇంటర్ - అలంపూర్ లో అమ్మా"
"ఇంకేడ సుంకన్న నాయినా! మార్చిలోనే మాకు దూరమయినాడు. హార్ట్ఎటాక్ వచ్చి పోయాడు"
ఆ స్వరంలో స్పష్టత పోయింది. దుఃఖం నిండిపోయింది. తర్వాత మూగపోయింది. ఫోన్ కట్టైంది.
నాకిక ముద్ద దిగలేదు. గుండె బరువైంది. కంచంలో అసంకల్పితంగా టపటపా కన్నీటి బొట్లు రాలిపడ్డాయి. రాత్రంతా అతని జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. 
తనువులో ఊపిరున్నంత కాలం అవి అలాగే ఉండిపోతాయి.

- ఎన్. జయన్న