21, డిసెంబర్ 2024, శనివారం
19, డిసెంబర్ 2024, గురువారం
15, డిసెంబర్ 2024, ఆదివారం
నా కొత్త పుస్తకం
కొన్ని పుస్తకాలపై, కొందరు రచయితలపై అప్పుడప్పుడు రాసిన కొన్ని వ్యాసాలను ఇలా పుస్తకంగా తీసుకవస్తున్నాను.
ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి
*🔴ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి----CODE OF CONDUCT*
స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్‌లో పనిచేస్తున్న ఉన్నతాధికారులు క్రిందిస్థాయి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నాల్గవ తరగతి ఉద్యోగులు తమ విద్యుక్త ధర్మాలు నిర్వహించే సందర్భంలో సత్ప్రవర్తన కలిగి పని చేయాలి.
అందుకోసమై మార్గదర్శక ప్రవర్తనా నియమావళి 1964ను ప్రభుత్వం నిర్దేశించింది. ప్రవర్తనా నియమావళికి లోబడే ఉద్యోగులందరూ తమ విధులను నిర్వహించాలి. అటువంటి ప్రవర్తనా నియమావళిని అతిక్రమించి ప్రవర్తించిన ఉద్యోగులపై అర్హత గల నిర్దేశిత అధికారులు గానీ, ప్రభుత్వం గానీ క్రమశిక్షణా చర్యలు తీసుకుని తగిన పద్ధతిలో శిక్షిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు నిర్దేశించిన ప్రవర్తనా *నియమావళి ఉద్యోగులకే కాకుండా వారిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యులకు కూడా వర్తిస్తాయి.*
*🎯ఎవరికి వర్తిస్తాయి.. ఎవరికి వర్తించవు..?*
తెలంగాణ ప్రభుత్వ సివిల్ సర్వీసులో ఉన్న ప్రతి సభ్యునికి, ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించే ఏ పోస్టులో పనిచేస్తు వారైనప్పటికీ, వారందరికి ప్రవర్తనా నియమావళి వర్తిస్తాయి. తెలంగాణ ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తులకు, అఖిల భారత సర్వీసు ఉద్యోగులకు, గ్రామ పరిపాలన యంత్రాంగం, ప్రత్యేక పద్దు నుంచి చెల్లింపులు పొందువారికి వర్తించవు.
*⛔కుటుంబ సభ్యులంటే ఎవరు..?-*
ఉద్యోగిపై ఆధారపడిన భార్య, భర్త, కుమారుడు, కుమార్తె, సవతి కొడుకు, సవతి కూతురు, ఉద్యోగితో పాటు నివాసముంటున్నా, లేకపోయినా.. ఉద్యోగికి చెందిన ఏ ఇతర బంధువైనా, అతనితో నివాసముంటూ అతనిపై ఆధారపడి ఉన్నవారు. ఉద్యోగి నుంచి చట్టరీత్యా విడిపోయిన భార్య / భర్త, ఉద్యోగిపై ఏ విధంగానూ ఆధారపడకుండా ఉన్న కుమారుడు, కుమార్తె, కుమారుడు, సవతి కుమార్తె లేక చట్టరీత్యా ఉద్యోగి సంరక్షణలో లేని వ్యక్తి.
*🎯ప్రవర్తనా నియమావళి..*
ప్రతి ఉద్యోగి తన విద్యుక్త ధర్మాలను అంకితభావంతో నిర్వర్తించాలి. అంకితభావం అంటే విశ్వతనీయత కలిగి పని చేయడం. అదే విధంగా పూర్తి నిజాయితీగా, క్రమశిక్షణ కలిగి, నిష్పక్షపాతంగా న్యాయబద్ధతంగా కలిగి పనిచేయాలి. ఉద్యోగి ప్రవర్తన ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విధంగా ఉండకూడదు.
*🎯Rule 3 (a):* ఏ ఉద్యోగియైనా దేశ భద్రతకు,రాష్ట్ర భద్రతకు ముప్పు కలిగించే ఉద్దేశం గల సంస్థలతో సంబంధాలు కలిగి సభ్యునిగా ఉండకూడదు.
*🎯Rule 3 (b):* విధి నిర్వహణలో గాని, ఇతరత్రా గాని ప్రజలతో సమంజసమైన రీతిలో ప్రవర్తించాలి. అసభ్యంగా ప్రవర్తించకూడదు. తనకు కేటాయించినపనిని దురుద్దేశంతో గాని మరి ఇత రత్రా కారణాల వల్లగాని అదే పనిగా ఆలస్యం చేయకూడదు.
*🎯Rule 3 (C) :* ఏ ఉద్యోగి అయినా సరే తన విధి నిర్వహణలో ఉద్యోగినిల విషయంలో మర్యాద పూర్వకంగా ప్రవర్తించాలి. అమర్యాద పూర్వకంగా కాని, అసభ్యంగా గాని ప్రవర్తించకూడదు. అదే విధంగా లైంగిక వేధింపులకు గురిచేయకూడదు.
*🎯Rule 4:* ఏ ఉద్యోగి కూడా సమ్మెలు తదితర రెచ్చగొట్టే కార్యక్రమాలలో పాల్గొనకూడదు.
*🎯Rule 5*: రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలకు భంగం కలిగించే ప్రదర్శనలలో పాల్గొనకూడదు.
*🎯Rule 6:* ఏ ఉద్యోగి కూడా బహుమతులు స్వీకరించకూడదు.
*🎯Rule 6 A:* విదేశాల నుంచి డబ్బుగాని లేక 10,000 రూపాయల విలువగల వస్తువులు గాని ఎవరి నుంచైనా, ఉద్యోగి కాని, కుటుంబ సభ్యులు కాని లేక వారి తరఫున ఏ వ్యక్తియైనా పొందితే సంబంధిత అధికారికి తెలియజే యాలి.(G.O.Ms. No. 354, GAD, dt: 8-8-1996)
*🎯Rule 7:* ప్రభుత్వ పూర్వానుమతి లేనిదే ఏ కార్యక్రమానికైనా చందాలు వసూలు చేయడం గాని, తీసుకోవడం గాని చేయకూడదు.
*🎯Rule 8 :* ఏ ఉద్యోగియైనా ప్రభుత్వ పూర్వానుమతి లేకుండా తన ఉద్యోగ కార్యకలాపాల పరిధిలోని వ్యక్తులతో గాని ఇతరత్రా అప్పు తీసుకొనకూడదు. అదే విధంగా వడ్డీకి అప్పు ఇవ్వరాదు.
*🎯Rule 9 :* ఏ ఉద్యోగి కూడా ప్రభుత్వానికి ముందుగా తెలుపకుండా లేక అనుమతి పొందకుండా తానుగాని తనపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యులు గాని స్థిరాస్థులు కొనడం గాని, అమ్మడం గాని చేయకూడదు. ఈ విషయంలో కొన్ని మినహాయింపులు చేశారు.
*🎯Rule 10*: ఏ ఉద్యోగస్థుడు కూడా ప్రైవేటు వ్యాపారాలు తదితరాలు చేయకూడదు. అదే విధంగా బీమా ఏజెంటు గానూ, కమిషన్ ఏజెంటుగాను పనిచేయకూడదు.
*🎯Rule 11:* ఏ ఉద్యోగి కూడా తన వ్యక్తిగత హెూదాలో బ్యాంకులు గానీ, రిజిష్టర్డు కంపెనీలు గాని పెంచి పోషించకూడదు. కానీ సమాజ సేవా దృక్పథంతో రిజిష్టరు కాబడిన సహకార సంస్థల కార్యకలాపాలలో పాలుపంచుకోవచ్చును.
*🎯Rule 12*: ప్రభుత్వ ఉద్యోగస్థులు తమ ఉద్యోగ బాధ్యతలు తప్ప ఏ విధమయిన ప్రైవేటు ఉద్యోగం చేయకూడదు.
*🎯Rule 13:* ప్రభుత్వ ఉద్యోగి ఏవైనా పుస్తకాలు ప్రచురించదలచిన ప్రభుత్వ పూర్వానుమతి పొందాలి. ఈ విషయమై కొన్ని సదుపాయాలు కల్పిస్తూ ప్రభుత్వం G.O.Ms. No. 553, GAD, 8: 8-8-1974 2 జారీ చేసింది.
*🎯Rule 14*: ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా తన స్వాధీనంలో వున్న డాక్యుమెంట్లు తనకు తెలిసిన ఇతర కార్యాలయపు విషయాలు అనధికారులకు గానీ లేక పత్రికల వారికి గాని తెలియజేయకూడదు. కానీ సమాచార హక్కు చట్టం- 2005 వచ్చిన తరువాత దీనికి కొంతమేర మార్పులు చేసారు. (G.O.Ms. No. 114, GAD, dt: 16-3-2009)
*🎯Rule 15:* ఏ ఉద్యోగి కూడా వార్తాపత్రికలకు గాని, ప్రభుత్వేతర ప్రచురణలకు గాని సంపాదకత్వం చేయటం, వాటితో ఏ రూపంలోనైనా కలిసి పనిచేయకూడదు.
*🎯Rule 16:* పత్రికలకు, అదేవిధంగా దఫాలుగా ప్రచురితమయ్యే నియమితకాల పత్రికలకు లేఖలు గాని, వ్యాసాలు గాని ప్రభుత్వ పూర్వానుమతి లేకుండా వ్రాయడం నిషేధం. కాని సాహిత్య, సాంస్కృతిక, శాస్త్రీయ సంబంధిత వ్యాసాలు కాని, వాటి ఆధారిత రేడియో ప్రసంగాలు గాని చేయవచ్చును.
20, నవంబర్ 2024, బుధవారం
15, ఏప్రిల్ 2024, సోమవారం
మాట్లాడే నాగలి
మలయాళ రచయిత 'పొన్కున్నం వర్కెయ్' రచించిన 'మాట్లాడే నాగలి' కథను ఎన్. వేణుగోపాలరావు తెలుగులోకి అనువాదం చేశారు. ఈ కథను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జంతుప్రేమ భూమికగా 8వ తరగతి తెలుగు వాచకంలో పాఠ్యాంశంగా చేర్చింది.
రైతు -ఓసెఫ్, ఎద్దు -కన్నన్...పన్నెండేళ్ల పాటు ఒకరి కోసం ఒకరు జీవితాన్ని ఎట్లా ధార పోసుకున్నారు. ఒకరి పట్ల ఒకరు ఎలాంటి ఆప్యాయతలను చూపుకున్నారు. ఎంతో ప్రేమగా చూసుకున్న కన్నన్ ను ఓసెఫ్ ఎందుకు అమ్ముకోవలసి వచ్చింది? చివరికి కన్నన్ ఎక్కడికి చేరింది? అన్నదే కథ. రైతుకు ఎద్దులకు మధ్య ఉండే అనుబంధాన్ని అద్భుతంగా చిత్రించిన కథ.
జంతువుల మీద ఇంత ప్రేమను చూపించే ఇట్లాంటి మనుషులు ఇప్పుడు కూడా మన చుట్టూ ఉంటారా? అంటే, ఈ వీడియోనే సాక్ష్యం. గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం యాక్తాపూర్ గ్రామానికి చెందిన ఎల్లన్న తన ఇంట్లోనే పుట్టిన దూడలను పెంచాడు. 14 సంవత్సరాలు వాటితో అనుబంధాన్ని పెంచుకున్నాడు. కుటుంబ అవసరాల రీత్యా ఆ ఎద్దులను అమ్ముకున్నాడు. ఇద్దరు రైతుల చేతులు మారాకా మూడోసారి సంతకు అమ్మకానికి వచ్చాయి. అక్కడే వాటిని చూసిన ఎల్లన్న కన్నీళ్ళు పెట్టుకున్నాడు. మాట్లాడే నాగలి ఓసెఫ్ ను గుర్తు చేశాడు. రైతులకు పశువులకు మధ్య ఉండే అవ్యాజమైన ప్రేమకు మరోసారి నిదర్శనమయ్యాడు.
3, మార్చి 2024, ఆదివారం
నేనూ - గొరుసు - గజఈతరాలు
20, జనవరి 2024, శనివారం
నడిగడ్డ చరిత్రే - కె. నాగేశ్వరాచారి 'గద్వాల్జాతర కథలు'
ఒక మొక్క వృక్షమై ఆకాశం వైపు ఎంత ఎదిగినా, దాని కొమ్మలు దిక్కుదిక్కులకు ఎంత విస్తరించినా, మూలాన్ని, తాను మొలకెత్తిన నేలను విడిచి ఏ వృక్షమైనా నిలబడగలదా?. అట్లా మూలాన్ని వదలని వ్యక్తిత్వం కె. నాగేశ్వరాచారి గారిది. నడిగడ్డలో జన్మించి, ఉన్నత విద్య కోసం, ఉద్యోగం కోసం అనంతపురం వెళ్లి, అక్కడే ఉండిపోక, తనకు జన్మనిచ్చిన నేల సమీపానికి రావడం, తన నేల మీద కథలు రాయడం, తన నేలకు సంబంధించిన వ్యక్తులను వెతుక్కోవడం, ఆ వ్యక్తులు దొరికితే అమాంతం హత్తుకపోవడం ఈ రచయిత వ్యక్తిత్వం. ఇట్లాంటి హృదయమార్దవం కలిగిన రచయిత కలం నుండి ఎట్లాంటి కథలు రాగలవో ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదనుకుంటా!
అయితే ఈ కథలు చదివిన ఏ విమర్శకుడైనా ఇవి కథలా?, కథనాలా? అనే ప్రశ్నవేయవచ్చు. దానికి ఈ సంకలనంలోని 'బీజం" లాంటి కథలు కూడా ఊతం ఇవ్వవచ్చు. కానీ నేనైతే, ఇవి జీవితాలంటాను. మట్టి మనుషుల వెతలంటాను. ఒక ప్రాంతపు చరిత్ర, వాళ్ళ బతుకులు, కష్టాలు, కన్నీళ్లు అమాయకత్వం, అన్ని కలగలిపి రాసిన చరిత్రంటాను, ఒక్కమాటలో చెప్పాలంటే ఇది యాభై, అరవై ఏళ్ల కిందటి నడిగడ్డ చరిత్ర.
రచయిత ఈ కథలనెందుకు రాశాడు?
పాలమూరు కవి కోట్ల వేంకటేశ్వర్ రెడ్డి తన 'నూరు తెలంగాణ నానీలు' పుస్తకంలో... ఒక నానీలో, "పచ్చగున్న కాడ / పక్షివై వాల్తివి, నా నేలను/ నాక్కాకుండా చేస్తివి" అన్నట్లు ... అరవై ఏళ్ల కిందట, ఆర్డీఎస్ వచ్చి అప్పుడప్పుడే పచ్చ పచ్చగా మారుతున్న నడిగడ్డను పసిగట్టిన కొన్ని వలస గద్దలు ఇక్కడ వాలి ఎంత సామాజిక, సాంస్కృతిక, భాషా విధ్వంసాన్ని సృష్టించాయో విడమర్చి చెప్పడానికే ఈ రచయిత ఈ కథలు రాశాడనిపిస్తుంది.
కథలు
ఈ పుస్తకంలో మొత్తం 11 కథలు ఉన్నాయి. ఇవన్నీ కాలువ కథలు.
ఆర్డీఎస్ కథలు. మనిషి దేహం నిండా
రక్తనాళాలు పరుచుకొని, ప్రతి అవయవానికి, ప్రతి కణానికి ప్రాణవాయువును
అందించినట్లు, ఈ కథల నిండా కాలువలు, వాటి
మీద ఆధారపడిన బతుకులు పరుచుకున్నాయి.
ఉన్న ఊర్లో జీవనాధారం లేక నగరానికి వలసెల్లిన ఓ కుటుంబానికి చదువుల తల్లి లాంటి బిడ్డను కోల్పోవడం ఎట్లా శాపంగా పరిణమించిందో తెలియజేసే కథ చంద్రమ్మ కథ. కథ సగ భాగం వరకు చంద్రమ్మ మరణం, కుటుంబ నేపథ్యం గురించి చర్చించి, ఆ తర్వాత కాల్వ తెచ్చిన మార్పులు, ప్రజల జీవితాల్లో ఖర్చులు పెరిగిన వైనం, కాల్వల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష వైఖరులను ఈ కథ చర్చిస్తుంది. సేతుల్ల పెరిగి, పెద్దదైన పిల్లను పోగొట్టుకుంటే ఎవరి పానమైన ఎట్లుంటది. ఆ బాధ మన వరకొస్తే గాని అర్థం కాదనడం అక్షరసత్యం. కాల్వొచ్చినాక ప్రజల కూడు, గూడు, గుడ్డ విషయాల్లో కొంత మార్పొచ్చిన మాట వాస్తవమే అయినా, అంతకు మించి లాభపడిందెవడు? మేడలు కట్టిందెవడు? విదేశాల్లో చదువులు లాంటి లాభాలు వొనగూడిందెవరికి? ఈ దేశభవిష్యత్తును బాధ్యతగా ముందుకు తీసుకపోగల విద్యార్థులు అర్థాంతరంగా తనువులు చాలిస్తుంటే కారణమెవరిదనాలి? అంటూ రచయిత ఈ కథ ద్వారా సంధించిన ప్రశ్నలు మన ఆలోచనల్ని మెలిపెడతాయి.
ఆర్డీఎస్ పెద్దకాలువ పూర్తి కాగానే, సిన్న కాలువలు మొదలవుతుండగానే వచ్చిన బెజవాడ వాళ్లు ఊర్లల్ల పెద్ద మనుషులను, సావుకార్లను బుడుక్కొని వారిని మధ్య మనుషులుగా పెట్టుకొని, అమాయకుల పొలాల నెట్లా కొన్నారో, ఆస్తిని అమ్ముకున్న కూడా వచ్చిన డబ్బెట్లా మాయమైపోయి, పేదల కండ్లల్లో కష్టమెట్లా కన్నీళ్లుగా రూపుదాల్చనో '18 వ కాలువ కథ' మనకు విడమర్చి చెపుతుంది. ఆర్డీఎస్ డిస్ట్రిబ్యూటర్ల లెక్కలు, కాలువ ప్రయాణ దూరాలు తెలియాలన్న, కాల్వ బుట్టిన కాడ్నుంచి కాల్వ ముగిసే వరకు ప్రయాణంలో ఎన్నెకరాలు ఎవరి పాలయ్యిందో తెలవాలన్న మనం ఈ కథను చదవాల్సిందే.
సమయ పాలన, క్రమశిక్షణ ఉండకూడదని కాదు గాని, విద్యాచైతన్యం లేని చోట అవి మరీ ఎక్కువైతే విద్యార్థుల చదువుకు అవే ఆటంకం కాగలవని తెలియజెప్పే కథ 'సూర్రెడ్డి జమానా'. "భయం విద్యార్థిని ఎదగనీయదు. టీచర్ విద్యార్థికి మధ్య నిరంతరం చర్చలు జరగాలి. విద్యార్థి తలనిండా ఉన్న ప్రశ్నలని బయటికి రానీయాల" అంటూ మనకు దిశానిర్దేశం చేస్తుందీ కథ.
టీవీలు, సెల్లు ఫోన్లు ఊర్లల్లోకి జొరబడని కాలంలో ప్రతి ఊర్లో రాత్రేల గుడికాడో, రచ్చబండ కాడో ముచ్చట్లు సర్వసాధారణం. అట్లాంటి ముచ్చట్లతోనే రచయిత 'నెనరు' కథను నడిపిన విధానానికి మనం ముచ్చటపడతాం. కాని కథలోని పాత్రలు బతకడానికి ఎన్నెన్ని పడవాట్లు పడ్డారో తెల్సుకొని విచారిస్తాం. జీవనాధారాన్ని పోగేసుకొని, అవరోధాలని అధిగమించే ప్రయత్నంలో శ్రమంతా చెల్లాచెదురై ఏట్లో కొట్టుకపోతుంటే బరువెక్కిన బతుకుల వేదనెంత దుర్భరంగా ఉంటుందో కథగా చూపి, మన కండ్లు తడిబారుస్తాడు రచయిత.
ఇట్లా ఈ కథల నిండా నడిగడ్డ బతుకులు, వాటి వెతలు మనకు కళ్లకు కట్టినట్లు చూయించారు రచయిత.
మాండలిక భాషా ప్రయోగం
మానవ జీవితంలోని వివిధ దశలను, వాటి అనుభవాలను కథలుగా మల్చడంలో గాని, కథావస్తువు స్వీకరణలో గాని, కథన విధానంలో గాని వైవిధ్యం ఉండవచ్చు. గాని ఆయా ప్రాంతాల మాండాలికాన్ని చక్కగా తమతమ కథల్లో పొందుపరిచిన సుప్రసిద్ద కథారచయితలు వంశి, స.వెం. రమేశ్, నామినిలతో నాగేశ్వరాచారి గారిని పోల్చడం అతిశయోక్తి కాకపోవచ్చు. నాగేశ్వరాచారి గద్వాల్జాతర కథల్లో నడిగడ్డ స్థానిక భాషను, యాసను అట్లే ప్రయోగించారు.
బడి పలుకుల భాషలో
కొట్టుకపోయిన మన పలుకుడుల భాషను వెతికిపట్టి, ఇక్కడ పొందుపరిచినట్లు మనకు
కనిపిస్తది.
సిన్నేటి సెంప లాంటి పద ప్రయోగాలు పాఠకుడికి ఈ ప్రాంత భౌగోళిక స్పృహ ఉంటే గాని అర్థం కావు.
జౌరి కట్టు , బుడుక్కొని, పురిబెట్టి, అమ్మడిపొద్దు, డబ్బిగిన్నె, కువాడం, వల్కలు, గప్పున, బుగులు, బుడ్డలు, బెరినా లాంటి అనేక పదాలు నడిగడ్డ భాషాసంపదను పట్టి చూపుతాయి.
కథనవిధానం
“ప్రజల జీవనాన్ని వాళ్ల భాషతో సహా పట్టడానికి, వాళ్ల జీవితపు అనుభవాల లోతులను చూడటానికి ఒక అసక్తే గాక, వాళ్లను ప్రేమించే మనస్తత్వం కూడా ఉండాలి” అని హరగోపాల్ గారు చెప్పినట్లు ఈ కథకుడిలో ఆ గుణం మెండుగా ఉంది కాబట్టే ఇంత మెరుగైన కథలు మన ముందుకొచ్చాయి.
పాత్రలు
లచ్చుమన్న, మారెప్ప, మల్దకల్, పక్కీర, బతుకన్న, పెద్దయ్య, బడేసావు, మొదలుగు ఈ కథల్లోని పాత్రలు కల్పనలు కావు. అవి దేవలోకం నుండి దిగివచ్చినవి కావు. అతి సామాన్యమైనవి. మన చుట్టూ ఉండే మనుషులు. కష్టం తప్ప మరో మార్గం తెలియని మట్టి మనుషులు. మన తాతో, మామో, బావో, చిన్నాన్నో, పెదనాన్నో అన్నట్లే అనిపిస్తాయి. మనతో బంధాన్ని పెనవేసుకున్న మన ఊరి వాళ్లలాగే అనిపిస్తాయి. ఇట్లాంటి పాత్రలతో , నడిగడ్డ విషయాలతో, విశేషాలతో కథావస్తువులను ఎంపిక చేసుకొని, వాటికి తగిన భాషను ఎంచుకొని ఈ కథలను విలువైన సాహిత్యంగా మనకందించిన పెద్దలు నాగేశ్వరాచారి గారికి ధన్యవాదాలు.
- నాయుడి గారి జయన్న
***