'ఆంధ్ర సాహిత్యములో బిరుదనామములు '
బిరుదులకు అర్రులు చాచనివారు, బిరుదులకు
ఉప్పొంగనివారు బహు అరుదు.సాహిత్యంలో ఇక దానికున్న స్థానమే వేరు. నాటి నన్నయ నుండి
నేటి నానా కవుల దాకా సాహిత్యాన్ని సృష్టించి బిరుదులు పొందినవారు, బిరుదులు పొందడానికి సాహిత్యాన్ని సృష్టించినవారు కొల్లలుకొల్లలు. అసలు,
అసలు పేరుకన్నా బిరుద నామంతోనే ప్రసిద్ది చెందినవారికి కొదువలేదు మన
సాహిత్యంలో.
ఏ పాఠ్య పుస్తకంలో కవి పరిచయం ఉన్నా, వారి
బిరుదుల ప్రస్తావన ఉండాల్సిందే. ఏ పోటీ పరీక్షలోనైనా బిరుదలకు సంబంధించి ఒక
ప్రశ్నైనా ఉండి తీరాల్సిందే. ఇట్లా వీటి గురించి మాట్లాడుతుంటే...అసలీ బిరుదులేమీ? ఎవరిస్తారు? ఎందుకిస్తారు? ఇచ్చేవారికి, పుచ్చుకునేవారికి
ఉండాల్సిన అర్హతలేమిటి? బిరుదుల్లో వైవిధ్యమేమిటి? వాటి అంతరార్థం ఏమిటి? ఇత్యాది విషయాలు
తెలుసుకోవాలంటే మాత్రం మీరు, కథల ప్రేమికుడు , తెలుగు విజ్ఞాన సర్వస్వాన్ని ప్రోది చేయడానికి శ్రమిస్తున్న తెలుగు వికీపీడియన్ కోడీహళ్ళి మురళీ మొహన్ గారి
ఆంధ్ర సాహిత్యంలో బిరుదనామములు పుస్తకాన్ని చదవవలసిందే. ముఖ్యంగా సాహితీ ప్రియులు,
పోటీ పరీక్షలకు సిద్దమయ్యే విద్యా, ఉద్యోగార్థులు.
ఆంధ్రా మిల్టన్, ఆంధ్రా డెమొస్తనీస్,
సాహితీ భీష్మ ఎంత గంభీరమైన బిరుదులు కదా! పేరు ముందు ఉంటే భలే
బాగుంటుంది అనిపిస్తుంది కదూ! ఈ పుస్తకం
చదివితే మాత్రం వద్దు బాబోయ్! అనకమానరు. అంతేనా! తిరుపతి వెంకటకవుల బిరుదైనా 'కింకవీంద్రఘటాపచానన ' బిరుదుపై, ఈ కవులకు పేరి కాశీనాథ శాస్త్రులకు మధ్య జరిగిన సంవాదం గురించి
తెలుస్తుంది. అంతేనా! ఏ కవికి ఏ ఏ బిరుదులు ఉన్నాయి? ఏ ఏ
బిరుదులు ఏ ఏ కవులకు ఉన్నాయి? ఇట్లా రెండు విధాలుగా
పాఠకుడికి సులువుగా చెప్పడానికి ఈ పుస్తక
రచయిత 599 మంది కవులు, 606 బిరుదులను శ్రమకోర్చి, ఏర్చి, కూర్చి రెందు విభాగాలుగా మనకు అందించాడు.
ఎవరైనా ఎందుకీ పుస్తకం? అని
ప్రశ్నిస్తే..."భవిష్యత్తులో ఎవరైనా బిరుదుల గురించి పరిశోధన చేసేవారికి ఈ
ప్రయత్నం ముడిసరుకుగా ఉపయోగపడుతుంది". అని రచయిత వినయంగా చెప్పాడు కానీ,
నిజానికి ఈ పుస్తక విషయానికి
మరికొంత మసాలా దట్టించి, ఏ పరిశోధక విద్యార్థో,
ఏ విశ్వవిద్యాలయంలోనో సమర్పించి ఉండి ఉంటే అధమాధమం ఎం.ఫిల్., పట్టా
అయినా వచ్చి ఉండేది.
చివరగా ఒక మాట. నాది కాదండి బాబు. ఈ రచయితదే. "
తెచ్చిపెట్టుకున్న బిరుదులు, అడిగి పుచ్చుకున్న బిరుదులు, వ్యాపార దోరణిలో సంపాదించుకున్న బిరుదులకు విలువ ఉండదు. వాటిని
ప్రజలు ఎల్లకాలం గుర్తించరు. అలాంటివి
పటాటోప ప్రదర్శనకు మాత్రమే పనికి వస్తాయి. కేవలం బిరుదాంచితులు మాత్రమే గొప్పవారు
అని ఎవరైనా భావిస్తే అది పొరపాటు. ఏ బిరుదులూ లేని ప్రతిభా సంపన్నులైన
కవిపండితులెందరో ఉన్నారు". ఎంత విలువైన మాటలు కదా!
- నాయుడిగారి జయన్న
ఆంధ్ర సాహిత్యములో బిరుద నామములు
రచయిత: కోడీహళ్ళి మురళీమొహన్
9701371256