10, అక్టోబర్ 2015, శనివారం

పట్నం శేషాద్రి

పట్నం శేషాద్రి మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల ప్రాంతానికి చెందిన కవి. రెవిన్యూ శాఖలో ఉద్యోగిగా పని చేసి, విరమణ చేశారు. ప్రస్తుతం సాహిత్య ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. పరిపాలనలో భాగంగా విరివిగా తెలుగు భాష వాడకాన్ని ప్రోత్సహించిన అధికారిగా అప్పటి అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ నుండి అవార్డును స్వీకరించాడు.
 కుటుంబనేపథ్యం 
వీరి తండ్రి పట్నం నర్సప్ప, తల్లి పాగుంటమ్మ. వీరికి ఒక కొడుకు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
 విద్యాభ్యాసం 
గద్వాలలో డిగ్రీ వరకు చదివిన శేషాద్రి, తరువాత ఎం.ఎస్సీ., వృక్షశాస్త్రం చదివారు. అందులో పరిశోధన చేసి డాక్టరేట్ పట్టాను సాధించారు.
ఉద్యోగ జీవితం 
1985లో మెదక్ జిల్లాలోజగదేవ్‌పూ ర్మం డలంలో తాహశిల్దారుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. తరువాత వరంగల్ డి.ఆర్.వో. గానిజామాబాద్ జిల్లా అధనపు సంయుక్త కలెక్టర్ గానూ  పనిచేశారు.
 సాహిత్య జీవితం 
మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలంలో పని చేస్తున్నప్పుడు అక్షరాస్యతా ఉద్యమంలో భాగంగా ఆ జిల్లాలో మంజీరా అక్షరప్రభ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలోని పాటలు, సాహిత్యం వీరిని సాహిత్యం వైపు నడిపించాయి. ఆ తర్వాత తానే పాటలు, కవితలు, నానీలు రాయడం మొదలు పెట్టారు. ఇప్పటి వరకు మూడు పుస్తకాలు ప్రచురించబడ్డాయి. మరో రెండు పుస్తకాలు ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి. ఆచార్య ఎన్. గోపి తాను రాసిన 'రాతి కెరటాలు ' అనే వచన కవితాసంపుటిని శేషాద్రికి అంకితమిచ్చాడు.
రచనలు 
1.కవితాసుమాలు: 41 కవితలతో కూడిన ఈ సంకలనం 2007 లో వెలువడింది. దీనిని ప్రముఖ కవి [[ఎన్. గోపి]] ఆవిష్కరించారు.
2. అక్షరదళాలు: ఇది నానీల సంపుటి. 2008లో వెలువడిన ఈ పుస్తకాన్ని [[సి. నారాయణరెడ్డి]] ఆవిష్కరించారు.
3. విచిత్ర వర్ణాలు: ఇది వచన కవితా సంపుటి 2015 జనవరిలో వెలువడింది. దీనిని అప్పటి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ ఆవిష్కరించారు.

--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల*



7, అక్టోబర్ 2015, బుధవారం

'మాటల మడుగు '- కొన్ని మాటలు

మెర్సీ మార్గరేట్ కవిత్వం 'మాటల మడుగు '-  కొన్ని మాటలు 

ఉరుకులు పరుగుల ఆధునిక యాంత్రిక జీవితంలో కవిత్వాన్ని శ్వాసిస్తూకవిత్వంగా జీవిస్తూకవిత్వం కొరకు తపిస్తూ తిరుగాడే మనుషులు కొందరే ఉంటారు. ఆ కొందరిలో మెర్సీ మార్గరేట్ ఉంటారు. ఫేస్ బుక్ కవిత్వ వేదిక 'కవి సంగమంలో నిరంతరం తన స్పందనలకు కవితా రూపమద్దుతూ వచ్చింది. మరెంతో మందికి కవిత్వంపై ఆసక్తి కలిగించడానికి కవిత్వశాలను నిర్వహించింది. ఆంధ్రా నుండి ఆటా వరకుతెలంగాణ నుండి తెలుగోడుండె ప్రతి నేల వరకు తన గొంతును వినిపించింది. ఇప్పుడు మాటల మడుగుతో మనముందుకొచ్చింది.

  మాటల మడుగు 53 కవితలతో కూడిన కవిత్వ సంకలనం. వీటిలో కొన్ని కవితలు ఇదివరకే ఫేస్ బుక్‌లోనోమరో పత్రికలోనోఇంకో వేదిక మీదో ప్రచురించబడినవే. వినిపించబడినవే. ఏ ముందీ కవితల్లోఅని ప్రశ్నించుకుంటే...నీ గురించినా గురించిమన గురించిమన చుట్టూ ఆవరించిన సమాజం గురించే అనిపిస్తుంది. ఎట్లా రాసిందిహృదయమెట్లా స్పందిస్తే అట్లా రాసింది. మనిషిలో మనిషి తనం మిగిలే ఉంటే ఇట్లానే రాస్తారనిపించేలా రాసింది. ఎందుకు రాసిందో కూడా అడుగాలనిపిస్తేఅడుగేయండి--
పునర్లిఖించుకోవాలిప్పుడు
 నన్ను నేను
కొత్త కాగితంపైకి అడుగేస్తూ..." అంటూ సమాధనమిస్తుంది.

  కాలం మారడం నిత్యం. సమాజం మారడం సత్యం. కాని ఆ మారేదేదో మంచి కొరకు మారితే ఎంత బాగుండు. అదే మన దురదృష్టం. ఈ కవి ఆవేదన కూడా అదే. గడిచిన గతాన్నినేటి నిరర్థక సత్యాన్ని పోలుస్తూ రాసిన మాటల మడుగు కవితలో ...
ఒకప్పుడు
 నోటి నిండా మాటలుండేవి...
మసక కన్నుల్ని వెలిగించే నిప్పురవ్వలుండేవి
చెమట చుక్కల్ని కౌగిలించుకొనే చేతులుండేవి.."  

ఇప్పుడూ మాటలున్నాయి. కాని అవన్నీ గాలికి తేలిపోయే తాలు మాటలే అంటూ చెబుతుంది. ఈ సంకలనంలో ఇది గొప్ప కవిత. ఈ కవితా శీర్షికే ఈ సంకలనానికి పేరుగా మారడంలో ఔచిత్యమూ ఉంది. అర్హతా ఉంది. మనల్ని మనం అన్ని విధాలుగా శారీరకంగా తీర్చిదిద్దుకోగలిగే అవకాశమే ఉండి ఉంటేపురుషులందరు ఏ సల్మాన్ లాగోస్త్రీలందరూ ఏ ఐశ్వర్యరాయ్ లాగో  తీర్చిదిద్దుకొనేవారు. మన ప్రమేయంలేని జన్యుపర అంశాలను అర్థం చేసుకోకుండాఅంతర సౌందర్యాన్ని అవగతం చేసుకోకుండాశారీరక బాహ్య సౌందర్యానికే విలువిచ్చే మనుషులు అన్నం మెతుకుల్లాగే అర్ధాంగి హృదయాన్ని కూడా చిదిమేసినప్పుడుఅనుభవించే వేదన బరువెంతో  తూచే కొత్త యంత్రమేమో అనిపిస్తుంది 'హృదయపు మెతుకు ' కవిత. నిజంగానే హృదయాన్ని ద్రవింప జేసే కవితిది. 
భాష ఒక్కోరికి ఒక్కో తీరుగా ఉపయోగపడుతుంది. మరి ఈమెకు? " మాయమవని కాలిన గాయం".  సమాజ శ్రేయస్సుకై జీవితాల్ని ఫణంగా పెట్టేఅదృష్టవంతుల కోసం నిరంతరం దురదృష్ట వంతులుగా బతికే శ్రామికులు నిజంగా కోల్పోతుందేమిటో చెబుతూ...
" మా అరచేతుల గీతల్నిఅస్తిత్వాన్నికాలాన్ని" అంటూ తానూ శ్రామిక పక్షపాతినేనని నిరూపించుకుంటుందీ కవి.
 ప్రపంచపు బాధ శ్రీశ్రీ నెట్లా మెలిపెట్టిందోఈమెనూ అంతే. అందుకే సిరియా పిల్లల కొరకు కన్నీళ్ళు పెడుతూనే...
" స్వేచ్చగా తలెత్తుకుని శ్వాసించే అస్తిత్వ కేతనాలు " అంటూ పిడికళ్ళకు కొత్త నిర్వచనాన్నిస్తుంది. 

గడియారంతో పోటి పడుతుబండెడు పుస్తకాలతో కుస్తీ పడుతుమనిషిని మనిషిగా నిలుపలేని చదువులకు బంధీ అయిపోయిన బాల్యాన్ని గడిపే చిన్నారులుస్వేచ్చగా ఎగిరే పక్షులను చూసినప్పుదుఆ పిల్లల కళ్ళు " బస్సు కిటికీ చువ్వలతో చేసే సంభాషణ" ను  మనం వినగలమాఅర్థం చేసుకోగలమాఈ కవి వినగలిగింది. 'అవసరం ' కవిత రాయగలిగింది.
మనసుండే మనుషులుండాలిగానీఆ మనుషులు మాట్లాడగలగాలి కానీశవాలైనా జీవం పోసుకొని తిరుగాడవూఅదే చెబుతుంది 'జీవనది ' కవిత.
 కమ్యూనికేషన్ స్కిల్ఆర్ట్ ఆఫ్ లివింగ్పచ్చిగా చెప్పాలంటే బతుక నేర్వడం తెలిసిన మనుషుల భాగోతాలను చూపే కవిత 'ఎక్స్‌క్లూసివ్ నవ్వులు '. నవ్వులనుమరి ముఖ్యంగా నానార్థాలు తెలిసిన నవ్వులను మనిషి ఉపయోగించినత నైపుణ్యంగా మరే జంతువూ   ఉపయోగించకపోవడం మనిషి సాధించిన విజయమే.  దుఃఖాన్ని భరించడంపంచుకోవడం సులువే. కానీవెటకారపు నవ్వులను భరించడం మాత్రం మహా కష్టమే.
 ఈ కవి తన కవిత్వంలో సూర్యుడిని ఎట్లా ఉదయింపజేస్తుందో చూడండి-
" సూర్యుడు చుక్కల్ని పట్టుకొని
పగటి గంప కింద కప్పిపెట్టి
తన పనికి ఉపక్రమిస్తూ..." అంటుంది. రాత్రిళ్ళు ఊళ్ళల్లో గంప కింద కోడిపిల్లలను మూసిపెట్టిఉదయం కాగానే తెరువడం మామూలే. దాన్నే ఇట్లా తిరిగేసి కాల సూచిగా వాడుకోవడం కవి సాధించిన కవితా మాయజాలం.

"అరువు భాషను
 హావభావాలనువేషధారణను
 చంకలోని బతుకు బరువును
సంచిలో వేసుకొని
నన్ను నేను అమ్ముకోవడానికి బయలుదేరుతా '' ననటంలోకేవలం బతకటం కోసం మన ఇష్టాలనెట్లా దూరం చేకోవాలో తెలిపే ధైన్యంఅయిష్టాలనెట్లా బలవంతంగా నెత్తికెత్తుకోవాలో తెలిపే దౌర్భాగ్యం ' జంతర్ మంతర్ ' కవితతో మనకు చూపిస్తూందీ కవి. ఇదే కవితలో ఒక చోట " నాలుకకు ఇరవై ఆరు అక్షరాల నరకాన్ని కట్టుకొని/ బయలుదేరుతాను" అని అనటంలో పరాయి భాషెప్పుడూ మన సమస్త భావ వ్యక్తీకరణావసరాలను తీర్చలేదని చెప్పటం లేదూ?  ఆ ప్రయత్నం చేయడం నరకంతో సమానమేననే భావం కనిపించటం లేదూ?  ఉద్యోగమంటే ఆషామాషి కాదనిఏ రోజుకారోజు పోరాటమేననిఆ రోజును ముగించటమంటేఆ యుద్ధంలో గెలవటమేనని చెప్పినట్లుగా ఉంటుందీ కవిత. ఈ సంకలనంలో ఆణిముత్యాల్లాంటి కవితల్లో ఇదీ ఒకటి.

  కొన్ని పరిచయాలు బౌతికంగా ముగిసినట్లు అనిపించినావాటి అనుబంధపు తాలుకూ పరిమళాలేవో మనుసుకు అంటుకొని గుభాలిస్తూనే  ఉంటాయని," జ్ఞాపకాల వెన్నని/ చేతిలో చల్లని ముద్దగా ఉంచి వెళ్తాయనికొత్త అనుబంధానికి నాందిగా నిలుస్తాయని ఈ కవి చెబుతుంది.

"అదేంటో
 కడుపులోకి
 పదునైన బాధ దిగిన ప్రతిసారి
 అక్షరాలు గుండెను చీల్చుకొని
 బయటకు వచ్చి
 పసిపిల్లల్లా నవ్వుతాయి " అంటూ ఈ కవి కవిత్వావిర్భావ రహస్యాన్ని మన ముందు ఉంచుతుంది.

చీత్కారాల ఘాటు గాయాల లోతెంతో తెలిపే కవితలుచెమ్మ కన్నుల నీటి సాంద్రతను తెలిపే కవితలు,విరహ వేదననుస్నేహపు విలువను తెలిపే కవితలు,కవులకుకవిత్వానికి,కన్నీళ్ళకు నిర్వచనమిచ్చే కవితలుమొసలి కన్నీరు కార్చే సమాజానికి హితోపదేశం చేసే కవితలుఅనాగరికపు అంటరాని తనాన్నిదాని విషాదకర ప్రతి ఫలనాలను చూపే కవితలుచక్కటి ఉపమానాలతో కూడిన కవితలుఅరుదైన భావచిత్రాలతో కూడిన కవితలు ఈ సంకలనంలో ఎన్నో! చక్కటి కవితా సంకలనాన్ని అందించిన కవిని అభినందిస్తూమరింత చిక్కబడిమరింత పదునుదేలి  ఈ కవి కవిత్వం సమాజానికి దిక్సూచిగా నిలువాలని ఆకాంక్షిస్తున్నాను.
                                                                                            
                                                                                           -నాయుడుగారి  జయన్న




4, ఆగస్టు 2015, మంగళవారం

ఇప్పటికిక వెళ్ళొస్తా!

తల్లీ!
ఇప్పటికిక వెళ్ళొస్తా! 
వెళ్ళాలని లేదు
వెళ్ళక తప్పదు
అందుకే...
వీలైతే మళ్ళొస్తా!

నీ నీడన...
ఇంచుమించు దశాబ్ధ కాల ప్రయాణం
ఒక అస్థిరుడిగా నాకే ఆశ్చర్యం!
ఈ పయనంలో
ముళ్ళు, రాళ్ళు, పూలు అన్నీ...
ఈ పయనంలో...
నలుగురు ప్రధానోపాధ్యాయుల మార్గదర్శకాన నడవడం
పాఠాలు చెప్పడమే కాదు నేర్చుకోవడం కూడా
తప్పకుండా గమనంలో ఉంచుకుంటా


వెళ్ళినప్పుడు ఉన్నవారు
ఉన్నప్పుడు వచ్చినవారు
వచ్చి వెళ్ళినవారు
వచ్చేటప్పటికి మిగిలినవారు
ఏతావాతా ఓ నలభై  మంది ఉపాధ్యాయులతో
కాలాన్ని పంచుకోవడం, కలిసినడవడం
  మధుర జ్ఞాపకమే!

నీ దరికి చేరిన క్షణాన
మూడొందల అరవై మంది పిల్లలు
ఓ తొమ్మిది మంది గురువులు  

వొదిలి వొస్తున్న క్షణానికి
తొమ్మిది వందల డెబ్బై మంది పిల్లలు
ఇరవై అయిదు మంది ఉపాధ్యాయులు
నీ ఎదుగుదలను చూశాకా
ప్రభుత్వ పాఠశాలలు పతనమవుతున్నాయనే మాటలను
ఎలా ఒప్పుకోవడం?
తల్లీ!
నీకు నేనేమి చేశానో తెలియదు కాని,
నీవు నాకు ఇచ్చింది మాత్రం చాలా ఎక్కువే
నీవు నేర్పిన ప్రతి పాఠాన్ని గుర్తుంచుకుంటా
వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తా!
చేసే పనికి పునరంకితమవుతా
తల్లీ!
ఇప్పటికిక వెళ్ళొస్తా! 
వీలైతే మళ్ళొస్తా!!





19, జులై 2015, ఆదివారం

గురుగింజలు

గురుగింజలు
పులి కాదు
పులి బిడ్ద కాదు
అడ్డంగా దొరికినోడెవడైనా
మహా చెడ్డ దొంగే
మరి 'దొర​'క​(కొ)ని(న​)వాడు....??
దొరలనే పిలుద్దాం!
దొరలనే కొలుద్దాం!
అవసరమనిపిస్తే
భజనగీతం రాసి భక్తితో పాడుదాం
అదీకాదంటే
శిరస్సొంచి, శివాలెత్తి ఆడుదాం
మన పిచ్చిగాకపోతే
పైస మీద ప్రజాస్వామ్యం పరిఢవిల్లు కాలానా
గు...కింద నలుపుండని
గురుగింజలు దొరుకుతాయా?
కళ్లకున్న గంతలన్ని విప్పేస్తే
జెండా ఏదైనా దోచే ఎజెండా కనిపిస్తది
ముడుచుకున్న గుండెను విప్పారిస్తే
నేత ఎవ్వడైనా నీతిమాలిన తనం అగుపిస్తది.
----ఎన్. జయన్న​
     

14, జులై 2015, మంగళవారం

పుణ్యమా? -పాపమా?

పుణ్యమా? -పాపమా?
రాజమండ్రి, షాంగై, మక్కా,
ప్రాంతమేదైనా కావొచ్చు
పుష్కరాలు, వేడుకలు
సందర్భం ఏదైనా కావొచ్చు
ఊపిరిపోయడానికి బదులు
విశ్వాసాలకు ఊపిరితీయడం
ఇప్పుడు కొత్తేమి కాదు
జరిగిన సంఘటనల నుండి
జనం పాఠం నేర్వకపోవడమే వింత​
ముందస్తు ఏర్పాట్లలో ప్రభుత్వ  వైఫల్యాలు
చక్కదిద్దాల్సిన అధికార యంత్రాంగపు నిద్రమత్తు
వీటికి తోడు వివేకరాహిత్య ప్రజోత్సాహం తోడైతే
జరిగే మహోత్పాతాన్ని ఇక ఏ పుణ్యకార్యం ఆపగలదు
గాలిలో కలిసే ప్రాణాలను ఏ మతానికి చెందిన​
దేవుడు రక్షించగలడు
---ఎన్. జయన్న​

1, మే 2015, శుక్రవారం

నా యాత్రానుభవాలు-7 , శ్రావణబెళగొళ

                                                                                               14.10.2013
                                                                                             
హాలేబీడులో మధ్యాహ్నం భోజనం చేసి నేను, నా మిత్రుడు బషీర్ శ్రావణబెళగొళ వైపు బయలుదేరాం. ముందుగా హాలేబీడు నుండి హాసన్,  హాసన్ నుండి బెలగొళ స్టేజికి  వచ్చాం. అక్కడి నుండి (48 వ జాతియ రహదారి నుండి) ఓ  చిన్న ఆటోలో శ్రావణబెళగొళ బయలుదేరాం. దారి పొడువునా ఎటూ చూసినా కొబ్బరి చెట్లే కనిపించాయి. అక్కడక్కడా చెరువులు  ఆ ప్రాంతమంతా బహు సుందరంగా కనిపించింది.  ఓ అరగంట ప్రయాణం తర్వాత శ్రావనబెళగొళ చేరుకున్నాం. సుమారు సాయంత్రం నాలుగు గంటల సమయంలో బెళగొళకు వచ్చాం.

         శ్రావణబెళగొళ కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాలోని చెన్నగరాయపట్టణానికి సమీపంలోని పట్టణం. ఇది బెంగుళూరుకు 158 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జైనులకు ప్రీతిపాత్రమైన బాహుబలి (గోమఠేశ్వరుడి) అతి ఎత్తైన విగ్రహం ఇక్కడ ఉంది. ఇక్కడ 2000 ఏళ్ళ సంవత్సరాలకు పూర్వమే జైన మతం ఉండినట్లు తెలుస్తుంది.  పశ్చిమ గంగ సామ్రాజ్యపు శిల్ప,వాస్తు కళా నైపుణ్యానికి ఇది ఆలవాలం. మౌర్య రాజు చంద్ర గుప్త మౌర్యుడు యుద్ధ జీవితంతో విసిగి ఇక్కడికి వచ్చి ధ్యానంతో మనశ్శాంతిని పొందినట్లు తెలుస్తుంది. దక్షిణ కాశిగాను ఈ పట్టణాన్ని వ్యవహారిస్తారు. రాజస్థాన్‌లోని అబూ పర్వతం, ఒడిశాలోని ఉదయగిరి గుహలతో పాటు జైనులు శ్రావణబెళగొళను పరమ పవిత్ర స్థలంగా భావిస్తారు.

          ఈ పట్టణానికి  ఇరువైపుల చంద్రగిరి, వింధ్యగిరి అను రెండు కొండలు ఉన్నాయి. ఇక్కడ ఆచార్య బద్రబాహు మరియు అతని శిష్యుడు చంద్రగుప్త మౌర్యుడు తపస్సు ఆచరించినట్లు తెలుస్తుంది. క్రీస్తుపూర్వం 3 వ శతాబ్ధిలో అశోకడు ఇక్కడ చంద్రగుప్తుని పేరుతో మఠాన్ని ఏర్పాటు చేశాడు.  చంద్రగిరిపై గొప్ప ఆలయం ఉంది. దీనిని గంగ రాజు రాజమల్ల మంత్రి, మరియు నేమిచంద్రుని శిష్యుడిగా చెప్పబడె చాముండిరాయ నిర్మించాడు.  రెండు కొండల మధ్యలో ఓ పెద్ద కొలను ఉంది. చాలా సుందరంగా కనిపిస్తుంది.  దీనికి శ్వేతకొలను లేదా దవళ సరోవరం అని పేరు. ఈ శ్వేతకొలనుకు కన్నడంలో బెళగొళ అని పేరు.  శ్రవణుడి(గోమఠేశ్వరుడి) బెళగొళ కాబట్టి శ్రావణబెళగొళగా ఈ ప్రాంతానికి పేరు స్థిరపడిపోయింది. ఈ కొలనుకు శ్వేత కొలను  అని పేరు రావడానికి వెనుక ఓ జానపద ఐతిహ్యం ఉంది.
వింధ్యగిరిపై రాజమల్ల మంత్రి చాముండిరాయ ఎన్నో ప్రయాసలు పడి గోమఠేశ్వరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయించాడు. ఈ విగ్రహానికి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహామస్తకాభిషేకం జరిగేలా ఏర్పాటుచేశాడు. తొలినాళ్ళలో అభిషేకోత్సవం జరిపించాలని చాముండిరాయ నిర్ణయించాడు. గొప్ప విగ్రహాన్ని ఏర్పాటు చేయించిన తనకు తప్ప వేరే ఎవరికి ఆ అభిషేకోత్సవంలో పాల్గొనే అవకాశం లేదని ప్రకటించాడు. బాహుబలి అభిషేకానికి అన్ని ద్రవ్యాలు తెప్పించాడు చాముండిరాయ. అభిషేకోత్సవం మొదలైంది. చాముండి తెప్పించిన అన్ని ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అన్నీ ఐపోయాయి. కాని అభిషేక ద్రవ్యాలు బాహుబలి పాదాలకు కూడా చేరలేదు.  చాముండిరాయకు యేమిచేయాలో పాలుపోలేదు. చివరికి ఒక అజ్జి(ముసలవ్వ) గుల్లెకాయ(కొబ్బరికాయ)లో కొన్ని పాలు తీసుకొని వచ్చిందట. తనకు అభిషేకానికి అనుమతి ఇవ్వమని కోరిందట. భటులు ముందు అంగీకరించకపోయినా, చాముండిరాయ ఆజ్ఞతో అనుమతించారట. అవ్వ ఆ చిన్న కొబ్బరి చిప్పలోని పాలను బాహుబలి మస్తకంపై పోయగా, ఆ కొద్ది పాలే ఆశ్చర్యంగా  బాహుబలి శిరస్సు నుండి పాదాలకు చేరి మొత్తం తడిపివేశాయట. అంతటితో ఆగకుండా ఆ విగ్రహం నుండి పాలు కొండ మీదికి, ఆ వింధ్యగిరి మీద నుండి కిందికి ధారాపాతగా ప్రవహించాయట. అలా పారిన ఆ పాలతో ఏర్పడినదే ఈ సరస్సు అని, అందుకే ఇది తెల్లగా ఉన్నదని, దానికి శ్వేతకొలను లేదా దవళసరోవరమని పేరొచ్చిందని చెబుతారు.  చాముండిరాయ అవ్వ మహాత్యానికి  అబ్బురపడి, క్షమించమని కోరాడట. ఆ అవ్వ ఎవరో కాదని జైన జాతి రక్షక దేవత అని, భగవంతుడి సేవాభాగ్యాన్ని అందరికి కలిపించాలని చాటి చెప్పి, చాముండిరాయ కళ్ళు తెర్పించడానికి వచ్చిందని జైనులు విశ్వసిస్తారు. ఆ అవ్వకు ఒక ఆలయాన్ని నిర్మిచారు. ఆ ఆలయాన్ని గుల్లెకాయ అజ్జి ఆలయంగా పిలుస్తారు.

     అప్పటికే సాయంత్రం కావడం వలన వేగంగా వింధ్యగిరి వైపు అడుగులు వేశాం. కొండ మీదికి పోవడానికి సహజమైన మెట్లు ఉన్నాయి. కొండ బండలనే మలిచి ఏర్పాటు చేశారు. రెండు వరుసలలో, రెండు రకాలుగా మెట్లు మలిచారు. రెండు వరుసలను కూడా ఎక్కి దిగటానికి ఉపయోగిస్తారు. మెట్లు ఎక్కి, దిగలేని వారి కొరకు ఏటవాలుగా తయరు చేసినది రెండో వరుస ఏర్పాటన్న మాట. కొండ మీద గుళ్ళు, విగ్రహాలు, మరి ముఖ్యంగా గోమఠేశ్వరుడి విగ్రహం చూపరులను కట్టి పడేస్తాయి.   ఈ గోమఠేశ్వర విగ్రహాన్ని చాముండిరాయ ప్రతిష్టించాడు.  ఈ 58 అడుగుల ఎత్తైన , ఆకర్షణీయమైన గోమఠేశ్వరుడి ఏకశిలా విగ్రహం,  ప్రపంచంలో అతి పొడవైన ఏకశిలా విగ్రహంగా గుర్తింపు తెచ్చుకుంది. భారతదేశపు ఏడు అద్భుతాల జాబితా కొరకు టైంస్ ఆఫ్ ఇండియా (ఆంగ్ల దినపత్రిక)2007 ఆగస్ట్‌ లో ఒక సర్వేను నిర్వహించింది. అందులో 49 శాతం మంది గోమఠేశ్వర విగ్రహానికి తమ మద్ధతు తెలిపి మొదటి స్థానాన్ని కట్టబెట్టారు. ఈ విగ్రహాన్ని కన్నడ ప్రజలు గోమఠేశ్వరుడిగా పిలుస్తే, జైనులు బాహుబలిగా కొలుస్తారు. ఈ గోమఠేశ్వరుడికి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహామస్తకాభిషేక ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ సందర్భంగా పాలు, పెరుగు, నెయ్యి, కుంకుమపూలు, బంగారు నాణేలతో అభిషేకం చేస్తారట. ఈ ఉత్సవానికి దేశ నలుమూలల నుండి వేలకొలది జైనులు తరిలివస్తారట.  మళ్ళీ 2018లో మహామస్తకాభిషేకం జరుగుతుంది.


  ఈ విగ్రహం యొక్క పీఠంపై కన్నడ, ప్రాచీన కొంకణి, సంస్కృత సమ్మిళితమైన లిపిలో ఒక శాసనం ఉంది. ఈ శాసనం క్రీ.శ.981 నాటిదిగా చెప్పబడింది.  ఈ శాసనంతో పాటు ఈ వింధ్యగిరిపై, చంద్రగిరిపై, పట్టణంలోనూ దాదాపు 800కు పైగా శాసనాలు ఉండినట్లు తెలిసింది.  ఇవన్నీ క్రీ.శ.600 నుండి 1830 మధ్య వివిధ కాలాలకు చెందినవిగా గుర్తించారు. . వీటిలో అధిక భాగం  చంద్రగిరి పర్వతం మీద లభించాయట.  చంద్రగిరిపై లభించినవన్నీ  కూడా క్రీ.శ. 10 వ శతాబ్ధికి ముందు కాలానివని తెలిసింది.  వీటిలో ఎక్కువ భాగం ప్రాచీన కన్నడలో ఉండగా, మిగిలిన శాసనాలు  కొంకిణి, మరాఠి, తమిళ, సంస్కృత, మహజనీ భాషల్లో ఉన్నాయట.  వీటిలో చాలా శాసనాలు పశ్చిమ గంగ, రాష్ట్ర కూట, హొయసల, విజయనగర, ఒడయార్ సామ్రాజ్యాల ఉత్థానపతనాలకు సూచికలని తెలిసింది.  కొండ పై నుండి ఎటు చూసినా చుట్టుతా కొబ్బరి తోటలే. కేరల సౌందర్యాన్ని గుర్తు చేస్తుంది. ఆ సౌందర్యాన్ని మనసార ఆస్వాదిందించి, తిరుగు ప్రయణమయ్యాం. వింధ్యగిరి మీదునుండి తిరిగి వచ్చేటప్పటికే చీకటి పడటంతో చంద్రగిరి మీదుకు వెళ్ళలేక పోయాం. అక్కడి ఆలయాన్ని చూసే భాగ్యం కలుగలేదన్న విచారంతో తిరుగు ప్రయాణమయ్యం.

          వచ్చిన దారిలోనే జాతీయ రహదారి మీదుకొచ్చి, హాసన్‌ చేరుకొన్నాం.  ఆ రాత్రి హాసన్‌లో భొజనాలు కానిచ్చి బస్టాండ్‌కు వచ్చాం. ధర్మస్థల్‌కు వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. బస్ బయలుదేరి వెళ్ళే సమయం చాల ఉండటంతో పొద్దు పుచ్చటానికి, తెలుగు సినిమాను వెతుక్కుంటూ వెళ్ళాం. తెలుగుదేశంలో కన్నడ సినిమాలు కరువు కానీ, కన్నడదేశంలో తెలుగు సినిమాలకు కరువులేదు. మేం తిరిగిన చాలా వరకు కన్నడ దేశంలో ప్రతి పెద్ద పట్టణంలోనూ ఏదో మూలన, ఏదో ఒకటి తెలుగు సినిమా ఆడుతూనే ఉంటుంది. ఇది తెలుగు వాళ్ళ విస్తరణను సూచిస్తుంది.  రాత్రి రెండో ఆట మన దగ్గరలా తొమ్మిది గంటలకు కాకుండా  ఎనిమిది గంటలకే ప్రారంభించారు. తొమ్మిది గంటలకని వెళ్ళిన మాకు సగం సినిమానే మిగిలింది. రామయ్య వస్తవయ్యా! చూశాం. థియేటర్‌లో కన్నడిగులు ఉండినప్పటికి ఎక్కువ భాగం తెలుగు వాళ్ళేనని వాళ్ళ అరుపులు, కేకలతో తెలుసుకున్నాం. అంతమంది తెలుగు వాళ్ళను ఓ కన్నడ ప్రాంతంలో చూసే సరికి చాలా ఆనందం కలిగింది. సినిమా చూసి బస్టాండ్‌కు వచ్చాకా, చాలా సేపు బస్ కొరకు ఎదురు చూశాం. మా ఎదురుచూపులకు వీడ్కోలు చెబుతూ గంట తర్వాత బస్ వచ్చింది. కండక్టర్ తో టికెట్ తీసుకొని ఎక్కి కూర్చున్నాం. బస్ బయలుదేరింది. రోజంతా తిరిగి అలసిపోవడంతో కాసేపటికే కళ్ళు మూతలు పడ్డాయి.    

6, ఏప్రిల్ 2015, సోమవారం

సోమనాద్రి

నల సోమనాద్రి
నల సోమనాద్రి  ఘనమైన  చరిత్ర కలిగిన  గద్వాల సంస్థాన స్థాపకుడు. ఈ సంస్థానంలో  సుప్రసిద్ధ పాలకుడు. ఇతనికి పెద్ద సోమభూపాలుడు, పెద శోభనాద్రి  అను  పేర్లు  కూడా ఉన్నాయి..  ఈ సంస్థానం ఒకనాడు మహబూబ్ నగర్ జిల్లాలోని సంస్థానాలలో ప్రసిద్ధిచెందినది. ఈ సంస్థానం స్థాపించాడానికి ముందు సోమనాద్రి పూడూరును రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. క్రీ.శ. 1663లో ఈ సంస్థానాన్ని స్థాపించాడు. ఇక్కడ ఒక కోటను కూడా నిర్మించాడు. 

                                                             సోమనాద్రి 

గద్వాల సంస్థాన ప్రభువుల వంశవృక్షం

                                                    బక్కమ్మ
                                                                    |
                                                                    ↓(పెంపుడు కుమారుడు)
                                                పెద శోభనాద్రి|పెదసోమ భూపాలుడు|సోమనాద్రి
                                                           (1663-1712)
                                  రాణి అమ్మక్కమ్మ|           | రాణి లింగమ్మ
                                        (సోమనాద్ర పెద్దభార్య)|         |(సోమనాద్రి చిన్నభార్య)
                                                 (1746-47)                        (1747-60)
                                                                                              |
                                                                                             ↓(దత్తపుత్రుడు)
                                                                                రాజా తిరుమలరావు 
                                                                                    (1760-64)
                                                                  రాణి మంగమ్మ|           |రాణి చొక్కమ్మ
                                               (తిరుమలరావు పెద భార్య)   |           | (తిరుమలరావు చిన్న భార్య) 
                                                         (1764- ... )                         (1764- 68)  
                                                                                |        −−−−−−−−−−−→ ↓(చొక్కమ్మ మరిది) 
                                                                                                    రాజా రామరాయలు 
                                                                                                    |                            (1768-83)
                                                                                                    | 
                                                                                                    | (చొక్కమ్మ కుమారులు)
                                                                                                   ↓ (రాజ రామరాయల పెంపుడు కుమారులు)
                             ↓ −−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−− ↓
                     రాజా చినసోమభూపాలుడు                                         రాజా చిన రామభూపాలుడు
                          (1784-1815)                                                                 (1816-28)
                                                                                                                 |
                                                                                                                 ↓(ఏకైక కుమారై)
                                                                                                           లింగమ్మ 
                                                                                               (రా.సీ.రా.భూ. రెండవ భార్య ) 
   |------------−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−    |                       (1861-63) 
    |                                                                                         |భర్తరాజా సీతారామభూపాలుడు 
   |                                                                (రాజా చిన రామభూపాలుడి ఇల్లరికపు అల్లుడు)
    |                                                                                         (1828-61)
    |                                                                                     వెంకటలక్ష్మమ్మ   ||        అనంతమ్మ
    |                                                                  (రా.సీ.రా.భూ. మొదటి భార్య)       (రా.సీ.రా.భూ.మూడవ భార్య)
    |                                                                                  (1867-87)
    |                                                                                             |
    |(లింగమ్మ దత్తపుత్రుడు)                                                           |
   ↓                                                                                              |
రాజా సోమభూపాలుడు                                                    | (వెంకటలక్ష్మమ్మ దత్తపుత్రుడు)
     (1863-66)                                                                             ↓
                                                                               రాజా రామభూపాలుడు
                                                                                       (1887-1923)
                                                                                              |భార్య||రాణి లక్ష్మీదేవి (1923-35)
                                                                                              |
                                                                                              | (దత్తపుత్రుడు)
                                                                                             ↓
                                                                            రాజా చిన సీతరామభూపాలుడు
                                                                                          (1935-46)

                                                                                 ||భార్య||రాణి ఆదిలక్ష్మిదేవమ్మ (1946-47)
కుటుంబ నేపథ్యం
ఇతని తండ్రి పెద్దారెడ్డి. తల్లి బక్కమ్మ. ఇతనికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య అమ్మక్కమ్మ ,   చిన భార్య లింగమ్మ . తల్లి బక్కమ్మ పుట్టినిల్లు పూడూరు.   ఆ పూడూరే సోమనాద్రి తొలి రాజధాని.


సోమనాద్రి స్వరూపం

సోమనాద్రి ఆరడుగుల ఎత్తు ఉండేవాడు. నల్లని గంభీరమైన ఆయన శరీర సౌస్టవం చూపరులకు భీతిగొల్పేది. సాము చేత కండలు తిరిగిన పొడవైన చేతులు కలిగి ఉండి ఆయన శత్రువులకు ప్రలయకాల రుద్రుని వలే ఉండేవాడట. 


కోట నిర్మాణ కాలాన్ని సూచించే శిలాఫలకం 
కోటను నిర్మించడం వెనుక ఉన్న కారణాలు

1. జానపద ఐతిహ్యం

సోమనాద్రి ఒకనాడు అటవి ప్రాంతంగా ఉండిన గద్వాల ప్రాంతానికి, పూడూరు నుండి వేటకు వచ్చాడు. ఆ సందర్భంలో ఆయనకు ఒక విచిత్ర దృశ్యం కనపడింది. ఒక కుందేలు వేట కుక్కను తరమడం గమనించాడు. ఇక్కడి స్థలానికి ఏదో మహత్తు ఉందన్న విషయాన్ని గ్రహించాడు. తన అనుంగు సహచరులతో చర్చించి , పూడూరు నుండి గద్వాలకు రాజధానిని మార్చాలని నిర్ణయించుకున్నాడు. అందుకు అనుగుణంగానే పటిస్ఠమైన  కోటను కూడా నిర్మించాలని నిర్ణయించుకున్నాడు.  కార్యాచరణను సిద్ధం చేశాడు.
2. ఉత్తరాన కృష్ణానది ఉండటం
ఈ ప్రాంతం కృష్ణానది సమీపాన ఉండటం వలన తనకు అన్ని విధాల అనుకూలమైనదిగా భావించి, ఇక్కడ కోట నిర్మించి, తన రాజధానిని పూడూరు నుండి ఇక్కడకు మార్చాడు.  
కోట కుడ్యం



కోట నిర్మాణానికి ఆదిలోనే అవాంతరాలు.

సోమనాద్రి కోట నిర్మించాలనుకున్న ప్రాంతం తన ఆధీనంలోని ప్రాంతమని  గద్వాలకు, రాయచూరుకు మధ్యలో ఉన్న ఉప్పేరును పాలిస్తున్న నవాబు సయ్యద్ దావూద్ మియా  కోట నిర్మాణానికి అడ్డుచెప్పాడు. ఇతను నాటి నిజాం నవాబు నాసిరుద్దౌలాకు బంధువు.  ఎలాగైనా కోటను ఇక్కడే నిర్మించాలని నిర్ణయించుకున్న సోమనాద్రి  తీవ్ర ఆలోచనలో పడిపోయాడు. అనుకున్న పని జరుగాలంటే ఓ మెట్టు దిగక తప్పదని భావించిన సోమనాద్రి, సంధి తప్ప మరో మార్గం లేదని గ్రహించాడు. ఉప్పేరు నవాబుతో సంధి కుదుర్చుకున్నాడు. కోట నిర్మాణానికి అనుమతిస్తే, నిర్మాణానంతరం కొంత పైకం చెల్లించగలనని సోమనాద్రి చెప్పాడు. నవాబు కూడా అంగీకరించాడు. 

కోట నిర్మాణం.

సోమనాద్రి వృత్తాకారంలో పటిస్టంగా మట్టి కోటను నిర్మించాడు. తూర్పూ, పడమరల వైపు రెండు ప్రధానా ద్వారాలు, ఉత్తరం వైపు అత్యవసర రహస్య ద్వారం ఉండేటట్లు కోటను నిర్మిచాడు.  కోటలో ఒక పెద్ద బావి, అంతఃపుర మందిరాలు, చెన్న కేశవస్వామి ఆలయం నిర్మింపజేశాడు. 
కోట పశ్చిమ ప్రవేశ ద్వారం


ఆలయ నిర్మాణం వెనుక కథ
కోట నిర్మాణ సమయంలో ఎంత పకడ్బందిగా నిర్మిస్తున్నప్పటికీ కోట నిలబడక పోతే, కేశావాచారి అను ఒక బ్రాహ్మణుడుని బలి ఇచ్చారట. అతని పాప పరిహారార్థం అతని పేరు మీదుగా ఈ కేశావాలయాన్ని నిర్మించారని అంటారు.  ఈ ఆలయ సముదాయం పశ్చిమ ద్వారానికి సమీపంలో ఉంటుంది. మధ్యలో కేశావాలయం, రెండు వైపుల పెద్ద మండపాలు ఉన్నాయి. ఆలయానికి ఎడమ వైపు మండపంలో శిల్పకళా నైపుణ్యం ఆకట్టుకొంటుది. అన్నిటికి మించి ఆలయ రాజ గోపురం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.  

ఉప్పేరు నవాబుతో తగాదా

కోట నిర్మాణానికి ముందు ఉప్పేరు నవాబుతో చేసుకున్న ఒప్పందాన్ని సోమనాద్రి ఉల్లంఘించాడు. మొదట్లోనే పైకం చెల్లించడం ఇష్టం లేకపోయినా కోట నిర్మాణానికి ముందు, అనవసర రాద్ధాంతం దేనికని నవాబుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. పని పూర్తైన పిదప ఒప్పందాన్ని తోసిపుచ్చాడు. దానితో ఆగ్రహించిన నవాబు సోమనాద్రిపై యుద్ధాన్ని ప్రకటించాడు. తనకు తోడు రావలసిందిగా రాయచూరు నవాబు బసర్ జంగుకు, అలంపూర్ పరగాణాలోని ప్రాగటూరును పాలిస్తున్న హైదర్ సాహెబ్‌కు కబురు పంపాడు సయ్య ద్ దావూద్ మియా.                                                                                                                           
                                                                                                          ఆలయ రాజగోపురం             


అరగిద్ద యుద్దం
సోమనాద్రి తన సైన్యంతో, మూడు ప్రాంతాల నవాబుల సైన్యాన్ని  రాయచూరు సమీపంలోని అరగిద్ద(ఇది నేడు గట్టు మండలంలోని ప్రాంతం)దగ్గర ఎదుర్కొన్నాడు.  ఇరు పక్షాల మధ్య సంకుల సమరం సాగింది. ఈ యుద్ధంలో సోమనాద్రి వీరోచిత పోరాటానికి తాళలేక రాయచూరు నవాబు బసర్ జంగ్ పలాయానం చిత్తగించాడు. ఇది గమనించిన ప్రాగటూరు నవాబు హైదర్ సాహెబ్ కూడా చేసేదేమిలేక ఇంటి ముఖం పట్టాడు. తోడు నిలుస్తారని భావించిన మిత్రులు వెన్ను చూపడంతో, ఏకాకిగా మిగిలిన సయ్యద్ దావూద్ మియా పోరాటం చేయలేక, ప్రాణాల మీది తీపితో తన ఓటమిని అంగీకరించి, సోమనాద్రిని శరణు వేడాడు. ఇక ముందెన్నడూ మీ జోలికి రానని, యుద్ధ పరిహారంగా తన యుద్ధ చిహ్నాలైన నగారా, పచ్చ జెండా, ఏనుగులను సోమనాద్రికి సమర్పించుకున్నాడు. దిగాలుగా ఉప్పేరుకు చేరుకున్నాడు.
చల్లారని ఉప్పేరు నవాబు కోపం

అరగిద్ద యుద్ధంలో పరాబావాన్ని ఎదుర్కొన్న ఉప్పేరు నవాబు సయ్యదు దావూద్, మరుసటి రోజు తన కోటపై నుండి గద్వాల వైపు చూడగా గద్వాల కోటపై రెపరెపలాడుతున్న తన పచ్చ జెం

డా కనిపించింది. అది అతనిని మరింతంగా కుంగదీసింది. ఆగ్రహింపజేసింది. ప్రతీకారంతో రగిలిపోయాడు. ఎలాగైనా దెబ్బకు దెబ్బ తీయాల్సిందేనని కంకణం కట్టుకున్నాడు. అనుకున్నదే తడువుగా నాటి నిజాం నాసిరుద్దౌలా దగ్గరకు హైదరాబాద్‌కు ప్రయాణమయ్యాడు. తన అవమానాన్ని, తన దీనస్థితిని చెప్పుకున్నాడు. సోమనాద్రిని దండించే వరకు నాకు మనశ్శాంతి ఉండదని చెప్పాడు. దానికి నిజాం సోమనాద్రి మీదకు దండయాత్ర మంచిది కాదని, ఆ యోచన విరమించుకోమని సయ్యద్‌కు సలహా ఇచ్చాడు. కాని సయ్యద్ పట్టు విడవలేదు. తప్పని పరిస్థితిలో ఉప్పేరు నవాబు సయ్యదు దావూద్ మియాకు బాసటగా నిజాం నవాబు సోమనాద్రి మీదకు యుద్ధాన్ని ప్రకటించాడు. అరగిద్ద యుద్ధంలో పరాజయం పాలై అవమానంతో రగిలిపోతున్న రాయచూరు, ప్రాగటూరు నవాబులకు ఇది అనుకోని వరమైంది. వెంటనే తమ సైన్యాలతో కలిసి, నిజాం సైన్యానికి తోడయ్యారు.

కోటలో ఆలయ సముదాయం



నిడ్జూరు యుద్దం
తుంగభద్రకు ఉత్తరాన ఉప్పేరు, రాయచూరు, ప్రాగటూరు నవాబుల సైన్యం తోడుగా నిజాం సైన్యం బయలుదేరింది.  వీరు చాలరని తుంగభద్రకు దక్షిణాన గుత్తి నవాబు టీకు సుల్తాన్, కర్నూలు నవాబు దావూద్ ఖాన్, బళ్ళారి నవాబుల సైన్యాలు జతగూడాయి. ఇంత మంది సైన్యం జతగూడడమే సోమనాద్రి పరాక్రమానికి ప్రబల నిదర్శనం. ఏడుగురు నవాబుల సైన్యాలు తుంగభద్ర నదికి దక్షిణాన నిడుదూరు(నేటి నిడ్జూరు) గ్రామానా విడిది చేశాయి. సోమనాద్రి తన సైన్యంతో తుంగభద్రకు ఉత్తరాన ఉన్న కలుగొట్ల (నేటి మానోపాడు మండలంలోని గ్రామం) దగ్గర విడిది చేశాడు. మరుసటి రోజు  నిడుదూరు దగ్గర యుద్ధం ప్రారంభమయింది. సూర్యోదయంతోనే సోమనాద్రి తన సైన్యంతో నిడుదూరు మిద దండెత్తాడు.  రోజంతా నవాబుల సైన్యంతో వీరొచితంగా పోరాడాదు. నవాబుల సైన్యం కకావీలమైపోయింది. సోమనాద్రి ఆ రాత్రి తిరిగి కలుగొట్లకు వచ్చి విశ్రమించాడు. 
                                                                                                                                                                                                                                                                                      రాజభవన శిథిలాలు
                                                                                                                                       
సోమనాద్రి ఆయువుపట్టుకై పన్నాగం

ఆ రోజు పోరాటంలో సోమనాద్రి పరాక్రమాన్ని చూసిన నిజాం, ఆ రాత్రి తక్షణ దర్బారు నిర్వహించాడు. సోమనాద్రిని ఓడించడానికి ఉపాయం చెప్పమన్నాడు. ఒక సర్ధారు సోమనాద్రి బలమంతా అతని గుర్రమేనని దాన్ని వశం చేసుకొంటే, మన విజయం సులువేనని చెప్పాడు. వెంటనే నిజాం, సోమనాద్రి గుర్రాన్ని ఈ రాత్రికి దొంగిలించి తెచ్చినవాడికి  జాగీరును ఇస్తానని ప్రకటించాడు. ప్రాణాలకు తెగించి ఒక సైసు కలుగొట్లకు వచ్చి సోమనాద్రి గుర్రాన్ని తీసుకవెళ్ళాడు. ఇచ్చిన మాట ప్రకారం నవాబు అమితానందంతో జాగీరుతో పాటు, ఒక బంగారు కడియాన్ని కూడా సైసుకు బహుమానంగా ఇచ్చాడు. 

మరుసటి రోజు సోమనాద్రి కలుగొట్ల శిబిరంలో కలకలం చెలరేగింది. తన గుర్రం లేక పోవడం తనకు  కుడిచేయి తెగినట్లుగా అనిపించింది. అయినా ధైర్య,స్థైర్యాలను విడువకుండా ఎలాగోలా రెండో రోజు యుద్ధాన్ని ముగించాడు. ముందు రోజు నాటి ఉత్సాహం లేక పోవడాన్ని గమనించి, తన వాళ్ళందరితో సమాలోచన చేశాడు. తన గుర్రాన్ని తెళ్ళవారేలోగా ఎవరైతే తిరిగి తెచ్చివగలరో వారికి ఆ గుర్రం ఒక రోజు తిరుగునంత వరకు భూమిని ఇనాంగా ఇవ్వగలనని ప్రకటించాడు.

హనుమప్పనాయుడి త్యాగం:
సోమనాద్రి ప్రకటనకు హనుమప్పనాయుడు అను ఒక బోయ సర్ధారు ముందుకు వచ్చాడు. ఇతని స్వగ్రామం నేటి ఇటిక్యాల మండలంలోని బొచ్చెంగన్న పల్లె. నాయుడు ఆ రాత్రి జొన్న సొప్పను ఒక మోపుగా కట్టుకొని నిడ్జూరుకు బయలుదేరాడు. నిజాం సైన్యం డేరాలను సొప్ప అమ్మేవాడిగా సమీపించాడు. అక్కడి సైన్యం సొప్పను ఖరీదు చేయగా హనుమప్ప ధర కుదురనీయలేదు. తన లక్ష్యం గుర్రం కాబట్టే అలా చేశాడు. ఎవరికి అనుమానం రాకుండా గుర్రాన్ని వెతుకుతూ డేరాలన్ని చూశాడు. చివరకు ఒక దగ్గర గుర్రం ఉండటాన్ని గమనించాడు. గుర్రం కూడా హనుమప్పను చూసి  సకిలించింది. సొప్పను చూసే సకిలించిందని సరి పెట్టుకున్నారు అక్కడి సైనికులు. గుర్రం కనపడిన ఆనందంతో తక్కువ దరకే సొప్పను అమ్మాడు. ఆ తర్వాత తప్పించుకొనే సమయం కోసం ఎదురుచూస్తూ, ఎవరి కంటాపడకుండా అక్కడే ఉన్న గడ్డి మోపుల కింద చప్పుడు కాకుండా దూరాడు. నాయుడుని చూసిన ఆనందంతో కట్టేసిన గుర్రం పెనుగులాడి గూటం పెరికి, సకిలించింది. దాని అలికిడికి దగ్గరలో ఉన్న ఒక సైనికుడు గుర్రం దగ్గరకు వచ్చాడు. నాయుడు చప్పుడు కాకుండా గడ్డి కింద అలాగే పడుకొని ఉండిపోయాడు. ఆ సైనికుడు పెరికిన గూటాన్ని తిరిగి గడ్డి మీద మోపి పాతి, గుర్రాన్ని కట్టేసిపోయాడు. ఆ గడ్డి కింద వెల్లకిలా పడుకొని ఉన్న నాయుడి కుడి చేతి మీద ఆ గూటం దిగిపోయింది. ఆ బాధకు తనుకులాడితే, ప్రాణాలే పోయే ప్రమాదమని గ్రహించిన నాయుడు సహనంతో ఓర్చుకొని అలాగే  ఉండిపోయాడు. అర్థ తాత్రి దాకా, సమయం కొరకు ఎదురు చూశాడు. అందరూ గాడ నిద్రలో ఉండటాన్ని గమనించి ఇదే తగిన సమయమని భావించి, చేతిని పీకే ప్రయత్నం చేశాడు. ఎంతకూ రాక పోయేసరికి నడుముకున్న  కత్తిని ఎడమ చేతితో తీసుకొని, గూటం పాతిన కుడి చేతి భాగాన్ని నరుక్కొన్నాడు. తెగిన భాగానికి తలపాగ చుట్టికొని లేచాడు.  గుర్రాన్ని చప్పుడు కాకుండా సైనికుల డేరాలు దాటించి, కలుగొట్ల వైపు దౌడు తీయించాడు. ఆ రాత్రి సోమనాద్రి ముందు  గుర్రంతో సహా నిలబడి హనుమప్ప నాయుడు ఎడమ చేతితో సలాం చేశాడు. నాయుడి దుశ్చర్యకు రాజు ఆగ్రహించాడు.  రక్తమోడుతున్న నాయుడి తెగిన కుడి చేతిని చూశాకా, జరిగిన సంగతంతా విన్నాకా  సోమనాద్రి కదిలిపోయి,నాయుడుని కౌగిలించుకొని సన్మానం చేశాడు. ఇచ్చిన మాట ప్రకారం అప్పటికప్పుడు దాన శాసనం రాయించాడు.     
                                                                                                           సోమనాద్రి స్మారక చిహ్నం
నిడుదూరు యుద్ధం మూడవ రోజు:
తన గుర్రం తిరిగి రావడంతో అమితోత్సాహుడైన సోమనాద్రి మరుసటి రోజు యుద్ధంలో తన పరాక్రమాన్ని చూపాడు. నిజాం సైన్యంపై విరుచుకపడ్డాడు. ఆ నాటి యుద్ధంలో ప్రాగటూరు నవాబు హైదర్ సాహెబ్, బళ్ళారి నవాబు హతులయ్యారు. నిజాం సైన్యాన్ని కర్నూలు వరకు తరుముతూ వెళ్ళాడు సోమనాద్రి. నిజాం సైన్యం కర్నూలు కోటలోకి ప్రవేశించింది. తరుముతూ వెళ్ళిన సోమనాద్రి కూడా కొద్దిమంది సైనికులతో కలిసి కోటలోకి వెళ్ళాడు. హఠాత్తుగా వెనుక నుండి  కోట తలుపులు మూత పడ్డాయి.  దిక్కు తోచక బయటే మిగిలి పోయిన గద్వాల సైన్యం లోపలికి వెళ్ళడానికి విశ్వప్రయత్నం చేసింది. కాని వీలు పడలేదు. కొద్ది మందితో ప్రవేశించిన తమ నాయకుడు కోటలోపల మరణించి ఉంటాడని, కాబట్టి మేము గద్వాలకు తిరిగి వస్తామని, మహరాణి లింగమ్మకు బయటే మిగిలి పోయిన సైన్యం కబరు పంపింది. మహరాణి అలాగే రండి కాకపోతే నేను పంపుతున్న ఈ గాజులు, చీరలు, పసుపు, కుంకుమలు ధరించి తిరిగి రండని ప్రత్యుత్తరం పంపింది. దానితో పౌరుషం పొడుచుకొచ్చిన సైన్యం ఇక విజయమో, వీరస్వర్గమో ఎదో ఒకటి తేలిపోవాలని భావించి, కర్నూలు కోట తలుపులు బద్దలు కొట్టి, కోటలోకి ప్రవేశించారు. ఉన్న కొద్ది పాటి సైన్యం తోనే ఎడతెగని పోరాటం చేస్తున్న సోమనాద్రికి పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్లైయింది తన సైన్యాన్ని చూసే సరికి. మరింత విజృంచేసరికి వీడు ఇక బతకనించేటట్లు లేడని భావించిన  రాయచూరు, గుత్తి నవాబులు యుద్ద విముఖతను చూపారు. ఉప్పేరు నవాబు ఏమి చేయాలో దిక్కు తోచని స్థితిలో పడిపోయాడు. ఈ స్థితిలో యుద్ధాన్ని విరమింపజేసుకొని, సంధి చేసుకోవడమే మేలని మంత్రులు సూచించే సరికి, నిజాం కుడా సరేనన్నాడు. సోమనాద్రి కూడా అంగీకరించాడు. యుద్ధ పరిహారానికి ప్రతిఫలంగా కర్నూలు కొండారెడ్డి బురుజు పైన ఉన్న ఎల్లమ్మ ఫిరంగిని, రాయచూరు నవాబు ఆధీనంలో ఉన్న గోన బుద్ధారెడ్డివని భావించే   రామ, లక్ష్మణ ఫిరంగులను, కర్నూలు ఏలుబడిలోని కొంత భూభాగాన్ని పొంది, విజయోత్సాహంతో సోమనాద్రి గద్వాలకు తిరిగి వచ్చాడు.

ఈ యుద్ధానికి వేదికలైన కలుగొట్ల, నిడ్జూరు గ్రామాలలో నేటికీ నాటి  యుద్ధ చిహ్నాలైన తాత్కాలిక బురుజులు, దిబ్బలు కనిపిస్తాయి.

గద్వాలకు తిరిగి వచ్చిన తరువాత సోమనాద్రి ఇచ్చిన మాట ప్రకారం హనుమప్ప నాయుడుకి గుర్రం ఒక రోజంతా తిరిగే భూమిని ఇనాంగా ఇచ్చాడు. కాల క్రమేణా చాలా భూమి ఇతరుల ఆధీనంలోకి వెళ్ళిపోయినా  ఈ నాటికి హనుమప్ప నాయుడు సంతతి వారు అధిక భూములను ఆ గ్రామంలో అనుభవిస్తున్నారు.  ఆ గ్రామంలో, దాని సమీప గ్రామమైన బొచ్చు వీరాపురంలో ఇతని సంతతి వారే భూస్వాములు. వారిదే పెత్తనం. ఈ అనవాయితీ నేటికీ కొనసాగటాన్ని గమనించవచ్చు.