25, మే 2019, శనివారం

నేను ఓటరును


నేను...
కవిని
రచయితను
మేధావిని
వృత్తి నిపుణడను
సంఘ సంస్కర్తను
తత్వవేత్తను
వాన్ని
వీన్ని
వానమ్మ మొగుడిని
కాని,
నా ఓటు నా కులానికే
నా ఓటు నా మతానికే
అక్కడ వేరే మతం పార్టీ గెలిచిందని
పొర్లి పొర్లి దొర్లాడి ఏడుస్తా!
ఇక్కడ నా మతం పార్టీ గెలిచిందని
ఎగిరెగిరి సంకలు గుద్దుకుంటా!
ఎవడు దొరైతే నాకేంటి?
ఎవడు దొంగైతే నాకేంటి?
ఎవడు నీతి దప్పిన కొడుకైతే నాకేంటి?
ఎవడు నిజాయితీ పరుడైతే నాకేంటి?
నాక్కావలసిందంతా నా కులమోడు గెలవడమే!
నాక్కావలసిందంతా నా మతమోడు గెలవడమే!!
వాడు పచ్చని పొలాల మీద సెజ్జుల గద్దై వాలనీ
కనబడిన ఖాళీ భూమినంతా వామనుడై ఆక్రమించనీ
సంవత్సరానికో ఎనిమిది వేలు నా బ్యాంకు అకౌంట్లో పడతితే చాలదూ!
వాడు లక్షలకోట్లు మింగనీ,
బ్యాంకులకు పంగనామం పెట్టనీ
భృతి అనో, ఫించన్ అనో
నెలకో పచ్చ నోటు నా మొఖాన కొడితే చాలదూ!
వాడు రేపిస్టో! ఫ్యాక్షనిస్టో
పాపిస్టో, పనికిమాలిన పెసరట్టో
ఎవడైతే నాకేంటి?
నాకేంటన్నదే నాకు ముఖ్యం
కాలం మారినా, నేను మారను
నేను దరిద్రుడిని
నేను మూర్ఖుడిని
నేను ఓటరును

ఎన్. జయన్న
25.05.2019

11, మే 2019, శనివారం

ఎప్పుడు_ మాత్రం...



ఎప్పుడు_ మాత్రం...

నడక మొదలైనప్పుడు శిఖరం వైపు
ఒక చెయ్యి కూడా మన వీపు మీద ఉండదు

శిఖరానికి చేరే క్రమంలో
ముళ్ళు, రాళ్ళు తొక్కి కందిన పాదానికి
ఏ హస్తమూ లేపనం రాయదు.

శిఖరం మీద ఉన్నంత కాలం
తలెత్తి ఒక నేత్రమన్న అసూయ నొదిలి
మన విజయాన్ని హర్షించదు

పడినా,
ఎవడైనా దొబ్బినా
శిఖరం మీద నుండి లోయలోకి
ఇక అంతే...

మనతో రాలేక
ఒక్క అడుగన్న వేయలేక
అక్కడే ఆగిపోయిన కాళ్ళు
తొక్కడానికి సిద్దంగా ఉంటాయి.
చూపడానికి వేళ్ళు వెర్రెత్తి పోతుంటాయి.

#నాయుడు_గారి_జయన్న

28, ఏప్రిల్ 2019, ఆదివారం

డా. ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్

డా. ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్  జోగులాంబ గద్వాల జిల్లా కి చెందిన  సంస్కృతాంధ్ర కవి, రచయిత. ఈ జిల్లాలోని ఉండవెల్లి మండలంలోని కంచుపాడు వీరి స్వగ్రామం. 1948 ఫిబ్రవరి 9 వ తేదిన జన్మించారు. ఫాతీమాబీబీ, హసన్ వీరి తల్లిదండ్రులు.  మహమ్మద్ హుసేన్ 1971లో తెలుగు భాషోపాధ్యాయులుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, 2001లో తెలుగు భాషోపన్యాసకులుగా  ఉద్యోగ విరమణ చేశారు. 'వేనరాజు - సమకాలీన సాంస్కృతికోద్యమాల ప్రభావం' అను అంశంపై ఎం.ఫిల్., 'అలంపూరు సీమ - సంస్కృతాంధ్ర సాహిత్యం' పై పి.హెచ్.డి., చేశారు.

రచనలు

1. అలంపురి జోగులాంబికా నక్షత్రమాల                               
2. కోయిల శతకం.
3. దేవదత్తం (పద్య సంపుటి)
4. హుసేన్ గీతములు
5. నేను - చుట్టూ (వచన కవితా సంపుటి)
6. విష్ణ్వష్టకం (సంస్కృతం)
7. విఘ్నేశ్వర స్తోత్రావళీ (సంస్కృతం)
8. చైతన్య ప్రవాహం (గేయ సంపుటి)
9. సర్కారు ఆసుపత్రి (నాటిక)
10. బతుకు బాగుచేసుకుంటా (నాటిక)
11. లోక సుఖం (నాటిక)
12. రైతులేని రాజ్యం (నాటిక)


--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల