8, మే 2018, మంగళవారం

ఇక్బాల్_ఝరి_కొన్ని ఆయుధాలు- కొన్ని కన్నీళ్ళు

ఇక్బాల్
కవి, రచయిత, ఉపాధ్యాయుడు అంతకు మించి ప్రజల మనిషి.

ఝరి 
ఇక్బాల్ గారు ఉపాధ్యాయుడిగా పనిచేసి, ఉద్యోగ విరమణ చేసిన సందర్భంలో ఆయన జీవితం, సాహిత్యం, వారితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొంటూ హితులు, సహచరులు, శిష్యులు తమ స్పందనలతో తెచ్చిన పుస్తకం.

కొన్ని ఆయుధాలు- కొన్ని కన్నీళ్ళు
తన సాహిత్యాన్ని  చదువుతూ, 15 ఏళ్ళ పరిచయంతో తనకు సమీపంలో నడుస్తూ, గమనిస్తూ  వచ్చిన చనువుతో రాసిన కొన్ని మాటలు.

కొన్ని ఆయుధాలు... కొన్ని కన్నీళ్లు...
    ఇక్బాల్'  - పాలమూరు జిల్లా కరువు వ్యతిరేక పోరాట కమిటీ  మొదటి సారి నాకు ఈ పేరును పరిచయం చేసింది. 2003లో పాలమూరు టౌన్ హాల్లో ఈ కమిటీ ఆధ్వర్యంలో ఓ రోజంతా వందలాది మంది కవి గాయకులతో   'పాలమూరు గోస' అనే  కార్యక్రమం ఏర్పాటుచేసింది.  పెద్దలు కె.సి. వెంకటేశ్వర్లు గారి వలన ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చింది.  వారి ద్వారానే వీరి పరిచయ భాగ్యం కలగింది. అంటే వీరు ఉపాధ్యాయుడిగా కన్నా  నాకు కవిగానే ముందు పరిచయం. ఆ పరిచయం నాటి నుండి నేటి దాకా వీరితో సాహిత్యానుబంధం కొనసాగుతూనే ఉన్నది. కాబట్టే వీరి ఉపాధ్యాయజీవితం కన్నా వీరి సాహిత్య జీవితం గురించే నేను ఎక్కువ చెప్పదలుచుకున్నాను.
      కుటుంబం, వృత్తి, సమాజం ఈ  మూడింటి బాధ్యతల నుండి వ్యక్తి తప్పించుకోలేడు.  అట్లాగని వాటిని పూర్తి బ్యాలెన్స్ చేయలేడు.  చాలా మంది మొదటి దాని దగ్గరో, కొంత మంది రెండవ దాని దగ్గరో ఆగిపోతారు. సమాజం గురించి, అది అట్టడుగు వర్గాల గురించి ఆలోచించే తీరిక, ఓపిక ఎవరికీ లేకుండా పోయింది.  ఇట్లాంటి విపరీత, స్వార్థపూరిత కాలంలో,  ఎండి నెర్రెలిచ్చిన నేలలను, కంప చెట్లతో నిండిన కాల్వలను, కాల్వలు మింగిన ఊళ్ళను, సెజ్ రాక్షస పాదాల కింద నలిగే పల్లెలను, పొక్కిలి లేసిన ఇళ్ళను, శవమై తిరిగొచ్చిన వలస జీవులను, అప్పు కత్తై కుత్తుక పై వేలాడితే చూరుకు వేలాడిన నిర్జీవ దేహాలను,  ఇట్లా ఒకటేమిటి..., ఒక్కమాటలో చెప్పాలంటే ఎక్కడ సముద్రం కళ్ళల్లోంచి   దుఃఖమై ఎగిసి పారుతుందో ఆ చోటును  ఒక మనిషి వెతుక్కుంటూ వెళ్ళడం ఎంత ఆశ్చర్యమో! అంతకు మించిన అద్భుతం.  ఇట్లాంటి అద్భుతాలు ఈ కవి ప్రస్థానం లో అడుగడునా కనిపిస్తాయి.  పీడితుల పక్షాన చాలా మంది కవులు కవిత్వమై పలుకుతారు. పిడికిలెత్తమంటే మాత్రం జంకుతారు. ఆ రెండు చేయగల  ధైర్యమున్న సాహిత్య సృజనశీలి ఇక్బాల్ గారు.  అసలా మాటకొస్తే...సమాజాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టిన నాటి నుండి నేటి దాకా ఈ కవి జీవితానికి ఇదే ప్రధానమైపోయింది కూడా. ఈ కవి సమాజాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు, నీ వయసెంతంటారా? దానితో పనేలేదు. వారి సాహిత్యంలో వారి జీవితం కనబడదూ!? కవి జీవితం, అతని సాహిత్యం వేరు కాదు. వేరైనా సాహిత్యం వేరే ఉంటుంది. అది తాలులా తేలిపోతుంది. ఆమూలాగ్రం వీరి సాహిత్యం వీరి జీవితాన్ని ప్రతిబింబిస్తుంది కాబట్టే చిన్నవాడినైనా, పై మాటలు చెప్పే ధైర్యం చేశా.
   ఇరవై ఏళ్ల కిందట గట్టు అంటే రాజస్థాన్ ను తలపించే ఎడారి.  ఆ ఎడారిలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నప్పుడు, అక్కడి ఎడారి భూములను, అక్కడ తడారిన జీవితాలను చాలా దగ్గర నుండి చూసి, చలించిన జీవితం ఈ కవిది.  అందుకే ఈ కవి  కవితల నిండా, కథల నిండా వాళ్ళే. వాళ్ళ కన్నీటి గోసే. వాళ్ళ భాషే. వాళ్ళ యాసే దర్శనమిస్తుంది.  తన పక్కలే పాకులాడుతూ, తన చుట్టే తిరుగాడుతూ, తన మీదుగా లేత పాదాలతో జీవితాన్ని ప్రారంభించినందుకు  పుట్టిన ఊర్లో పచ్చటి అడవి భాషను పదును దేల్చి ఆయుధంగా ఎలా వాడాలో ఈ కవికి నేర్పితే,  పని చేసే ఎడారి భూమి, అక్కడి జీవితాలు భాషకు ఆర్ద్రతను ఎలా అద్దాలో నేర్పాయి.  అందుకే ఈ కవి సాహిత్యాన్ని స్థూలంగా నిర్వచించాలంటే కొన్ని ఆయుధాలు, కొన్ని కన్నీళ్లు అని చెప్పవచ్చు.   
 కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి దేవుడు అవతరిస్తాడని పురాణాలు చెప్పిన మాట నిజమని నిరూపించడానికి నా దగ్గర ఆధారాలు లేవు గాని,  ఎక్కడ కష్టముంటే అక్కడ ఈ కవి ప్రత్యక్షమవుతాడని చెప్పడానికి మాత్రం నా దగ్గర బోలడన్ని ఆధారాలు ఉన్నాయి.  పేదల ఇళ్ళను, ఊళ్ళను, పొలాలను, మూలాలను మింగి, పెద్దలకు సంపదలు తెచ్చి పెట్టడం కొరకు  కాలువలు కొండ చిలువలై  పాకుతూ వస్తున్నప్పుడు, ‘కాల్వ మింగిన ఊరు’ ను ప్రపంచానికి చూయించాడు. అధికార పీఠాలు అప్పనంగా పేదల భూములను దోచి పారిశ్రామిక  దొరలకు సెజ్జుల  పప్పు బెల్లాలుగా పంచి పెడుతున్నప్పుడు  పల్లెలన్ని చచ్చిన శవాలై ‘కఫన్ ‘ లు  కప్పుకుంటుంటే,  సహచరులతో సంఘటితమై ఊరూరు సంచరించి పల్లె పల్లెను తట్టి లేపుతూ మళ్ళీ పల్లెలకు ప్రాణాలు నింపిన ఆ అడుగుల ప్రయాణం నాకు తెలుసు. మైనింగ్ మాఫియా అచ్చంపేట అడవులను మాయం చేయడానికి రంగం సిద్ధమైతే, అడవులను హత్తుకున్న హృదయమార్దవం నాకు తెలుసు.  కరువు పీడిత పాలమూరు జిల్లాలో ఎక్కడ, ఏ  కారణం చేత ఏ రైతు ఉరిబోసుకున్నా, అక్కడ ఆ ఇంటి ముందు కన్నీళ్లు తుడిచే చుట్టమై వాలిపోవడం నాకు తెలుసు. పాలమూరు జిల్లాలో నీటి వనరులు, వాటి వాటాలు, భూములు వాటి స్వరూపాలు, లెక్కలు ప్రభుత్వం దగ్గర కన్నా ఈ కవి దగ్గరే భద్రంగా ఉండి ఉంటవన్నది నా ప్రగాఢ విశ్వాసం. ఇట్లా ఎన్నని చెప్పను గానీ, ఇప్పుడు తనకై తాను నడవడానికి కూడా ఈ కవికి  సహకరించని అరిగిపోయిన ఆ మోకాలి చిప్పలను (అడిగి) చూడండి. శ్రమజీవుల స్వేదం తుడువడానికి అలుపెరుగక ఆ పాదాలు తిరుగాడిన చరిత్రంతా మీకు తప్పక చెప్పవచ్చు.          

ఎన్. జయన్న, ఎస్. ఏ.(తెలుగు)
జి--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల*


ల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పూడూరు.  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి