4, నవంబర్ 2018, ఆదివారం

ఒకడుండేవాడు


*ఒకడుండేవాడు*
(నా బడి - కొన్ని జ్ఞాపకాలు)


*మాకు పశువులంటే ప్రాణం* లాగా నాకు మనుషులంటే ప్రాణం.  అదీ టాలెంటున్నోడంటే మరీ ప్రాణం. అట్లాంటోడొకడుండేవాడు మా తరగతిలో.   అందరికీ కాదు కాని, కొందరికీ వాడిలో *డకాటికాడు*  కనిపిస్తే,. నాకు మాత్రం *ఆల్ రౌండర్* కనిపించేవాడు.  నాటకం వేయాలన్న వాడే, పాట పాడాలన్న వాడే, ఆట ఆడాలన్న వాడే, ఉపన్యాసం చెప్పాలన్నా వాడే, వ్యాసం రాయాలన్న వాడే. ఇక చదువు సంగతి సరేసరే. తిరుగే లేదు. జెండా పండుగలొస్తే‌  మాటిమాటికి స్టేజి ఎక్కి దిగడమే పని వాడికి- బహుమతులు అందుకోవడానికి. ఇట్లాంటోడ్ని ఎవడైనా అభిమానించకుండా ఉంటాడా - అసూయ పడేవాడు తప్పా. అందుకే వాడంటే నాకు వల్ల మాలిన అభిమానం.
అదే అభిమానం వాడు నా మీద చూపాలని నేనేనాడు కోరుకోలేదు. వాడికి నాకన్నా గొప్ప స్నేహితులు, మంచి స్నేహితులు చాలా మందే. ఉంటే ఉండొచ్చు గాకా, నాకు మాత్రం వాడు స్నేహితుడే అనుకున్నా.
 అప్పట్లో మా బడి కాలేజీతో కలిసి ఉండటం వలననో, పిల్లలకు ప్రజాస్వామ్య మంటే తెలియజెప్పాలనే ఉద్దేశ్యంతోనో బళ్ళో ఎన్నికలు నిర్వహించడమనే ఓ మంచి సాంప్రదాయం ఉండేది. కొన్ని దుస్సంఘటనల కారణంగా ఆ‌ తర్వాత ఆ ప్రక్రియ ఆగిపోయింది. అది వేరే విషయం.
అట్లాంటి ఎన్నికలు ఒక సారి వచ్చాయి. వాడు తరగతి CR గా నిలబడ్డాడు. వాడికి ప్రత్యర్థిగా మా హాస్టల్ విద్యార్థి పోటీ చేశాడు. నాకు మాత్రం వీడి మీదే నమ్మకం. వీడిలో గొప్ప నాయకుడు ఉన్నాడనిపించేది. అందుకే మా (ప్రజాస్వామ్యానికి‌,  పురోగతికి  *మా* పెద్ద ప్రమాదం. మా కులమోడు,  మా‌ మతమోడు, మా ప్రాంతమోడు ఇత్యాది)  హాస్టలోడిని కాదని వీడికే  ఓటేశా.  దురదృష్టమేమంటే వాడు ఓడిపోయాడు. ప్రతిభ మీద అసూయ గెలిచింది. ముందే చెప్పినట్టు వాడిలో నాకు ఆల్ రౌండర్ కనిపిస్తే, కొందరికి 'డకాటిగాడు' కనిపించాడు. మనిషిలో భిన్న కోణాలు ఉండటం సహజం. కానీ యద్భావం తద్భవతీ!. ఏమనుకుంటే అదే! అంతే!
నీకూ మీ హాస్టలలోడి మీదా అసూయే కదా! అనొచ్చు. కాదు  వీడి నాయకత్వం మీద నమ్మకం. దానికీ ఓ ఉదాహరణ చెబుతా.  కాలేజీ డే (మాకు బడి, కాలేజీ ఒకటే కాబట్టి) కు ముందు ఆటల పోటీలు జరిగాయి.
వాడు ఓ క్రికెట్ టీం కు నాయకత్వం వహించాడు. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. మంచి బౌలర్ ను కుడా. కానీ నేనూ  ఆడుతానని ఎవరినడిగేది? ఎట్లా అడిగేది? నేను ఇప్పటిలాగే అప్పుడు కూడా అమాయకుడినే. పెద్ద మొహమాటస్తుడినే. అందుకే మౌనంగా కూర్చున్నానంతే.
వాడి టీంకు ఒక సభ్యుడు తక్కువ పడ్డాడు. వెతకడం మొదలెట్టాడు. నా కళ్ళల్లో ఆడాలన్న కాంక్ష కనబడిందేమో వాడికి. రా వచ్చేశేయ్ అన్నాడు. టీంలోకి తీసుకోవడమే కాదు. ఓ ఓవర్ ఇచ్చాడు కూడా. వాడి నమ్మకానికి అనుగుణంగానే ఇచ్చిన మొదటి ఓవర్, మొదటి బంతికే వికెట్ తీసి వాడికి కానుకగా ఇచ్చాను. పసిగట్టడం, నమ్మకం నాయకత్వానికి ఉండాల్సిన  లక్షణాలో కొన్ని. అవి వాడిలో పుష్కలంగా ఉండేవి.  కాబట్టే వాడికి ఓటేశాను. టీం లోకి తీసుకున్నందుకే ఓటేసినట్టున్నావంటారేమో! కానే కాదు. ఒక విద్యాసంవత్సరంలో ఎన్నికలు ఆగస్టులో అయితే ఆటలు ఫిబ్రవరిలో. ఓటేసినానని చెప్పినందుకే తీసుకుని ఉండొచ్చు కదా! మీరు లాజిక్ గా అడగటం తప్పేమీ కాదు. కానీ చెప్పా కదా! ఇప్పటిలాగే అప్పుడు కూడా అమాయకుడినే నని. వాడికి చెప్పింది లేదూ! వాడితో అంటకాగింది లేదు. వాడంటే అభిమానమంతే.

 9 వ తరగతి తర్వాత వాడు కారణాంతరాలచే అనంతపురం వెళ్ళిపోయాడు. నా వరకు నాకో పెద్ద అగాధం, అనంత శూన్యం -తరగతి గదిలో.
మరో సంవత్సరం గడిచిపోయింది.  బడి దాటేసి, కాలేజీల్లో పడి, పడీ లేచీ చదువు *లై* పోగొట్టుకుని, ఉద్యోగం తెచ్చుకొని జీవితంలో సెటిలయ్యా మనిపించుకొని, 27 ఏండ్లు గడిచిపోయాయి.
వాణ్ణి మాత్రం ఆలోచనల్లో మోస్తూనే వచ్చా. వాడు అనంతపురం వెళ్ళాడన్నమాటే గానీ, అక్కడే ఉన్నాడా? ఇంకెక్కడికైనా వెళ్ళాడా? ఏమి చేస్తున్నాడు? ఎట్లున్నాడు?
ఏమీ తెలిసేది కాదు. వాడికి నాకు తెలిసిన ప్రతివాడిని అడగటమే. వాడేడున్నడు? ఎట్లున్నడు? తెలియదు...తెలియదు...ప్రతి వాడి నుండి ఇదే సమాధానం. అయినా నేను అడగటం మానలేదు. నమ్మకం ఎప్పటికైనా ఫలిస్తుందన్న ఓ గుడ్డి నమ్మకం -నాకు. వాడి నుండి దూరమైన 27 ఏండ్ల తర్వాత నా నమ్మకం నిజమైంది.
నేను పనిచేసే ఊరిలో ఓ పెద్దాయన లైబ్రేరియన్ గా పని చేసేవాడు. ఆయన కుమారుడు నా శిష్యుడు. శిష్యుడితో ఓ మాటల సందర్భంలో మూలాలు బయటపడ్డాయి. తీగలాగితే డొంకంతా కదిలింది. మా‌ విద్యార్థి మా వాడికి అల్లుడని, వాళ్ళ నాన్నకు మేనల్లుడని అని తేలింది. తేలిందన్న మాటే గానీ మాట్లాడటానికి మరో ఆర్నెళ్ళు పట్టింది.
వాడి ఫోన్ నెంబర్ పట్టేసి ఒక రోజు ఫోన్ చేశా. జస్ట్ నేను నీ క్లాస్ మేట్ ను‌ అని చెప్పి ఫోన్ పెట్టేశా ఉడికిద్దామని. అరే ఎవర్రాబై చెప్పునీవు. అరె ఎవర్రాబై చెప్పు నీవు అంటూ ఫోన్లు, మేసేజ్ లు. చివరికి ఒక్కొక్క జ్ఞాపకం గుర్తు చేస్తుంటే వాడి కళ్ళల్లో నుంచి నీళ్ళు.  ఇదే కదా స్నేహం.
ఇదే కదా అభిమానం. వాడెవడో కాదు నా బాల్యమిత్రుడు‌ మద్దిలేటి.
 ఆర్నెళ్ల తర్వాత ఒకసారి కలిసే ప్రయత్నం చేశాం. సమయానుకూలత లేకపోవడం వలన వీలుకాలేదు.
మరోసారి...మరోసారి...చివరికి ఎక్కడైతే చదువుకున్నమో అక్కడే కలిశాం. మరో ఇద్దరు క్లాస్ మేట్స్ కలిశారు. అందరం కలిస్తే బాగుంటుందనుకున్నాం.  విజయ్ అనే మరో మిత్రుడు దానికి నేనే కారణమవుతా. నా తమ్ముడి పెళ్ళినే సందర్భం చేస్తానని మాటిచ్చాడు. ప్రతి మిత్రుడిని ఆహ్వానించాడు. వీలైన ఓ 25 మంది దాకా వచ్చారు. ఇక ఒకటే జ్ఞాపకాలు, ఒకటే నవ్వులు. ఇట్లాంటి సందర్భంలో నేను నోటి కన్నా చెవులకు, కళ్ళకే ఎక్కువగా పని పెడతా. వాళ్ళ కళ్ళల్లో కాంతిని, వాళ్ళు రాల్చిన‌ మాటలను ఏరుకోవడానికి. ఇట్లా మీ ముందు కుప్పవోయడానికి.

మీ
"జయన్న*

(మరో జ్ఞాపకంతో... మరో సారి)

2 కామెంట్‌లు: