14, జులై 2021, బుధవారం

నేను - దేవుడు

 జీవితంలో నాకు కొంచెం స్థిరత్వం తక్కువ. అనేకానేక ప్రభావాలకు చాలా తేలికగా లోనై తరుచూ అభిప్రాయాలు మార్చుకుంటుపోతాను. ఈ విషయంలో మరీనూ.


బాల్యమంతా మా పెద్దమ్మ ఊర్లో గడిచిపోయింది. ఇంటి ముందరే హనుమాన్ గుడి. పొద్దున లేవగానే దైవ దర్శనం. వేసవి కాలం గుడి కట్ట మీదే నిద్ర. యవ్వనంలో అర్ధరాత్రి దాకా మిత్రబృందంతో బాతాఖానీ అక్కడే. సరదాగా శనివారాలు, శ్రావణ మాసాలు భజన బృందాలతో మా మిత్రబృందం కలిసిపోయి తాళాలు, గొంతులు, అడుగులు (అడుగు భజన) కలిపే వాళ్ళం.  కొత్తకొత్త పాటలు రాసుకొని కొత్తకొత్త బాణీలతో పాడుకొంటు గడిపేవాళ్ళం. అట్లా సహజంగానే దైవం పట్ల సానుకూలత ఏర్పడింది.

డిగ్రీలోకి ప్రవేశించటంతో పరిస్థితులు మారటం మొదలుపెట్టాయి. కొత్త ఊరు. కొత్త పరిచయాలు. కాలేజీ గొడలపై నినాదాలు, కాలేజీ నేపథ్యం. శ్రీశ్రీ, తిలక్ కవిత్వం (శ్రీశ్రీ ప్రతిజ్ఞ, తిలక్ తపాలా బంట్రోత్ డిగ్రీలో పాఠాలుగా ఉండేవి. దాంతో మహాప్రస్థానం, అమృతం కురిసిన రాత్రి ఇంటికి వచ్చేశాయి. దిన,వార,మాస పత్రికలు కాకుండా సాహిత్యానికీ సంబంధించి నేను కొన్న మొదటి పుస్తకాలు ఇవే) నన్ను మార్చడం మొదలు పెట్టాయి.
వీటికి తోడు దిగజారిపోయిన ఇంటి ఆర్థిక పరిస్థితులు, ముందుకు సాగని చదువు, అధికమైన అవమానాలు, ఆకలి నన్ను దేవుడికి దూరం చేశాయి.
ఇవే పరిస్థితులు ఇంకొంత కాలం ఉండి ఉంటే, ఇంకొంచెం తీవ్రమై ఉంటే అడవి దారి పట్టేవాడినేమో! ఏ పరిస్థితి ఎల్లకాలం ఒకే తీరుగా ఉండదు కదా!  పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. అడవికి దూరమయ్యాను కానీ దేవుడికి దగ్గర కాలేకపోయాను. ఒక దశాబ్దం పాటు ఎర్రజెండకు సమీపంలో నడిచాను.
జీవితంలో మెరుగుపడిన పరిస్థితులు, ప్రభుత్వ ఉద్యోగం, పెళ్ళి, కూతురు, వయసు, అనుభవాలు నన్ను ఒక్కొక్కటి మార్చుకుంటూ వచ్చేశాయి. వీటన్నింటికి మించి అభ్యుదయ మిత్రుల డొల్లతనమూ ఎర్రజెండకూ దూరం చేసింది.‌  కులమతాలు అవమానాలకు, అణచివేతలకు కారణమైనప్ఫుడు తిరుగబడటం నేరం కానేకాదు. ఆ కారణం చేత పొందే ప్రతిఫలాలను కూడా కాలదన్ని, ఏ హద్దులైన దాటి స్వేచ్చగా నచ్చిన కులం, మతంలో చేరిపోయి, నచ్చిన దేవుడిని భుజం మీద మోస్తూ, హీనత్వానికి కారణమైన మతం మీద, దేవుడి మీద యుద్దం చేయడం నికార్సైన మనుషుల పని. అట్లాంటి మనుషులు నాకక్కడ కనపడటం మానేశారు.  ప్రతిఫలాలు అనుభవిస్తూనే, ఎవడి మతం మురికిని వాడు తొలిగించుకోకుండానే, ఎదుటి మతంపై దాడి చేసే సహచరులతో కలిసి నడవడం నాకు కొంచెం కష్టమైపోయింది. పూర్తిగా ఎర్రజెండా నీడ నుండి బయటికి వచ్చేశాను. అట్లాగని భక్తిలో మునిగిందీ లేదు. కుటుంబ సభ్యులతో, మిత్రులతో తప్పని సరి అయినప్పుడు గుడికి వెళ్తాను. దేవుడి ముందుకు వెళ్ళను. కోర్కెల చిట్టా విప్పను. మొక్కినా, చెప్పినా, అరిచినా, ఏడ్చినా, గీపెట్టినా, పొర్లినా, దొర్లినా మనకు ఇవ్వకూడదనిది ఇవ్వడని, ఇవ్వాల్సినవి, ఇవ్ళాల్సిన సమయంలో అడగకపోయినా తప్పకుండా ఇస్తాడని నమ్ముతాను. దేవుడు గుడిలో మాత్రమే ఉంటాడని, చూడాలని, అడగాలని తాపత్రయపడే మనుషులకు అడ్డుతగలడం, ముందునిలబడం భావ్యం కాదని బయటే ఉండిపోతాను. గుడిని, దాని నిర్మాణాన్ని, వాటి శిల్పసౌందర్యాన్ని ఆరాధిస్తూ బయటే ఉండిపోతాను.
ఈ మొత్తం జీవితంలో ఇప్పటికి నేను నేర్చుకున్నది ఏమిటంటే...దేవుడున్నాడో లేడో తేల్చి చెప్పడం కష్టం. ఏది తేల్చినా, వాటికి ఋజువులు చూపడం మరింత కష్టం. ఉంటే అన్ని మతాల దేవుడొక్కడే. ఒక మతం దేవుడు మంచి, ఒక మతం దేవుడు చెడు అంటూ లేడు. మనుషుల దృష్టికోణంలోనే ఈ వ్యత్యాసమంతా. దేవుడు ఉన్నాడనుకుంటే...ఎక్కడెక్కడికో వెతుక్కుంటూ, వెళ్ళాలిసిన అవసరం లేదు. నువ్వున్న చోటే, నీలోనే, నీవు చేసే పనిలోనే ఉండి ఉంటాడు. అన్నిటికి మించి,  తిండి పెట్టే పనికి మించిన దేవుడు ప్రపంచంలో ఏ మతంలోనూ లేడు. కార్యాలయమే  గొప్పగుడి అని భావిస్తాను. 

3 కామెంట్‌లు: