గద్వాల కోట మహబూబ్
నగర్ జిల్లాలోని కోటలన్నిటిలోకి ప్రసిద్ధిచెందినది. ఇది గద్వాల పట్టణం నడి
బొడ్డున ఉంది. ఈ కోటను రాజా పెద్ద సోమభూపాలుడు క్రీ.శ.1662లో
నిర్మించాడు. ఇతనికే నల్ల సోమనాద్రి అనే పేరు కూడా ఉంది. ఇదే కోటలో
చెన్నకేశవస్వామి దేవాలయాన్ని సోమనాద్రియే అత్యంత సుందరంగా నిర్మించాడు. దేవాలయ
గోడలపై ఉన్న శిల్పకళ, దేవాలయం ఎదుట ఉన్న 90 అడుగుల గాలిగోపురం ఇప్పటికీ చూపురులను ఆకట్టుకుంటాయి. కోట లోపల ప్రస్తుతం
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల
నడుస్తున్నవి.
కోటలోని నిర్మాణాలు
ఇది వలయాకారంలో ఉన్న మట్టికోట. కోట బయటి వైపు ఎత్తైన
పెద్ద పెద్ద బురుజులతో మట్టితో
నిర్మించబడింది. లోపలి వైపు కోట మొత్తానికి రాతి గోడ ఒక పొరగా నిర్మించబడింది.
బయటి మట్టి గోడలు వర్షాకాలంలో తరుచుగా కూలిపోతున్నప్పటికీ, లోపలి
వైపు రాతి గోడ ఏ మాత్రం చెక్కు చెదరలేదు. కోటలోకి శత్రువులు ప్రవేశించకుండా కోట
బయట చుట్టూరా నీటితో నింపడానికి కందకం నిర్మించారు. నేటికీ కందకం పట్టణంలోని
మురికి నీటితో నిండి నాటి దృశ్యాన్ని తలపిస్తుంది. పశ్చిమాన కోట ప్రవేశద్వారం ఉంది. కోటలోనికి
ప్రవేశించగానే, కుడివైపు శిథిలమైన అధికారుల, భటుల నివాస స్థావరాలు కనిపిస్తాయి. వాటిని దాటుకుని ముందుకు వెళ్తే, కుడివైపే ఎత్తైన ఆలయాల ప్రహరీ గోడ కనిపిస్తుంది. ప్రహరీలోపల ఆలయాల సముదాయం
కనిపిస్తుంది. వీటిలో మూడు ఆలయాలు
చెప్పుకోదగినవి. వాటిలో ప్రధానమైనది. గద్వాల సంస్థాన ప్రభువుల ఇలవేల్పైన శ్రీ
చెన్నకేశవస్వామి ఆలయం. ఇది మిగిలిన
ఆలయాలకు మధ్యలో ఉండి, ఎత్తైన
వేదిక మీద నిర్మించబడి ఉంది. ఆలయం ముందు
గాలి గోపురం పట్టణం మొత్తానికి కనిపించేంత ఎత్తుగా ఉండి, బహు
ఆకర్షణీయంగా ఉంటుంది. గాలి గోపురం ద్వారా ఆలయంలోని వచ్చే దారిలో మెట్ల దగ్గర గంటా వేదిక ఉంది. రాతి స్తంభాలకు
చాలా పెద్దదైన గంట వేలాడి ఉంటుంది. ఈ
ఆలయానికి ఇరువైపుల మరో రెండు ఆలయాలు ఉన్నాయి. వీటిలో ఒకటి శివాలయం. ఈ ఆలయాలలోని
శిల్పాలు ఆకట్టుకుంటాయి. ఈ మూడు అలయాలు ఒకే ఆవరణలో ఉన్నాయి. ఆలయాల ఆవరణలోకి
ప్రవేశించడానికి రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి. తూర్పు వైపు ఉన్న గాలి గోపురం
ద్వారా, ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించవచ్చు. దక్షిణం వైపు
కూడా మరో ద్వారం ఉండినప్పటికీ అది ప్రవేశ ద్వారం కాదు. ఆ ద్వారం గుండా వెళితే
కోటలోపలి పురాతన బావి
కనిపిస్తుంది. ఆలయాల ప్రహరీకి ఆనుకొని ఆగ్నేయాన రెండు వరుసలలో ఎదురెదురుగా రాజ భవనాలు ఉండేవి. ఈ భవనాలలో ఒకటైన దక్షిణం
వైపు భవనంలో, కోటలో
తర్వాత ఏర్పాటుచేసిన డిగ్రీ కళాశాలకు చెందిన భౌతిక, రసాయన
శాస్త్ర ప్రయోగశాలలు ఏర్పాటు చేశారు. పాత భవనం శిథిలమయ్యే కొద్ది ప్రయోగశాలల
నిమిత్తం తరుచుగా ఆధునీకీకరించబడి, పూర్తిగా రూపు రేఖలు మారిపోయింది.
ఈ భవనానికి దక్షిణం వైపు కొన్ని శిథిలాలు మాత్రం మిగిలి గత చరిత్రకు ఆనవాళ్ళుగా
కనిపిస్తాయి. ఈ భవనం దక్షిణం వైపు నుండి కోటలోని బావిలోకి దారి ఉంది. ఈ బావి నాడు
తాగు నీటికి, ఈతకు ఉపయోగించినట్లు తెలుస్తుంది. నేటికీ ఈ బావిలోని
నీరు స్వచ్చంగా కనిపిస్తుంది. దక్షిణం వైపు భవనానికి అభిముఖంగా మరో రాజభవనం
ఉండేది. ఇది రెండంతస్తుల భవనం. ఈ భవనంలోని లోపలి గోడలు అందమైన చిత్రకళతో అలరారేవి.
ఉత్తరం వైపు అంతఃపురాన్ని ప్రతిబింభించేలా కలపతో ఏర్పాటుచేసిన అందమైన నిర్మాణాలు
కళానైపుణ్యంతో
ఉట్టిపడేవి. భవనం శిథిలదశలో ఉండినప్పుడు, ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న రెండు
గదులను మాత్రం ఆటలు, ఎన్. సి. సి. నిమిత్తం కళాశాల వారు
ఉపయోగించుకునేవారు. అందమైన చారిత్రక భవనాలను పరిరక్షించాల్సిందిపోయి. స్థలం కొరకు
కక్కుర్తితో ప్రభుత్వాలు ఇక్కడ నూతన నిర్మాణాల కొరకు ఈ భవనపు శిథిలాలను కూడా
పూర్తిగా తొలగించారు. ఈ రెండు భవనాల మధ్య అందమైన
ఉద్యానవనం ఉండేది. వనం మధ్యలో సింహాసనం మీద అసీనుడై ఉన్న పెద
సోమభూపాలుడి(సోమనాద్రి) పెద్ద విగ్రహం ఉండేది. అది కూడా నేడు ద్వంసమైపోయింది.
రాజగోపురానికి తూర్పు వైపు, గోపురానికి అభిముఖంగా రాజా
కృష్ణరాంభూపాల్ శిలా విగ్రహం ఉంది. ఈ విగ్రహానికి వెనుక వైపు ఇప్పుడు నూతనంగా
నిర్మించబడిన డిగ్రీ కళాశాల భవన సముదాయం ఉంది. రాజ గోపురానికి దగ్గరలో ఇటీవల
డిగ్రీ కళాశాల స్వర్ణోత్సవాల సందర్భంగా నాటి సంస్థానపు వీర వనిత మహారాణి
ఆదిలక్ష్మిదేవమ్మ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. కోటలోకి ప్రవేశించేటప్పుడు
ఎడమవైపు జూనియర్ కళాశాల భవనం కనిపిస్తుంది. కోటలో ఉత్తరం వైపు ఆటస్థలం, తూర్పు వైపు ఎల్లమ్మ దేవాలయం ఉన్నాయి.
కోట చారిత్రక నేపథ్యం
రాజా పెదసోమభూపాలుడు (నలసోమనాద్రి) పూడూరు రాజధానిగా
పరిపాలించేవాడు. పూడూరు కోటను మరమ్మత్తు చేస్తుండగా గుప్తనిధి లభించగా, శత్రు ధుర్భేధ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో గద్వాలలో మట్టి కోటను కట్టించాడు.
కోట నిర్మాణంలో ఎన్నో అవాంతరాలు రావడముతో కేశవాచారి అనే బ్రాహ్మణుడిని బలి
ఇచ్చారని, ఆ పాప పరిహారానికి గాను గద్వాల కోటలో చెన్నకేశవ
దేవాలయాన్ని నిర్మించారని కథ ప్రచారంలో ఉంది. చెన్నకేశవ స్వామి ఆలయాన్ని నిర్మించిన
తరువాత రాజధానిని పూడూరు నుంచి గద్వాలకు మార్చినాడు. పూడూరును చాళుక్యులు
పరిపాలించగా, చాళుక్యులకు, పల్లవులకు మధ్య జరిగిన
యుద్దంలో పెదసోమభూపాలుడు కూడా పాల్గొని గదను, వాలమును
ప్రయోగించడము వలన ఈ ప్రాంతానికి "గదవాల(గద్వాల)" అన పేరు వచ్చినదని
చెబుతారు. ఆవిధంగా ఈ కోట గద్వాల కోటగా
చరిత్రలో మిగిలిపోయింది. 1663 నుండి 1950 వరకు
గద్వాల సంస్థానాధీశుల ఆధీనంలో ఉండిన ఈ కోట, సంస్థానాల
రద్దు తరువాత ప్రభుత్వ పరమైంది. రాష్ట్ర
ప్రభుత్వం తరువాత 1962లో జిల్లాలోనే మొట్టమొదటి డిగ్రీ కళాశాలను ఈ కోటలోపల ఏర్పాటు చేసింది.
డిగ్రీ కళాశాల పేరు కూడా రాణి పేరు మీదుగా మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ డిగ్రీ కళాశాలగా పెట్టబడింది. గద్వాల సంస్థానాధీశులు సాహితీప్రియులు
కావడంతో కోటలో తరుచుగా సాహిత్య సభలు జరిగేవి. కవులకు సంస్థానాధీశులు బహుమతులను
కూడా అందజేసేవారు. చినసోమభూపాలుని హయంలో అష్టదిగ్గజాలనే 8మంది
కవులుండేవారు. వీరి కాలంలో సాహిత్యం బాగా
అభివృద్ధి చెందినది. అందుకే గద్వాలకు ''విద్వద్గద్వాల '' అని పేరు. తిరుపతి వేంకట కవులు కూడా గద్వాల సంస్థానాన్ని సందర్శించారు.
ఆధారాలు
* గద్వాల సంస్థాన తెలుగు సాహిత్య
పోషణం -డాక్టర్ కట్టా వేంకటేశ్వర శర్మ
* ఆంధ్రజ్యోతి దినపత్రిక మహబూబ్ నగర్ ఎడిషన్
ప్రారంభోత్సవ ప్రత్యేక సంచిక
Good narration
రిప్లయితొలగించండిthank u sir
రిప్లయితొలగించండి