ఘనపురం ఖిల్లా మహబూబ్
నగర్ జిల్లాలోని గిరిదుర్గాలలో ఒకటి. ఇది వనపర్తికి సమీప మండలం మరియు
కేంద్రమైన ఖిల్లాఘనపురంలో ఉంది. కాకతీయుల సామంతులు నిర్మించిన ఈ కోట ఎత్తైన
రెండు కొండల మీద నిర్మించబడి చూపరులను ఆకట్టుకుంటుంది.
కోట చరిత్ర
ఘనపూర్ ప్రాంతాన్ని ఇప్పటికి 800 ఏళ్ళ క్రితం కాకతీయుల సామంతులు పాలించినట్లు తెలుస్తుంది. వారిలో గోన బుద్దారెడ్డి కుమారుడు గోన గణపరెడ్డి ఒకరు. ఇతను ఘనపురం గ్రామంలో గణపతీశ్వరాలయం నిర్మించాడు. ఇక్కడ గణపతీశ్వరాలయం ఉండటం, ఈ ప్రాంతాన్ని గణపరెడ్డి పాలించడం వలన ఈ గ్రామానికి ''గణపురం'' అని పేరు వచ్చింది. ఇతను నాగర్‌కర్నూల్ తాలుకాలోని వర్ధమానపురం నుండి కాకతీ కందూర్(అడ్డాకుల) వరకు ఉన్న ప్రాంతాన్ని పరిపాలించాడు. ఈ ప్రాంతానికి కేంద్రంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో గణపురం గ్రామంలో కోటను నిర్మించాడు. ఇక్కడి నుండి పాలన సాగించాడు. ఈ కోట కారణంగా గణపురానికి ఖిల్లాఘనపురం అను పేరు స్థిరపడిపోయింది.
కోట నిర్మాణం
గణపురం గ్రామం చుట్టు ప్రక్కల తొమ్మిది గుట్టలు
ఉన్నాయి. వాటికి దేవుని గుట్ట, మనిషి కొండయ్య గుట్ట, వీరన్నగుట్ట, బంగారు గూడు, వెంకయ్యగుట్ట,
చౌడమ్మగుట్ట, చంద్రగుట్ట, ముర్రయ్యగుట్ట,
దుర్గంగుట్ట అని పేర్లు ఉన్నవి. వీటిలో గ్రామానికి ఈశాన్యంలో ఉన్న ముర్రయ్యగుట్ట, దుర్గంగుట్టలు
ఎత్తుగా ఉన్నవి. ఈ రెండు గుట్టలను
కలుపుతూనే గణపరెడ్డి కోటను నిర్మింపచేశాడు. ఈ కోటలో రాజమందిరం, మంత్రుల నివాసాలు, సైనికుల స్థావరాలు ఉన్నట్లు అక్కడి
ఆధారాల ద్వారా తెలుస్తుంది. కోటలోకి ప్రవేశించడానికి వరుసగా మూడు ముఖద్వారాలు ఉన్నాయి. ప్రతి ముఖద్వారం దగ్గర కాపలా కాసే సైనికులకు
గదులు నిర్మించారు. అక్కడే అతిథులు ఎవరైనా వస్తే విశ్రాంతి తీసుకోవడానికి
విశ్రాంతి గదులు కూడా ఉండినట్లు తెలుస్తుంది.
కోట రహస్య మార్గాలు
విపత్కర పరిస్థితులలో కోటపై శత్రువులు దాడి చేస్తే,
ఎదుర్కోలేని పరిస్థితులు దాపురించినపుడు తప్పించుకోవడానికి కోటలో రెండు
రహస్య మార్గాలు నిర్మించినట్లు తెలుస్తుంది. ఒకటి కోట నుండి సమీప ఘనపురం గ్రామంలోని ఓ చేదుడు బావికి చేరుకుంటుందని, మరొకటి పాన్‌గల్ కోట వరకు నిర్మించబడిందని ప్రచారంలో ఉంది.
కోట ఫిరంగి
శత్రువులపై
దాడికి ఈ కోటలో అత్యంత ఎత్తులో తోపు(ఫిరంగి)ని ఏర్పాటుచేశారు. దీని కొరకు
ప్రత్యేకంగా సైనిక విభాగం ఉండినట్లు తెలుస్తుంది.
కోటలో ఇతర నిర్మాణాలు
కోటలోపల
దొరసాని మాలె, సమావేశ మందిరాలు, దొంగల బాట, నిత్యం నీటితో ఉండే రెండు చెరువులు, తాగునీటి కొరకు పాలగుండం, నేతిగుండం అనే నీటి తొట్టెలు,
మబ్బు చెలిమ మొదలగు నిర్మాణాలు నేటికీ కనిపిస్తాయి. మబ్బు చెలిమలోకి
వెళ్లాలంటే 10 అడుగుల వరకు చిమ్మచీకటిలో వెళ్ళవలసి ఉంటుంది, అనంతరం సూర్యకిరణాలు కనిపిస్తాయి. అక్కడి నుండి రెండు వందల అడుగుల వరకు
దిగవలసి ఉంటుంది.
అనుబంధ కోటలు
గణపురంలోని గుట్టలకు అనుసంధానంగా కాకతీయ సామంతరాజులు
మట్టితో గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఏడు కోటలు నిర్మించారు. వాటికి
మేడికోట, బండకోట, వీరన్నకోట, ఆగారంకోట, తక్కిళ్ళకోట, వావిళ్ళకోట,
బర్వనికోట అని పేర్లు ఉన్నవి. శత్రువులు కోటలలోకి ప్రవేశించకుండా వాటి
చుట్టు కందకాలు తవ్వింఛారు. వాటిని నిత్యం
నీటితో నింపి వాటిలో మొసళ్ళను పెంచేవారని తెలుస్తుంది.
గణ సముద్రం
గ్రామానికి సంబంధించిన కోటలకు సమీపాన నాటి రాజులు ఒక
పెద్ద చెరువును నిర్మించారు. దీనికే ''గణసముద్రం'' అని పేరు.
చారిత్రక సంఘటనలకు సాక్షి
కాకతీయ వీరవనిత రాణి రుద్రమదేవి పాలనానంతరం కాకతీయ
సింహాసనాన్ని ప్రతాపరుద్రుడు అధిష్టించాడు. ఇతను ఘనపురం రాజైన గణపరెడ్డి
కుమారుడు గోన కన్నారెడ్డిని భూత్‌పూర్ యుద్దంలో ఓడించి, అతని కుమారైను ఈ కోటలోనే వివాహామాడినట్లు చరిత్ర చెబుతుంది. ఈ వివరాలు వరంగల్ లో వెయ్యి స్తంభాల గుడిలోని ఓ శిలాశాసనంలో పేర్కొనబడినవని చెబుతారు.
మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సైన్యం కూడా కోటకు వచ్చినట్లు ఆధారాలు ఉన్నాయి.
It would ha been much better if you had included some photos of the fort and the temple.
రిప్లయితొలగించండిత్వరలో ఫోటోలు చేర్చడానికి ప్రయత్నిస్తాను సార్!
రిప్లయితొలగించండి