3, ఫిబ్రవరి 2013, ఆదివారం

కథ - 'భగవంతుడి బహుమానం'

      "నేల  మీద, నింగిలోన పిండి ఆరబోసినట్లు
        కుండలతో గుమ్మపాలు కుమ్మరించినట్లు
        వెండి ధూళి గాలికెగిరి నిలువెల్లా లేచినట్లు
       మల్లెపూల వానజల్లు పైనుంచి కురిసినట్లు
       వెన్నెలమ్మ వెన్నెల వచ్చిందమ్మా  వెన్నెల " అనే పాటలోని వెన్నెలలా 'దీప', నా దీప  నా కళ్ళ ముందు సాక్షాత్కరించింది.
   ఆనంద భాష్పాలతో నా కళ్ళు చెమర్చాయి.  జీవితంలో మళ్ళి కలుస్తామో! లేదో! అనుకున్న మేము ఇంత హఠాత్తుగా ఇలా కలుస్తామని నేనూహించలేదు.  దీపను నా ప్రాణానికి ప్రాణంగా అభిమానించాను, ఆరధించాను. గుండెల్లో గుడి  కట్టి పూజించాను.
   తాను  కూడా అలాగే ఆరాధించింది.  అలాంటి నా దీప నన్ను వెతుక్కుంటూ వచ్చి నన్ను చేరటంతో మాటల్లో చెప్పలేనంత సంతోషం కలిగింది నాకు. నా మదిలో  మెదిలే  ఆలోచనలు కట్టిపెట్టి " రా దీపా! అలా కూర్చొని మాట్లాడుదాం" అంటూ  అటు వైపుగా నడిచాను.
దీప నన్ను అనుసరించి వచ్చింది.  ఒక చెట్టు క్రింద కూర్చొని దీప అరచేతిని నా  చేతుల్లోకి తీసుకుని, ప్రేమతో నిమురుతూ " ఎలా ఉన్నావు దీపా?" అంటూ సంభాషణ ప్రారంభించాను .
"నిత్యం నిన్ను ఆరాధిస్తూ..." అంటూ కోయిల  స్వరంతో పలికింది.
" చాలు దీపా! చాలు నా జన్మకీ మాటలు చాలు" అంటూ ఉండగానే నా నోటికి తన అరచేతిని అడ్డుపెట్టి 'అంత మాట అనొద్దు ' అన్నట్లుగా  తల అడ్డంగా కదలాడిస్తూ, వేడుకున్నాట్లుగా ముఖం పెట్టింది. నిజమే దీప మీద నాకు, నా మీద దీపకు  ఎనలేని ప్రేమాభిమానాలు. దీపను మొదటి  సారిగా చూసిన రోజు  నాకింకా  బాగా గుర్తుంది.

                                                           *****
    గత ఎనిమిది సంవత్సరాల క్రితం, మిత్రుడు రఘురామ్ తో కలిసి డిగ్రీలో చేరాను. ఆ రోజు రూమ్ చూడటం కొరకు నేను,రఘు  టౌనుకు వచ్చాం మా ఊరి నుండి. గతంలో మా ఫ్రెండ్స్ బషీర్, గురునాథ్ గార్లు ఇక్కడే రూమ్  తీసుకొని  ఉండేవారు.  వారు ప్రస్తుతం డిగ్రీ పూర్తి చేసుకొని వెళ్లి సిటిలో పి.జి. చేస్తున్నారు. వారు ఈ ఊరిలో ఉండినప్పుడు  ఒకటి రెండు సార్లు వచ్చాం.   అందుకే  మొదటిగా ఒకనాడు మా ఫ్రెండ్స్ ఉన్న రూమ్ వైపు వెళ్ళాం.  కాని అది అప్పటికే ఎవరికో ఇచ్చివేశారు. సీత కోసం హనుమంతుడి అన్వేషణలా రూమ్ కొరకు వెతకటం ఆరంభించాం. చాలా సేపు తిరిగి తిరిగి అలిసిపోయిన  మాకు ఒక వీధి చివరన టూలెట్ బోర్డు తగిలించిన రూమ్ లు కనిపించాయి.  పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్లుగా సంతోషమేసింది మాకు.
" భగవంతుడు ఇప్పుడు కనికరించాడురా శివా!" అంటూ రఘు ఓ వేడి నిట్టూర్పు విడిచాడు.
" అప్పుడే ఏమైంది! ముందుంది ముసళ్ళ పండుగ. రూమ్, అద్దె, వసతులు అన్నీ నచ్చితే అప్పుడు సంతోషపడుదువుగానిలే. ముందు పదా!" అంటూ రూమ్ వైపు నడిచాను.  రఘు అప్పటికే బాగా అలిసిపోవటం వలన భారంగా అడుగులు వేస్తూ నన్ను అనుసరించి వచ్చాడు.  ఆ రూమ్ లకు పక్కగానే ఉన్న ఇళ్ళు రూమ్ ఓనరిగారిదేనని తెలుసుకుని ఇంటి వాకిలి ముందు నిలబడి, అడ్డంగా ఉన్న తెరను పక్కకు తీసి
" ఎవరు సారు లోపల...?" అని పిలిచాం.
 మమ్మల్ని చూసి డెబ్బైయో పడిల పడిన ఓ వృద్దుడు బయటికి వచ్చి
 " ఏమిటి? ఎవరు కావాలి? ఎవరు మీరు?" అంటూ  గుక్క తిప్పుకోకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పించాడు.
తాత గారు మాది ఈ  ఊరికి ముప్పై కిలోమీటర్ల దూరంలో గల రామ్ నగర్ మా ఊరు. మేము కాలేజి స్టూడెంట్స్ మూ . మాకు రూమ్ కావాలి." అని చెప్పాం.
" నాకు  జర చెవుడు గట్టిగా చెప్పండి " అని గదమాయించినట్లుగా చెప్పాడు.  తాత గారి అజ్ఞానుసారం  అలాగే చెప్పాం. ఇంతలో అవ్వగారనుకుంటా లోపలినుండి తాతకు ఆడియో ఫోను అందించింది. తాత దాన్ని చెవిలో సర్దుకొని సంభాషణ ప్రారంభించాడు. ఇప్పుడు అతనితో మాట్లాడటం మాకు కాస్తా సులభమనిపించింది.
" ఇదిగో ఈ ఐదు రూమ్ లు నావే. ఇందులో నాలుగు రూమ్ లు ఇప్పటికే భర్తీ అయ్యాయి.  అదృష్టం బాగుండి మీకోసం అయిదో రూమ్ ఖాళీగా ఉంది.  రండి చూపిస్తాను." అంటూ రూమ్ తాళం తీసి చూపించాడు. రూమ్ చాలా చిన్నగా ఉంది.  వంట పాత్రలకు, పుస్తకాలకు మాత్రమే సరిపోయెవిధంగా. మరి మేము ఎక్కడ ఉండాలో అర్థం కాలేదు.
" ఇకపోతే ఈ అయిదు రూమ్ ల వారికి ఇదే కామన్ బాత్ రూమ్" అంటూ చూయించాడు. అయితే ఇక వాటి ముందు ప్రతిరోజు 'క్యూ' కట్టాల్సిందేనేమో! అనుకున్నాను మనసులో.
" ఇక మీకందరికి త్రాగేందుకు మంచినీరు వచ్చే కుళాయి ఇది " అని  పక్కనే పసివాడు ఒకటికి పోస్తున్నట్లుగా  సన్నటి  ధారతో  వస్తున్న కుళాయిని చూయించాడు.
"  ఒరే శివా! దీని వాలకం చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉందిరా. ఇది కనీసం  గంటకు ఒక  బిందె చొప్పునైనా  నిండేటట్లు  లేదు. ఎడారి జీవితం తప్పదేమో!" అంటూ రఘు  మెల్లగా నా చెవిలో గుసగుసలాడాడు.
" పది గంటలకల్లా కరెంటు తీసేయాలి. రూమ్ అద్దె మూడొందలు" తాత చెప్పుకుంటూనే పోతుండు. తాత గారు అన్ని వసతుల గురించి  చెప్పినా అవి అవసరానికి ఉపయోగపడేలా  లేవు.  ఎందుకు అనవసరంగా ఎరిగి ఇరుక్కొని ఇబ్బందులుపడటం అని, ముందే  జారుకోవటం బెటరని  అక్కడి నుండి మెల్లగా జారుకున్నాం .
   తాత గారు తెప్పించిన తలనొప్పికి విరుగుడుగా  అక్కడికి దగ్గర్లోనే ఉన్న ఒక క్యాంటిన్లో టీ తాగి, మల్లి రూమ్  వేటలో పడ్డాం.
   అదృష్టం బాగుండి వెదికిన కొద్దిసేపటికే ఇంకో రూమ్ కనబడింది.  ఓనరు గారు రూమ్ చూయించారు.
" బాబు మీకు నచ్చితే అద్దె విషయం మాట్లాడుదాం. ముందు రూమ్ చూడండి. నేను పక్క ఇంట్లో ఉంటాను. వచ్చి కలవండి." అని చెప్పి వెళ్ళిపోయాడు.
  మేము రూమ్ లోకి ఇలా అడుగు పెట్టామో లేదో!  అలా బయటి నుండి  కాలి అందెల సవ్వడి మా చెవిని సోకింది.
తలలు వంచి బయటికి చూశాం.  మూర్ఛ పోయినంత పనైంది మాకు.  మత్తెక్కించే ఆ అందం, హంసలకే నడకలు నేర్పే  ఆ సోయగం... మహారాణిలా నడుచుకుంటూ ఓ అప్సర, మాకు గది  చూపించిన  యజమాని ఇంట్లోకి వెళ్ళింది. మసక మొబ్బు కొండల్లో మెరిసిన మెరుపు తీగలా, ఓ మెరుపు మెరిసి అదృశ్యమయింది ఓ దేవత.  కళ్ళు భైర్లు కమ్మి తేరుకున్నట్లుగా ఫీలయ్యాం.
" ఏరా శివా! ఎట్లుంది?" రఘు ప్రశ్నించాడు.
" చాలా అందంగా " నేను.
"ఏమిటి గురించి చెపుతున్నావురా?" రఘు.
" ఇప్పుడు వెళ్ళిన ఆ అందాల అప్సరస గురించి" నేను చెప్పాను.
" నేనడుగుతుంది రూమ్ గురించి" రఘు చెప్పాడు.
"పోరి బాగుంటే ఎలాంటి రూమైనా బాగుండదేంటి!" నా జవాబు.
" మరైతే రూమ్ సెలెక్టేనా?"
"రూమ్ తో పాటు పోరి కూడా సెలెక్టే" నని చెప్పాను.
రఘురామ్ ఓనరిగారితో  అద్దె విషయాలు మాట్లాడి, అడ్వాన్స్ కూడా ఇచ్చాడు.
  మరో పదిహేను రోజుల తర్వాత రూమ్ లో జాయిన్ అయ్యాం. రూమ్ లో చేరిన తర్వాత ఒక్కొక్కటిగా అన్నీ  విషయాలు తెలిసిపోయాయి.  ఆ రోజు కనిపించిన మెరుపు  తార పేరు దీప అని,  మా ఓనరిగారి కూతురని, డిగ్రీలో మా గ్రూపేనని  తెల్సింది.  మా ఆనందానికి హద్దు లేకుండా పోయింది. ఓ రకంగా చెప్పాలంటే పండుగే మాకారోజు.  కొన్ని రోజుల తర్వాత మెల్ల మెల్లగా దీపతో మా పరిచయం, స్నేహం ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయాయి.  దీపతో  అటు కాలేజిలోనూ, ఇటు ఇంటి దగ్గరా చనువుగా మెలిగేవాళ్ళాం.  నోట్స్, రికార్డ్స్ పరస్పరం బదిలీ అయ్యేవి.
    డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షలు అయిపోయాయి. కాలేజికి సెలవులు ప్రకటించారు.  రూమ్ ఖాళీ  చేసి వెళ్ళటమా! ఇక్కడే ఉండిపోవటమా!  ఎటూ నిర్ణయించుకోలేని సందిగ్ధావస్థలో పడిపోయాం.  ఇంటి దగ్గర ఆర్థిక పరిస్థితి గుర్తెరిగినదే! ఇంటి  నుంచి ఎలాంటి సహాయ సహకారాలు ఆశించకుండా స్వంతంగా ఏదేని పని చూసుకొని అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను.  మా మిత్రుడు శ్రీరామ్ సహాయంతో ఓ ఫైనాన్స్ కంపెనీలో చేరిపోయాను.   రఘు మాత్రం  ఊరెల్లిపోయాడు.  ఆ వేసవి సెలవుల్లో దీపతో నా స్నేహం  ముదిరి  ప్రేమకు దారి తీసింది.  చివరికి  ఒకరిని విడిచి ఒకరం ఉండలేని స్థితికి చేరుకున్నాం.  ఒక్కోసారి ఎప్పుడైయినా  అవసరం పడి మా ఊరు వెళ్ళినా, మళ్ళి  వచ్చిన తర్వాత రెండు రోజుల దాకా  నాతో మాట్లాడకుండా ఎడమొఖంగా, పెడమొఖంగా వ్యవహరించేది దీప. " అత్యవసర పరిస్థితులలో తప్పా మా ఊరు వెళ్ళనని, వెళ్ళినా అదే రోజు తిరిగి వస్తానని  సంజాయిషీ ఇచ్చుకునేదాకా  అలకమానేది కాదు.   తాను కూడా ఎక్కడికి  వెళ్ళనని, నిన్ను విడిచి పోనని, నిన్ను చూడకుండ ఒక్క క్షణం కూడా ఉండలేననేది దీప.
    అలా ఆగకుండా కదిలిపోయే కాలంతో పాటు మేము కూడా మూడు సంవత్సరాలు గడిపాం.  ఈ మూడు సంవత్సరాలు మా  ప్రేమను అర్థం చేసుకుని, మా  వెన్నంటి నిలిచి, ప్రోత్సహించిన మా మిత్రుడు రఘురామ్ సహాయం మరువలేనిది.
   డిగ్రీ ఫైనలియర్ పరీక్షలు రాసిన కొద్ది రోజులకే దీప నేను దిగ్భ్రాంతి  చెందేలా ఓ వార్త నా చెవిన వేసింది. " మా నాన్నకు ఉద్యోగరీత్యా వేరే ఊరికి బదిలీ అయింది. మరో పదిహేను రోజుల్లో  మేము  వెళ్ళవలసిన  అవసరం ఉంది.  ఇక్కడ ఇంటి దగ్గర మా తాత మాత్రమే ఉంటారు." అంటూ బాధాతప్త  హృదయంతో , కన్నీళ్ళు కారుస్తూ చెప్పింది.  వారు వెళ్ళేముందు ఆ పదిహేను రోజులు ఎలా గడిపామో అర్థం కాదు.  ఇలా ఉండగానే దీప వాళ్ళు వెళ్ళే రోజు వచ్చేసింది.  ఆ రోజంతా దీప, నేను  ఎంతగా ఏడ్చామో! ఆ భగవంతుడికి తెలుసు.  తాము  వెళ్ళిన  తర్వాత అన్ని విషయాలు తెలియజేస్తూ ఉత్తరం  రాస్తానని చెప్పింది దీప.  నేను, రఘు రూమ్ ఖాళిచేసి మా ఊరికి వచ్చేశాం.  ఆ తర్వాత   చాలా కాలం దీప  నుండి ఉత్తరం వస్తుందని ఆశతో ఎదురుచూశాను.   కాని నా ఆశ నిరాశగానే మిగిలిపోయింది. ఎంతకీ దీప నుండి ఉత్తరం రాలేదు.  అక్కడి పరిస్థితుల   ప్రభావం కారణంగా  నన్ను మర్చిపోయిందేమోనని అనుకున్నాను. దీప ఎక్కడుందో, ఏమి చేస్తుందో , ఎలా ఉందో తెలుసుకోవాలని ఎంతో ప్రయత్నం చేశాను.  కాని నా ప్రయత్నాలు ఫలించలేదు.   దీపతో కలిసి  జీవించే అదృష్ట గీత భగవంతుడు నా నుదుటిన గీయలేదని నన్ను నేను  ఓదార్చుకున్నాను.  
       అలా రోజులు, మాసాలు,  సంవత్సరాలు గడిచిపోయాయి.  మా ఇంటి పరిస్థితి దినదినానికి  ఆర్థికంగా అస్తవ్యస్తమైంది.  పై చదువులు చదవడానికి సహాయపడని ఆర్థిక పరిస్థితి, వృద్ధాప్యంలోని తల్లిదండ్రుల హీన స్థితి,  తమ్ముళ్ళ చదువు సంధ్యలు, పోషణ భారం  కుటుంబానికి పెద్ద వాడినైన నాపై పడి మానసికంగాను, శారీరకంగాను ఎంతో కృంగిపోయాను.  సంసార సాగర ప్రయాణంలో కష్టాల సుడిగుండాలకు గురై నా బతుకు బలైపోయింది.  అనారోగ్యంతో మంచం పట్టాను.  తిరిగి మునుపటి వాడిలా కాకపోయినా కొద్దో గొప్పో ఆరోగ్యవంతుడిగా  తయారు అయ్యేలోగా నా  హాస్పటల్ ఖర్చులకు, అమ్మానాన్నల మందులకు, ఇతరత్రా  విషయాలకుగాను తాతల నాటి ఆస్థిగా, మాకు వారసత్వంగా దక్కిన, మాకు జీవనాధారమై ఉన్న ఎకరం పొలం హారతి కర్పూరంలా కరిగిపోయింది. దినదిన గండంగా గడుపుతూ,  మెతుకులు కూడా దొరకని మా బతుకులు బజారున పడినంత పనైపోయింది.  ఈ నా దురవస్థ నేను ప్రాణంగా అభిమానించే  దీపను అతి సునాయసంగా  మర్చిపోవడానికి దోహదం చేశాయి.
                                                                   *******
   అలా నా నుండి దూరమైన దీప, నేను మర్చిపోయిన దీప అదృష్ట  దేవత తలుపు తట్టినట్లుగా, ఇప్పుడు తాను నన్ను వెతుక్కుంటూ రావడం నాకు ఆనందం  కాకపోతే మరేంటి? 
" ఏమిటి గురు అలా ఆలోచనలో పడిపోయావు?" అంటూ గత జ్ఞాపకాలు నెమరువేసుకుంటున్న నన్ను తట్టింది దీప.  నా ఆలోచనలకు తెరదించేసి, దీపతో  చాలా  సేపు చాలా విషయాలు మాట్లాడాను. మా మధ్య  కొద్దిసేపు నిశ్శబ్ధంగాను, కొద్దిసేపు సంధిగ్ధంగాను కాలం గడిచిపోయింది.  తర్వాత దీప " నేను వెళ్ళొస్తాను"  అంటూ లేచింది.  
"అప్పుడే పోతవా? అలా అయితే ఎందుకు రావడం? రాకుండ ఉండరాదు?  వచ్చి , పోతున్నానన్న విషాదాన్ని నాకు  మిగిల్చిపోవడనికి వచ్చావా? నా మనసు క్షొభపడితే నీకానందమా? చెప్పు దీప చెప్పు " అంటూ ఆక్రోశించాను.
" అలా కొప్పడుతావెందుకోయ్. నాకు అక్కడ చాలా పనుంది. నేను వెళ్ళాలి.  నీవు ఎలా ఉన్నావో చూసి  వెళ్దామని వచ్చాను. చూశాను. వెళ్తున్నాను." అంటూ తన రెండు చేతులతో నా తలను దగ్గరికి తీసుకొని నా పెదవులపై, చెంపలపై  తన లేత పెదవులతో అతి సుతారంగా ముద్దు పెట్టి "నేను మల్లి వచ్చేదాకా తీపి గుర్తుగా ఇది చాలా" అంటూ నా నుంచి దూరంగా జరుగుతూ, గాల్లో చేతులు ఊపుతూ విడ్కోలు తీసుకొని నా కళ్ళ ముందే కనుమరుగైపోయింది.
                                               ********
     నా దీప వెళ్తూ వెళ్తూ తన లేత పెదవులతో అతి సుతారంగా ముద్దిడిన ఈ చెంప చల్లగా, హాయిగా ఉండాల్సిందిపోయి  ఎందుకో వేడెక్కినట్లుగా అన్పించింది నాకు. చేత్తో తడిమి చూసుకున్నా. ...అన్పించడం కాదు. నిజంగానే వేడెక్కింది.  మెల్లగా కళ్ళు తెరిచి చూశా. బాగా పొద్దెక్కినట్లుగా ఉంది.  అందుకే ఎండ తీవ్రత కూడా మొదలైంది.  అందునా ఎండకాలం మరీనూ! పూరి గుడిసె పైకప్పు రంద్రాల గుండా  సూర్య కిరణాలు సూటిగా చెంపపై పడటంతో బాగా వేడెక్కింది. నాకు మెలుకువ రావడం కూడా దీని ప్రభావమేనేమో! క్రిందుగా చూశాను. గోనె సంచుల పరుపు పక్కగా పడి ఉంది - వెక్కిరిస్తున్నట్లుగా.  అంటే ఇందాకా దీప వచ్చింది నిజం కాదా! కలలోనా!  ఆ చేదు నిజం భరించలేకపోయింది నా మనసు. భోరున విలపించాను. 
"భగవంతుడా!  కల నిజం చేయరాదా! నీకు జీవితాంతం రుణపడిఉండేవాడిని. నేను ప్రేమతో ఆరాధించే దీపను నా నుంచి దూరం చేసిన నీవు, కనీసం కలలోనైనా కలిశామన్న తృప్తినైనా మిగల్చకుండా స్వప్నభంగం చేశావు. అసలు నీకు మనసంటూ ఉంటే ఇలా చేస్తావయ్యా" అంటూ నాలో రేగిన కసిని భగవంతుడిపై తీర్చుకున్నాను.
    ఉన్నట్లుండి నా  అంతరాత్మ నాపై దాడి చేసింది. 
" ఒరేయ్! అసలు నీకు బుద్దుందా? భగవంతుడినెందుకు నిందిస్తావు? ఆయనేమి చేశాడు.  చేసుకున్నది నీవు. అనుభవిస్తున్నది నీవు.  అన్నిటికి కారణం నీవు నీ దరిద్రం. అంతేకాని ఆయనేమి చేశాడు. 
    ఒరేయ్ దీప నీకోసం మల్లీ వస్తుందని ఎలా ఆశలు పెట్టుకున్నావురా? అప్పుడేమో అమాయకంగా నీ ఆకర్షణకు లోనై  నిన్ను ప్రేమించింది.  నీ వెనుకున్న ఆర్థిక స్థితిగతులను భేరీజు వేసుకోలేదు. ఇప్పుడు వయసుతో పాటు తెలివి పెంచుకుంది. ఈ దరిద్రజీవి దగ్గరికి తిరిగి వచ్చి, నిన్ను పెళ్లి చేసుకుంటుందనుకోవడం వట్టి నీ భ్రమ మాత్రమే.  చూసి,చూసి ఎవరుకూడా నరకకూపంలోకి దిగాలనుకోరు.  అసలు  నిన్ను నీవే పోషించుకోవడానికి ఇబ్బంది పడుతూ, బతుకు బరువై భారంగా కాలాన్ని ఈదుతున్న నీవు ఆమెను ఏవిధంగా పోషించగలనునుకున్నావు? ఒరేయ్! రేగిపోయిన నీ జుట్టు,  చిరిగిపోయిన నీ చొక్కా,  ఎండిపోయిన నీ డొక్కా,  ఎవరుచూసినా ఇట్టే  తెలిసిపోతుంది నీవు దరిద్రనారాయణుడి, దురదృష్టలక్ష్మిల ముద్దు బిడ్డవని.  ఒక దరిద్రుడికి ఉండవలసిన సర్వ లక్షణాలు నీలో గోచరిస్తాయి ఎదుటివారికి.  దరిద్రుడు అంటే ఇలా ఉంటాడని చెప్పటానికి నీవో మచ్చు తునుక." అంటూ నా అంతరాత్మ నాపై దాడిచేసి నాకు జ్ఞానోదయం కలిగించింది.  
   నిజమే ఉట్టికెగరలేని నేను ఆకాశానికి  అర్రులు చాచి నిచ్చెనలు వేయాలనుకోవడం, నా అవివేకం కాకపొతే మరేమిటి? నిజంగా ఎవరిని ప్రేమించే అర్హత నాకు లేదు.  ఒక్క నాకేకాదు  నాలాంటి దరిద్రుడైన ప్రతివాడికి ప్రేమించే అర్హత లేదు. దీప అందంలోనూ, ఆస్తుల్లోనూ ఆకాశానికి అంటితే, నేను అదోఃపాతాళానికి దిగజారుతాను.  ఆమెకు నేను ఏవిధంగాను సాటిరాను.  
   మీరనొచ్చు ప్రేమకు కావల్సింది అందం, ఆస్తులు, అంతస్తులు కాదని.  నిర్మలమైన మనసు, ఆరాధన, అభిమానం, మానవత్వమని.  కాని  మారుతున్న కాలంతో పాటు మనుషుల తరాలు,  మనుసుల స్వభావాలు  మారి ఆ నిర్వచనాలు ఏనాడో మంట గలిశాయి. 
     ఇప్పుడంతా డబ్బు. డబ్బుతో దేనినైనా కొనొచ్చనే అహంభావం ప్రతి డబ్బున్న వాడిలోనూ. దీపను కోరుకోవటం నా తప్పే.  ఆశకంటూ హద్దు ఉండాలి కదా! హద్దు మీరితే అనర్థలేకదా! 
  నాలాంటి పేదవాడికి, ప్రేమించిన ఎదుటివారికి మధ్య కులం, మతం,ఆస్తులు, అంతస్థుల మధ్యగల అంతరం తరాలు మారినా మారనిది.  ఇది నగ్న సత్యం. వీటికి మినహాయింపు ఒక కలలోనేనేమో!  అందులో  ఎవరితోనైనా, ఏవిధంగానైనా ప్రవర్తించవొచ్చు.  నియమ నిబంధనలంటూ ఏమీ ఉండవు.  అందుకే తరాలు మారకున్నా, అంతరాలను దాటి కనీసం కలలోనైనా కనిపించిన దీపకు, కోరుకున్న వారితో నిజజీవితంలో ఎలాగు కలిసి జీవించే అదృష్టంలేని నాలాంటి దరిద్రజీవులకోసం భగవంతుడు సృష్టించి, ప్రసాదించిన కలను 'భగవంతుడి బహుమానం'గా  భావించి, ఆ దేవుడికి ఆత్మసాక్షిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎవరికోసం, ఎందుకోసం బతుకాలో అర్థం కాని  ఈ అయోమయపు గందరగోళ జీవితాన్ని చాలిస్తూ... ఈ మనుషుల నుంచి, ఈ  ప్రపంచం నుంచి సెలవు తీసుకుంటున్నాను.

                                                     ************      

                                                                  నాయుడు గారి జయన్న 
                                                                               రచనా కాలం . జూన్ , 1996
                                                                  జనవరి,1997 - 'ఆంధ్రభూమి'  మాస పత్రికలో ప్రచురితం
                                           
                                                           (ఈ కథకు అనుసంధానించిన చిత్రం అప్పటి ఆం.భూ.లోనిదే )








3 కామెంట్‌లు:

  1. భగవంతుడి బహుమానం కథని చాలా అద్భుతంగా రక్తి కట్టించారు సార్.
    మా కోసం భగవంతుడిచ్చిన బహుమానం మీరు.

    రాముడు

    రిప్లయితొలగించండి
  2. కథ చాలా అద్భుతంగా ఉంది సార్. అద్భుతంగా రక్తి కట్టించారు.
    మీరు నిజంగా భగవంతుడిచ్చిన బహుమానం మాకు

    రిప్లయితొలగించండి
  3. అద్భుతంగా ఉంది సార్ కథ.
    మీరు భగవంతుడిచ్చిన బహుమానం మాకు

    రిప్లయితొలగించండి