9, నవంబర్ 2013, శనివారం

నా యాత్రానుభవాలు - 2, మురుడేశ్వరం


      జోగ్ జలపాతం చూశాక మురుడేశ్వరం వెళ్ళాలని   నిర్ణయించుకున్నాం. మురుడేశ్వరం వెళ్ళాలంటే ముందుగా హనవర వెళ్ళాలని చెప్పారు- అక్కడ విచారిస్తే.   అయితే హనవర   వెళ్ళడానికి వచ్చే బస్,ఇక్కడికి  రావడానికి మరో గంట సమయం ఉందంటే   దగ్గర్లోనే ఉన్న అందమైన లొకేషన్లు చూడటానికి,  జలపాతంగా మారడానికి ముందు శరావతి నది నడక చూడటానికి ఓ రెండు కిలోమీటర్లు కాలి నడకన బయలుదేరాం.
ఎటు చూసినా అందమైన కొండలు, వాటి మధ్య శరావతి నడక, దానిని దాటటానికి ఎత్తైన వంతెన, కనుచూపు మేర పచ్చదనం. వర్ణించడానికి  మాటలు చాలవు.
రమణీయమైన ఆ ప్రదేశంలో  కాసేపు స్వేచ్చా విహాంగాలమై విహరించాం. తరువాత బస్ వస్తే హనవర బయలుదేరివెళ్ళాం.  సాయంత్రం అయిదో, అయిదున్నరకో హనవర చేరుకున్నాం. అది కూడా పెద్ద పట్టణం లాగే కనిపించింది.  ఓ అరగంట పాటు పట్టణ విహారం చేసి, దగ్గర్లోని ఓ టీ కొట్టులో టీ కొట్టి, మళ్ళి బస్ ఎక్కాం .  మురుడేశ్వరం వెళ్ళే  దారిలో..    హనవరను ముద్దాడుతూ శరావతి నది అరేబియా కౌగిలికి పరుగులెత్తే దృశ్యాలు, హనవరకు దక్షిణాన బీచ్ ను తలపించే దృశ్యాలు   కనువిందు చేస్తాయి. శరావతి పై  నిర్మించిన వంతెన   దాటుకుంటూ  బస్ కదిలిపోయింది.                            

       మురుడేశ్వరం వెళ్ళే దారంతా అందమైన తోటలతో, వయ్యారాలు పోయిన నడకతో సాగిపొయింది.  అప్పటికే  సూర్యుడు డ్యూటి  దిగిపోవడంతో , ఇక అడిగేవారు ఎవరని దిక్కులంతా చీకట్లు కమ్మడం మొదలయ్యాయి. ప్రకృతి సోయగం చూసే అవకాశం తప్పిపోయింది కదాని విచారిస్తుండగానే, అప్పటికే ప్రయాణ బడలికచే కళ్ళు మూతలు పడ్డాయి.
మూరుడేశ్వరం అన్న పిలుపుతో  మల్లి ఇహలోకంలోకి  వచ్చి గబ గబా బస్ దిగి, మెయిన్ రోడ్డు  నుండి గుడికి వేళ్ళే దారి పట్టాం - కాలి నడకన.  ఓ 15 నిమిషాల నడక తరువాత గుడి చేరుకున్నాం.  అల్లంత దూరం నుండే  మనకు ఆహ్వానం పలుకుతుంది గుడి ముందరి గాలి గోపురం.
  నా వరకు నేను చాలా దేవాలయాలు చూశాను. కాని   ఇంత ఎత్తైన గాలి గోపురం మటుకు ఎక్కడా చూడలేదు.  పద్దెనిమిది అంతస్తులతో, తల పూర్తిగా పైకి ఎత్తి   చూస్తే గాని శిఖరాన్ని  చూడలేనంత ఎత్తుతో అలరారుతుంది.  పొందికైన నిర్మాణాన్ని  రూపొందించడం కన్నా ఎత్తుకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు కన్పిస్తుంది - గోపుర నిర్మాణంలో.   మూడు పక్కల అరేబియా సముద్రం ఆవరించి ఉన్న ఎత్తైన కొండపై గుడి,  దాని వెనుక కొండ మీద ఎత్తైన పరమేశ్వరుని విగ్రహం, శివుని తాపాన్ని చల్లార్చటానికి  కొండ చుట్టూ ఎగసి పడే సముద్రపు అలలు, విగ్రహం చుట్టూ పచ్చటి పచ్చికలో శివ భక్తుల విగ్రహాలు, కొండకు ఎడమ వైపు బీచ్ చూపరులను ఆకట్టుకుంటాయి.  కొండకు అనుకుని ఉన్న దారిలో,  బీచ్ లో మొలిచినట్లుగా ఉన్న ఓ హోటల్ లో కడలి కెరటాల అందాన్నిచూస్తూ, సముద్రపు హోరును వింటూ, ఆ రాత్రి భోజనం కానిచ్చి మళ్ళి తిరుగు   ప్రయాణం అయ్యాం- హుబ్లీ దారిలో.....
                                                                                                                           - నాయుడుగారి జయన్న

 









కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి