25, నవంబర్ 2013, సోమవారం

నా యాత్రానుభవాలు-3, హోస్పేట్






13.10. 2013

రా. 10. 30 గం. లకు మురుడేశ్వర్ నుండి హుబ్లీకి బయలుదేరాం. తెల్లవారుజామున 3 గ.లకు హుబ్లికి   చేరుకున్నాం.  హుబ్లి నుండి గదగ్, అక్కడి నుండి బయలుదేరి ఉ. 8 గం. లకు  హోస్పేట్ కు చేరుకున్నాం. పట్టణంలోకి వెళ్ళకుండా, ఊరి బయటే డ్యాం దగ్గరే బస్ దిగి డ్యాం వైపు వెళ్ళాం. డ్యాం కు ముందు పచ్చటి పార్క్ ఒకటి మనకు ఆహ్వానం పలుకుతుంది. పార్క్ నుండి, మరియు ఎగువ భాగాన కొండ పక్కల దారి వెంట కూడా  డ్యాం కు చేరుకోవచ్చు. కొండ పక్కల దారి వెంట డ్యాం వైపు వెళ్ళాం. డ్యాం దగ్గరలో కుడివైపు దిగివ కాలువలో  స్నానాదికాలు కానిచ్చి, డ్యాం దగ్గరకు వెళ్ళాం.
  కర్ణాటక లోని బళ్ళారి జిల్లాలో హోస్పేట్ దగ్గర తుంగభద్ర నదిపై నిర్మించిన ఈ  డ్యాం చూపరులను ఆకట్టుకుంటుంది. నీటి పారుదల అవసరాలు,  విద్యుత్ ఉత్పత్తి, వరదల నివారణ కొరకు బహుళ ప్రయోజన ప్రాజెక్ట్ గా  1945 లో మద్రాస్ ప్రెసిడెన్సీ, నిజాం సర్కార్లు ఉమ్మడిగా నిర్మించ తల పెట్టగా,  1953 లో కర్ణాటక, ఆంధ్రపదేశ్ రాష్ట్ర ప్రబుత్వాలు ఉమ్మడిగా పూర్తి చేశాయి. కనుచూపు మేర విస్తరించిన అతి పెద్ద జలాశయం మనసును నీటి అలల్లో ముంచి తేల్చుతుంది. తుంగభద్ర నదిపై ఇదే అతి పెద్ద జలాశయం. 423 TMC నిల్వ సామర్థ్యం కలిగి, 35.36 మీటర్ల ఎత్తుతో, 2,449 మీటర్ల పొడువు కలిగి నీటిని నిల్వచేస్తుంది.  అప్పటి మద్రాస్ ఇంజనీర్ డా. తిరుమలై అయ్యంగారు ఈ డ్యాం రూప శిల్పి. వారి విగ్రహాన్ని జలాశయానికి అనుకొని ఉన్న పార్కులో చూడవచ్చు. ఈ డ్యాం నుండి వదిలె ఎడమ కాలువ నీరు పూర్తిగా  కర్ణాటక అవసరాలకు వినియోగం కాగ, కుడి వైపు నిర్మిచించిన రెండు కాలువలు ( ఎగువ కాలువ, దిగువ కాలువ ) కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంత అవసరాలకు వినియోగిస్తున్నారు. ఈ  డ్యాం కు కుడివైపు సండురు కొండ ఉంది. దాని మీదికి వెళ్ళి చూస్తే  డ్యాం అందాలు మరింత రమణీయంగా కనిపిస్తాయి.
  డ్యాం పై భాగంలో అందాలన్ని దర్శించాక అక్కడ ఓ క్యాంటిన్ లో టీ తాగి , డ్యాం ముందు, దిగువలో ఏర్పాటు చేసిన పార్క్ లో కాసేపు విశ్రాంతి తీసుకొని, బయటకు నడిచాం. బయటకు వచ్చే దారిలో పార్క్ లో జల విహారానికి చిన్న సైజు బోటింగ్ ఏర్పాటు ఉంది. కాసేపు అక్కడ ఆగి, పట్టణం వైపు వెళ్ళిపోయాం.  
  మ. 12 గం. లకు హోస్పేట్ పట్టణ బస్ స్టాండ్ కు చేరుకున్నాం - హంపికి వెళ్ళే యోచనతో...


                                                     - నాయుడుగారి జయన్న

19, నవంబర్ 2013, మంగళవారం

పదనిసలు

జీవితం
పుట్టుకతో పుడమి పైకి అరంగేట్రం
మృత్యువుతో మట్టిలోకి మహాభినిష్క్రమణం

స్నేహం
ఒంటరి తనానికి ఒక జోడు
కష్టసుఖాలలో ఒక తోడు

ప్రేమ
ఆస్వాదిస్తే అమృతం
విఫలమైతే విషం

లోకం
నవ్వు - ఏడ్పిస్తుంది
ఏడ్చు- నవ్విస్తుంది

గడ్డి
నీతితో పశువులు మేసేది
అవినీతితో మనుషులు బొక్కేది

నిజం
దాచేస్తే దాగని నిప్పు
అబద్ధంతో దాన్ని దాచుట తప్పు

- నాయుడుగారి జయన్న


15, నవంబర్ 2013, శుక్రవారం

ఆటవెలది

పలుకులుంటె చాలు పసిడి దేనికిరయ్య ?
తిమ్మి బమ్మి జేయ తిండి దొరుకు
నాగరికపు మనిషి నాటక మిట్లుండు
జయుడి మాట నిజము జాబిలమ్మ!

                          -  నాయుడిగారి జయన్న

10, నవంబర్ 2013, ఆదివారం

ఆటవెలది

ఎదుటి వాడి గుణము యెంచవలదు, మన
తీరు బట్టి వాడు తిరుగుచుండు
అద్దమందు జూడ నగుపించదన్యంబు
జయుడి మాట నిజము జాబిలమ్మ!

9, నవంబర్ 2013, శనివారం

నా యాత్రానుభవాలు - 2, మురుడేశ్వరం


      జోగ్ జలపాతం చూశాక మురుడేశ్వరం వెళ్ళాలని   నిర్ణయించుకున్నాం. మురుడేశ్వరం వెళ్ళాలంటే ముందుగా హనవర వెళ్ళాలని చెప్పారు- అక్కడ విచారిస్తే.   అయితే హనవర   వెళ్ళడానికి వచ్చే బస్,ఇక్కడికి  రావడానికి మరో గంట సమయం ఉందంటే   దగ్గర్లోనే ఉన్న అందమైన లొకేషన్లు చూడటానికి,  జలపాతంగా మారడానికి ముందు శరావతి నది నడక చూడటానికి ఓ రెండు కిలోమీటర్లు కాలి నడకన బయలుదేరాం.
ఎటు చూసినా అందమైన కొండలు, వాటి మధ్య శరావతి నడక, దానిని దాటటానికి ఎత్తైన వంతెన, కనుచూపు మేర పచ్చదనం. వర్ణించడానికి  మాటలు చాలవు.
రమణీయమైన ఆ ప్రదేశంలో  కాసేపు స్వేచ్చా విహాంగాలమై విహరించాం. తరువాత బస్ వస్తే హనవర బయలుదేరివెళ్ళాం.  సాయంత్రం అయిదో, అయిదున్నరకో హనవర చేరుకున్నాం. అది కూడా పెద్ద పట్టణం లాగే కనిపించింది.  ఓ అరగంట పాటు పట్టణ విహారం చేసి, దగ్గర్లోని ఓ టీ కొట్టులో టీ కొట్టి, మళ్ళి బస్ ఎక్కాం .  మురుడేశ్వరం వెళ్ళే  దారిలో..    హనవరను ముద్దాడుతూ శరావతి నది అరేబియా కౌగిలికి పరుగులెత్తే దృశ్యాలు, హనవరకు దక్షిణాన బీచ్ ను తలపించే దృశ్యాలు   కనువిందు చేస్తాయి. శరావతి పై  నిర్మించిన వంతెన   దాటుకుంటూ  బస్ కదిలిపోయింది.                            

       మురుడేశ్వరం వెళ్ళే దారంతా అందమైన తోటలతో, వయ్యారాలు పోయిన నడకతో సాగిపొయింది.  అప్పటికే  సూర్యుడు డ్యూటి  దిగిపోవడంతో , ఇక అడిగేవారు ఎవరని దిక్కులంతా చీకట్లు కమ్మడం మొదలయ్యాయి. ప్రకృతి సోయగం చూసే అవకాశం తప్పిపోయింది కదాని విచారిస్తుండగానే, అప్పటికే ప్రయాణ బడలికచే కళ్ళు మూతలు పడ్డాయి.
మూరుడేశ్వరం అన్న పిలుపుతో  మల్లి ఇహలోకంలోకి  వచ్చి గబ గబా బస్ దిగి, మెయిన్ రోడ్డు  నుండి గుడికి వేళ్ళే దారి పట్టాం - కాలి నడకన.  ఓ 15 నిమిషాల నడక తరువాత గుడి చేరుకున్నాం.  అల్లంత దూరం నుండే  మనకు ఆహ్వానం పలుకుతుంది గుడి ముందరి గాలి గోపురం.
  నా వరకు నేను చాలా దేవాలయాలు చూశాను. కాని   ఇంత ఎత్తైన గాలి గోపురం మటుకు ఎక్కడా చూడలేదు.  పద్దెనిమిది అంతస్తులతో, తల పూర్తిగా పైకి ఎత్తి   చూస్తే గాని శిఖరాన్ని  చూడలేనంత ఎత్తుతో అలరారుతుంది.  పొందికైన నిర్మాణాన్ని  రూపొందించడం కన్నా ఎత్తుకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు కన్పిస్తుంది - గోపుర నిర్మాణంలో.   మూడు పక్కల అరేబియా సముద్రం ఆవరించి ఉన్న ఎత్తైన కొండపై గుడి,  దాని వెనుక కొండ మీద ఎత్తైన పరమేశ్వరుని విగ్రహం, శివుని తాపాన్ని చల్లార్చటానికి  కొండ చుట్టూ ఎగసి పడే సముద్రపు అలలు, విగ్రహం చుట్టూ పచ్చటి పచ్చికలో శివ భక్తుల విగ్రహాలు, కొండకు ఎడమ వైపు బీచ్ చూపరులను ఆకట్టుకుంటాయి.  కొండకు అనుకుని ఉన్న దారిలో,  బీచ్ లో మొలిచినట్లుగా ఉన్న ఓ హోటల్ లో కడలి కెరటాల అందాన్నిచూస్తూ, సముద్రపు హోరును వింటూ, ఆ రాత్రి భోజనం కానిచ్చి మళ్ళి తిరుగు   ప్రయాణం అయ్యాం- హుబ్లీ దారిలో.....
                                                                                                                           - నాయుడుగారి జయన్న

 









6, నవంబర్ 2013, బుధవారం

మీనీలు

అడ్డేలేదు
నేనే రాజు
నా  కలల సామ్రాజ్యానికి.
        **

నిజమే 
ఏ రెక్కలు లేవు నాకు
అయినా విహారమే
నా ఊహల  నింగిలో 
         **

చీకట్లోనే నేనొంటరిని
వెలుగుల్లో నాకూ ఓ తోడు
నా నీడ

 - నాయుడుగారి  జయన్న

3, నవంబర్ 2013, ఆదివారం

అక్కడే..



ఎంత తోడినా
ఊరుతూనే ఉంది
గుండెబావిలో
వేదనాజలం

విశ్వ ప్రయత్నాల
తరువాత కూడా విఫలమే
పగిలిన మనసు అద్దాన్ని అతకటంలో..

లక్ష్ల కోట్ల అడుగుల ప్రయాణం
అయినా అక్కడే
పాదంతో పాటూ
భూమీ పయనమే

     - నాయుడుగారి జయన్న