22, మే 2025, గురువారం

సమాజహితకారకం-పవనపుత్ర శతకం

 

సమాజహితకారకం-పవనపుత్ర శతకం 

           సహృదయులు, ఉత్తమోపాధ్యాయులు, ధర్మపరులు, పరోపకారపరులు, దైవభక్తిపరులు, కవివరులు అగు శ్రీ నాయుడు గారి జయన్న గారు ప్రస్తుతం పవనపుత్ర శతకాన్ని సామాజిక అంశాలతో ఆటవెలది పద్యాలలో రమణీయంగా రచించి పద్యశతకకర్తగా కూడా కీర్తిని గడించారు.

          శతకం అంటే వంద పద్యాలతో ఉండే గ్రంథం. ప్రతిపద్యం ఒక ముక్తకంగా ఉంటుంది. పద్యాలకు అన్నింటికీ చివర ఒక పదం గానీ లేక కొన్ని పదాలు గానీ మకుటంగా ఉండటం శతక పద్యాలలో ఉండే నియమం. ఈ నియమాలను అనుసరించి రచింపబడిన ఈ పవనపుత్ర శతకం “శ్రీ పవనకుమార….” అని దైవప్రార్థనతో ప్రారంభించబడింది. “నేను కవిత చెప్పలేను…..” అని వినయంగా విన్నవించుకొంటూ, పవనపుత్రుడైన ఆంజనేయస్వామివారి దీవెనలను కోరుకోవడం ద్వారా శ్రీ జయన్న కవిగారు తన వినయాన్ని, హనుమద్భక్తిని ప్రకటించుకోవడం ఒక విశేషం. 

         ఈ శతకంలో జయన్న గారు ప్రధానంగా సామాజిక అంశాలను ప్రస్తావించారు. ధర్మమార్గాన్ని అనుసరిస్తూ ఉన్న తాను లోకం పోకడను చూచి ఆవేదనను వ్యక్తం చేశారు. సమాజ సంక్షేమాన్ని కోరుకొన్నారు. ప్రతియొక్కరూ తాము ఉన్న స్థితినుండి ఉన్నతస్థితికి చేరుకొనేందుకు యథాశక్తి ప్రయత్నం చేసేందుకోసం కొన్ని సూచనలను తమ పద్యాల ద్వారా తెలియజేశారు.  శ్రీ జయన్న గారి పద్యాలను చదువుతూ ఉంటే పాఠకులకు వేమన పద్యాలు తప్పనిసరిగా గుర్తుకు వస్తాయి.

       వేమన మహాకవి తాను రచించిన ఆటవెలది పద్యాలలో ఒకటవ, రెండవ పాదాలలో లోకస్థితిని వివరించి, మూడవపాదంలో పైపాదాలలో చెప్పిన విషయమునకు సంబంధించిన ఒక సామెత వంటి సూక్తిని తెలియజేసి, నాలుగవ పాదంలో మకుటాన్ని ఉంచి లోకప్రసిద్ధిని పొందినారు.

          శ్రీ జయన్న గారి పద్యరచన కూడా తేట తెలుగులో, అలతి అలతి పదాలతో ఉంటూ వేమన పద్య ధోరణిని కలిగి యుండడాన్ని మనం గమనించవచ్చు. 

     ఉదాహరణలు

                 వేమన పద్యం-

తల్లిదండ్రలందు దయలేని పుత్రుండు

పుట్టనేమి వాడు గిట్టనేమి

పుట్టలోన చెదలు పుట్టవా? గిట్టవా?

విశ్వదాభిరామ వినుర వేమ!

 

               జయన్న పద్యం-

తాను యెదుగు వరకు తల్లిదండ్రులు మేలు

యెరుక రారు వార లెదుగగానె

తలపగ నిటువంటి తనయులు భారమే

పల్లెపాటివాస! పవనపుత్ర!                  (62 వ పద్యం)

 

               జయన్న పద్యం -

వక్రబుద్ధి నీయ వద్దు తండ్రీ నాకు

మాట బడుదు నేను మంది చేత

మాట బడుట కన్న మరణంబె మేలుగా

పల్లెపాటివాస! పవనపుత్ర!             (92 వ పద్యం)

 

ఓ పవనపుత్రా!

కోరికలే లేని మనసును కానుకగా ఇయ్యవయ్యా! అని

“కాంక్ష లేని మనసు కానుకగా నివ్వు” అని అంటూ 44 వ పద్యంలో కోరుకొన్న శ్రీ జయన్న కవి,  సిరి సంపదలను నాకు ఇవ్వవద్దు. విద్యను మాత్రం ప్రసాదించవయ్యా! చాలు అని 7 వ పద్యంలో

“విద్య నొకటి నాకు విడువుమయా దయన్” అని అర్థించారు.

        కామము క్రోధము లోభము అనే దుర్గుణాలకు వశమాపోయినవాడు మంచి మనిషి కాలేడు. అందువలన కరుణతో ఆ దుర్గుణాలను కాల్చివేయి అని

“కరుణ జూపి వాటి కాల్చివేయుము తండ్రి” అని అంటూ 45 వ పద్యంలో ఆంజనేయస్వామిని ప్రార్థించారు. 53 వ పద్యంలో కూడా కోపం వలన కలిగే నష్టాన్ని విశదీకరించారు.

       లోకంలో ప్రస్తుత కాలంలో నీతి నియమాలను ఎక్కడా చూడలేకపోతున్నాము అని 55 వ పద్యంలో వర్ణించిన కవిగారు ఓ పవనపుత్రా! ఆనాడు సీత జాడను కనుగొన్నావు. ఈనాడు నీతి జాడను కనుగొనగలవా? నీతిని మాకు చూపగలవా? అని అంటూ

“నేటి కాలమందు నీతి జూపగలవా?” అని 98 వ పద్యంలో ప్రశ్నిస్తూ ఉన్నారు.

      మద్యం తాగి వాగే వారికి అన్ని విధాలా దెబ్బలు పడగలవు అని

“తాగి వాగి నాక తబల గాదా మేను” అని అంటూ 58 వ పద్యంలో సెలవిచ్చారు.

        ప్రక్కనున్నవాడి బాధలను పంచుకోవాలి. వారికి సుఖాన్ని పంచాలి. అటువంటివాడే నిజంగా గొప్పవాడు అని

“పక్కవాడి బాధ పంచుకొనెడివాడు

పరులకింత సుఖము పంచువాడు

నిజము గొప్పవాడె నిఖిల జగమ్ముల”

అని అంటూ

69 వ పద్యంలో వివరించారు.

       పద్యకవిత, గద్యకవిత అనే రెండు కవితలలో దేని గొప్పదనం దానికి ఉంది. ఏదీ తక్కువైనది కాదు అని

“దేని ఘనత జూడ దానిదే లోకాన” అని 70 వ పద్యంలో నిష్పక్షపాతంగా తెలియజెప్పినారు.

             ప్రతి మనిషిలోనూ ఏదో ఒక గొప్పదనం తప్పనిసరిగా ఉంటుంది అని

“మహిమ యుండు నేదొ మనుషులందరిలోన” అని అంటూ 73 వ పద్యంలో వివరించారు.

         “నడక మేలు చేయు నరుని కద్భుతముగ” అని 8 వ పద్యంలో నడక మనకు చేసే మేలును విశదీకరించారు

        అపనిందతో జీవింపగలమా? అని

“నిందయగ్ని యందు నిలువగ తరమౌనె?” అని అంటూ

11 వ పద్యంలో ఆవేదన చెందినారు.

“యముడి బాధకన్న నధికమ్ము గద నింద” అని అంటూ 21 వ పద్యంలో వాపోయారు.

        మనం చేసే పనులను బట్టి తిరిగి ఫలితం లభిస్తుంది అని

“పనిని బట్టి తిరిగి ఫలిత ముండును గదా!” అని అంటూ 12 వ పద్యంలో హితవు పలికినారు.

      కరుణతో పేదలను కాపాడు అని

“కరుణ జూపి వాని కనులు తుడ్చుము దేవ!” అని అంటూ 14 వ పద్యంలో పవనపుత్రుని ప్రార్థించారు.

              మంచితనము, కరుణ లేని మానవుడు శవంతో సమానము అని

“మనిషి గాడు అతడు మాటాడు శవమేను” అని అంటూ 18 వ పద్యంలో నిష్ఠూరమాడినారు.

       మంచిని పంచే మానవులు కొందరే అని

“మంచి నట్లు పంచు మనుషులు కొందరే” అని అంటూ 27 వ పద్యంలో స్పష్టం చేశారు.

     గుడి బయట భిక్షాటన చేస్తున్న నిరుపేదలకు సహాయం చేయి. సముద్రానికి నీళ్లను ఇవ్వడం వృథా అని

“గుడి బయలున నిలిచె గ్రుడ్డిఁ జూడు

నీటి నివ్వ నేమి నిండు సంద్రమునకు”

అని అంటూ 31 వ పద్యంలో ఉపదేశం చేశారు.

        కుల మతాల చిచ్చు కాలకూట విషం కంటే భయంకరంగా ఉన్నది అని

“కనగ కులము మతము కాలకూటవిషము” అని 32 వ పద్యంలో విశదీకరించారు.

       “ఇంటి భవిత యంత యిల్లాలి మీదుండు” అని 38 వ పద్యంలో తెలియజేసిన కవిగారు ఆ ఇల్లాలిని కట్న కానుకలకోసం కష్టపెట్టే వాడు భర్త అనే పదానికి తగడు అని

“ఒగుడు గాక వాడు మొగు డనంగనురాదు”

అనిఅంటూ 82 వ పద్యంలో పరుషపదాలతో విశ్లేషించారు.

       ప్రస్తుత రాజకీయ నాయకులలో ధర్మాన్ని వెదకడం వృథా అని తెలుపుతూ

“రవిని వెదికి నటుల రాతిరి సమయాన” అని అంటూ 89 వ పద్యంలో వివరించినారు.

           ఓ ఆంజనేయ స్వామీ! మేము సుఖంగా ఉన్నామంటే అది మీ దయాఫలం. మేము కష్టంలో ఉన్నామంటే అది మా కర్మఫలం అని

“సుఖము యేది కలుగ చూపు మీదే స్వామి” అని అంటూ 99 వ పద్యంలో తన దైవభక్తిని ప్రకటించారు.

       రూపము ధనము లేకున్నా ముఖంలో బాధను వ్యక్తం చేయకుండా, ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఆనందయోగంలో ఉండగలగడమే ఉత్తమం అని

“హాసముంటె చాలు నంద మదేగదా!” అని అంటూ 100 వ పద్యంలో అందరికీ హితాన్ని ఉపదేశించారు. ఈ విధంగా తన పవనపుత్ర శతకాన్ని పూర్తిచేసిన శ్రీ నాయుడుగారి జయన్న గారు ధన్యులు.

       ముఖపరిచయం కూడా లేని నేను వ్రాసిన రోజుకోపద్యం-శంకరాభరణం అనే గ్రంథంలోని సమస్యాపూరణ పద్యాలలో 100 పద్యాలకు, శ్రీ సీతారామకల్యాణం అనే గ్రంథంలోని పద్యాలలో ఇప్పటికి 200 పద్యాలకు ప్రతిఫలం ఏమీ ఆశించకుండా వీడియో చిత్రీకరణ చేసి తన రామభక్తిని ప్రకటించుకొన్న శ్రీ నాయుడుగారి జయన్న కవివర్యులు ధన్యాత్ములు.

 

        శ్రీ నాయుడుగారి జయన్న గారికి 5-4-1975 తేదిన జన్మనిచ్చిన తల్లిదండ్రులు శ్రీమతి లక్ష్మీదేవి, శ్రీ గోపాలు నాయుడు దంపతులు ధన్యాత్ములు. శ్రీ జయన్న గారి జన్మస్థలం జల్లాపూర్, మానోపాడు మండలం, జోగులాంబ గద్వాల జిల్లా ధన్యమైనవి. పెంచిన తల్లిదండ్రులు శ్రీమతి శంకరమ్మ, శ్రీ గుండ్లకొండ నడిపి శేషన్న కృతార్థులు. ఎం. ఏ, బి. ఇడి విద్యార్హతలతో ఉత్తమ ఉపాధ్యాయుడుగా వృత్తి ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా నిర్వహిస్తూ, ప్రవృత్తి పరంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని సమర్థవంతంగా నడుపుతూ, దృక్కోణం (వ్యాససంపుటి) రచించి ముద్రించి, నడిగడ్డ (దీర్ఘకవిత), శ్రీ గడియారం రామకృష్ణశర్మ జీవితం-వ్యక్తిత్వం, కథలు, వచన కవితలు మొదలైన ఎన్నో రచనలను చేసి సమాజ శ్రేయస్సును కాంక్షించే మీ కలంనుండి ఇంకా ఎన్నో ఉత్తమ రచనలు వెలువడాలని, మీకు పరిపూర్ణంగా దైవానుగ్రహం సదా కలగాలని ఆకాంక్షిస్తున్నాను.

          శ్రీ నాయుడుగారి జయన్న కవివరా! సహధర్మచారిణి శ్రీమతి రామేశ్వరి గారు మీకు తోడుగా నీడగా ఉండగా, పుత్రికారత్నములు గౌతమి, ఆద్య సుగుణమణులై మహదానందమును కలిగించుచుండగా, శ్రీరామదూతయైన పవనపుత్రుడు మీకు ఆయురారోగ్య భోగభాగ్యములను అక్షయకీర్తి సంపదలను కలిగింపగా సమాజసేవలో యథాశక్తి తరిస్తూ నిండునూరేండ్లు వర్ధిల్లుదువు గాక! శ్రీరామజయం.

                                                                                                   శుభాశీస్సులతో

14-1-2025,                                                                                     భవదీయుడు

కోవూరు, నెల్లూరు జిల్లా.                                                               అవధాని కోట రాజశేఖర్

                                                                                          విశ్రాంత సంస్కృతోపన్యాసకులు                                                                                      

                                                                                               

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి