పెద్ద దిన్నె - శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానము చరిత్ర
పరిశోధకులు - రచయిత
ఊర ఈశ్వర్ రెడ్డి
కోవెల దిన్నె గ్రామము
ఓం నమో వేంకటేశాయ
ప్రార్థన
1.
శ్రీనివాస భక్త!శ్రితజనపరిపాల
ఆదిదేవనీకు!పాదసేవ
మదినిసల్పుదెపుడు!మరువకనేవేళ
వేగబ్రోవరావె! వేంకటేశ!
2.
నీదుమహిమదెల్ప!నిఖిలలోకంబుల
సజ్జనులుగమార్చ!సన్నుతాంగ
కోరివెలసితీవు!కొంగుబంగారమై
పెద్దదిన్నెలోన!ప్రేమతోడ!
3.
గొంతుతెరచినిన్ను!గోవిందయనిపిల్వ
కూడిబాధలెల్ల!గూల్చినావు
నీదుమహిమనెన్న!నేనెంతవాడను
నిఖిలలోకరక్ష!నీరజాక్ష!
4.
వేలవందనములు!విశ్వంభరానీకు
సాధుజననృపాల!సన్నుతింతు
దీనబంధుయింక!దిక్కెవ్వరికమాకు
జాగుచేయనేల!వేగరమ్ము!
5.
సీ,మా.
కరుణాలవాలనీ!కరుణజూపవదేమి
కానివాడననీకు!కమలనయన
అరవింద లోచనా!ఆశ్రితపరపాల
యింతైనదయరాద!ఏలనీకు
సాగరంబనెడుయీ!సంసారచక్రంబు
దాటించరాగదే!దనుజవైరి
కష్టాలు కడతేర్చు!కల్పవృక్షమనీవు
దీవించి నాబాధ!దీర్చవేమి
దీనబాంధవనాకు!దిక్కునీవేయంటి!
వేగబ్రోవగరావె!వేంకటేశ
ఎన్నికష్టములైన!యిష్టంబుగానిన్ను
భక్తితోపూజించు!శక్తి నిమ్ము
నీపాదపద్మముల్!నిరతంబుసేవించు
భాగ్యమ్మునొసగుమా!భవ్యచరిత
కలనైననీరూపు!కనులజూతమటన్న
కనిపించరావునా!కర్మయేమొ
కోరనునినునేను!కోట్లధనమ్మును
వరమివ్వుచేయనీ!పాదసేవ
పలుమార్లునినునేను!ప్రార్థించిననుగాని
పలుకవేనామీద!పంతమేమొ
అఙ్ఞానినైనేను!యంధకారమునున్న
దిక్కుజూపగనాకు!దివ్వెనీవె
ఎన్నిజన్మలకైన!నిన్నువీడనునేను
దిక్కునేవేయంటి!దీనబంధు!
తే,గీ
భక్తజనపోష ఆశ్రిత పక్షపోష
విశ్వ కల్యాణ గిరిధరా వేంకటేశ
పరమ కారుణ్య జగదీశ పాపనాశ
పుడమి పెద్దదిన్నేగ్రామ! పురనివాస!
ఓం నమో వేంకటేశాయ
శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానము*చరిత్ర
పెద్ద దిన్నె గ్రామము
శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం యొక్క విశిష్టత ఏమిటంటే ఈగ్రామంలో సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం ఒక గొల్ల భక్తుడు ఉండే వాడట.
అతడు గోవుల గాచి జీవించే వాడట అలా ఉండగా ఒకరోజు స్వామి వారు కలలో కనిపించి నేను నీ ఆవుల పాలు త్రాగి జీవిస్తున్నాను. నేను మీ ఊరి పొలిమేరల్లోని కోట్ల బావి దగ్గర భూమిలో ఏ పూజ పునస్కారాలు లేక పడి ఉన్నాను నన్ను వెలికితీసి గ్రామంలో ప్రతిష్ఠ చేయమని చెప్పారట స్వామి వారు. ఏదైనా గ్రామ ప్రజలకు చెప్పబోతే వెఱ్ఱి గొల్ల వాడు అని హేళన చేసేవారు .అయితే రానురాను అతడి ముఖంలో ఒక దివ్యమైన తేజస్సు ఎర్పడి అతడు నమ్మకం కుదిరింది.
అలా కొద్ది రోజుల తరువాత గ్రామము లోని పెద్దలయిన వెంకోబా గారికి తెలియజేయగా వారు కొందరు గ్రామస్థులు కలిసి ఆ గొల్ల భక్తుని పిలుచుకొని పొలిమేర లోని కోట్ల బావి దగ్గరకు వెళ్ళి ఆ భక్తుడు చూపిన చోట తవ్వి చూడగా దొరికిన ఆ వేంకటేశ్వర స్వామి విగ్రహం తెచ్చి అక్కడ ప్రతిష్ఠించడం జరిగిందని ఆ ఆలయ ప్రధాన కార్య నిర్వాహకులైన శ్రీ జయసింహయ్య గారి ద్వారా తెలిసింది.
అయితే అప్పటికి కేవలం గర్భగుడి మాత్రమే కట్టించి
నారు అలా కొంత కాలం తరువాత గద్వాల సంస్థానాధీశులైన రాజా పెద్ద సోమభాపాల్ దొర గారిని కలిసి సంప్రదించగా వారు ఒప్పుకుని దేవాలయం చుట్టూ ప్రహరీగోడ ముఖ మంటపం ఆ ముఖ మంటపంపై ముందు భాగాన ఆ యాదవ భక్తుని రూపం శిలా విగ్రహం చెక్కించి పెట్టడం జరిగింది అదేవిధంగా ముందు విమాన గోపురం దాని ముందు రెండు ఎత్తైన శిలా దీపస్తంభాలను మరియు ఒక ద్వజస్తంభాన్నీ కూడా ప్రతిష్ఠించడం జరిగింది.
అంతేకాకుండా ఆ దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్య సేవా కైంకర్యానికై సుమారు 480 ఎకరాల ఇనాం భూమిని కూడా సంస్థానాధీశులు సమర్పించడం జరిగింది.
అదేవిధంగా గ్రామంలోని శివాలయానికి కూడా70 ఎకరాల భూమిని సమర్పించినట్లు తెలిసింది
ఆ విధంగా గ్రామంలో అన్ని వృత్తుల వారు నేటికీ సేవలు చేస్తూనే ఉన్నారు.బ్రాహ్మణులు మరియు
శ్రీ వైష్ణవులు అర్చకులు తంబలి మంగలి వారు వాయిద్య కారులు అలాగే పోలీస్ రెడ్డి గారి ఇంటి నుండి పూర్ణ కుంభము తీసుకెళ్ళడం ఇలా రకరకాలుగా కురువ గొల్ల కమ్మరి కుమ్మరి సాలె గాండ్ల హరిజన అన్ని కులాల వారు స్వామి కైంకర్యంలో పునీతులౌతున్నారు.
ఇంత మొత్తం ఇనాం భూమి గల దేవస్థానం అలంపూర్ తాలుకాలో మరే గ్రామములోను లేదనేది నిస్సందేహం.
అయితే నాటినుండి అనగా దేవాలయం స్థాపించి నప్పటి నుండి ఇప్పటి వరకు నిరాటంకంగా స్వామి వారికి సేవలు జరుగుతూనే ఉన్నాయి.
అయితే ఈ ఆలయ సంరక్షణ ప్రతిష్టాపకులైనటువంటి వెంకోబా గారి కుటుంబీకులే చూసుకుంటున్నారు.
సుమారు 1840 నుండి1888 వరకు శ్రీ వెంకోబా గారు తరువాత1888నుండి 1935 వరకు శ్రీ రాఘప్ప గారు 1935 నుండి1941 వరకు శ్రీ వెంకోబా గారు1941నుండి1954 వరకు శ్రీ బలరామప్ప గారు అప్పటి నుండి శ్రీ బద్రి నారాయణ రావు గారు దినదినాభివృద్ధికై అలుపెరుగని పోరాటం సాగించారనేది నిర్వివాదాంశం.
అయితే ఈ గ్రామము గుండా రైలు మార్గము ఉన్నప్పటికీ ఈగ్రామంలో రైల్వే స్టేషను లేకుండేది అయితే రైల్వేస్టేషన్ కూడా
శ్రీ బద్రి నారాయణ రావు గారు ఏర్పాటు చేయించారనేది నాకు 20 సం"రాల వయసు ఉన్నప్పుడే తెలిసింది మాది వడ్డేపల్లి మండలం లోని కోవెల దిన్నె గ్రామము
మా ఊరికి పెద్ద దిన్నె గ్రామానికి బంధుత్వం కూడా ఉండడం వల్ల కొన్ని విషయాలు తెలుసు.
అదీకాక 2000 సం:ము నుండి మా గురువు గారైన శ్రీ బ్రహ్మయ్యాచార్యులు
పోలీసు పటేల్ చిన్న సల్వారెడ్డి గారు అయిదు సెంట్ల స్థలం దానమివ్వగా అక్కడ శ్రీ నిర్భయానంద స్వామి ఆశ్రమం ఏర్పాటు చేయగా అప్పటి నుండి మేము అక్కడికి వస్తూ పోతూ ఉండడం వల్ల పై విషయాలన్నీ మాకు శ్రీ జయసింహయ్య ద్వారా తెలిశాయి.
అయితే ఇక్కడ విచారకరమైనదేమిటంటే ఆ యాదవ భక్తుని పేరు తెలియరాలేదు. అయితే ఆ స్వామి ప్రతిష్ఠకు మూల పురుషుడు యాదవ భక్తుడు అన్నది గ్రామస్థులకందరకు తెలుసన్నది జగద్వితము.
ఇకపోతే ఈ సంవత్సరం అనగా2022 లో దేవాదాయశాఖ శాఖ వారు గ్రామస్థులు 9లక్షల రూపాయలు డిపాజిట్ చేయగా రూ 36/-ల రూపాయలు దేవాదాయశాఖ వారు సర్వశ్రేయోనిధినుండి విరాళంగా ఇవ్వడం జరిగింది ఆ డబ్బుతో చుట్టూ ఉన్న కాంపౌండ్ మరమ్మత్తు చేయించి దానికానుకొని లోపల భాగాన సత్రాలు వినూత్నమైన రీతిలో నిర్మించి ధ్వజస్తంభం నూతనంగా తయారు చేసి
ఎంతో వైభవంగా నిర్వహించారు గ్రామంలో
అన్ని కులాల వారు ప్రముఖంగా రెడ్ల కుటుంబాలు ధర్మకర్తలైనటువంటి జయసింహయ్య కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటూ దేవాలయాన్ని దినదినాభివృద్ధిగా తీర్చిదిద్దుతున్నారనేది నిర్వివాదాంశం.
స్వామి వారి సేవా విశేషాలు
ప్రతిరోజూ ఉదయం బిందెసేవ సాయంత్రం దివిటీ సేవ క్రమం తప్పకుండా జరగడం ఒక విశేషం. ప్రతి సంవత్సరం పుష్య శుద్ధ దశమి రోజున జాతర జరుగుతుంది ఆరోజు రథోత్సవం మొదలు కొని ఐదు ప్రధాన వరకు పాంచరాత్రాగమ సాంప్రదాయ పద్ధతిలో సేవలు జరగడం ఒక నియమం. అదేవిధంగా గ్రామంలో ఇంతకు ముందు యాదవ భక్తుని ఇల్లు ఉండేదట.స్వామి వారు అక్కడకు తీసుకు వెళ్ళమని కోరగా అక్కడ దశమి కట్ట కట్టించి స్వామి వారిని పల్లకిలో ఊరేగించి అక్కడ దించి పూజచేసి తిరిగి దేవాలయానికి తీసుకు రావడం ఇప్పటి వరకు అదే ఆనవాయితీగా వస్తోంది అదేవిధంగా ప్రతి నెల శ్రవణా నక్షత్రం రోజున స్వామి కల్యాణం ఇప్పటి వరకు నిరాటంకంగా కొనసాగుతుంది. ఇంకొక విశేషమేమంటే వేంకటేశ్వర స్వామి దేవాలయం అయినప్పటికీ యాదవ భక్తుని వల్ల ప్రతిష్ఠ జరిగినందుకు గోకులాష్టమి రోజున ఉట్లు కొట్టే జాతర కూడా జరుగుతుంది. అయితే ఆ భక్తునికి స్వామి వారు ప్రత్యక్షమై నీకేమి కావాలో కోరుకో అని అడుగగా ఆ యాదవ భక్తుడు నాకేమి వద్దు నీవు నాయింటికి వస్తే చాలు అన్నాడని అందుకు స్వామి కోపోద్రిక్తుడై నీ వంశం విఫలమౌగాక అని అన్నాడని అందుకు భయపడి వారి వంశస్థులు ఊరు వదిలి కర్నూలు జిల్లా లోనిపోలుకల్లు గ్రామము కొందరు పెద్ద నాగటూరు గ్రామము కొందరు వలస పోయారని వారి వంశస్థులు తెలిపిన విషయం. ఇకపోతే ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఆ రెండు గ్రామాల నుండి వారు ఇక్కడికి వచ్చి పుట్టు వెంట్రుకలను తీయించడం జాతరకు రావడం పశువులు ఈనిన నెయ్యిని తెచ్చి స్వామి వారికి సమర్పించిన తరువాతనే వారు తినడం ఆనవాయితీగా వస్తున్నదని పెళ్ళిళ్ళు చేసినా కొత్త జంట ఇక్కడికి వచ్చి మొక్కు తీర్చుకుంటారని వారి ద్వారా తెలిసిన విషయము నేను ఇక్కడ ఉటంకించడం జరిగింది.
ఈవిధంగా ఈ దేవాలయ ప్రాశస్త్యాన్ని పదిమందికి తెలియజేసేలా అవకాశం కలిగి నందుకు నా అదృష్టంగా భావిస్తూ స్వామి వారి పాదపద్మాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ స్వామి వారి కృపా కటాక్షములు కోరుకుంటూ ముగిస్తున్నాను.
ఇట్లు
పరిశోధకులు
ఊర ఈశ్వర్ రెడ్డి
కోవెల దిన్నె గ్రామము
వడ్డేపల్లి మండలం
జోగులాంబ గద్వాల జిల్లా
చరవాణి -7981497017
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి