8, అక్టోబర్ 2013, మంగళవారం

మేం పాలమూరు కూలీలం!

మేం పాలమూరు కూలీలం!
కూలే ఇంటికి ముసలి తల్లులను కావలుంచి
కాలే కడుపుతో
బతుకు దారిని అన్వేషిస్తూ ...
బయలుదేరే బాటసారులం !

మేం వలస పక్షులం
మేం మాసిన మనషులం
ఎండిన డొక్కలం
కూలిన గుడిసెలం
మేం పాలమూరు కూలీలం!

నెర్రెలు బారిన నేల మీద
నెత్తురు పూసుక నడిచిన పాదాలం 
క్షణానికో కష్టాన్ని,
గడియకో గండాన్ని
కన్నీళ్ళ మాటున దిగమింగి దాచుకున్న అగ్ని గుండెలం!

ఎడారి భూముల్లో
ఆశల పత్రాలను రాల్చుకుని
నిరాశల కంటకాలను మనసంతా నింపుకుని
బ్రహ్మ జెముడు మొక్కల్లా మొలుస్తుంటామిక్కడ

నిరంతర జీవన ఘోషే
మా మాండలిక భాష

పండగైతే పచ్చడి మెతుకులు
లేకుంటే పస్తు బతుకులు
మా కలవాటే....

జీవంతో ఊరిడివడం
శవంగా తిరిగి రావడం
మాకానవాయితే...

చెరువుల్లో  ఎండిన నీటిని
కాంతిని కోల్పోయిన మా  కళ్ళలో నింపుకుని
దేశం నలుమూలలా  బయలుదేరుతాం
మా చిరునామాలు వెతుక్కుంటూ...

ఇక...
మట్టి మేమే
తట్టా మేమే
 బుట్టా మేమే
పారే  నీటికి కట్టా మేమే
ఎదిగే  భవనానికి నిచ్చెన మేమే
వేసే రోడ్డుకు కంకర మేమే
పని పరమేశ్వరులం!
బతుకు శనీశ్వరులం!!

గుత్తేదారు మాటల గునపాలు
గుండెకు గుచ్చుకున్నప్పుడో ,
బతుకు మీద చివరి ఆశ చచ్చినప్పుడో
ఇక చివరి సారి
వలసెల్లిపోయేది మాత్రం వల్లకాటికే...

       ----- నాయుడుగారి జయన్న
                 08.10.2013



5 కామెంట్‌లు: