9, అక్టోబర్ 2013, బుధవారం

నాకు నేనే ...



గోడకు పిడకేస్తే
గోడ కూలి పోతుందా?
ఏసిన పిడకైన
ఎల్ల కాలం ఉంటుందా?

ఎత్తి పొడుపు మాటలతో
ఏడుపు మొహం మిగిలిపోద్ది
దెప్పి పొడుపు కవిత్వంతో
పెంట దిబ్బ పెరిగిపోద్ది

కవిత రాయకుంటేను
కలం ఇంకు ఒలుకుతుందా?
కసి కక్క కుంటేను
కడుపు మండిపోతుందా?

కదల లేని కొండలాగ
కనికరం లేని బండలాగ
ఎంతెత్తు ఎదిగితేను ఏమి లాభం!
మనుసును మరుగుజ్జుగానే ఉంచుకొని...

కళ్ళ ముందు తప్పొకటి జరిగిపోతే
కనికరించి, సవరించు
పెద్దరికం మిగిలిపోద్ది

పిన్నల దీవించ
చేతులు నీకు రాకుంటే
పెద్ద నేరమేమి కాదది
మహా రోగమంతే!

ఎదుటోన్ని బాధ పెట్టి
ఏమి సుఖం పొందుతావు?
పక్క వాన్ని పడదోసి
పైకెలా ఎదుగుతావు?

ఎదుటి వాడి మీదికి
ఎన్నైనా వొదులొచ్చు బాణాలు
మనకొకటి తగిలితేనే
మహా మంటగుంటుంది

కుక్క పిల్ల కాడి నుంచి
అగ్గి పుల్ల దాకా 
అన్ని కవితామయమే అన్నాడుగా శ్రీశ్రీ
అన్నిట్లో ఒక్కటైనా దొరక్కపోతే
భావ బిచ్చగాడివేరా,  ఛీ ఛీ

ఏమి దొరకనట్లు
ఎందుకురా ఏడుపు కవిత జయన్నా!?
పర నింద మానుకోరా
మంచిగుంటది మాయన్నా!!



 -నాయుడిగారి జయన్న
    09.10.2013





 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి