27, అక్టోబర్ 2013, ఆదివారం

నా యాత్రానుభవాలు 1 - జోగ్ జలపాతం



   మాదొక చిన్న పల్లెటూరు. పేరు పల్లెపాడు. మహబూబ్ నగర్ జిల్లాలోని కృష్ణా పరివాహాక ప్రాంతాలలో ఇది ఒకటి.  గురు స్వామి, బషీర్, దస్తగిరి, శ్రీరాం, నేను మా ఊరిలో చిన్న సైజు పాండవులం. చిన్నప్పుడు నుండి కలిసి పెరిగాం, కలిసి తిరిగాం. జీవన యానంలో తలోదిక్కు విసిరేయబడ్డాం. అయినా సంవత్సరానికి ఒకసారైనా ఊరిలో కలవాలని, వీలైతే ఎటైనా విహార యాత్రలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. అలా ప్రతి సంవత్సరం దసరా సెలవుల్లోనో, సంక్రాంతి సెలవుల్లోనో, వీలైతే అందరూ, కాకుంటే విలైనంత మందిమి విహార యాత్రలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాం.
   అందులో భాగంగా ఈ సంవత్సరం దసరా సెలవుల్లో నేను , బషీరు, గిరి కర్ణాటకలోని జోగ్ జలపాతం చూడాలని నిర్ణయించుకున్నాం.. వ్యవసాయ పనులవలన గురు, వ్యాపార పనుల వలన శ్రీరాం మాతో రాలేక పొయారు.
    అనుకున్నదే తడువుగా తేది: 11.10.2013 రోజు ఉదయం 11 గంటలకు  గద్వాల నుండి  రాయచూరు  వెళ్ళాం- బస్సులోనే. మా ముగ్గురికి ప్రత్యేకంగా వాహనం తీసుకవెళ్ళెంత స్థోమత లేదు కాబట్టే బస్సులో బయలదేరాం. మ. 1.00 గ.లకు రాయచూరు చేరుకున్నాం.  బస్సు ప్రాంగణం కొత్తదే. ప్రాంగణానికి ఓ వైపు
ఎత్తయిన కొండ, ముందు వైపు అలనాటి చారిత్రిక వైభవానికి సాక్ష్యంగా  నిలిచిన కోట బురుజు ఆకర్షిస్తాయి.  ఒక హోటల్లో భోజనం చేశాం. ఆంధ్రాతో పోల్చుకుంటే  భొజనం చాలా ఖరీదే. అయినా భొజనం రుచించలేదు. .  ఏమైనా ఒకసారి పూర్వపు మా జిల్లా కేంద్రాన్ని చూడటం ఆనందాన్నిచ్చింది. ( గద్వాల, అలంపూరు ఒకప్పుడు రాయచూరు జిల్లాలోనివే )   

                                                                  తరువాత మ. 2.00 గ.లకు రాయచూరు నుండి సిందనూరుకు, సిందనూరు నుండి హోస్పేట్ కు బయలుదేరాం. ఆ రాత్రి హోస్పేట్లో అల్పాహారం కానిచ్చి, మళ్ళీ ప్రయాణం మొదలెట్టాం.
  
            ముందుగా శీమొగ్గకు, అక్కడి  నుండి సాగర కు బయలుదేరాం. ఆ రాత్రంతా ప్రయాణమే. తెల్లవారు జామున సాగరకు చేరుకున్నాం. సూర్యుడు తూర్పు కొండల్లోచి నిద్రలేచి వచ్చే సమయానికి జోగ్ జలపాతం చేరుకున్నాం.
     చాలా  రోజుల నుండి ఊరించిన ప్రదేశానికి చేరుకున్నందుకు చెప్పలేని ఆనందం నాకు. మా పర్యటనలో పట్టు పట్టి ఈ ప్రాంతాన్ని చేర్చింది నేనే. ప్రకృతి ప్రదేశాలంటే ప్రాణం.

    భారత దేశం లోని ఎత్తైన జలపాతాలలో ప్రథమ స్థానాన్ని ఆక్రమిస్తున్న ఈ జలపాతం కర్ణాటక రాష్ట్రం షిమోగ జిల్లా సాగర తాలూకాలో ఉన్నది. ఈ జలపాతం శరవతి నది, 253 మీటర్ల (829 అడుగులు)ఎత్తు నుండి పడడం వల్ల ఏర్పడుతోంది. ఈ జలపాతం వివిధ రాష్ట్రాలనుండి పర్యటకులను ఆకర్షిస్తున్నది. ఈ జలపాతానికి గేరుసొప్ప లేదా జోగోడా గుండి అనే పేర్లు కూడా కలవు. షిమోగ నుంచి జోగ్ జలపాతం కు బస్సు, ఇతర రవాణా సౌకర్యాలు కలవు.


      ఆ ఉదయం ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పటికి ఇంకా ఆ ప్రాంతాన్ని ఆవరించిన  మంచు తెర తొలగిపోలేదు.  ఎత్తయిన ఆ ప్రదేశంలో ప్రవేశ ద్వారాన్ని దాటుకుని  వ్యూ పాయింట్కు చేరుకున్నాం. అక్కడక్కడ ఏవో కుటిరాల లాంటి నిర్మాణాలు, ఓ హోటల్, ఇంకా చుట్టూ లోతైన లోయలు కనిపించాయి.  లోయ అంతా  మంచు దుప్పటి  కప్పుకొని ఉండటం వలన జలపాతం ఎక్కడుందో కనిపించలేదు మరో అరగంట దాకా.

  వదలని చలి ఒక వైపు, విడువని చినుకులు మరో వైపు తోడు  ఉండగా  మెల్లగా మెట్ల దారిలో కిందికి జలపాతం వైపు నడక సాగించడం మొదలు పెట్టాం.
పైనుండి కింది వైపు దాదాపు 1000 దాకా మెట్లు ఉన్నట్లు అక్కడి  వారు చెప్పారు. ఆ మెట్ల గుండా కిందికి దిగడం మొదలు పెట్టాం.  ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే...మేమే ఆ ప్రాంతానికి ఆ రోజు మొదట చేరుకున్న సందర్శకులమనుకున్నాం. కాని అప్పటికే ఆ ప్రదేశానికి చేరుకున్న వాళ్ళు, చేరుకొని  తిరిగి వస్తున్న వాళ్ళూ, చేరుకోలేక మధ్యలోనే తిరిగి వచ్చిన వాళ్ళు మాకు ఎదురుకావటం.  ఆ తిరిగి వస్తున్న వాళ్ళలో కనిపిస్తున్న అలసట ఒక వైపు మమ్మల్ని భయపెడుతూనే ఉంది. చేరుకోగలమా? చేరుకొని తిరిగి రాగలమా? అని. అయినా మొండిగా ముందుకు కదిలిపోయాం.
ఓ పదహైదు నిమిషాల నడక తరువాత మా మిత్రుడు గిరి కాళ్ళెత్తేశాడు. ఇక నావళ్ల కాదు మీరు వెల్లి రండి. నేను మెల్లగా పైకి వెల్లి సేదతీరుతాను  అని చెప్పాడు. నేను, బషీరు మాత్రం ధైర్యం చేసి ముందుకు కదిలిపోయాం. మరో అరగంట కష్టాల  తరువాత జలపాతం దగ్గరికి చేరుకున్నాం.
   







  నది 829 అడుగుల నుండి పడుతూ నాలుగు పాయలుగా విడిపోయి, నాలుగు వేర్వేరు గతిపథాలలో క్రింద పడుతుంది. ఈ విధంగా 4 గతిపథాలకు నాలుగు పేర్లు కలవు. ఎడమ నుండి కుడికి ఆ గతిపథాల ఆధారంగా జలపాతాల పేర్లు పెట్టారు.


  • రాజ: జలపాతం చాలా నిర్మలంగా సౌమ్యంగా ఉన్న రాజు మాదిరిగా ఉండడం వల్ల జోగ్ జలపాతంలో ఈ గతిపథికి రాజు అని పేరు పెట్టారు.
  • రోరర్: ఈ జలపాతం పెద్ద పెద్ద రాళ్ల మధ్య నుండి పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ క్రింద పడుతుండడం వల్ల జోగ్ జలపాతంలో ఈ గతిపథికి రోరర్‌ అని పేరు పెట్టారు.
  • రాకెట్: అత్యంత వేగంతో సన్నటి ధారగా రాకెట్టు
    మాదిరిగా ఉండడం వల్ల జోగ్ జలపాతంలో ఈ గతిపథికి
    రాకెట్టు అని పేరు పెట్టారు.
  • రాణి: వయ్యారాలు , వంపులు పోతూ పడే జోగ్ జలపాతంలో ఈ గతిపథికి రాణి అని పేరు పెట్టారు.
రెండువైపుల నుంచి కిందికి దూకే నాలుగు పాయలు కనువిందు చేస్తాయి.
ఆ పాయల నుండి అంతెత్తు మీదునుండి కిందికి దూకే ఆ జలపాతాల నుండి వచ్చి పడే నీటి తుంపరలు గిలిగింతలు పెడుతాయి. అద్భుత ఆ ప్రదేశం కాసేపు మనల్ని స్వర్గంలో ముంచినట్లుగా అనిపిస్తుంది.

  అక్కడే కాసేపు జలకాలాడి ఆ మనోహర దృశ్యాలను మనసు నిండా నింపుకుని తిరిగి మెట్ల దారిన తిరుగు ప్రయాణమయ్యాం. 


పైకి వచ్చేటప్పటికి  మా మిత్రుడు గిరి ఒకసారి ఆ ప్రదేశమంతా కలియ తిరిగి వచ్చి, మా కోసం ఎదురు చూస్తూ కనిపించాడు. మరో సారి ముగ్గురం ఆ ప్రాంతమంతా తిరిగి, అలసిపోయి, అక్కడి ఓ రెస్టారెంట్లో  భోజనం అయిందనిపించి తిరుగు ప్రయాణానికి సిద్దమయ్యాం.
                                                               

                                                                                                                 ( మరో మజిలీ...)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి