27, మార్చి 2013, బుధవారం

రామయ్య పాఠాలు ( పుస్తక పరిచయం )


                 విద్యారంగానికి  గుణపాఠాలు 'రామయ్య పాఠాలు'

        రామయ్య పరిచయం అక్కర్లేని పేరు.  నేటి విద్యారంగానికి చుక్కాని చుక్కా రామయ్య. IIT వంటి  సాంకేతిక విద్యకు సంకేతం iit రామయ్య.  అందుకే  ఆ పేరుకు మరొక్క  సారి పరిచయం అక్కర్లేదని చెప్పటం.  అయన  కలం  నుండి జాలువారిన వ్యాసావళే ' రామయ్య పాఠాలు'.
     ఏమిటి ఈ  వ్యాసాల పరమోద్దేశ్యం? అని మనం ప్రశ్నించుకుంటే - "విద్య పేద వర్గాల ప్రజలకు ఉపయోగపడాలన్న  ఆదుర్ధాతో,  సమాజాన్ని చైతన్యవంతం చేయాలన్న ఉద్దేశ్యంతో నేను కలం  పట్టి , వీటిని రాస్తున్నాను". అని అయన తన  పుస్తకానికి రాసుకున్న ముందు మాటలు మనకు సమాధనం  చెప్తాయి.

     ఈ   వ్యాస సంకలనంలో మొత్తం 50  వ్యాసాలు ఉన్నాయి.  ఒక్కో వ్యాసం నిజంగానే మనకో పాఠమే. మన విద్యా వ్యవస్థకు పట్టిన అంతులేని సమస్యల జాఢ్యానికి, తన మేధా సంపతితో, అపార అనుభవ జ్ఞానాన్ని రంగరించి  తయారు చేసిన పరిష్కారాల పరమ ఔషధం ఈ వ్యాసావళి.
    ఈ వ్యాసాల్లో కొన్నిట్లో సమస్యల ప్రస్థావన, కొన్నిట్లో సమస్యలకు పరిష్కారాలు, కొన్నిట్లో మార్గదర్శనం, మరికొన్నిట్లో భవిష్యత్తు  పట్ల భయాందోళన మనకు కన్పిస్తాయి.  ఈ వ్యాసాల్లోని రామయ్య మాటలు కేవలం మాటలు కాదు.  అవి విలువైన పాఠాలు. విద్యార్థులకు లాలిపాటలు. తల్లిదండ్రులకు గుణపాఠాలు.   ఉపాధ్యాయులకు వెలుగు బాటలు. విద్యావ్యవస్థలకు, సంస్థలకు  మార్గదర్శకాలు.  సామాన్యున్ని సైతం సాంకేతిక విద్య వైపు  దృష్టి సారించేలా చేసిన మేధావి కాబట్టే రామయ్య పాఠాలకు అంతులేని విలువ.
        రామయ్య ఈ వ్యాసాల్లో వేటి గురించి ప్రస్తావించాడని ప్రశ్నించుకుంటే ...ప్రాథమిక విద్య నుండి అత్యున్నత విద్య   వరకు, వీధి బడి నుండి యూనివర్సిటి వరకు, సాంప్రదాయ చదువుల  నుండి  సాంకేతిక విద్య వరకు అన్ని స్థాయిలలోని, అన్ని రకాల, అన్ని ప్రాంతాలలోని విద్య గురించి, వాటి సమస్యల గురించి ప్రస్తావించాడు.

      రామయ్యది కేవలం సమస్యలను వేలెత్తి చూపించి , తప్పుకునే తత్వం  కాదు.  వాటికి పరిష్కారాలను సైతం సూచిస్తాడు.  ఎంతో అధ్యనం, ఎంతో పరిశీలన, ఇంకెంతో పరిశోధన, మరెంతో  అవగాహన ఉంటేగాని ఎన్నో సమస్యల గురించి ప్రస్తావించలేం.  వాటికి పరిష్కారాలను సూచించలేం.  విద్యారంగాన ఆరితేరిన మేధావి కాబట్టే చాల సమస్యలకు సులభంగా పరిష్కారాలను సూచించగలిగాడు రామయ్య.
        రామయ్య చెప్పే విషయం కూడా బెత్తం పుచ్చుకొని బెదిరిస్తూ పాఠం చెప్పే ఉపాధ్యాయునిలా కాకుండా, అమ్మలా  అనురాగంతో చెప్పే  గురువులా చెప్తాడు. అదీ ఆయన రచనా విధానంలోని గొప్పదనం.
       ఇక వ్యాసాల్లోని విషయాలలోకి వెళ్తే... ఇంగ్లీషు మీడియం  మోజులో తల్లిదండ్రులు తమ పిల్లలపై  ఒక వైపు విషయ భారాన్ని, మరో  వైపు భాషాభారాన్ని మోపుతున్నారని, దీని వలన పిల్లలు మానసికంగా దెబ్బతిని అటు మాతృభాషలోను,  ఇటు చదివే భాషలోను రాణించలేకపోతున్నారని ఆవేదన చెందుతాడు.  ఇలాంటి తల్లిదండ్రులు ' ఇంగ్లీష్ నేర్చుకోవడమంటే ఇంగ్లీష్ మీడియంలో   చదవటం కాదన్న వాస్తవాన్ని గుర్తించుకోవాలంటాడు'.  అంతేకాదు విద్యార్థికి  తన భాషలో తన పరిసరాలను గురించి  నేర్పాలని సూచిస్తాడు.
    ప్రాథమిక స్థాయిలో  బోధించే పాఠాలకంటే, ఆటపాటలకే ప్రాధాన్యం ఇవ్వాలని, బెత్తంతో బెదిరించటం ఉపాధ్యాయులు మానాలని చెప్తారు.  పిల్లల వ్యక్తిత్వ నిర్మాణంలో తల్లిదండ్రులదే  కీలక పాత్ర అని, వారు పిల్లలను పాఠశాలకు పంపటమంటే ఉత్తరాలను పొస్ట్ చేసి మర్చిపోయినట్లుగా ఉండరాదని,  వారిని  సమున్నత వ్యక్తులుగా తీర్చిదిద్దాలంటాడు.
      పాఠశాల కరిక్యులం గురించి మాట్లాడుతూ  కేవలమది పాఠ్య కార్యక్రమాల సమాహారంగా కాక, విద్యార్థి పరిసరాలను, అవసరాలను, అన్ని వర్గాల ప్రజల జీవన నేపథ్యాలను ప్రతిబింబించేదిగా  ఉంటేనే అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతామంటారు.
    విద్యార్థి  థియరిటికల్ గా తాను చదువుకున్న విషయాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలంటే,   పాఠశాల  ఎన్ని రోజులు ఉంటుందో అన్నే రోజులు సెలవులు ఉండాలన్న ఓ కొత్త ప్రతిపాదన చేస్తాడు.   ఇది  నిజమే అన్పిస్తుంది.  గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులకు ఆ రోజు జరిగిన పాఠాలు చదువుకోవటానికి ఇంటి దగ్గర సరైన వాతావరణం   లేక వాటి మీద సరైన అవగాహన రాక సతమతమవుతుండగానే మరుసటి రోజు పాఠాలు ములిగే నక్కల మీద తాటికాయలలా వచ్చిపడుతాయి. అది  ఈ గందరగోళంలో చదువు మీద ఆసక్తి సన్నగిలి బడిమానివేస్తున్న సంఘటనలు చాలానే ఉన్నాయి.  దీనికి విరుద్దంగా రెసిడెన్సియల్ పాఠశాలలలో పాఠశాలల పనివేళలలో రోజులో  సగభాగం బోధనకు కేటాయిస్తే, మిగిలన సగభాగం స్వీయ అధ్యనానికి కేటాయిస్తారు. కావుననే అక్కడ మెరుగైన ఫలితాలు సాధించగలుగుతున్నారు.
   బోధనాలక్ష్యం సిలబస్ పుర్తిచేయడమో, వంద శాతం ఫలితాలు సాధించడమో కాదు. విద్యార్థిలోని నైపుణ్యాలను అభివృద్ది చేయడమేనంటాడు రామయ్య. నేడు నూటికి తొంబై మంది, పాఠశాల ప్రధానోపాధ్యాయుల  నుండి జిల్లా కలెక్టర్ల దాకా నైపుణ్యాలకన్న ఫలితాల సాధనకే అధిక ప్రాధాన్యం ఇస్తుండటాన్ని గమనించవచ్చు.
 బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని గగ్గోలు పెడుతున్న సంస్థలకు, ప్రభుత్వాలకు చురకలంటిస్తూ...పిల్లల  పెంపకం, పొలం పనులు, ప్రమాదకరం కాని పనుల్లో పిల్లలు ఉండటం తప్పేమి కాదని, అవి వారికి శ్రమవిలువను తెలియజేస్తాయని, అవి వారి జీవితంలో ముడిపడిన  అంశాలని,  వాటి నుండి తప్పించటం కాక  వాటిలో పాల్గొనే అవకాశం కల్పిస్తూనే, చదువుకొనే అవకాశం కూడా ఇవ్వడానికి పాఠశాల పనిగంటలను 4 గంటలకు కుదిస్తే  సరి పోతుందని చెప్తారు.
   ఉపాధ్యాయుల నియామక విధానాన్ని తూర్పారపడుతూ... చేయవలసింది భర్తీ కాదని సరైన అభ్యర్తుల ఎంపికని, విద్యార్హతలు లేని ఉపాధ్యాయుని ఎంపిక ఎంత ప్రమాదకరమో, అధిక విద్యార్హతలు వున్న వ్యక్తి ఎంపిక కూడా అంతే  ప్రమాదకరమని, ఎంతో మంది పోస్టుగ్రాడ్యుయేట్స్  ప్రాథమిక పాఠాశాల ఉపాధ్యాయులుగా ఎంపికై సక్రమంగా పని చేయని ఉదంతాలను మనకు గుర్తుచేస్తాడు.
    పాఠ్య పుస్తకాలలో మత భావాలు ప్రమాదకరమని, పాఠ్యాంశాల రూపకల్పనలో వికేంద్రికరణ జరగాలని, వృత్తి విద్యలను సంస్కరిస్తేనే  ఉత్తమ ఫలితాలు సాధ్యమని చెప్తారు.  పరీక్షలనేవి నేర్చుకునే ప్రక్రియలో భాగమనే స్థాయి నుండి మొత్తం విద్యావ్యవస్థనే శాసించే స్థాయికి  చేరుకున్న  ప్రస్తుత  తరుణంలో ' ఓపెన్ బుక్ పాలసీ ' అన్నది సరైన విధానమేనని, అయితే ముందు సంస్కరణలు అన్నవి ఏవి చేయకుండా ఇతర  దేశాలలో అమలు  చేస్తున్నారని మనమూ నేరుగా దిగుమతి చేసుకుని అమలు చేస్తే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు  ఉంటుందని , దాని ఫలితంగా విద్యార్ధి బలిపశువు కావడం తథ్యమని హెచ్చరిస్తాడు.
  మనం, మన  దేశం పలు సమస్యలతో సతమతమవుతున్నామని కునారిల్లుతూ  కూర్చోవడం మాని, ఒక  ఆశావాహ దృక్పథంతో ముందుకు నడవాలంటాడు. జనాభా మనకు సమస్యే అయినా దాన్ని సమస్యగా కాక అపారమైన మానవ వనరుగా భావించి, దానికి టెక్నాలజీని జోడిస్తే విస్తృత మార్కెట్లో పుష్కల అవకాశాలు లభించి ప్రపంచంలో సగర్వంగా తలెత్తుకునే రోజు వస్తుందంటాడు.

      విశ్వవిద్యాలయాల పని తీరును, వాటి పరిశోధనల తీరు తెన్నులను సమీక్షిస్తూ...దేశంలో వందల కొలది విశ్వవిద్యాలయాలు, వేల కొలది పరిశోధనలు,  కోట్ల  కొద్ది  నిధులు.  ఇదంతా ప్రజా ధనం. మరి ఈ విశ్వవిద్యాలయాల పరిశోధనలు, వాటి ఫలితాలు సామాన్యుని కష్టం తీరడానికి ఏమైనా దోహదం చేశాయా? సమాజ పరివర్తనకు దారి చూపాయా? నల్గొండ ఫ్లోరైడ్ సమస్యను, పాలమూరు కరువును రూపు మాపడానికి కృషి చేశాయా? అని ప్రశ్నించుకుంటే - " అవును" అని సమాధానం  వస్తే, వాటి పనితీరు బాగున్నట్లేనంటాడు.
    ఇంకా ఈ వ్యాస సంకలనంలో రామయ్య -దొడ్డి దారిన ప్రవేశాలు కల్పించి, విద్యా ప్రమాణాలకు తూట్లు పొడుస్తున్న మైనార్టి విద్యాసంస్థల భాగోతాలను, విదేశి చదువు మోజును ఆసరాగా చేసుకుని భోగస్ కన్సల్టెన్సిలు చేస్తున్న దుర్మార్గపు వ్యాపారాన్ని, ప్రపంచీకరణ ఫలితంగా విద్య వాణిజ్య వస్తువుగా మారుతున్న వైనాన్ని, ప్రామాణిక పుస్తకాల ప్రచురణకు తెలుగు అకాడమి చేయవలసిన  కృషిని, బ్రౌన్ దొర  స్ఫూర్తిగా మనం కొనసాగించవలసిన పనులను,....ఒకటేమిటి సమస్త విద్యాసంబంధ విషయాలన్నీ ఈ  పుస్తకంలో ప్రస్తావించాడు .  ఒక రకంగా నేటి విద్యావ్యవస్థకు ఇదొక నిలువుటద్దం. ఇంత విలువైన వ్యాసాలను అందించిన రామయ్య గారికి, వీటిని సంకలనంగా తీసుకొచ్చిన జూలూరు గౌరీ శంకర్ గారికి అభినందనలు. విద్యారంగంతో ముడిపడిన ప్రతి ఒక్కరు చదువదగ్గ మంచి పుస్తకం - 'రామయ్య పాఠాలు'.

                                                                                                           -   నాయుడుగారి జయన్న
                                                                                                               27.03.2013                     












14, మార్చి 2013, గురువారం

చట్ట సభలా? సట్టు బండలా?



ప్రజల డబ్బుతో నడిచే చట్ట సభల  విలువైన  కాలమంతా 
ప్రభుత్వాలను పడగొట్టడానికో 
ప్రభుత్వాలను  నిలబెట్టుకోడానికో నేతలంతా వృధా చేస్తే
మరి
ప్రజల సమస్యల గురించి మాట్లాడేదెప్పుడు?
తీర్చేదెప్పుడు?
తీర్చెదెవ్వడు?                    

బ్యాంకుల నీతి

బతుకలేకో
బతుకనీకో
పదో
పరకో
అప్పు చేసి
తీర్చలేక తిప్పలు పడే
సామాన్యుడి ఫోటోలు
పత్రికల్లో ముద్రిస్తాయట బ్యాంకులు -
అతను అవమాన భారం  భరించలేక
ఉసురు తీసుకున్నీక.

మరి
ఒక్కొక్కడు 100  కోట్లు , ఆపై మాటేనట
మొత్తం 98,884 కోట్లు
ఎగేసిన బడా బాబుల ఫోటోలు కూడా
ముద్రిస్తాయా బ్యాంకులు!?

పేదోడికో నీతి , పెద్దోడికో నీతి అన్న
నిజాన్ని నిరూపిస్తాయా ?!

3, మార్చి 2013, ఆదివారం

ఆటవెలది 6

ఆకలనుచు  నొకడు అల్లాడి పోవును
అరుగ దనుచు నొకడు అరుచు చుండు
 ఒకడి కైన లేదు లోకమందు సుఖము
జయుడి మాట నిజము జాబిలమ్మ!

26, ఫిబ్రవరి 2013, మంగళవారం

చిట్టి కవిత



ఎప్పుడూ కచేరే -
మా ఇంటి ముందు.
చెట్టు మీద కోయిల.


24, ఫిబ్రవరి 2013, ఆదివారం

మట్టి గంప

                                'సామాన్యుడి  బతుకు జెండాలో అశోక చక్రం " మట్టిగంప"
  అనాది  నుండి ఈనాటి దాకా కరువుకు చిరునామా పాలమూరే.  ఇక్కడ అడుగడుగునా నెర్రెలు బారిన నేలే. ఇక్కడ ఊరూరా బతుకులు  కూలిన  జాడే.  అంతటా ఆకలే.  మనుషుల నిండా ఆవేదనే.    సూర్యుడు ఉదయించినా, అస్తమించినా  సంబంధమేమి లేకుండా మనుషులు అస్తమిస్తూనే ఉండే నేల ఇది.  ఈ దుర్భర దారిద్ర్యం, ఇక్కడి ప్రకృతి శాపం  చాల మంది సున్నిత  హృదయులైన చదువరులను కవులను  చేసింది.  ఆ ఒరవడిలో ఉదయించిన కవే  'పరిమళ్'.  నేటి  అభ్యుదయ,విప్లవ కవిత్వంతో పరిచయం ఉండిన ఎవరికైనా పరిచయమైన పేరేఅతను వెలువరించిన కవితా సంకలనమే " మట్టిగంప".
  ఈ కవి  కవితను నెత్తికెత్తుకోని పత్రిక లేదు. ఈ కవి గొంతును వినిపించని  విప్లవ కవితా వేదిక లేదు.  ప్రతి దుర్మార్గపు, దుశ్చర్యను ఖండిస్తూ నిరసన గళమెత్తిన ప్రతి అభ్యుదయ కవితా సంకలనానికి ఈ   కవి కవిత  అధనపు బలాన్నిచ్చింది. ఆయుధమైంది. ఒక్క  మాటలో చెప్పాలంటే...
                                                                  " పిడికిలి మీద
                                                                    కొత్త స్వప్నాలు పూయించాల"ని కలలు కనే అభ్యుదయవాది.  
  కాబట్టే  పాలమూరు కరువు, దళితుల దైన్యం, ప్రపంచీకరణ పైశాచికత్వం, అగ్రరాజ్యపు  ఆధిపత్యం,  కాషాయపు రంగు నల్ల రంగుకు చేసిన ద్రోహం,...మొదలగు  నేపథ్యాలతో, 42  కవితలతో ఈ మట్టిగంపను  రూపొందించాడు.  మరీ ముఖ్యంగా  పాలమూరు మట్టి  మనుషుల గురించి, వారి కష్టాల గురించి, కన్నీళ్ళ గురించి,... వారి  బతుకు గోసకు అక్షరాలు అద్ది  ఈ మట్టిగంపను " సామాన్యుడి బతుకు జెండాలో అశోక చక్రం"గా నిలిపాడు. ఇందులో ఉన్న ఒక్కో కవిత మనల్ని ఒక్కో కుదుపు కుదిపి ఆలోచనల్లోకి నెట్టివేస్తుంది.
    రెండు నదులు, లెక్కలేనన్ని వాగులు, వంకలు ఉన్నా పాలమూరు ఎందుకు  ఎడారిగా మారిందో ఎవరికీ అర్థం  కాని ధైన్యం. అందుకే కవి ...
                                 " నీళ్ళు పక్కనే ఉన్న  మనిషికి
                                    నీడ లేదు
                                    మెతుక్కోసం దూరాలకు వేళ్ళాడ్డం"
" రక్త సంబంధాలని
నిత్యం కన్నీళ్ళ మీద గుర్తుచేసుకోవడం" ఇక్కడ నిత్య కృత్యమైందని వాపోతాడు.
      పాలమూరు కరువుకు పరాకాష్ట ప్రతీకనేమో అనేవిధంగా   చెప్పిన కవిత 'కరువూరు'. ఈ కవితలోని ఓ మూడు పాదాల్లో రెండు దుఃఖపు దృశ్యాలు ఏక కాలంలో మన కళ్ళ ముందు కదలాదుతాయి. ఆ రెండు ఒక దానితో ఒకటి ముడిపడినవే.  ఒకటి ఇక్కడి  నేల దౌర్భాగ్యాన్ని గుర్తు చేస్తే , మరోటి ఆ నేల మీద ఆధారపడిన బడుగు జీవుల కన్నీటి గాథను గుర్తు చేస్తుంది. చూడండి...
                                                        " ఇక్కడ  వాన
                                                          ఆకాశంలోంచి ఎప్పుడైనా కురిసిందా ?
                                                          కన్నుల్లోంచే ..."   ఈ  మాటలు పొడిబారిన మన కళ్ళను, తడారిన మన గుండెను మెలిపెట్టకుండా వదిలేస్తాయా?
                                   " ఓ  ఊరి గూటిలో దీపం వెలగాలంటే
                                     ఈ ఊళ్ళో గాజులు పగలాలి" ఈ చారిత్రిక సత్యం -పాలమూరు వలస జీవి శ్రామిక త్యాగం ఎంత గొప్పదో  గుర్తు చేయటం లేదూ?  
       ఈ కవి  ఛాయా చిత్ర  కవిత్వంలో ఒక చోట స్వీయ పరిచయమేమో అనిపించే  ' కలల దారి' కవిత ఈ కవి కవిత్వం నిండా భావ చిత్రాలెందుకు ఉన్నాయో సమాధానం చెబుతుంది.
      " పిచ్చివాళ్ళను, కుక్క పిల్లలను/ ఎవరైనా బాధిస్తే / కన్నీటి చుక్కలై రాలేవాణ్ణి" అని అనటం ద్వారా ఈ కవిత్వానికి ఇంతటి హృద్యతా, ఆర్ద్రత ఎలా అంటుకుందో కూడా మనకు తెలిసిపోతుంది.
       దళితుల అణచివేతను, అవమానాల్ని, ధీనత్వాన్ని చిత్రించిన కవితలకు ఇందులో కొదువే లేదు. మచ్చుకు ...
" మనుషులమే/ కాని మలినపరుచబడ్డాం/ తరతరాలుగా కుట్రల గొలుసులతో/ ఊరి బయట బంధించబడ్డాం" అని బాధ పడుతూనే, అందుకు కారణమైన వర్ణ ధర్మాన్ని - "పాదాలు లేకుంటే నడకెక్కడిది?/ మీ బతుకులకు ఆ హొయలెక్కడివి ?" అని ఘాటుగానే ప్రశ్నిస్తాడు. అంతే కాదు దళితులూ, మైనార్టీలు వేరు కాదని, ఒకే కొమ్మకు పూసిన రెండు పువ్వులని,  ఉమ్మడి శత్రువు మీదికి దూయవలసిన ఒకే ఒరలోని రెండు కత్తులన్నది ఈ కవి భావం. వృత్తిని కులంగా, కులాన్ని మతంగా మార్చేసి తన జాతికి అవమానాల్ని అంటగట్టినప్పుడు - " నా కనులు తుడిచింది / నా గుండెను చిగురింపజేసింది/ చల్లని కిరణాల నెలవంకనే" అన్న చారిత్రిక వాస్తవాన్ని గుర్తు చేయడంలోని ఔచిత్యం, వారితో సఖ్యతను కోరుకోవటమే.
    వర్తమాన దేశాల మీద అగ్ర రాజ్యపు పెత్తనాన్ని నిరసిస్తూ..." భూగోళం మీద ప్రతివాడూ/ పడమటి గాలినే పీల్చాలా?'' అని ప్రశ్నిస్తాడు.  అయితే ఇదే గొంతుక " ఒక పడమటి రుతు పవనం/ కరుణ జల్లుకు/ నా మేధస్సు వేయి హరిత శాఖలైంది". అని అన్నప్పుడు కొంత ఆశ్చర్యంగానూ, వింతగానూ అనిపించవచ్చు. కాని- " అక్షరాలు/ శిరస్సు నుండి పాదాల దాకా / చెమట /పాదాల నుండి శిరస్సు దాకా/ ప్రవహించడం నిషేదించిన" ఆర్యుల ద్రోహం గురించి  విడమరిచి చెప్పిన తరువాత మనకిక  ఔననక తప్పని పరిస్థితే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నైనా చెప్పవచ్చు. అసలు ఈ పుస్తకం ఏ సమీక్షకుడికైనా ఒక సవాలే. ఎందుకంటే ఏ పుస్తకంలోనైనా ఓ గొప్ప పాదం ఎక్కడుందని వెతుక్కోవాలి-ఉటంకించడానికి.  కాని ఈ పుస్తకంలో దేన్ని వదిలేయాలో అర్థంకాని పరిస్థితి. ఇది మరీ అతిశయోక్తిలా అనిపించినా, అక్షర సత్యం.
    ఇంకా ఈ సంకలనంలో మతం, అది చిమ్ముతున్న విషం, విత్తుల్లోకి చొచ్చుక వస్తున్న కల్మష విప్లవం, క్యాసెట్లలో బంధీ అయిపోయినా జానపదాల ధైన్యం, మాల మాదిగల మధ్య  రగులుతున్న అంతర్యుద్ధం ఒకటేమిటి ఎన్నెన్నో  ఇతని కలంలో కవితలుగా ప్రాణం పోసుకున్నాయి.
    ఇక ఈ సంపుటిలో నూతన పదబంధాలకైతే కొదువేలేదు.  నేలసింహాసనం, నోట్లహంసలు, దుమ్ముదయ్యం, నూనెపాయసం లాంటి అనేక పదబంధాలు దర్శనమిస్తాయి. వీటితో చిన్న సైజు నిఘంటువును తయారు చేయవచ్చేమోనన్పిస్తుంది.
    మొత్తం మీద చెప్పొచ్చేదేమంటే  కవిత్వం రాయాలని కుతూహలపడే నవతరానికి నిస్సందేహంగా ఈ పుస్తకమొక పెద్ద బాలశిక్షే.  మరీ నిజాయితీగా  చెప్పాలంటే నేనూ ఆ నీడన కొన్ని కవితాక్షరాలను దిద్దుకొన్నవాడినే.
    ఇదంతా చూసి ఈ కవెవరో కవిత్వంలో, వయసులో తలపండిన కురువృద్దుడనుకుంటే పొరపాటే.  ఈ పుస్తకం వెలువడే నాటికి(2005) ఈ కవి బహుశా మూడు పదులైనా దాటి ఉండక పోవచ్చు. ఈ వయసు నాటికే ఇంత ప్రతీకాత్మకమైన , ఘాడమైన కవిత్వాన్ని వెలువరించిన ఈ కవి నుండి మరో పది, పదిహేను సంవత్సరాల తరువాత ఎలాంటి కవిత్వం రాగలదో ఊహిస్తేనే, మనుసు ఉప్పొంగకుండా ఊరుకోదు. బహుశా ఇదంతా పాలమూరు మట్టి మహిమే కావొచ్చు.

                                                                                              - నాయుడుగారి జయన్న 
                                                                                                                     24.02.2013


23, ఫిబ్రవరి 2013, శనివారం

దేశపు వెన్నెముక


దేశానికి వెన్నెముకైన రైతు
మాడిన డొక్కతోటి వెన్నముక ఇరిగి నేడు కూలిపోతుండు.
లోకానికి తిండి పెట్టె రైతు
తనకే తిండి కరువై, బతుకు బరువై నేడు ఒరిగిపో్తుండు.

నిండా ధాన్యపు సంచులతో
నిత్యం కళకళలాడిన అతని ఇల్లు
కరువులతో, కాటకాలతో
గబ్బిలాల కంపులతో వెలవెలబోతుంది.

చేలల్లో పైరుకు పట్టిన చీడలు
మార్కెట్లో దళారుల పీడలు
భరించలేక, సహించలేక
నేల తల్లిపై మోపాల్సిన నాగలి మొనను
తన గుండెల్లో దించుకొంటుండు.

నేల తల్లిని నమ్మి
ఆలి తాళిని అమ్మి
కుప్పల అప్పులు చేసి
తీర్చలేక ముప్ప తిప్పలు పడుతూ...

మట్టిని ముద్దాడాల్సిన రైతు
మృత్యువును ముద్దాడుతూ...

సందడి చేసే పిట్టలను ఇంట్లోకి పిలవడానికి
కంకులు కట్టే కొంకి కొయ్యలకు
తానే ఉరికొయ్యై ఊగుతుండు.

పైర మొక్కలు తలెత్తి నిలబడాల్సిన చోట
రియలెస్టేట్ రాళ్ళు విత్తులై, భవనపు కత్తులై మొలుస్తుంటే...
బుక్కెడు బువ్వ పెట్టె జానెడు నేల తల్లి ఎక్కడ అని
శోధించి, శోకించి, కుశించిపోతుండు.

అతని గోస ఎవరికి వినబడుతుంది?
నాకూ, నీకే కాదు
పాలకులకైనా వినబడదు.

అతనేమైనా పర్సేంటేజిలు పంచే ప్రాజెక్టా !
ఏ నేతైనా పట్టించుకోవడానికి ?!

అతనేమైనా కోట్లకు కోట్లు ఎగేసిన బడా బాబా!
బ్యాంకులు అప్పు తీర్చకపోయినా పర్వాలేదని
కత్తో, కాలో కుత్తుక మీద పెట్టకపోవడానికి.

అతనో సామాన్యుడు
అతనో అసమానుడు
కండల కొండలను కరిగిస్తూ...
స్వేదసంద్రంలో తేలియాడే నిండు చంద్రుడు

అతనికే ఇప్పుడు ఆసర కరువైంది!
అతనికే ఇప్పుడు అభయం ఆవిరైంది !!