విద్యారంగానికి గుణపాఠాలు 'రామయ్య పాఠాలు'
రామయ్య పరిచయం అక్కర్లేని పేరు. నేటి విద్యారంగానికి చుక్కాని చుక్కా రామయ్య. IIT వంటి సాంకేతిక విద్యకు సంకేతం iit రామయ్య. అందుకే ఆ పేరుకు మరొక్క సారి పరిచయం అక్కర్లేదని చెప్పటం. అయన కలం నుండి జాలువారిన వ్యాసావళే ' రామయ్య పాఠాలు'.
ఏమిటి ఈ వ్యాసాల పరమోద్దేశ్యం? అని మనం ప్రశ్నించుకుంటే - "విద్య పేద వర్గాల ప్రజలకు ఉపయోగపడాలన్న ఆదుర్ధాతో, సమాజాన్ని చైతన్యవంతం చేయాలన్న ఉద్దేశ్యంతో నేను కలం పట్టి , వీటిని రాస్తున్నాను". అని అయన తన పుస్తకానికి రాసుకున్న ముందు మాటలు మనకు సమాధనం చెప్తాయి.
ఈ వ్యాస సంకలనంలో మొత్తం 50 వ్యాసాలు ఉన్నాయి. ఒక్కో వ్యాసం నిజంగానే మనకో పాఠమే. మన విద్యా వ్యవస్థకు పట్టిన అంతులేని సమస్యల జాఢ్యానికి, తన మేధా సంపతితో, అపార అనుభవ జ్ఞానాన్ని రంగరించి తయారు చేసిన పరిష్కారాల పరమ ఔషధం ఈ వ్యాసావళి.
ఈ వ్యాసాల్లో కొన్నిట్లో సమస్యల ప్రస్థావన, కొన్నిట్లో సమస్యలకు పరిష్కారాలు, కొన్నిట్లో మార్గదర్శనం, మరికొన్నిట్లో భవిష్యత్తు పట్ల భయాందోళన మనకు కన్పిస్తాయి. ఈ వ్యాసాల్లోని రామయ్య మాటలు కేవలం మాటలు కాదు. అవి విలువైన పాఠాలు. విద్యార్థులకు లాలిపాటలు. తల్లిదండ్రులకు గుణపాఠాలు. ఉపాధ్యాయులకు వెలుగు బాటలు. విద్యావ్యవస్థలకు, సంస్థలకు మార్గదర్శకాలు. సామాన్యున్ని సైతం సాంకేతిక విద్య వైపు దృష్టి సారించేలా చేసిన మేధావి కాబట్టే రామయ్య పాఠాలకు అంతులేని విలువ.
రామయ్య ఈ వ్యాసాల్లో వేటి గురించి ప్రస్తావించాడని ప్రశ్నించుకుంటే ...ప్రాథమిక విద్య నుండి అత్యున్నత విద్య వరకు, వీధి బడి నుండి యూనివర్సిటి వరకు, సాంప్రదాయ చదువుల నుండి సాంకేతిక విద్య వరకు అన్ని స్థాయిలలోని, అన్ని రకాల, అన్ని ప్రాంతాలలోని విద్య గురించి, వాటి సమస్యల గురించి ప్రస్తావించాడు.
రామయ్యది కేవలం సమస్యలను వేలెత్తి చూపించి , తప్పుకునే తత్వం కాదు. వాటికి పరిష్కారాలను సైతం సూచిస్తాడు. ఎంతో అధ్యనం, ఎంతో పరిశీలన, ఇంకెంతో పరిశోధన, మరెంతో అవగాహన ఉంటేగాని ఎన్నో సమస్యల గురించి ప్రస్తావించలేం. వాటికి పరిష్కారాలను సూచించలేం. విద్యారంగాన ఆరితేరిన మేధావి కాబట్టే చాల సమస్యలకు సులభంగా పరిష్కారాలను సూచించగలిగాడు రామయ్య.
రామయ్య చెప్పే విషయం కూడా బెత్తం పుచ్చుకొని బెదిరిస్తూ పాఠం చెప్పే ఉపాధ్యాయునిలా కాకుండా, అమ్మలా అనురాగంతో చెప్పే గురువులా చెప్తాడు. అదీ ఆయన రచనా విధానంలోని గొప్పదనం.
ఇక వ్యాసాల్లోని విషయాలలోకి వెళ్తే... ఇంగ్లీషు మీడియం మోజులో తల్లిదండ్రులు తమ పిల్లలపై ఒక వైపు విషయ భారాన్ని, మరో వైపు భాషాభారాన్ని మోపుతున్నారని, దీని వలన పిల్లలు మానసికంగా దెబ్బతిని అటు మాతృభాషలోను, ఇటు చదివే భాషలోను రాణించలేకపోతున్నారని ఆవేదన చెందుతాడు. ఇలాంటి తల్లిదండ్రులు ' ఇంగ్లీష్ నేర్చుకోవడమంటే ఇంగ్లీష్ మీడియంలో చదవటం కాదన్న వాస్తవాన్ని గుర్తించుకోవాలంటాడు'. అంతేకాదు విద్యార్థికి తన భాషలో తన పరిసరాలను గురించి నేర్పాలని సూచిస్తాడు.
ప్రాథమిక స్థాయిలో బోధించే పాఠాలకంటే, ఆటపాటలకే ప్రాధాన్యం ఇవ్వాలని, బెత్తంతో బెదిరించటం ఉపాధ్యాయులు మానాలని చెప్తారు. పిల్లల వ్యక్తిత్వ నిర్మాణంలో తల్లిదండ్రులదే కీలక పాత్ర అని, వారు పిల్లలను పాఠశాలకు పంపటమంటే ఉత్తరాలను పొస్ట్ చేసి మర్చిపోయినట్లుగా ఉండరాదని, వారిని సమున్నత వ్యక్తులుగా తీర్చిదిద్దాలంటాడు.
పాఠశాల కరిక్యులం గురించి మాట్లాడుతూ కేవలమది పాఠ్య కార్యక్రమాల సమాహారంగా కాక, విద్యార్థి పరిసరాలను, అవసరాలను, అన్ని వర్గాల ప్రజల జీవన నేపథ్యాలను ప్రతిబింబించేదిగా ఉంటేనే అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతామంటారు.
విద్యార్థి థియరిటికల్ గా తాను చదువుకున్న విషయాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలంటే, పాఠశాల ఎన్ని రోజులు ఉంటుందో అన్నే రోజులు సెలవులు ఉండాలన్న ఓ కొత్త ప్రతిపాదన చేస్తాడు. ఇది నిజమే అన్పిస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులకు ఆ రోజు జరిగిన పాఠాలు చదువుకోవటానికి ఇంటి దగ్గర సరైన వాతావరణం లేక వాటి మీద సరైన అవగాహన రాక సతమతమవుతుండగానే మరుసటి రోజు పాఠాలు ములిగే నక్కల మీద తాటికాయలలా వచ్చిపడుతాయి. అది ఈ గందరగోళంలో చదువు మీద ఆసక్తి సన్నగిలి బడిమానివేస్తున్న సంఘటనలు చాలానే ఉన్నాయి. దీనికి విరుద్దంగా రెసిడెన్సియల్ పాఠశాలలలో పాఠశాలల పనివేళలలో రోజులో సగభాగం బోధనకు కేటాయిస్తే, మిగిలన సగభాగం స్వీయ అధ్యనానికి కేటాయిస్తారు. కావుననే అక్కడ మెరుగైన ఫలితాలు సాధించగలుగుతున్నారు.
బోధనాలక్ష్యం సిలబస్ పుర్తిచేయడమో, వంద శాతం ఫలితాలు సాధించడమో కాదు. విద్యార్థిలోని నైపుణ్యాలను అభివృద్ది చేయడమేనంటాడు రామయ్య. నేడు నూటికి తొంబై మంది, పాఠశాల ప్రధానోపాధ్యాయుల నుండి జిల్లా కలెక్టర్ల దాకా నైపుణ్యాలకన్న ఫలితాల సాధనకే అధిక ప్రాధాన్యం ఇస్తుండటాన్ని గమనించవచ్చు.
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని గగ్గోలు పెడుతున్న సంస్థలకు, ప్రభుత్వాలకు చురకలంటిస్తూ...పిల్లల పెంపకం, పొలం పనులు, ప్రమాదకరం కాని పనుల్లో పిల్లలు ఉండటం తప్పేమి కాదని, అవి వారికి శ్రమవిలువను తెలియజేస్తాయని, అవి వారి జీవితంలో ముడిపడిన అంశాలని, వాటి నుండి తప్పించటం కాక వాటిలో పాల్గొనే అవకాశం కల్పిస్తూనే, చదువుకొనే అవకాశం కూడా ఇవ్వడానికి పాఠశాల పనిగంటలను 4 గంటలకు కుదిస్తే సరి పోతుందని చెప్తారు.
ఉపాధ్యాయుల నియామక విధానాన్ని తూర్పారపడుతూ... చేయవలసింది భర్తీ కాదని సరైన అభ్యర్తుల ఎంపికని, విద్యార్హతలు లేని ఉపాధ్యాయుని ఎంపిక ఎంత ప్రమాదకరమో, అధిక విద్యార్హతలు వున్న వ్యక్తి ఎంపిక కూడా అంతే ప్రమాదకరమని, ఎంతో మంది పోస్టుగ్రాడ్యుయేట్స్ ప్రాథమిక పాఠాశాల ఉపాధ్యాయులుగా ఎంపికై సక్రమంగా పని చేయని ఉదంతాలను మనకు గుర్తుచేస్తాడు.
పాఠ్య పుస్తకాలలో మత భావాలు ప్రమాదకరమని, పాఠ్యాంశాల రూపకల్పనలో వికేంద్రికరణ జరగాలని, వృత్తి విద్యలను సంస్కరిస్తేనే ఉత్తమ ఫలితాలు సాధ్యమని చెప్తారు. పరీక్షలనేవి నేర్చుకునే ప్రక్రియలో భాగమనే స్థాయి నుండి మొత్తం విద్యావ్యవస్థనే శాసించే స్థాయికి చేరుకున్న ప్రస్తుత తరుణంలో ' ఓపెన్ బుక్ పాలసీ ' అన్నది సరైన విధానమేనని, అయితే ముందు సంస్కరణలు అన్నవి ఏవి చేయకుండా ఇతర దేశాలలో అమలు చేస్తున్నారని మనమూ నేరుగా దిగుమతి చేసుకుని అమలు చేస్తే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఉంటుందని , దాని ఫలితంగా విద్యార్ధి బలిపశువు కావడం తథ్యమని హెచ్చరిస్తాడు.
మనం, మన దేశం పలు సమస్యలతో సతమతమవుతున్నామని కునారిల్లుతూ కూర్చోవడం మాని, ఒక ఆశావాహ దృక్పథంతో ముందుకు నడవాలంటాడు. జనాభా మనకు సమస్యే అయినా దాన్ని సమస్యగా కాక అపారమైన మానవ వనరుగా భావించి, దానికి టెక్నాలజీని జోడిస్తే విస్తృత మార్కెట్లో పుష్కల అవకాశాలు లభించి ప్రపంచంలో సగర్వంగా తలెత్తుకునే రోజు వస్తుందంటాడు.
విశ్వవిద్యాలయాల పని తీరును, వాటి పరిశోధనల తీరు తెన్నులను సమీక్షిస్తూ...దేశంలో వందల కొలది విశ్వవిద్యాలయాలు, వేల కొలది పరిశోధనలు, కోట్ల కొద్ది నిధులు. ఇదంతా ప్రజా ధనం. మరి ఈ విశ్వవిద్యాలయాల పరిశోధనలు, వాటి ఫలితాలు సామాన్యుని కష్టం తీరడానికి ఏమైనా దోహదం చేశాయా? సమాజ పరివర్తనకు దారి చూపాయా? నల్గొండ ఫ్లోరైడ్ సమస్యను, పాలమూరు కరువును రూపు మాపడానికి కృషి చేశాయా? అని ప్రశ్నించుకుంటే - " అవును" అని సమాధానం వస్తే, వాటి పనితీరు బాగున్నట్లేనంటాడు.
ఇంకా ఈ వ్యాస సంకలనంలో రామయ్య -దొడ్డి దారిన ప్రవేశాలు కల్పించి, విద్యా ప్రమాణాలకు తూట్లు పొడుస్తున్న మైనార్టి విద్యాసంస్థల భాగోతాలను, విదేశి చదువు మోజును ఆసరాగా చేసుకుని భోగస్ కన్సల్టెన్సిలు చేస్తున్న దుర్మార్గపు వ్యాపారాన్ని, ప్రపంచీకరణ ఫలితంగా విద్య వాణిజ్య వస్తువుగా మారుతున్న వైనాన్ని, ప్రామాణిక పుస్తకాల ప్రచురణకు తెలుగు అకాడమి చేయవలసిన కృషిని, బ్రౌన్ దొర స్ఫూర్తిగా మనం కొనసాగించవలసిన పనులను,....ఒకటేమిటి సమస్త విద్యాసంబంధ విషయాలన్నీ ఈ పుస్తకంలో ప్రస్తావించాడు . ఒక రకంగా నేటి విద్యావ్యవస్థకు ఇదొక నిలువుటద్దం. ఇంత విలువైన వ్యాసాలను అందించిన రామయ్య గారికి, వీటిని సంకలనంగా తీసుకొచ్చిన జూలూరు గౌరీ శంకర్ గారికి అభినందనలు. విద్యారంగంతో ముడిపడిన ప్రతి ఒక్కరు చదువదగ్గ మంచి పుస్తకం - 'రామయ్య పాఠాలు'.
- నాయుడుగారి జయన్న
27.03.2013
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి